
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలన విశాఖ పర్యాటకానికి శాపంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి కారణంగా రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ గుర్తింపును రద్దు చేశారు. బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దుతో విశాఖ పర్యాటకంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
ఏపీలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖలోని రుషికొండకు పేరుంది. రుషికొండ వద్ద తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్ బీచ్‌గా వైఎస్సార్‌సీపీ హయాంలో 2020లో ధ్రువీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) సంస్థ అందిస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రుషికొండ బీచ్‌లో ఎప్పటికప్పడు వ్యర్థాల తొలగింపు చేపట్టారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలతో పాటు బీచ్ క్లీన్‌గా ఉండేలా పలు చర్యలు తీసుకున్నారు. దీంతో, బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది.
ఇక, చంద్రబాబు పాలనలోకి వచ్చిన తర్వాత రుషికొండ బీచ్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో, ఇటీవల కాలంలో బీచ్‌లోకి కుక్కలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, ప్రయాణీకుల నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటుచేసుకున్నాయి. అలాగే.. టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు దారుణంగా మారాయి. బీచ్ వద్ద నిర్వహణ అధ్వానంగా ఉన్న ఫొటోలను, వీడియోలను కొందరు పర్యాటకులు డెన్మార్క్ సంస్థకు గత నెల 13న ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా తాజాగా రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపును రద్దు చేశారు. దీంతో, తీరంలోని జెండాలను పర్యాటకశాఖ అధికారులు కిందకు దించేశారు.

Comments
Please login to add a commentAdd a comment