
మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్‌కు అందిస్తున్న కూటమి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు
- గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి నేతల చూపు
- బలం లేకున్నా బలవంతంగా దక్కించుకునే యత్నం
- కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో సంఖ్యా బలం లేనప్పటికీ.. బలవంతంగా మేయర్ పీఠాన్ని లాక్కునేందుకు కూటమి కుటిల యత్నాలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతూ.. ప్రలోభాలకు గురిచేస్తూ బరితెగిస్తున్నారు. అందులో భాగంగానే జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కూటమి పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర్ ప్రసాద్‌కు నోటీసు ఇచ్చారు..
డబ్బు ఎర.. లొంగనివారికి బెదిరింపులు
కూటమిలో చేరితే దాదాపు రూ.25 లక్షలు ఇస్తామంటూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ఎర వేస్తున్నట్టు తెలిసింది. అక్కడికీ లొంగకపోతే మరింత ఎక్కువ ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. మీ వార్డుల్లో పెద్దఎత్తున పనులకు సహకరిస్తాం.. అని ప్రలోభ పెడుతున్నారు. ఈ ఆఫర్లకు ఒప్పుకోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు.
అవిశ్వాసానికి 64 మంది కార్పొరేటర్లు అవసరం..
2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 58 కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుంది. టీడీపీ(30), జనసేన (3), సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కటి నెగ్గాయి. స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. దీంతో వైఎస్సార్‌సీపీ బలం 60కి చేరింది.
21వ వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తొలుత ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ వార్డుకు ఉప ఎన్నిక జరగక ఖాళీగా ఉంది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల సంఖ్య 59, టీడీపీ సభ్యుల సంఖ్య 28కి తగ్గింది.
స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ నుంచి 12 మంది టీడీపీలో, ఏడుగురు జనసేనలో చేరారు. స్వతంత్రులు నలుగురు జనసేనకు మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 14కి చేరింది. ప్రస్తుతం కూటమికి 55 మంది, వైఎస్సార్‌సీపీకి 40, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే 2/3 మెజార్టీ కార్పొరేటర్లు (64) ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment