సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాప్‌లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:
మహిళలకు భద్రత లేదు: రాష్ట్రంలో మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో రోజులు గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు. భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్ బాలికపైన మద్యం తాగిన దుండగుడు అత్యాచారం చేశాడు. అలాగే మరో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పని చేస్తున్న మహిళలపై దౌర్జన్యం చేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే, ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు. మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు.
గతంలో జగన్‌గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా ఎటువంటి వ్యవస్థను తీసుకు రాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండుమూడు సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. దీనికి ప్రధానంగా మద్యం ఏరులై పారుతోంది. 50వేలకు పైగా బెల్ట్‌షాప్‌లు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా వెలిశాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సంబరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాప్‌లు నిర్వహించినా ప్రభుత్వం పట్టించకోలేదు. ఎనీటైం మద్యం లభించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన జాతరలో ఎనబై శాతం మద్యం మత్తులో జరిగినవే.
మాదక ద్రవ్యాల నియంత్రణలో చర్యలు ఏవీ?
గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్‌షాపల్ నిర్వాహణ కొనసాగించారు.
హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు. రాష్ట్రంలోని పోలీసులను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకే వినియోగించుకుంటున్నారు. చివరికి దావోస్ వెళ్ళిన మంత్రి నారా లోకేష్ అక్కడ కూడా తన రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.
దాడుల ఘటనల్లో బాధితులకు భరోసా ఏదీ?:
యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి జరిగితే రాష్ట్ర హోం మంత్రి ఏమైనా స్పందించారా? మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబిల్లి గ్రామంలో ఒక యువతిని సురేష్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అయినా, నేటికీ హోమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యతా యుతమైన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారని తెలియగానే హడావుడిగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అక్కడికి పరుగులు పెడుతుంటారు.
ఇదీ చదవండి: కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్
ఎక్కడ తమకు చెడ్డపేరు వస్తుందోనని మాత్రమే వారు స్పందిస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్దితో వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధిత కుటుంబాలకు మేం అండగా ఉంటామనే భరోసాను కల్పించలేక పోతున్నారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడం, సీఎం, డిప్యూటీ సీఎం అంటూ పదవులను పంచుకోవడంపైనే శ్రద్ద కనపరుస్తున్నారు. మధ్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే వెంటనే రాష్ట్రంలోని బెల్ట్‌షాప్‌లన్నింటినీ తొలగించాలని, మద్యం విక్రయాలను నియంత్రించాలని, లేని పక్షంలో బెల్ట్‌షాప్‌లను మహిళలే ధ్వంసం చేస్తారని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment