అంగన్‌వాడీల్లో ఆ సౌకర్యాలెప్పుడో..
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పన ప్రహసనంగా మారింది. సరైన వసతులు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ... నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఫలితంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు వేచి ఉండలేక ఇళ్లకెళ్లిపోతున్నారు.
రాష్ట్రంలోని 7,021 అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల నిర్మాణం, 1,811 కేంద్రాలకు తాగునీటి వసతి ఏర్పాటు కోసం పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2024–25లో రూ.10 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. కానీ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియనున్నా వేగం పుంజుకోవడం లేదు.
పురోగతి లేని పనులు
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. వీటిల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు సైతం పౌష్టికాహారాన్ని అందిస్తారు. సమగ్ర పౌష్టికాహారాన్ని అక్కడే వండి పంపిణీ చేయాల్సి ఉంటుంది.
కానీ చాలాచోట్ల వండిన ఆహారానికి బదులుగా ముడిసరుకునే అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని కొన్ని కేంద్రాలకు వీటిని మంజూరు చేసింది. 7,021 కేంద్రాలకు టాయిలెట్లు మంజూరు చేయగా... ఇందులో కేవ లం 1,015 టాయిలెట్లకు సంబంధించిన నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. 1,738 కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా..4,268 కేంద్రాల్లో పనులు ప్రారంభానికే నోచుకోలేదు.
అదేవిధంగా 1,864 అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీటి వసతికి సంబంధించి పనులు మంజూరు కాగా కేవలం 289 మాత్రమే పూర్తయ్యాయి. మరో 406 కేంద్రాల్లో పనులు కొనసాగుతుండగా.. 1,169 కేంద్రాల్లో అసలు ప్రారంభమే కాలేదు.
పాలకవర్గాలు లేకపోవడమే కారణం?
ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పనులు ప్రారంభించకుంటే మంజూరైన నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. తాజాగా మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక పాలన ప్రారంభమైంది.
అంగన్‌వాడీల్లో వసతుల కల్పనలో స్థానిక సంస్థల పాత్రే కీలకం. కానీ పాలకమండళ్లు లేకపోవడం, ప్రత్యేక పాలన కొనసాగుతుండడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణ పనులపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్‌పల్లి అంగన్‌వాడీ కేంద్రం పరిస్థితి ఇదీ. ఇక్కడ 22 మంది చిన్నారులున్నారు. టాయిలెట్ అసంపూర్తిగా ఉండటంతో రోడ్డుపైనే లఘుశంక తీర్చుకుంటున్నారు. ఈ కేంద్రంలో తాగునీటి వసతి కూడా లేకపోవడంతో చిన్నారులు, ఈ కేంద్రానికి వచ్చే బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment