ఇతర నగరాల్లో రియల్ దూకుడు!
అభివృద్ధిలో వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏకైక ఆశాదీపం... పరిశ్రమలతో నిండిన విశాఖే. సింగపూర్‌ను పోలిన వనరులు, సౌకర్యాలూ ఇక్కడున్నాయి. చుట్టూ సముద్రం, భారీ నౌకలు కూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు, చమురు కంపెనీలు, షిప్‌యార్డ్, విమాన సేవలు, ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు, వేల కోట్ల ఫార్మా ఎగుమతులు, ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు, ఏడాది పొడవునా బారులు తీరే పర్యాటకులు ఇదీ క్లుప్తంగా విశాఖపట్నం అంటే.
ఏడాదిగా విశాఖలో స్థిరాస్తి ధరల్లో కనీసం 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని క్రెడాయ్ విశాఖపట్నం సెక్రటరీ కోటేశ్వరరావు చెప్పారు. 2006లో రూ.25 వేలున్న గజం స్థలం ధర ఇప్పుడు రూ.50 వేలకు పైగానే పలుకుతోందని పేర్కొన్నారు. సిటీ నుంచి 15 కి.మీ. దూరంలో ఉండే మధురవాడ, ఎండాడ, మురళీనగర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2,500గా, నర్సింహానగర్, అక్కయపాలెం, అబీద్‌నగర్ వంటి ప్రాంతాల్లో రూ.3,500లు, బీచ్‌రోడ్, బాలాజీనగర్, పాండురంగాపురం వంటి ప్రాంతాల్లో రూ.4000గా ఉందని తెలిపారు. అయితే రాజకీయ అనిశ్చితి కారణంగా విశాఖలో ధరలు పెరిగాయని, మరో ఆరేడు నెలల్లో ధరలు స్థిరపడే అవకాశముందని ఆయన చెప్పారు.
ఐటీ జోరు..
విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి ఎలాంటి ఢోకాలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత ఐటీ పెట్టుబడులు వచ్చేది విశాఖకే. ఇప్పటికే ఇక్కడ 70 ఐటీ కంపెనీలు, 90 ఫార్మా కంపెనీలున్నాయి. వీటి వార్షిక టర్నోవర్ ఏటా రూ.1,450 కోట్లుగా ఉంది. ప్రత్యేక హోదా కారణంగా భారీస్థాయిలో పన్ను మినహాయింపులు లభిస్తాయని కనుక కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. మరో 50 కంపెనీలు విశాఖకు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రుషికొండలో మూడు ఐటీ సెజ్‌లు ఏర్పాటు కానున్నాయి. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా రెండో సెంటర్‌ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అభివృద్ధికి ఢోకాలేదు..
విశాఖ నుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు ఆధారిత కంపెనీలు భారీగా రానున్నాయి. పది మండలాల్లో విస్తరించనున్న ఈ జోన్‌లో వివిధ కంపెనీలు రానున్నాయి. పీసీపీఐఆర్ కంపెనీలకు పన్ను రాయితీలు వర్తిస్తుండగా ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్‌కు మరింత డిమాండ్ పెరగనుంది. వైజాగ్, గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి, భీమిలిలోనూ పోర్టులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. సిటీ నుంచి 20 కి.మీ. దూరంలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రభుత్వ భవనాలూ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే అటవీ భూమిని సైతం డీ నోటిఫై చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందువల్ల మరో 5 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
పారిశ్రామిక రాజధాని.. ‘విశాఖపట్నం’
జనాభా: 21 లక్షలు
విస్తీర్ణం: 550 చ.కి.మీ.
ఐటీ, ఫార్మా కంపెనీలు: 160
ఎస్‌ఈజెడ్‌లు: 4, పోర్టులు: 2
స్థిరాస్తి ధరలు 40 శాతం వరకూ పెరిగాయి
{పాంతాన్ని బట్టి చ.అ. ధర రూ.2,000
నుంచి రూ.4,000 వరకూ ఉంది.