సాక్షి, తాడేపల్లి: ఒక వైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరిస్తూ.. మరోవైపు పెట్టుబడులు (Investments) పెట్టమని ప్రాధేయపడితే, వారెలా ముందుకొస్తారని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్(Nagarjuna Yadav) సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా? అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్న నాగార్జునయాదవ్.. రాష్ట్రం విడిచివెళ్లిన సజ్జన్ జిందాల్కు క్షమాపణ చెప్పి, ఆ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రతిష్టను దిగజార్చారు..
దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కూటమి పార్టీల నాయకుల్లో కమీషన్ల కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో మరికొందరు ఏడు నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల ప్రవాహం వస్తుందని మోసపు మాటలతో మళ్లీ నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.
రాష్ట్రం నుంచి తరిమేశారు..
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వాస్తవానికి ఇదే కంపెనీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ దాదాపు రెండేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో కడపలో రూ.8800 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చి భూమి పూజ కూడా చేశారు. ఇంకా రాష్ట్రంలో సుమారు రూ.50,500 కోట్ల పెట్టుబడులకు 2022లో 6 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యక్తిని సాదరంగా ఆహ్వానించకుండా చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసింది.
కమీషన్ల కోసం బెదిరింపులు
ముంబైకి చెందిన కాదంబరి జెత్వాని అనే నటిని తీసుకొచ్చి ఆమెతో సజ్జన్ జిందాల్‌పై నిందారోపణలు చేసి, అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు. జిందాల్ మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. దాల్మియా గ్రూప్‌నకు చెందిన 11 లారీలను కూటమి నాయకులు కప్పం కట్టలేదని నాశనం చేశారు. మరో పెద్ద సంస్థ అదానీ పోర్టుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా కమీషన్ల కోసం వెళ్లి ఉద్యోగులను బెదిరించి వచ్చాడు. అందుకే ఇకనైనా కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు తరలిపోకుండా చూడాలి.
జిందాల్‌కు క్షమాపణలు చెప్పాలి
ఇంకా కూటమి ప్రభుత్వ తీరు కారణంగా వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు క్షమాపణలు చెప్పి రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని, గతంలో ప్రభుత్వంతో ఆయన కుదుర్చుకున్న 6 ఒప్పందాలకు సంబంధించిన రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం ఈ అస్తవ్యస్త పరిస్థితికి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఆయన తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు!
Comments
Please login to add a commentAdd a comment