
నాణ్యమైన చదువుతోపాటు ఆకట్టుకునే వసతులు ఉండేలా నిర్మాణాలు
విడివిడిగా అకడమిక్, డార్మెటరీ, వంట, భోజనశాల భవనాలు
అధ్యాపకులు, ఇతర సిబ్బందికి క్యాంపస్‌లోనే భారీ క్వార్టర్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా ఆధునిక హంగులతో కూడిన భారీ సమీకృత గురుకుల క్యాంపస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ప్రతిష్టాత్మకంగా నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మంచి విద్యాబోధన, మెరుగైన వసతులు, మానసిక–శారీరక వికాసానికి వీలున్న పరిస్థితులు, హాస్టల్ వసతి, ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణం, శుభ్రతతో కూడిన భోజనం..ఇలా అన్ని రకాలుగా ఇవి మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు.
ఇందుకోసం తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. గతంలో రోడ్లు, భవనాల శాఖలో ఈఎన్‌సీగా పనిచేసి పదవీ విరమణ పొందిన గణపతిరెడ్డిని ప్రభుత్వం తాజాగా దీనికి ఎండీగా నియమించింది.
ఇన్ఫోసిస్‌తో ఒప్పందం..
ఈ గురుకులాల్లో విద్యాబోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పాఠ్యాంశాల తయారీ, బోధన పద్ధతులు, ఆధునిక బోధన వ్యవస్థ ఏర్పాటు.. తదితరాల్లో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో ఒప్పందం చేసుకోనుంది. ఇప్పటికే ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకనితో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ గురుకులాల్లో పూర్తిగా డిజిటల్ బోర్డులు వాడుతారు.
ఒక్కో క్యాంపస్ ఇలా...
యూనివర్సిటీల మాదిరిగా విశాలమైన ప్రాంతాల్లో ఈ సమీకృత గురుకుల సముదాయాలను నిర్మిస్తారు. ఒక్కో గురుకులం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కనీసం 2,560 మంది విద్యార్థులు, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి 640 మంది చొప్పున ఉండేలా ఏర్పాట్లు చూస్తారు. వాటిల్లో నిర్ధారిత దామాషాలో ఓసీ విద్యార్థులను కూడా చేర్చుకుంటారు.
⇒ అకడమిక్ బ్లాక్, డార్మెటరీ బ్లాక్, వంట, భోజనశాల, స్టాఫ్ క్వార్టర్స్ సముదాయం విడివిడిగా ఉంటాయి.
⇒ విద్యార్థులకు పాఠాలు బోధించే అకడమిక్ బ్లాక్ రెండంతస్తులతో నిర్మిస్తారు. ఇందులో 64 తరగతి గదులు, 10 ప్రయోగశాల గదులు, 12 ఉపాధ్యాయుల గదులు, ఒక పరిపాలన బ్లాక్, గ్రంథాలయం, 12 టాయిలెట్లు ఉంటాయి. ఇలాంటివి నాలుగు బ్లాక్స్ ఉంటాయి.
⇒ విద్యార్థుల వసతి గృహాలకు సంబంధించి 11 బ్లాక్స్ నిర్మిస్తారు. ఒక్కో బ్లాక్‌లో 148 డార్మెటరీ హాల్స్ ఉంటాయి. వీటిని జూనియర్ హాస్టల్స్, సీనియర్ హాస్టల్స్‌గా విడివిడిగా కేటాయిస్తారు. జూనియర్ సెక్షన్‌లో ఒక్కో హాలులో 14 మంది విద్యార్థుల సామర్థ్యంతో 120 హాల్స్ ఉంటాయి. వాటిల్లో 1,680 మంది విద్యార్థులుంటారు. సీనియర్ సెక్షన్‌లో 376 మంది విద్యార్థులుండేలా 28 హాళ్లను నిర్మిస్తారు.
⇒ 41,860 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంట, భోజన శాల బ్లాక్ ఉంటుంది. ఇందులో రెండు డైనింగ్ హాల్స్, ఒక వంటశాల, 2 వెజ్, నాన్‌వెజ్ స్టోర్లు, ఒక కోల్డ్ స్టోరేజ్, ఒక మల్టీ పర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్ హాల్ ఉంటాయి. 1,280 మంది చొప్పున రెండు షిఫ్టుల్లో దీన్ని వినియోగించుకునేలా ప్లాన్ చేశారు. అధ్యాపకులు, సిబ్బంది కోసం కూడా ట్రిపుల్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తారు.
ఏ నిర్మాణానికి ఎంత ?
⇒ ప్రధాన భవన సముదాయాల నిర్మాణానికి: రూ.140 కోట్లు
⇒ ప్రహరీ, పచ్చిక బయళ్లు, సెక్యూరిటీ బ్లాక్, కాంక్రీట్ డ్రెయిన్, రోడ్లు, ఎస్టీపీ, ప్లే గ్రౌండ్స్, భూగర్భ సంప్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, లిఫ్టులు, వీధి దీపాలు, సౌర విద్యుత్ వ్యవస్థ తదితరాలు రూ. 30 కోట్లు
⇒ ఎలక్ట్రిక్ ఉపకరణాలు, డిజిటల్ బోర్డులు, లైబ్రరీ, ఫర్నీచర్, క్రీడా పరికరాలు, వంటగది వ్యవస్థ, పన్నులు తదితరాలు: రూ.30 కోట్లు
⇒ 58 నియోజకవర్గాల్లో ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11,600 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఒక్కో క్యాంపస్‌కు రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్, మధిర, సూర్యాపేట నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ మూడు నియోజకవర్గాలు కాకుండా మరో 55 నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment