
అక్కిరెడ్డిపాలెం: అప్పుడే పుట్టిన శిశువుల్లో వచ్చే పచ్చకామెర్ల నివారణకు వినియోగించే ఎనలైట్–360 పరికరాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పరిశీలించారు. అక్కిరెడ్డిపాలేనికి చెందిన ఎం.సుబ్రహ్మణ్యప్రసాద్ ఈ పరికరాన్ని తయారు చేశారు.
దీనిని దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించగా.. బిల్‌గేట్స్ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. పరికరం తయారుచేసిన ప్రసాద్‌ను అభినందించారు. ఈ పరికరం తయారీతో నూతన ఆవిష్కరణలకు అందించే ప్రతిష్టాత్మక ఆరోహణ్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డు 2023ను ప్రసాద్ ఇప్పటికే సాధించారు.
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్.. పోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. భారత్ కు వచ్చే ముందు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment