real boom
-
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్ఆర్తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. -
హైదరాబాద్‌లో రియల్టీ జోరు!
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 12 శాతంగా ఉంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నగరంలో 12,700 గృహాలు అమ్ముడుపోగా.. 13,900 యూనిట్లు సిద్ధం అయ్యాయి. క్యూ2తో పోలిస్తే విక్రయాలు 16 శాతం క్షీణించగా.. కొత్తగా సిద్ధమైనవి ఒక శాతం పెరిగాయని అనరాక్ తాజా అధ్యయనం వెల్లడించింది.గృహ విక్రయాల్లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగుతోంది. క్యూ3లో అమ్ముడైన ఇళ్లలో 53 శాతం వెస్ట్ జోన్లోనే జరిగాయి. ఆ తర్వాత నార్త్‌లో 28 శాతం, సౌత్‌లో 13 శాతం, ఈస్ట్‌లో 4 శాతం, సెంట్రల్ హైదరాబాద్‌లో ఒక శాతం విక్రయాలు జరిగాయి. నగరంలో అపార్ట్మెంట్ల చదరపు అడుగు ధర సగటున రూ.7,150లుగా ఉన్నాయి.లక్ష దాటిన ఇన్వెంటరీ..హైదరాబాద్‌లో తొలిసారిగా ఇన్వెంటరీ లక్ష యూనిట్లను దాటింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి నగరంలో 1.01 లక్షల గృహాల ఇన్వెంటరీ ఉంది. దేశంలోని ఇన్వెంటరీలో 18 శాతం నగరానిదే. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లో 60 శాతం, నార్త్‌లో 25 శాతం ఇన్వెంటరీ ఉంది.3–5 శాతం ధరల వృద్ధి..నగరంలో మూడు నెలల్లో గృహాల అద్దెలు 1–4 శాతం, అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు ధరలు 3–5 శాతం మేర పెరిగాయి. ఆదిభట్లలో చ.అ. ధర సగటు రూ.4,650, ఎల్బీనగర్లో రూ.6,800, మియాపూర్‌లో 6,700, కొండాపూర్‌లో రూ.8,600, గచ్చిబౌలీలో రూ.8,900లుగా ఉన్నాయి. ఇక అద్దెలు డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్‌లకు నెలకు ఆయా ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.42 వేలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!లగ్జరీ గృహాలే ఎక్కువ..నగరంలో క్యూ3లో 13,900 యూనిట్లు సిద్ధం కాగా.. లగ్జరీ గృహాలు అత్యధికంగా ఉన్నాయి. రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న ప్రీమియం ఇళ్ల వాటా 60 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.40–80 లక్షల ధర ఉన్న గృహాల వాటా మూడు శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ఉన్న యూనిట్ల వాటా 37%, రూ.1.5–2.5 కోట్ల ధర ఉన్న ఇళ్ల వాటా 40%, రెండున్నర కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 20 శాతంగా ఉంది. -
ఫార్మాసిటీతో రియల్ బూమ్: వాటికి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లతో శ్రీశైలం జాతీయ రహదారి రూపురేఖలే మారిపోయాయి. ఫార్మా సిటీ నుంచి కూతవేటు దూరంలో ఉన్న కడ్తాల్, కందుకూరు, ఆమన్‌గల్, తలకొండపల్లి వంటి ప్రాంతాలు రెసిడెన్షియల్ హబ్‌గా మారిపోయాయి. విజయవాడ, బెంగళూరు, వరంగల్ జాతీయ రహదారులతో పోలిస్తే శ్రీశైలం హైవేలోని గృహ అద్దెలకు, స్థలాలకు రెట్టింపు విలువ చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న జాతీయ రహదార్లలో ఒక్క శ్రీశైలం రహదారి మినహా అన్ని దార్లలోనూ స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరంగల్ హైవేలో చూస్తే.. నగరం నుంచి 50 కి.మీ. వరకూ ఎకరం ధర రూ.కోటి పైనే. ముంబై, బెంగళూరు హైవేల్లోనూ కోటిన్నర పైమాటే. ఇక, షామీర్పేట్, శంకర్పల్లి రహదారిలో అయితే రూ.2 కోట్లకెక్కువే. మరి, నేటికీ సామాన్య, మధ్యతరగతి అందుబాటులో ఉన్న ప్రాంతం ఏమైనా ఉందంటే అది ఒక్క శ్రీశైలం రహదారి మాత్రమే. హాట్‌స్పాట్స్ ప్రాంతాలివే.. శ్రీశైలం రహదారిలో కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రోడ్ ఫేసింగ్‌ను బట్టి రూ.8 వేల నుంచి 30 వేల వరకున్నాయి. ప్రధా న నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో ఏకంగా విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లే అవుట్లు, విల్లాలకు డిమాండ్.. శ్రీశైలం రహదారిలో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లతో పాటూ లే అవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. హాల్‌మార్క్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై, విశాల్ ప్రాజెక్ట్స్, రాంకీ, హస్తినా రియల్టీ, మ్యాక్ ప్రాజెక్ట్స్, వెర్టెక్స్, జేఎస్ఆర్ గ్రూప్ వంటి పేరున్న నిర్మాణ సంస్థలతో పాటు చిన్న సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నాయి. కందుకూరు నుంచి ఆదిభట్లకు 15 కి.మీ. దూరం. దీంతో ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ ఉద్యోగులు శ్రీశైలం రహదారిలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. 30 కి.మీ. దూరంలో ఎల్బీనగర్, ఆదిభట్ల ప్రాంతాలుండడంతో విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకూ కొదవేలేదు. కృష్ణా జలాల సరఫరా, విద్యుత్ ఉపకేంద్రంతో మౌలిక వసతులూ మెరుగ్గానే ఉన్నాయి. ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి.. ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి అభివృద్ధి దశే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమల వల్ల మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల వరకూ అభివృద్ధి విస్తరించింది. అలాగే గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడు సనత్‌నగర్, బోయిన్పల్లి వంటి ప్రాంతాలకు ఎలాగైతే అభివృద్ధి చెందాయో.. శంషాబాద్ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటంతో సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఇది షాద్‌నగర్ నుంచి తలకొండపల్లి మీదుగా ఫార్మాసిటీకి అనుసంధానమై ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం రహదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లున్నాయి. -
రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 75,236 లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.382.64 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దీంతోపాటు రూ.200 కోట్లు ఈ చలాన్ల రూపంలో వచ్చాయి. కరోనా మన రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు సాధారణంగా రోజుకు 4-5 వేల వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. ఈ నెలలో వచ్చిన సెలవులను మినహాయిస్తే దాదాపు అదే స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఎప్పుడు ఏమవుతుందో? కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరగడానికి మళ్లీ లాక్డౌన్ పెడతారేమోననే ఆందోళనే కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఏ క్షణమైనా ప్రభుత్వం లాక్డౌన్ పెట్టే అవకాశముందని రియల్టర్లు, కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ కూడా రియల్ లావాదేవీలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనుకుంటున్న ప్రభుత్వం.. కచ్చి తంగా మార్కెట్ విలువలను పెంచుతుందనే అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉంది. ఏప్రిల్ 1 నుంచే మార్కెట్ విలువల పెంపు అమల్లోకి వస్తుం దనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ మార్కెట్ విలువలు పెరిగితే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఫీజు పడుతుందనే ఆలోచనతోనే హడావుడిగా రిజిస్ట్రేషన్లకు వెళ్లాల్సి వస్తోందని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోవడం కూడా లావాదేవీలు పెరిగేందుకు కారణమని రిజిస్ట్రేషన్ల అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు క్రయ, విక్రయ లావాదేవీల నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండడంతో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది. ముఖ్యంగా ఫొటో క్యాప్చరింగ్ సమయంలో మాస్కులు తీయాల్సి ఉన్నందున ఆ విభాగంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.400 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చిన నేపథ్యంలో ఈ నెలలో మిగిలిన పనిదినాల్లో జరిగే లావాదేవీల ఆధారంగా మరో రూ.100 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్ చదవండి: రియల్ బూమ్.. జోరుగా రిజిస్ట్రేషన్లు -
భగాయత్ 'బూమ్'లు..
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ భూములు రియల్ బూమ్‌ను తలపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్లోని ఓ ప్లాట్ ఆదివారం రికార్డుస్థాయిలో ధర పలికింది. 525 గజాలున్న ఓ ప్లాట్‌ను గజానికి ఏకంగా రూ.79,900 చెల్లించి ఓ బిడ్డర్ దక్కించుకున్నారు. తొలిరోజు శనివారం జరిగిన ఆన్లైన్ వేలంలో 166 గజాలున్న ఓ ప్లాట్ గజం ధర రూ.77,000 పలికితే.. రెండో రోజైన ఆదివారం దాన్ని అధిగమించి గజం రూ.2,900 అధికంగా అమ్ముడుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లుక్‌ఈస్ట్ అభివృద్ధితోపాటు మెట్రోకు ఆమడ దూరంలోనే ఈ లేఅవుట్ ఉండటం కూడా హెచ్ఎండీఏకు రెండు రోజుల్లోనే రూ.290.21 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో కార్యదర్శి రామకిషన్, ఇంజనీరింగ్ విభాగాధిపతి బీఎల్ఎన్ రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ నరేంద్ర, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, సీఏవో శరత్చంద్ర తదితర అధికారులు ఆదివారం జరిగిన ఆన్లైన్ వేలాన్ని పర్యవేక్షించారు. రెండోరోజూ.. అదే జోరు.. తొలిరోజు వేలంలో 52 ప్లాట్లకు రూ.155 కోట్ల ఆదాయం రాగా.. రెండోరోజు 41 ప్లాట్ల ద్వారా రూ.135.21 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు సాగిన తొలి సెషన్లో 23 ప్లాట్లకు బిడ్డర్లు హోరాహోరీగా పోటీపడ్డారు. రెండు రోడ్డులు ఉన్న ప్లాట్ నంబర్ 127 (525 గజాలు) అత్యధికంగా గజానికి రూ.79,900 పలికితే.. అత్యల్పంగా ఓ ప్లాట్‌ను గజం రూ.43,800కు బిడ్డర్ దక్కించుకున్నారు. ఈ సెషన్లో మొత్తంగా రూ.51.34 కోట్ల ఆదాయం వచ్చింది. మధ్యాహ్నం నుంచి రాత్రి 10 వరకు జరిగిన రెండో సెషన్లో 22 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో 3 ప్లాట్లకు సింగిల్ బిడ్ దాఖలు కాగా.. ఒక ప్లాట్‌కు బిడ్ దాఖలు కాలేదు. దీంతో ఈ నాలుగింటిని మినహాయించి మిగిలిన 18 ప్లాట్లకుగాను రూ.83.87 కోట్ల ఆదాయం సమకూరింది. రెండో సెషన్లో అత్యధికంగా గజం ధర రూ.64,000 పలకగా.. అత్యల్పంగా రూ.30,200 ధర పలికింది. ఇదే అత్యధికం.. ఈ ఏడాది ఏప్రిల్ 7, 8 తేదీల్లో జరిగిన ఉప్పల్ భగాయత్ ఫేజ్–1 ఆన్లైన్ వేలంలో గజం ధర అత్యధికంగా రూ.73,900 పలికితే, ఈసారి ఆ ధరను మించిపోయింది. ఈసారి ఎంఎస్టీసీ ద్వారా జరుగుతున్న ఫేజ్–2 ఆన్లైన్ వేలం మొదటిరోజు గజం ధర అత్యధికంగా రూ.77 వేలు పలికింది. ఇక రెండోరోజు ఆ రెండింటి ధరను చెరిపేస్తూ గజం ఏకంగా రూ.79,900 పలికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అయితే హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు కావడంతోనే జనాలు బాగా ఆదరిస్తున్నారని, ఈ లేఅవుట్లో ప్లాట్లు తీసుకుంటే ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చనే భావనతో అధిక ధరలు నమోదయ్యాయని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు మూసీనది వెంట చేపట్టిన బ్యూటిఫికేషన్, మినీ శిల్పారామం కూడా ఈ ప్లాట్లు అధిక ధర పలికేందుకు మరో కారణమని లెక్కలు వేసుకుంటున్నారు. మూడో రోజు సోమవారం కూడా ఇదేస్థాయిలో ప్లాట్ లు అమ్ముడవుతాయని హెచ్ఎండీఏ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
2018లో రియల్ బూమ్!
‘సాక్షి రియల్టీ’తో మై హోం ఈడీ శ్యాం రావు సాక్షి, హైదరాబాద్: ‘‘అభివృద్ధికి పక్కా ప్రణాళికలు.. చక్కటి పరిపాలన.. శాంతిభద్రతలకు పెద్దపీట.. పూర్తిస్థాయి పారదర్శకత.. భాగ్యనగరికి పెరుగుతున్న ఆదరణ.. టీఎస్-ఐపాస్, ఐటీ పాలసీలతో నగరానికి క్యూ కడుతున్న ఐటీ, ఇతర సంస్థలు.. నిర్మాణ రంగ వృద్ధికి సరికొత్త నిర్ణయాలు.. మొత్తానికి తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించిందని’’ మై హోం ఈడీ శ్యాంరావు అభిప్రాయపడ్డారు. ఇది స్థిరాస్తి రంగానికి హైదరాబాద్‌లో నేటికీ అందుబాటులో ఉన్న స్థిరాస్తి ధరలు, త్వరలో ప్రారంభం కానున్న మెట్రోరైలు, పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు.. బెస్ట్ లివింగ్ సిటీ జాబితాలో ముందు వరుసలో నిలిచే భాగ్యనగరి.. ఇవన్నీ నగర స్థిరాస్తి రంగానికి ఊతకర్రలా నిలుస్తున్నాయని వివరించారు. అందుకే 2018 నాటికి హైదరాబాద్‌లో మళ్లీ రియల్ బూమ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ‘సాక్షి రియల్టీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనింకా ఏమన్నారంటే.. * 1 చ.అ. కమర్షియల్ స్థలం అమ్ముడయ్యిందంటే.. 200 చ.అ. రెసిడెన్షియల్ స్థలం అవసరముంటుంది. ఈ లెక్కన చూస్తే నగరంలో గత నాలుగేళ్లతో పోల్చుకుంటే కమర్షియల్ స్థలం అమ్మకం/లీజుకు తీసుకోవటం మెరుగ్గా ఉంది. ఏడాది కాలంగా ఈ-కామర్స్, ఐటీ, హెల్త్ కేర్ సంస్థలు నగరంలో సుమారు 3-4 మిలియన్ల స్థలం అద్దెకు తీసుకున్నాయి. ఎక్కడైనా సరే స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలంటే.. ఎయిర్పోర్ట్, ఐటీ, ఫార్మా కంపెనీలుండాలి. అంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలు రావాలని దానర్థం. ఈ లెక్కన దేశంలోని ఇతర నగరాలతో పోల్చుకుంటే భాగ్యనగరం ముందువరుసలోనే ఉందని చెప్పాలి. * 2012 వరకు కూడా స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో ప్రజల్లో చాలా సందేహాలుండేవి. ధరలు మరింత తగ్గుతాయనో, రాష్ట్రం ఏర్పాడ్డాక పరిస్థితులు ఎలా ఉంటాయనో రకరకాల సందేహాలు. కానీ, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా దూసుకెళుతుంది. నూతన పారిశ్రామిక విధానం, టీ-హబ్, హైరేజ్ బిల్డింగ్లు.. ఇలా భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చే ప్రణాళికలు చేస్తోంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలుంటాయి. తెలంగాణ రాష్ర్టం ఏర్పాడ్డాక నగరంలో ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరిగింది. 8 నుంచి 12 మిలియన్ల ప్రయాణికులకు చేరింది. * ప్రస్తుతం నగరంలో స్థిరాస్తి వ్యాపారం వెస్ట్రన్ రీజియన్‌లో బాగుంది. ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీలుండటమే ఇందుకు కారణం. నార్సింగి, రాయదుర్గం, పుప్పాలగూడ, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వెంచర్లు, ప్రాజెక్ట్‌లు వెలుస్తున్నాయి. మరో 10-15 ఏళ్ల వరకు ఇక్కడి స్థిరాస్తి వ్యాపారానికి డోకా లేదు. * ఈస్ట్, నార్త్ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం అంతగా వృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం.. విమానాశ్రయానికి దూరంగా ఉండటం, పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు లేకపోవడం. పెపైచ్చు ఇక్కడి స్థిరాస్తి ధరలు రూ.2-3 వేల మధ్య ఉంటాయి. అంటే మధ్య తరగతి ప్రజలకు ఇది సరైన ప్రాంతం. పోచారం, యాదాద్రి, గుండ్లపోచంపల్లి, ఆదిభట్ల ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరగాలి. కమర్షియల్, రిటైల్ స్పేస్ అమ్మకం పెరిగితే ఈ ప్రాంతంలోనూ భారీ ప్రాజెక్ట్‌లను చూడొచ్చు. * కస్టమర్‌కు సేఫ్టీ అనేది ముఖ్యం. బిల్డర్/ సంస్థ మీద నమ్మకం, నాణ్యతలకే ప్రాధాన్యమిస్తాడు. విశ్వసనీయత ఉన్న బిల్డర్లు/సంస్థలు రియల్ ఎస్టేట్ బూమ్‌ను మళ్లీ కోరుకోరు. ఎందుకంటే బూమ్ మార్కెట్ అనేది ఆర్టిఫియల్ మార్కెట్. రాత్రికి రాత్రే ధరలు పెరగడం సరైంది కాదు. మార్కెట్ అనేది స్థిరంగా అభివృద్ధి జరగాలి. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, త్వరితగతిన అనుమతుల మంజూరు కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన విభాగం కూడా బాగుంది. క్రెడాయ్, ట్రెడా వంటి నిర్మాణ రంగ సంస్థలతో నిత్యం చర్చిస్తూ.. స్థిరాస్తి రంగం అభివృద్ధికి బాటలు వేసే నిర్ణయాలను తీసుకుంటుంది. దీంతో హైదరాబాద్‌లో మరో 2-3 ఏళ్లలో రియల్టీ బూమ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాయదుర్గంలో భూజ! గడువులోగా కొనుగోలుదారులకు ఇంటి తాళాలందించే సంస్థగా బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది మై హోం. లొకేషన్ ఎంపికే మా సక్సెస్‌కు కారణం. ఆ తర్వాతే ధరలు, వసతుల గురించి ఆలోచిస్తాం. మై హోం సంస్థ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందంటే.. ఆ ప్రాంతం అభివృద్ధికి చిరునామా అని అర్థం. మా ప్రాజెక్ట్‌లు పూర్తిగా ఎగువ మధ్యతరగతి, ప్రీమియం విభాగానివే. చ.అ. ధరలు రూ.4 నుంచి 8 వేల మధ్య ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 15-16 మిలియన్ చ.అ. స్థలంలో పలు ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి.3-5 ఏళ్లలో బెంగళూరు, పుణెల్లోనూ ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తాం. * రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్క్ ప్రాంతంలో 32 ఎకరాల్లో భూజ పేరుతో ఏసీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాం. ఇందులో 18 ఎకరాలు నివాస సముదాయానికి, 14 ఎకరాలు వాణిజ్య సముదాయాలకు కేటాయించాం. మొత్తం 1,700 ఫ్లాట్లు. అన్నీ 3,4 పడక గదులే. ఐజీబీసీ ప్లాటినం రేటెడ్ పొందిందీ ప్రాజెక్ట్. ఇందులో 85 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్‌తో పాటూ అన్ని రకాల వసతులుంటాయి. * పుప్పాలగూడలో అవతార్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 2,700 ఫ్లాట్లకు గాను తొలి విడతగా 1,400 ఫ్లాట్లను ప్రారంభించాం. ఒక్క రోజులోనే వెయ్యికి పైగా ఫ్లాట్లను విక్రయించేశాం. చ.అ. ధర రూ.4 వేలు. 2 బీహెచ్‌కే 1,300 చ.అ., 3 బీహెచ్‌కే 1,835 చ.అ. మధ్య ఉన్నాయి. 60 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్‌తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులుంటాయిందులో. 42 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. * ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 21 ఎకరాల్లో నిర్మిస్తున్న విహాంగ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతుంది. ఇప్పటికే 85 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. ఇందులో మొత్తం 2 వేల ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.4,500. * సిమెంట్, ఇసుక, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు గత నాలుగేళ్లతో పోల్చుకుంటే 30-40 శాతం పెరిగాయి. కానీ, స్థిరాస్తి ధరలు విషయానికొస్తే 10 శాతానికి మించలేదు. ఇక నుంచి ఏటా 8-10 శాతం ధరలు పెరుగుతాయి. -
మహేశ్వరం.. మహర్దశ!
మూడేళ్ల క్రితం ఎకరం ధర రూ.25 లక్షలు.. మరి నేడో అర కోటికి పైమాటే ♦ అమీర్‌పేట్, రావిర్యాల, తుక్కుగూడలో రియల్ బూమ్ ♦ ఐటీఐఆర్, టీ-పాస్‌తో పరిశ్రమల పరుగులు ♦ స్థిరాస్తి రంగానికి పెరిగిన గిరాకీ; ప్రాజెక్ట్‌లతో నిర్మాణ సంస్థల క్యూ ♦ గతంలో షేరింగ్ ఆటోలు కూడా తిరగని ప్రాంతం! ♦ మరి నేడో.. లగ్జరీ కార్లు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయ్!! ♦ గతంలో గ్రామాధికారులు కూడా సరిగా పట్టించుకోని ప్రాంతం! మరి నేడో.. ఐటీఐఆర్‌తో కేంద్రం, టీ-పాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన హైటెక్ గ్రామం!! ... ఇదంతా మహేశ్వరం మండలం గురించి. ఈ ప్రాంతాన్ని మూడు ముక్కల్లో వివరించాలంటే.. ఎత్తై కార్యాలయ భవనాలు.. విశాలమైన రోడ్లు.. లక్షల సంఖ్యలో ఉద్యోగులు! ఇలా పూర్తి స్థాయి హైటెక్ గ్రామంగా రూపుదిద్దుకుంటున్న మహేశ్వరం మండలంపై ఈ వారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది. సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ పరిధిలో మహేశ్వరం, కందుకూరు మండలాలొస్తాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమీర్‌పేట్, ర్యావిర్యాల, తుక్కుగూడ, మంఖాల్, శ్రీనగర్ ప్రాంతాల గురించే. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లే కారణం. గతంలో కేంద్రం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) మూడు క్లస్టర్లలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఉంది. ♦ ఈ క్లస్టర్ కిందికి మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాలొస్తాయి. మొత్తం 79.2 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న క్లస్టర్లో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇక రాష్ర్ట ప్రభుత్వం విషయానికొస్తే.. 313 ఎకరాల్లో మహేశ్వరంలో, 600 ఎకరాల్లో రావిర్యాలలో ఎలక్ట్రానిక్ సిటీ (ఈ-సిటీ)లను ఏర్పాటు చేశాయి. నూతన పారిశ్రామిక విధానం (టీ-పాస్)లో పరిశ్రమల స్థాపన కోసం 60కి పైగా కంపెనీలు స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాయి కూడా. ♦ భాగ్యనగర అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం చుట్టూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నగరం చుట్టూ 13 రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాంతాలను నగరంతో అనుసంధానించనున్నారు. వీటిలో తుక్కుగూడ ప్రాంతానికి చోటు దక్కింది. ఆయా ప్రాంతాల్లో 2041 నాటికి నగరం ఎలా విస్తరిస్తుంది? అప్పటి మౌలిక, వాణిజ్య అవసరాలకు తగ్గట్లు ప్రజా రవాణా, మౌలిక వసతుల ఏర్పాట్లు చేస్తారు. అలాగే సైన్స్‌పార్క్‌ను మహేశ్వరంలో ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ఆయా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటుగా ఈ ప్రాంతంలో స్థిరాస్తి, అద్దెల ధరలు పెరుగుతాయి. గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులూ మెరుగవుతాయి. ఐటీఐఆర్ జోన్ కారణంగా కేవలం ఐటీ రంగమే కాదు.. రవాణా, పర్యాటక, ఆతిథ్య రంగాలకూ గిరాకీ పెరుగుతుంది. వైద్య, విద్యా రంగాలకు రానున్న రోజుల్లో ఆదరణ లభిస్తుంది. ఎకరం రూ.50 లక్షల పైమాటే.. మూడేళ్ల క్రితం వరకూ మహేశ్వరం మండలంలో ఎకరం ధర పాతిక లక్షలుండేది. కానీ, నేడు రూ.50 లక్షలకు పైగానే ఉందని శతాబ్ది టౌన్షిప్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి వైద్య కళాశాలతో పాటూ 70 ఎకరాల్లో చిన జీయర్ స్వామి ఆశ్రమం, నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కార్వి, సెంట్రల్ ఎక్సైజ్, బ్యాంక్ కాలనీ నివాస సముదాయాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాంతం హైలెట్స్.. మహేశ్వరం మండలం మెహదీపట్నం నుంచి 32 కి.మీ., శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్‌కు 12 కి.మీ. దూరంలో ఉంటుంది. కొంగర, రావిర్యాల, శ్రీనగర్ గ్రామాల్లో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, మండల కేంద్రంలో ఐటీ ఎలక్ట్రానిక్ పార్క్, మంఖాల్‌లో పారిశ్రామికవాడలో పలు కంపెనీలు రానున్నాయి. రావిర్యాలలో రూ.200 కోట్లతో ఏర్పాటైన మైక్రోమ్యాక్స్ ప్లాంట్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఇదే ప్రాంతంలో బెంగళూరుకు చెందిన వండర్ లా సంస్థ అమ్యూజ్మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కూడా. -
హైదరాబాద్, రంగారెడ్డిలో పడిపోయిన రిజిస్ట్రేషన్లు
-
జోరుగా క్రయ విక్రయాలు
* ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు * విభజన తర్వాత 93 శాతం వృద్ధి నమోదు * ఆరు నెలల్లో ప్రభుత్వానికి రూ.1,316 కోట్ల ఆదాయం * ‘రాజధాని’ జిల్లాల్లో రికార్డు స్థాయిలో డాక్యుమెంట్ల నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. ఈ ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య స్థిరాస్తి క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఈ మధ్యకాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే దాదాపు రెట్టింపు (93.35 శాతం అధికం) రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. గత ఏడాదితో పోల్చితే ఇదే కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇక రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం సాగిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య రెట్టింపుకంటే అధికంగా ఉండటం విశేషం. మొత్తం 13 జిల్లాలకు గాను ఆరు జిల్లాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గత ఏడాదికంటే రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ల వృద్ధిలో ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య మొత్తం 3,08,445 డాక్యుమెంట్లు రిజిష్టర్ కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 5,96,385 రిజిస్ట్రేషన్లు (93.35 శాతం అధికంగా) జరగడం గమనార్హం. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన రాబడి రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటితో పోల్చితే విభజన తర్వాత రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2013 -14 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ - సెప్టెంబర్) ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వచ్చిన దానికంటే ఈ ఏడాది ఇదే కాలంలో దాదాపు రెట్టింపు ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.624.83 కోట్లు రాగా ఈ ఏడాది ఇదే కాలంలో రూ. 1,316 కోట్లు వచ్చింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం రాబడి తగ్గిపోయింది. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు రూ.1,469.95 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నూతన రాజధాని ఏర్పాటుపై, వివిధ జిల్లాల్లో విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుపై అనేకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఈ కారణంగానే అన్ని జిల్లాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. అయితే అదే అక్టోబర్‌కు వచ్చేసరికి రాజధాని ప్రాంతం మినహా మిగిలిన జిల్లాల్లో పెద్దగా ఏ సంస్థగానీ, పరిశ్రమలు గానీ వచ్చే అవకాశం కనిపించడంలేదనే భావానికి ప్రజలు వచ్చారు. -
లక్ష్యానికి లంగరు!
* ఆస్తుల క్రయవిక్రయాల్లో అనిశ్చితి.. తప్పిన అంచనాలు * లక్ష్యాలకు దూరంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం * హైదరాబాద్, రంగారెడ్డిలో పడిపోయిన రిజిస్ట్రేషన్లు * ఇతర జిల్లాలు, భావి జిల్లా కేంద్రాల్లోనూ భూ విక్రయాల్లో స్తబ్దత.. * ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్య సాధన ఇప్పటికీ 52 శాతమే! * ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోకన్నా తక్కువే * కొత్త రాష్ర్టంగా అవతరించినా కనిపించని రియల్ బూమ్ * ధరల హెచ్చుతగ్గులపై ప్రజల్లో ఉన్న భారీ అంచనాలే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలపై అంచనాలు తలకిందులవుతున్నాయి! తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తగ్గిన రిజిస్ట్రేషన్లు కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా పుంజుకోలేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే రాజకీయ స్థిరత్వంతో ‘రియల్’ బూమ్ పునరావృతమవుతుందని రియల్టర్లు వేసిన అంచనాలు తప్పుతున్నాయి. కొత్త రాష్ట్రానికి వలసలు పెరిగి, భూముల క్రయవిక్రయాల్లో చలనం వస్తుందని ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరడం లేదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల కాలంలో కూడా రిజిస్ట్రేషన్లలో పెద్దగా పురోగతి లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ శాఖ అంచనా వేసిన ఆదాయ లక్ష్యం ఇప్పటికీ అందనంత దూరంలో ఉండటం గమనార్హం. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే భూముల మార్కెట్ విలువలు తగ్గుతాయని కొనుగోలుదారులు, బూమ్‌లేక ఇప్పటికే పడిపోయిన ధరలు కొత్త రాష్ట్రంలో పెరుగుతాయని రియల్టర్లు భావించడమే ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధించిన లక్ష్యం 52 శాతమే! అధికారికంగా జూన్ 2న రాష్ర్టం ఏర్పాటైనప్పటికీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే తెలంగాణ ఏర్పాటు ఖాయమైంది. దీంతో జనవరి నుంచే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. జిల్లా కేంద్రాలు, భవిష్యత్తులో జిల్లా కేంద్రాలుగా మారుతాయని భావి స్తున్న సిద్ధిపేట, మంచిర్యాల, వికారాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జనగామ తదితర పట్టణాల్లో భూముల రేట్లు పెరిగాయి. అక్కడ రిజిస్ట్రేషన్లూ జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం (జూన్2) నాటికి మళ్లీ స్తబ్ధత ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో ఉండదని కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రెవెన్యూ శాఖ రూ. 4,766.79 కోట్లు రాబట్టుకోవాలని అంచనా వేసింది. దీని ప్రకారం అక్టోబర్ వరకు రూ. 2,717.07 కోట్లు రాబట్టాలి. కానీ వచ్చిన ఆదాయం మాత్రం రూ.1,418.91 కోట్లు. మిగిలిన 5 నెలల్లో వంద శాతం లక్ష్యాన్ని సాధిం చాలంటే మరో రూ. 3,348 కోట్లు ఆర్జించడం సాధ్యమయ్యే పనికాదు. అదే గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లక్ష్యం రూ. 4,445.30 కోట్లు కాగా, వచ్చిన ఆదాయం రూ. 2,939.05 కోట్లు. అంటే గత ఏడాది 66.12 శాతం లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ, ఈ ఏడాది ఇంకా 52 శాతానికే పరిమితమైంది. హైదరాబాద్, రంగారెడ్డిలోనే గండి... తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే క్రయవిక్రయాల ద్వారా 68 శాతం ఆదా యం వస్తుంది. ఈసారి రెవెన్యూ శాఖ అంచనాలో ఈ 2 జిల్లాల లక్ష్యమే రూ. 3283 కోట్లు. ఈ లెక్క ప్రకారం ఇప్పటికే రూ. 1871.85 కోట్ల ఆదాయం రావాలి. కానీ ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ. 968. 83 కోట్లు మాత్రమే. ఈ ప్రభావం మిగతా జిల్లాలపై కూడా పడినట్లు కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 61.74 శాతం తప్ప.. ఇతర ఏ జిల్లాలో కూడా 60 శాతానికి మించి లక్ష్యాలను సాధించలేదు. అయితే గత ఏడాది రంగారెడ్డిలో 60.4 శాతం లక్ష్యాన్ని చేరగా, హైదరాబాద్‌లో 70 శాతానికిపైగా సాధించింది. అంటే రెండు జిల్లాల్లో కలిపి 65 శాతానికిపైగా రెవెన్యూ లక్ష్యాలను ప్రభుత్వం సాధించింది. మరోవైపు రాబోయే ఐదు నెలల్లో మంచి ఫలితాలే ఉంటాయని రియల్టర్లు ఆశాభావం వ్యకం చేస్తుండగా, ఆ పరిస్థితి లేదని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
‘ల్యాండ్‌పూలింగ్’కు చిక్కులు!
ప్రతాప్‌సింగారం మెగా వెంచర్‌కు అడ్డంకులు సర్వే దశలోనే చతికిలబడ్డ హెచ్ఎండీఏ సరిహద్దులు తేలక ప్రాజెక్టు పక్కదారి.. సాక్షి, సిటీబ్యూరో: భూ అభివృద్ధి పథకం ద్వారా నగర శివార్లలో మరోసారి రియల్ బూమ్‌ను సృష్టించాలనుకొన్న హెచ్ఎండీఏకు చుక్కెదురైంది. భూములిచ్చేందుకు రైతులు ముందుకొచ్చినా...వాటిని అభివృద్ధి చేసేందుకు సవాలక్ష ఆంక్షలను సాకుగా చూపుతూ హెచ్ఎండీఏ వెనుకడుగు వేస్తోంది. ముఖ్యంగా భూముల సరిహద్దులు తేలడం లేదంటూ... సర్వే దశలోనే చతికిలబడ్డ అధికారులు తమ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఏకంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కే తిలోదకాలిచ్చేందుకు పూనుకొన్నారు. ఫలితంగా శివారు ప్రాంతాల్లోని భూముల్లో సిరులు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. భూ అభివృద్ధి పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద నగరం చుట్టుపక్క ప్రాంతాల్లోని రైతుల నుంచి భూమిని సేకరించి కొత్త లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని ఏడాది క్రితం హెచ్ఎండీఏ నిర్ణయించింది. రైతులకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లో 40 శాతం భూమి (ప్లాట్లు) తిరిగి అప్పగించాలనుకొంది. ఆయా లేఅవుట్లలో రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక అవసరాలకు కొంత భూమిని మినహాయించి అభివృద్ధి చేసినందుకు గాను మిగతా భూమిని హెచ్ఎండీఏ తీసుకొంటుంది. ఇదీ... ల్యాండ్ పూలింగ్ స్కీం ఉద్దేశం. ఈ మేరకు ఉప్పల్‌కు సమీపంలోని ప్రతాప్‌సింగారం వద్ద మూసీని ఆనుకొని ఉన్న 300ల ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. ఇక్కడ కొత్త లేఅవుట్ అభివృద్ధికి భూ సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన హెచ్ఎండీఏ ఆ తర్వాత మనసు మార్చుకొంది. ప్రతాప్‌సింగారం వద్ద 300 ఎకరాల భూముల్లో రెవిన్యూ, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నిర్వహించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు, రికార్డుల్లోని భూములకు పొంతనే లేదని, పైగా సరిహద్దులు కూడా పక్కాగా తేలడం లేదంటున్నారు. రికార్డుల్లో ఉన్న భూ యజమాని పేర్లు, ప్రస్తుతం పొజిషన్లో ఉన్న యజమాని పేర్లకు సంబంధం లేకుండా ఉందని, వీటిని సేకరిస్తే కోర్టు వివాదాలు ఉత్పన్నమవుతాయన్న కారణాన్ని సాకుగా చూపుతూ ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేసినట్లు సమాచారం. ఆశ అడియాసే... తమ భూములను హెచ్ఎండీఏకు ఇస్తే (60-40 ప్రాతిపదికన) అభివృద్ధి చేసిన ప్లాట్లు వస్తాయని ఆశించిన చిన్న, సన్నకారు రైతులకు నిరాశే మిగిలింది. అర ఎకరం భూమినిస్తే వెయ్యి చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్ దక్కుతుందని, దీన్ని అమ్ముకోవడం ద్వారా ఆర్థికంగా సమస్యలను నుంచి బయటపడవచ్చని పేద రైతులు ఆశించారు. కాగా, ఆయా భూముల్లో సర్వే నిర్వహించిన అధికారులు ఇక్కడ మొత్తం 450 మంది రైతులకు చెందిన భూములున్నట్లు గుర్తించారు. ఎక్కడ భూమి తీసుకొంటే అక్కడే ప్లాట్ ఇవ్వాలన్నది నిబంధన. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నరైతులకు ఇది సాధ్యమే. అయితే... మొత్తం రైతుల్లో 1/2 ఎకరా భూమి ఉన్నవారే ఎక్కువగా ఉండటంతో రోడ్లు, పార్కు వంటి వాటి కి భూములు పోయిన వారికి అక్కడే ప్లాట్లు ఇవ్వడం అసాధ్యంగా మారింది. ఇదే విషయమై చివర్లో రైతులు మెలికపెడితే చిక్కులు ఎదురవుతాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ప్రాజెక్టును పక్కకు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో జాప్యంపై సంబంధిత అధికారిని వివరణ కోరగా ఫిజికల్ సర్వేలో ఆయా భూములు రెవిన్యూ రికార్డుల్లోని సరిహద్దుతో మ్యాచ్ కావట్లేదని, ఇప్పుడు వీటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యామని సమాధానం ఇచ్చారు. -
మళ్లీ హైదరాబాద్ లో 'రియల్ బూమ్' కు రెక్కలు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ స్థిరాస్తి రంగంపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో స్తబ్ధతగా మారిన ఈ రంగం మళ్లీ పుంజుకుంటోంది. మొన్నటి వరకు రాష్ట్ర విభజనతో స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లావాదేవీలు తగ్గాయి. తెలంగాణేతరులు స్థిరాస్తులు, భూముల ధరలపై ఆందోళన చెందినప్పటికీ భూముల ధరలు, విలువలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. అయితే తాజాగా హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటనతో మళ్లీ రియల్ బూమ్ మరింత పెరగవచ్చని దేశీయ స్థిరాస్తి అభివృద్ధి సమాఖ్య (సీఆర్డీఏఐ) స్పష్టం చేసింది. గత మూడు నెలల్లో రియల్ రంగం 10 శాతం మేర ఊపందుకున్నట్లు పేర్కొంది. ఇదే పరంపర కొనసాగితే రానున్న కాలంలో రియల్ రంగం మరింత వృద్ధిని సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రాబోవు ఆరు -ఎనిమిది నెలల్లో 40 శాతం నుంచి 50 శాతం వరకూ రియల్ ఎస్టేట్ ధరలు పెరగవచ్చని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో క్రమంగా భూములు, ప్లాట్ల క్రయ విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారంలో ఒకేసారి దస్తావేజుల నమోదు సంఖ్య కూడా పెరిగింది. -
స్తంభించిన రిజిస్ట్రేషన్లు
నేటితో రెండుగా విడిపోతున్న శాఖ రెండు రాష్ట్రాలకు విడివిడిగా సర్వర్లు రాజధాని అంచనాలతో ‘రియల్’ బూమ్ జిల్లాలో ఊపందు కోనున్న క్రయవిక్రయాలు కైకలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడివిడిగా సర్వీసు సర్వర్లు ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు రోజులుగా ఆయా మండలాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, ఈసీల కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. జిల్లాలో మొత్తం 50 మండలాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. హైదరాబాదు కేంద్రంగా సర్వర్ పనిచేస్తోంది. జూన్ 2న రాష్ట్రం రెండుగా విభజన జరగనుండటంతో నూతనంగా ఏర్పడే ఇరు రాష్ట్రాలకు కొత్త సర్వీసు సర్వర్లు సోమవారం నుంచి విడివిడిగా ఏర్పాటు కానున్నట్లు సమాచారం. రెండుగా విడిపోనున్న సిబ్బంది... విభజన నేపథ్యంలో ఇప్పటి వరకు హైదరాబాదు ప్రధాన కేంద్రంగా జరిగిన రిజిస్ట్రేషన్ సేవలు రెండుగా విడిపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు సర్వర్లు రానున్నాయి. శాఖాపరమైన విధులు, సిబ్బంది విషయానికి వస్తే సెంట్రల్ సీ అండ్ ఐజీ ఆఫీస్, జోనల్ ఆఫీస్ అనే రెండంచెల విధానంలో రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్ ఐజీ, అడిషనల్ కమిషనర్ ఐజీ, జాయింట్ ఐజీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, సీనియర్ అసిస్టెంట్స్, టైపిస్టు, షరాఫ్, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినెంట్లు కలిపి 3,997 మంది ఈ శాఖలో పనిచేస్తున్నారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయాన్ని రెండుగా విభజించి పదేళ్ల పాటు అదే కార్యాలయాల్లో విడివిడిగా విధులు నిర్వహించనున్నారు. సెంట్రల్ కార్యాలయంలో సిబ్బందిని ఆయా ప్రాంతాల ప్రాతిపాదికన బదలాయిస్తున్నారని, జోనల్ వ్యవస్థలో ప్రాంతాలవారీ బదిలీలపై స్పష్టమైన ఆదేశాలు రాలేదని కార్యాలయ సిబ్బంది ఒకరు తెలిపారు. స్టాంపు డ్యూటీపై గంపెడాశలు... అవశేష ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కారణంగా జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వస్తాయని, ఈ పరిణామం స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కలిసొచ్చే అంశంగా మారుతుందని జిల్లా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరు - విజయవాడల మధ్య ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ముందుకు దూసుకుపోతుందని, రాజధాని ప్రభావం కారణంగా క్రయ విక్రయాలు ఊపందుకుంటాయని అందరూ భావిస్తున్నారు. -
రాజధాని ‘భూ’మ్
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొండెక్కిన భూముల ధరలు సాక్షి, హైదరాబాద్: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్టర్ల దృష్టంతా ప్రస్తుతం ఈ రెండు జిల్లాల పైనే ఉంది. నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటవుతుందనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడి భూములకు భారీగా డిమాండ్ వచ్చింది. రాజధానిగా ఏర్పడితే భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే భావనతో ఈ ప్రాంతంలో చాలామంది భూములు, స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఇక్కడ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక్కడ తప్ప అంతటా తగ్గుదలే.. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, నెల్లూరు తదితర అన్ని రిజిస్ట్రేషన్ జిల్లాల్లో గత ఏడాది మొదటి నాలుగు నెలలతో పోల్చితే ఈ ఏడాది ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. ఆ మేరకు ఆదాయం కూడా తగ్గింది. అయితే కృష్ణా, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం రిజిస్ట్రేషన్ జిల్లాల్లో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాల్లో ఈ ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్లు, రాబడి అనూహ్యంగా పెరగడం విశేషం. విజయవాడ రిజిస్ట్రేషన్ జిల్లాల్లో గత ఏడాది ఏప్రిల్‌లో 2,515 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 7.43 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అదే నెలలో 3,831 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14.28 కోట్ల ఆదాయం వచ్చింది. విజయవాడ తూర్పు జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో 3,493 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 8.78 కోట్ల రాబడి రాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 4,608 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 15.93 కోట్ల ఆదాయం వచ్చింది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏప్రిల్‌లో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున చాలామంది డబ్బు తీసుకెళ్లే మార్గం లేక అడ్వాన్సులు ఇచ్చి మే, జూన్ నెలల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అందువల్ల ఈ నెలలోనూ, వచ్చే నెలలోనూ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. అమ్మో! ఇవెక్కడి ధరలు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక వైపు పొలాల్లో వేసిన వెంచర్లో రెండు నెలల కిందట చదరపు గజం స్థలం రూ. 1200 ఉండగా ఇప్పుడు రూ. 7000కు పెరిగింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రెండు నెలల కిందట రూ. 20 లక్షలున్న ఎకరా భూమి ఇప్పుడు రూ. 2 కోట్లు పలుకుతోంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో రెండు నెలల కిందట ఎకరం పొలం రూ. 15 లక్షలు ఉండగా ఇప్పుడు రూ. కోటిన్నరకు పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో యజమానులు భూముల్ని అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు. -
రియల్ బూమ్.. ఢాం
హైదరాబాద్, రంగారెడ్డిలో భారీగా పడిన రియల్ ఎస్టేట్ భూముల క్రయువిక్రయూల్లో స్తబ్ధత గణనీయంగా తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు విభజన తర్వాత సగానికి సగం తగ్గిన రాబడి మెదక్ జిల్లాపైనా విభజన ప్రభావం కొంతకాలం గడిస్తేనే మళ్లీ పుంజుకుంటుందంటున్న రియల్టర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని, శివారు ప్రాంతాల్లో రియల్ భూం ఢాం అంది! విభజన ఎఫెక్ట్‌తో హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశం నుంచి నేలకు దిగింది. భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విభజన ప్రకటన చేశాక రిజిస్ట్రేషన్లు సగానికి సగం పడిపోయాయి. ప్రత్యేకించి నగర శివార్లలో ఏర్పడిన వెంచర్లవైపు ఎవరూ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలను బట్టి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఆ రంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు. రూ. 564 కోట్ల నుంచి రూ. 274 కోట్లకు.. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలో 2013 మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 564.17 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది (2014) అదే నెలల్లో రిజిస్ట్రేషన్ల రాబడి రూ.274.47 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని విభజించాక ఏకంగా సగానికిపైగా రాబడి తగ్గిపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాను విడిగా చూస్తే గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.313.84 కోట్లు ఉండగా... ఈ ఏడాది మార్చిలో ఈ ఆదాయం ఏకంగా రూ.121.12 కోట్లకు పడిపోయింది. ఇక ఒక్క హైదరాబాద్‌ను చూస్తే గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ద్వారా 112.69 కోట్ల రాబడి రాగా... ఈ ఏడాది మార్చిలో అది ఏకంగా 46.73 కోట్లకు దిగజారింది. గతేడాది ఏప్రిల్‌లో రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.103 కోట్లు రాగా.. ఈ ఏడాది అదే నెలలో రూ.68.07 కోట్లకు పడిపోయింది. విభజన ప్రక్రియ జరిగిన ఫిబ్రవరి నెలతో పోలిస్తే తర్వాతి నెలల్లోనూ భారీగా తేడా కనిపించింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లో రిజిస్ట్రేషన్ల రాబడి ఫిబ్రవరిలో రూ.277.35 కోట్లు ఉండగా... మార్చి నెలలో రూ. 167.85 కోట్లకు, ఏప్రిల్‌లో రూ.106 కోట్లకు పడిపోయింది. రంగారెడ్డి, హైదరాబాద్‌లకు ఆనుకొని ఉన్న మెదక్ జిల్లాపైనా విభజన ప్రభావం కనిపించింది. ఈ జిల్లాలో గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.45.80 కోట్లు కాగా... ఈ ఏడాది మార్చిలో అది రూ.14.99 కోట్లకు అంటే మూడో వంతుకు పడిపోయింది. కొత్త ప్రభుత్వ విధానాలతోనే: రియల్ ఎస్టేట్ రంగం ఇంత తీవ్రంగా పడిపోవడం... రిజిస్ట్రేషన్ల ఆదాయం సగానికిపైగా తగ్గడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. విభజన నేపథ్యంలో నెలకొన్న గందరగోళ పరిస్థితి వల్లే ఇక్కడ భూముల కొనుగోళ్లు పడిపోయాయని అంటున్నారు. ఈ పరిస్థితి మెరుగుపడాలంటే తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కీలకం అని రియల్టర్లు అంటున్నారు. ప్రభుత్వం పెట్టుబడుల పట్ల సానుకూలంగా వ్యవహరించి, పెట్టుబడులను ఆహ్వానించే తీరుపైనే రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు. హైదరాబాద్‌కు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, వాతావరణ సమతుల్యత తదితర కారణాలతో రాబోయే ఏడాదిలోగా రియల్ రంగం యథాతథ స్థితికి వస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌కు మించిన నగరం ఎక్కడుంది?: టి.శేఖర్‌రెడ్డి విభజన తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని తాను భావించడం లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) అధ్యక్షులు టి.శేఖరరెడ్డి అంటున్నారు. విభజన జరిగిన తర్వాత ఈ రెండు మూడు నెలల కాలంలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని భావించడం లేదని చెప్పారు. ఆ నెలల్లో కొన్న భూములకు అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్లు జరగబోవని, రిజిస్ట్రేషన్లు ఏమేరకు జరిగాయో తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు. విభజన ప్రభావం ఎంతో కొంతమేర ఉండటానికి కారణం వేరే ఉందన్నారు. ‘‘విభజన జరగకముందు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లలో కొంత గందరగోళం ఉంది. అయితే విభజన జరిగాక అందరికీ స్పష్టత వచ్చింది. అయినా ఆసియాలోనే హైదరాబాద్ గొప్ప నగరం. దేశంలో ఇక్కడ ఉన్నన్ని వసతులు మరెక్కడా లేవు. మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడి భూములపైనా... ఇతరత్రా ప్రాజెక్టులు, పరిశ్రమలపైనా పెట్టుబడులు పెట్టడానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండబోవు’’ అని ఆయన చెప్పారు. నూతన పరిశ్రమల స్థాపన కోసం వచ్చే పారిశ్రామికవేత్తలకు కొత్త ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి, పదిహేను ఇరవై రోజుల్లోగా అనుమతులు ఇచ్చేట్లయితే హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల రాబోయే 20 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని, దీనిద్వారా నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో ఊహించవచ్చన్నారు. -
గుంటూరులో రియల్ బూమ్
సాక్షి, గుంటూరు :గుంటూరు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్న మొన్నటి వరకూ స్తబ్దుగా ఉన్న భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత నాలుగేళ్లుగా అనేకమంది భూములను అమ్మేందుకు ఎదురుచూపులు చూశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాష్ట్రానికి నూతన రాజధానిగా గుంటూరు- విజయవాడ మధ్య ప్రాంతం అనుకూలంగా ఉందంటూ ఊహాగానాలు రావడంతో గుంటూరుకు చుట్టుపక్కల 30 కి.మీ వరకూ భూముల ధరలు రోజురోజుకూ పైపైకి వెళ్తున్నాయి. దీనికితోడు ఇటీవల రాజధాని ఏర్పాటు గురించి సీమాంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రాంతాలు తిరిగిన కేంద్ర బృందం వారం రోజుల క్రితం గుంటూరుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బృందం జిల్లాలో గుంటూరు- విజయవాడ మధ్యే పరిశీలన జరపడంతో ఇక ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జోరందుకుంది. దీంతో గుంటూరు నగర శివారుల్లో సైతం భూములను అమ్మేందుకు ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు. ధరలు పెరుగుతున్నాయి కదా.. ఒక నెల చూద్దాంలే అంటూ వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. బడా వ్యాపారవేత్తలు మాత్రం ప్రస్తుతం అక్కడ ఉన్న మార్కెట్ ధరల కంటే అనూహ్యంగా ధరలు పెంచి అడుగుతుండటం తో కొందరు వచ్చిన వరకూ చాల్లే అంటూ అమ్మేస్తున్నారు. శివారు ప్రాంతాలపై రియల్టర్ల దృష్టి దీనికితోడు గుంటూరు నగర శివారులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నూతన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, మంగళగిరి వద్ద పోలీస్ బెటాలియన్ ఉన్న ప్రాంతంలో సీమాంధ్ర డీజీపీ కార్యాలయం ఏర్పాటు అవుతుందంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో భూ యజమానుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే భూముల ధరలు పెరుగుతున్నాయంటూ అందరికీ తెలిసిపోవడంతో అమ్మేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రియల్టర్ల దృష్టి నగర శివారు ప్రాంతాలపై పడింది. పల్నాడును ప్రత్యేక జిల్లా చేస్తామంటూ ప్రకటనలు.. గుంటూరు సంగతి అలా ఉంచితే నరసరావుపేటతోపాటు పల్నాడు ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేస్తామంటూ ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తుండటంతో ఆ ప్రాంతంలో సైతం భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు మాచర్ల నుంచి దుర్గి, బొల్లాపల్లి ప్రాంతాల్లో అటవీభూములు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని కేంద్రం భావిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పక్కనే కృష్ణానది ఉండటంతో రాజధాని కేంద్రంలో నీటి సమస్య ఉండదని, వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఇక్కడే ఉన్నాయని, పైగా పల్నాడు ప్రాంతంలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ళ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన మైనింగ్ భూములు ఉండటం కూడా కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. దీంతో గతంలో ఎకరా లక్ష కూడా పలకని భూములు ఇప్పుడు నాలుగైదు రెట్లు అధికంగా పెరిగిపోయాయి. ఆ ధరకు కూడా అమ్మేందుకు ఎక్కువ శాతం మంది ముందుకు రావడంలేదు. రాజధాని అయినా కాకపోయినా, ప్రత్యేక జిల్లా అయితే చాలని కొందరు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్థల యజమానులు అప్రమత్తం... పెదకాకాని: సీమాంధ్ర రాజధాని ఏర్పాటు గుంటూరు, విజయవాడల మధ్య ఏర్పాటు జరుగుతుందని ప్రచారం ఊపందుకోవడంతో కొందరు స్థలాల యజమానులు అప్రమత్తమయ్యారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మండల పరిధిలోనే ఉండటంతో పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, వెనిగండ్ల అగతవరప్పాడు గ్రామాలలో ఎక్కువగా స్థలాలు కొన్న వారు తమ ప్లాట్లను చూసుకునేందుకు అధికసంఖ్యలో వస్తున్నారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొందరు తమ ప్లాటు గుర్తించగా మరి కొందరు తమ ప్లాటు ఎక్కడుందో తెలీడంలేదనీ, కాస్త వెతికి పెట్టాలని బ్రోకర్లను ఆశ్రయిసున్నారు. తక్కువ ధరకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రాంతాలలో ఉండటం వల్ల ప్లాటు కొని ఏళ్ల తరబడి తిరిగి చూడలేదు. ప్రస్తుతం కొన్ని ప్లాట్లు ముళ్ల కంచెలుగా మారగా మరికొని బ్రోకర్ల మాయాజాలం కారణంగా దొంగ రిజిస్ట్రేషన్లు జరిగాయి. పలు ప్రాంతాల్లో తాము కొనుగోలు చేసినప్పుడు తూర్పు, పడమర రోడ్లు ఉన్నాయి కదా, ఇదేంటి మా పాట్లన్నీ ఉత్తరం, దక్షిణం రోడ్లుగా మారాయని తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్ర రాజధాని ప్రచారం జోరుగా సాగడంతో మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్న ప్లాట్లను ఫెన్సింగ్ వేసుకోవడం, పిల్లర్స్ పోయడం, ప్రహరీ కట్టుకోవడం వంటి చర్యలు చేపడుతున్నారు. స్థలాల ధరలు మాత్రం చుక్కలు చూస్తుండగా కొనుగోలు చేసే వారు ముందుకు రావడం లేదు. అవకతవకలు జరగకుండా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటారో వేసి చూడాలి. -
ఇతర నగరాల్లో రియల్ దూకుడు!
అభివృద్ధిలో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏకైక ఆశాదీపం... పరిశ్రమలతో నిండిన విశాఖే. సింగపూర్‌ను పోలిన వనరులు, సౌకర్యాలూ ఇక్కడున్నాయి. చుట్టూ సముద్రం, భారీ నౌకలు కూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు, చమురు కంపెనీలు, షిప్‌యార్డ్, విమాన సేవలు, ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు, వేల కోట్ల ఫార్మా ఎగుమతులు, ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు, ఏడాది పొడవునా బారులు తీరే పర్యాటకులు ఇదీ క్లుప్తంగా విశాఖపట్నం అంటే. ఏడాదిగా విశాఖలో స్థిరాస్తి ధరల్లో కనీసం 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని క్రెడాయ్ విశాఖపట్నం సెక్రటరీ కోటేశ్వరరావు చెప్పారు. 2006లో రూ.25 వేలున్న గజం స్థలం ధర ఇప్పుడు రూ.50 వేలకు పైగానే పలుకుతోందని పేర్కొన్నారు. సిటీ నుంచి 15 కి.మీ. దూరంలో ఉండే మధురవాడ, ఎండాడ, మురళీనగర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2,500గా, నర్సింహానగర్, అక్కయపాలెం, అబీద్‌నగర్ వంటి ప్రాంతాల్లో రూ.3,500లు, బీచ్‌రోడ్, బాలాజీనగర్, పాండురంగాపురం వంటి ప్రాంతాల్లో రూ.4000గా ఉందని తెలిపారు. అయితే రాజకీయ అనిశ్చితి కారణంగా విశాఖలో ధరలు పెరిగాయని, మరో ఆరేడు నెలల్లో ధరలు స్థిరపడే అవకాశముందని ఆయన చెప్పారు. ఐటీ జోరు.. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి ఎలాంటి ఢోకాలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఐటీ పెట్టుబడులు వచ్చేది విశాఖకే. ఇప్పటికే ఇక్కడ 70 ఐటీ కంపెనీలు, 90 ఫార్మా కంపెనీలున్నాయి. వీటి వార్షిక టర్నోవర్ ఏటా రూ.1,450 కోట్లుగా ఉంది. ప్రత్యేక హోదా కారణంగా భారీస్థాయిలో పన్ను మినహాయింపులు లభిస్తాయని కనుక కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. మరో 50 కంపెనీలు విశాఖకు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రుషికొండలో మూడు ఐటీ సెజ్‌లు ఏర్పాటు కానున్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధికి ఢోకాలేదు.. విశాఖ నుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు ఆధారిత కంపెనీలు భారీగా రానున్నాయి. పది మండలాల్లో విస్తరించనున్న ఈ జోన్లో వివిధ కంపెనీలు రానున్నాయి. పీసీపీఐఆర్ కంపెనీలకు పన్ను రాయితీలు వర్తిస్తుండగా ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్‌కు మరింత డిమాండ్ పెరగనుంది. వైజాగ్, గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి, భీమిలిలోనూ పోర్టులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. సిటీ నుంచి 20 కి.మీ. దూరంలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రభుత్వ భవనాలూ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే అటవీ భూమిని సైతం డీ నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందువల్ల మరో 5 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. పారిశ్రామిక రాజధాని.. ‘విశాఖపట్నం’ జనాభా: 21 లక్షలు విస్తీర్ణం: 550 చ.కి.మీ. ఐటీ, ఫార్మా కంపెనీలు: 160 ఎస్ఈజెడ్లు: 4, పోర్టులు: 2 స్థిరాస్తి ధరలు 40 శాతం వరకూ పెరిగాయి {పాంతాన్ని బట్టి చ.అ. ధర రూ.2,000 నుంచి రూ.4,000 వరకూ ఉంది. -
భాగ్యనగరికి ఐటీ హారం
సాక్షి, సిటీబ్యూరో, రాయదుర్గం/మాదాపూర్, న్యూస్‌లైన్: ‘భాగ్య’నగర కంఠసీమలో మరో మణిహారం చేరనుంది. అంతర్జాతీయ ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారనుంది. నగరంలో ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నగరం ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుంది. సిటీలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగం పుంజుకోనుంది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం స్తబ్దుగా ఉన్న రియల్టీకి తాజా ఐటీఐఆర్ ప్రాజెక్టు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే నగరంలో కొలువుదీరాయి. అయితే నాలుగేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కొన్ని సంస్థలు ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టేందుకు వెనుకడుగేశాయి. రియల్ఎస్టేట్ కూడా మందగించింది. ఈ తరుణంలో తాజా ప్రకటన మళ్లీ నగరంలో రియల్ బూమ్ పెరిగేందుకు దోహదపడనుంది. 202 చదరపు కిలోమీటర్ల (50 వేల ఎకరాల) పరిధిలో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, హార్డ్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిధి పూర్తిగా నగరంలోనే ఉండటంతో నగరంలో పలు రియల్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఐటీఐఆర్ ఏర్పాటు చేసేది ఇక్కడే.. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మొత్తం 50 వేల ఎక రాల పరిధిలో మూడు క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో) పరిధిలో 86.7 చదరపు కిలోమీటర్లలో ఒకటి, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) పరిధిలో 79.2 చదరపు కిలోమీటర్ల మేర మరొకటి, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో 10.3 చదరపు కిలోమీటర్ల మేర మరో క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు క్లస్లర్ల పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. వీటిని అనుసంధానిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి. పరిధిలో, ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి. పరిధిలో కూడా ఐటీఐఆర్‌ను అనుమతిస్తారు. దీన్ని 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. ‘మెట్రో’తో మరింత జోష్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు మెట్రో రైల్ మరింత జోష్‌ను పెంచింది. ఐటీఐఆర్ ప్రతిపాదించిన మొదటి, మూడో క్లస్టర్లలో ప్రతిపాదిత మెట్రో రైలు మార్గాలుండడం అదనపు అంశం. దీంతో ఈ ప్రాంతాల్లో ఇప్పుటికే అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతోంది. క్లస్టర్-1 పరిధిలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ కింద గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్‌లతో మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల వరకు అభివృద్ధి శరవేగంగా జరిగింది. మియాపూర్‌లో 55 ఎకరాల్లో సుమారు రూ. 100 కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద బస్ టర్మినల్‌ను నిర్మించనున్నారు. ఇదే ప్రాంతంలో 104 ఎకరాల్లో మెట్రో రైల్వే డిపోను కూడా నిర్మించనున్నారు. దీనికి తోడు మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్ని హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ‘పారిశ్రామిక జోన్’గా ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు సంస్థల్ని ఏర్పా టు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మెట్రో కారిడార్-1లో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 28.87 కి.మీ. మెట్రో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ మార్గాల్లో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారుల విస్తరణ, పిల్లర్లపై సెగ్మెంట్ల అమరిక జరుగుతోంది. 2015 ఆగస్టుకి ఈ మార్గంలో పనులు పూర్తిచేస్తామని ఎల్అండ్టీ వర్గాలు తెలిపాయి. మెట్రో కారిడార్లలో మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైటెక్ సిటీ ఎదురుగా 2 లక్షల చ.అ. విస్తీర్ణంలో 2 మెట్రో మాల్స్‌ను నిర్మిం చేందుకు ఎల్అండ్టీ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. క్లస్టర్3 పరిధిలో విశేష అభివృద్ధి క్లస్టర్-3లోని ఉప్పల్, పోచారం ప్రాంతాలకు దగ్గర్లోని ప్రతిపాదిత నాగోల్-శిల్పారామం మెట్రోరైలు మార్గంలో ఉప్పల్, హబ్సిగూడల్లో స్టేషన్లు రానున్నాయి. మెట్రో రానుండటంతో ఇక్కడ రియల్ వ్యాపారం కూడా జోరుగానే సాగుతుంది. హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్-2031లో ఉప్పల్ ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలోకి వస్తుంది. పోచారంలోని రహేజా మైండ్‌స్పేస్, ఇన్ఫోసిస్, ఐటీ సెజ్ కంపెనీలతో ఈ ప్రాంతం హాట్‌కేక్‌లా మారింది. ‘ఎరేనా టౌన్‌సెంటర్’లో ఎన్ఎస్ఎల్ సంస్థ ఏకంగా 26 అంతస్తులతో పది టవర్లను నిర్మించింది. దీంతో బడా బడా నిర్మాణ సంస్థలు, దేశ, విదేశీ సంస్థలు ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నాయి. రామంతాపూర్ వెళ్లే మార్గంలో 36 ఎకరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత సెజ్‌ను నూజివీడు సీడ్స్ ఏర్పాటు చేసింది. భాగ్యనగర్ మెటల్స్, ఐకానిక్, స్పేస్ డెవలపర్స్ సంస్థలు ఈ ప్రాంతంలో ఐటీ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నాయి. జోడిమెట్ల చౌరస్తా నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో 23 ఎకరాల్లో చెన్నమనేని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ‘ఆవలోన్ కోట్స్’ పేరుతో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇదే ప్రాంతంలో సత్యవాణి కన్స్ట్రక్షన్స్, మోడీ బిల్డర్స్, సురానా కంపెనీ వంటి వివిధ సంస్థల భారీ నివాస సముదాయాలు, మల్టీప్లెక్స్‌లు కూడా రానున్నాయి. ఇప్పటికే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోరైల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాగోల్ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 100 ఎకరాల్లో రైల్వే డిపోను అభివృద్ధి చేయబోతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానిస్తూ నాగోలు-గౌరెల్లి రేడియల్ రోడ్డు కూడా ఏర్పాటు కానుంది. ఎల్బీనగర్ ఓపెన్ స్టేడియంలో 1.5 ఎకరాల్లో 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో మెట్రో మాల్స్ ఏర్పాటుకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో విశేషంగా అభివృద్ధి జరగనుంది. మార్కెట్ అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ అంతర్జాతీయ హబ్ గా మారుతుంది. మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ స్థాయి మల్టిప్లెక్స్‌లు, షా పింగ్‌మాళ్లు, భారీ నివాస సముదాయాలు వస్తాయి. మాదాపూర్, గచ్చిబౌలిలను మించిన ఐటీ రంగ అభివృద్ధి ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వరకు జరుగుతుంది. ఎక్కడిక్కడ శాటిలైట్ నగరాలు వెలుస్తాయి. - జైవీర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ సద్వినియోగం చేసుకోవాలి ఐటీ రంగంలో హైదరాబాద్ నాల్గో స్థానంలో ఉంది. ఐటీఐఆర్‌తో మొదటి స్థానానికి వెళ్తుందని ఆశిస్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్న మౌలిక వసతులు, మెట్రో, ఓఆర్ఆర్, అనుకూలమైన వాతావరణం వంటి కారణంగానే ఇతర మెట్రో నగరాలను కాదని హైదరాబాద్‌కు ఐటీఐఆర్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. - శేఖర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి హైదరాబాద్‌కు ఫ్యాబ్ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ సెంటర్, గేమింగ్ అండ్ యానిమేషన్ సిటీ, రిలయన్స్ 100 అంతస్తుల సెజ్, హార్డ్ పార్క్ ప్రాజెక్టులు వస్తాయన్నారు. కానీ అవేమీ రాలే దు. వీటి పేర్లు చెప్పుకొని రియల్టర్లు బాగుపడ్డారే తప్ప ఉద్యోగాలేమీ రాలేదు. బోగస్ కంపెనీల మాయలో పడి ఐటీ ఉద్యోగులు మోసపోయారు. కనీసం ఇప్పుడైనా అలా జరగకుండా ఐటీఐఆర్‌ను పూర్తి చేయాలి. - నరేందర్, సీనియర్ సిస్టమ్స్ ఇంజినీర్ వైఎస్ హయాంలోనే ప్రతిపాదనలు హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చ డం అభినందనీయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ఐటీఐఆర్ ప్రతిపాదనలున్నాయి. ఇప్పుడు ఆమోదానికి నోచుకున్నాయి. కొత్త ప్రతిపాదనలతో లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. సిటీలోనే కాకుండా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తే బాగుండేది. - మధుమూర్తి రొనంకి, కో ఫౌండర్, అధ్యక్షులు, ట్యాలెంట్ స్ప్రింట్ సంస్థ మౌలిక వసతులు కల్పించాలి కొత్తగా ఐటీ రంగంలో రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండడంతో ప్రత్యకంగా, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి వ స్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుతం ఉన్న మౌలికవసతులను మరింతగా మెరుగు పర్చాలి. ్రపస్తుతం ఉన్న జనాభా స్థాయిలో కొత్తగా నగరానికి వచ్చే అవకాశం ఉంది. అందుకోసం శివారు ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్స్ నిర్మించాలి. - డి.శ్రీనివాస్‌కుమార్, ఐటీ ఉద్యోగి హైదరాబాద్‌కు మంచి గుర్తింపు కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు రావడం వల్ల సాంకేతికపరంగా హైదరాబాద్ మంచి గుర్తింపు పొందుతుంది. ఎంప్లాయ్మెంట్, గేమింగ్, ఐటీ రంగాల్లో రాబోయే తరాల వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలుంటాయి. వారి వల్ల మరింతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. రా్రష్టంలోని ప్రస్తుత వాతావరణం ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలి. - కిరణ్-డిలాయిట్ ఐటీ ఉద్యోగి