
విశాఖను అన్ని విధాలా నిర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
విమాన సర్వీసుల్లోనూ కుయుక్తులు
విశాఖ నుంచి అంతర్జాతీయ సర్వీసులకు ఎయిర్‌లైన్స్ సంస్థల ఆసక్తి
విజయవాడ నుంచి నడపాలంటూ ప్రభుత్వం ఒత్తిడి
దుబాయ్‌కు విశాఖ నుంచి సర్వీసుకు సిద్ధమైన ఎమిరేట్స్
దానిని విజయవాడ నుంచి నడపాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం
సందిగ్ధంలో ఎమిరేట్స్ సంస్థ.. అసలు సర్వీసే రద్దు చేసే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక రాజధానిగా భాసిల్లుతూ.. నిన్నటిరవకు కార్యనిర్వాహక రాజధానిగా ఎదిగిన విశాఖపట్నం నగరాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఓ పక్క విశాఖపై చాలా ప్రేమ ఉందని చెబుతూనే, మరోపక్క ఈ మహా నగరం అభివృద్ధిని అడ్డుకుంటోంది. అన్ని రకాల సౌకర్యాలను విశాఖపట్నం ప్రజల నుంచి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది.
ఆర్‌బీఐ రీజనల్ కార్యాలయం ఏర్పాటవుతుందన్న తరుణంలో దాన్ని విజయవాడకు పట్టుకుపోయిన చంద్రబాబు సర్కారు.. చివరకు విమాన సర్వీసులనూ తరలించేస్తోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందుకొస్తుంటే.. ఆ సర్వీసులను విజయవాడ నుంచి నడపాలంటూ ఒత్తిడి తెస్తోంది. దీంతో ఎటూ తేల్చుకోలేక విమానయాన సంస్థలు అసలు ఏపీ నుంచి సర్వీసులు నడపాలా వద్దా అన్న సందిగ్ధంలో పడుతున్నాయి.
స్లాట్‌లపై నౌకాదళం ఆంక్షలతో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వివక్షతో విశాఖ విమానాశ్రయం అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రయాణికులతో పాటు కార్గోలోనూ అపారమైన వృద్ధి సామర్థ్యం ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం మానేసి.. కొత్త సర్వీసుల్ని కూడా విజయవాడకు మళ్లిస్తోంది.
ఎమిరేట్స్‌పై ఒత్తిడి?
మిడిల్ ఈస్ట్ దేశాలకు సర్వీసులు నడిపేందుకు విశాఖ ఉత్తమ ప్రాంతంగా విమానయాన సంస్థలు భావిస్తుంటాయి. వివిధ దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ అవకాశాలు కూడా వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎమిరేట్స్ కూడా ఏపీ నుంచి దుబాయ్‌కు సర్వీసు నడిపేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎయిర్‌పోర్టులను అధ్యయనం చేసింది. విశాఖే అనుకూలంగా ఉందని భావించింది.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నుంచి కాకుండా విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్టు) నుంచి దుబాయ్‌కి సర్వీసు నడపాలంటూ ఈ ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి షార్జాకు ఓ సర్వీసు నడుపుతోంది. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు రెండో సర్వీసు నడిపినా ఆక్యుపెన్సీకి అవకాశం లేదు.
అయినా విశాఖపై కక్ష సాధింపుతో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ నుంచే నడపాలని అంటుండటంతో ఎమిరేట్స్ సంస్థ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం ఇలాగే ఒత్తిడి చేస్తే పూర్తిగా సర్వీసు రద్దు చేసే అవకాశం కూడా ఉందని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమిరేట్స్ సంస్థ పరిస్థితిని చూసిన ఇతర సంస్థలు ఏపీ నుంచి సర్వీసులు నడపడానికి వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో దుబాయ్‌కి విజయవంతంగా సర్వీసు
కోవిడ్–19కి ముందు విశాఖ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ దుబాయ్‌కు ఏడేళ్ల పాటు సర్వీసుని నడిపింది. 80 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ సర్వీసు నడిచింది. ఇప్పుడూ ఇదే విధమైన డిమాండ్ ఉన్నప్పటికీ, దుబాయ్ సర్వీసును ప్రభుత్వం అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 180 సీటర్ ప్యాసింజర్ విమానానికి 2 టన్నుల కార్గోని కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది.
ఈ సర్వీసు విశాఖ నుంచి నడిస్తే 100 శాతం ఆక్యుపెన్సీతో పాటు రొయ్యలు, ఔషధాలు, దుస్తులు, ఇతర కార్గో ఎగుమతులకు కూడా అవకాశం ఎక్కువ ఉంది. ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు కార్గో అదనపు ఆదాయాన్నిస్తుంది. అందువల్ల విదేశీ సర్వీసులకు వైజాగ్ పూర్తి అనుకూలమని విమానయాన సంస్థలు భావిస్తున్నా, ప్రభుత్వం మోకాలడ్డడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment