Gurukuls
-
మధ్యాహ్నం.. అధ్వానం!
మధ్యాహ్న భోజనం ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తున్నాయి. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచారు. కానీ, ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ 1 నుంచి ఐదో తరగతి (ప్రైమరీ) వరకు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.97 చొప్పున.. 6 నుంచి 8 తరగతులవారికి రూ.7.45 చొప్పున, 9, 10 తరగతులవారికి రూ.9.45 చొప్పున ఇస్తున్నారు. ఈ కేటాయింపులు పెంచాలి. 1–5 తరగతులకు 55 శాతం, 6–8 తరగతులకు 58 శాతం, 9–10 తరగతుల వారికి 60 శాతం చొప్పున నిధులు పెంచాలి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్తంగా ఉందని విద్యా కమిషన్ అభిప్రాయపడింది. చాలీచాలని నిధులతో ఈ పథకాన్ని సక్రమంగా నిర్వహించడం అసాధ్యమని పేర్కొంది. విద్యార్థులకు పోషకాహారం అందేది ఎలాగని ఆందోళన వ్యక్తం చేసింది. వంట ఖర్చులనూ సక్రమంగా చెల్లించని పరిస్థితిని ఎత్తిచూపింది. అప్పులు చేసి వండి పెడుతున్నా, ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తేల్చి చెప్పింది. వీటన్నింటినీ పరిశీలిస్తే మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత ఆశించడం కష్టమనేనని పేర్కొంది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థత పాలవ్వడం, పలుచోట్ల తీవ్ర అనారోగ్యానికి గురవడం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్ర విద్యా కమి షన్ పరిశీలన జరిపింది. మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై కొన్ని సిఫార్సులతో ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. వందలాది స్కూళ్లను పరిశీలించి... రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్ వాడీ కేంద్రాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జోత్స్న శివారెడ్డి సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యానికి సంబంధించిన లోటుపాట్లను క్షుణ్నంగా పరిశీలించింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ‘మధ్యాహ్న భోజన పథకం–ప్రభుత్వ విద్య సంస్థల్లో ఆహార నాణ్యత, భద్రత’ పేరుతో నివేదిక అందజేసింది. అందులో అనేక అంశాలను ప్రస్తావించింది. ఇలాగైతే పౌష్టికాహారం అందడం కష్టం రాష్ట్రంలో 26,519 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 20.36 లక్షల మందికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం వారికి వారానికి 3 కోడిగుడ్లు ఇవ్వాలి. ఒక్కో గుడ్డు కోసం ప్రభుత్వం ఇస్తున్నది రూ.5 మాత్రమే. మార్కెట్లో గుడ్డు ధర రూ.7 వరకు ఉంది. దీనితో స్కూళ్లలో చాలా చోట్ల వారానికి ఒకటి, రెండు గుడ్లనే అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందడం కష్టమని కమిషన్ అభిప్రాయపడింది. భోజనం వండి, వడ్డించే మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఇప్పటికీ రూ.116 కోట్లు బకాయి ఉంది. తాము అప్పుచేసి వండి పెడుతుంటే బిల్లులు ఆలస్యంగా వస్తున్నాయని.. తాము వడ్డీ భారం మోయాల్సి వస్తోందని అనేక చోట్ల స్వయం సంఘాల మహిళలు వాపోతున్నారు. ఇక చాలీచాలని నిధులతో నాణ్యమైన కూరగాయలు తీసుకురాలేక పోవడం, నిల్వ చేసేందుకు తగిన మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఇబ్బంది ఎదురవుతోందని విద్యా కమిషన్ పేర్కొంది. దీనితో ఆహారం కల్తీ అవడం, నాణ్యత లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని స్పష్టం చేసింది. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి.. మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. వీటిని తక్షణమే అమలు చేయాలని కోరింది. అలా చేస్తేనే భోజనం నాణ్యత పెరుగుతుందని, విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి దూరమవుతుందని తెలిపింది. – మహిళా సంఘాలకు ఎప్పుడు బిల్లులు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. విధి లేని పరిస్థితుల్లో అప్పులు తెచ్చి వండి పెడుతున్నామనేది మహిళా సంఘాల ఆందోళన. ఈ పరిస్థితిని మార్చాలి. గ్రీన్ చానల్ ద్వారా వారం వారం బిల్లులు చెల్లించాలి. – గురుకులాల్లో అన్నిరకాల పోషకాలు అందిస్తున్నారు. అక్కడ నిధులు పెంచారు. కానీ ప్రభుత్వ స్కూళ్లలో ఇస్తున్న మెనూ విద్యార్థులు తినేలా లేదని అనేక మంది ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఒకే తరహా మెనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అందించాలి. – మధ్యాహ్న భోజనం అమలుకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉండాలి. నిత్యావసరాలు, కూరగాయలు సేకరించడం, వాటిని నిల్వ చేయడం, శుభ్రం చేయడం, వండటం, వృధాను పారేసేందుకు ప్రత్యేక నిబంధనలు ఉండాలి. దీని అమలుకు యంత్రాంగం చర్యలు చేపట్టాలి. – రాష్ట్రంలో నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర సామగ్రి సేకరించడంలో ఐదు సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. దీనికి అనేక రకాల నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. టెండర్లు వేయడం, వాటిని ఖరారు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతుల వల్ల ఆలస్యమవుతోంది. ఈ బాధ్యతను ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించాలి. దీనివల్ల ఒకే సంస్థ ఈ బాధ్యతను తీసుకుని, నాణ్యత పెంచుతుంది. ప్రభుత్వం దృష్టిపెడుతుందని ఆశిస్తున్నాం.. రాష్ట్రంలోని వందల స్కూళ్లలో మధ్యాహ్న భోజన పరిస్థితిని పరిశీలించాం. అన్ని వర్గాలవారితో మాట్లాడాం. అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. నాణ్యమైన భోజనం అందించే దిశగా ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి నివేదిక అందజేశాం. ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాం. – ఆకునూరు మురళి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ -
భావి తరాలపై పెట్టుబడే: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశ భవిష్యత్తే కాదు ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించే శక్తి మన విద్యార్థులకు ఉంది. పిల్లలకు సరైన వసతి కల్పించకపోతే, నాణ్యమైన విద్యను అందించకపోతే మనం సమాజానికి ద్రోహం చేసినట్లు కాదా? సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు. వీటిపై పెడుతున్న వ్యయాన్ని భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా చూడాలి కానీ.. ఇతర ఖర్చులా భావించొద్దు. డైట్, కాస్మెటిక్ చార్జీలు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలపై పెడుతున్న ఖర్చులను భవిష్యత్తు పెట్టుబడిగా చూడాలి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో మన విద్యార్థులు 60% ఉంటారు. మల్టీ టాలెంటెట్ స్టూడెంట్స్‌ను ప్రోత్సహించడంలో మనమెందుకు వెనుకబడుతున్నాం? వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సీఎం శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ పథకాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...ఆ అపోహను తొలగించాలి..సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల్లో తక్కువ టాలెంట్ ఉంటుందని, వెనుకబడిన వారు మాత్రమే వీటిలో చదువుకుంటారనే అపోహ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెండ్ హబ్‌గా నిరూపించాలి. పీవీ నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడే సర్వేల్ గురుకులాన్ని ప్రారంభించారు. ప్రస్తుత పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం సహా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఇక్కడే చదువుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం భట్టితో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. సామాజిక బాధ్యతగా విద్యా ప్రమాణాలు పెంచాలని, నాణ్యమైన వసతులు కల్పించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇందులోభాగంగా డైట్ చార్జీలను 40 శాతం పెంచాం. కాస్మొటిక్ చార్జీలను ఏకంగా 200 శాతం పెంచాం’ అని రేవంత్ చెప్పారు.ప్రైవేట్ టీచర్లకు మీకన్నా ఎక్కువ జీతాలున్నాయా?ప్రభుత్వ ఉపాధ్యాయులను సూటిగా అడుగుతున్నా. ప్రైవేటు స్కూళ్లలో చదువు చెబుతున్న వాళ్లు మీకన్నా ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్లా? వాళ్లకేమైనా మీకన్నా ఎక్కువ జీతభత్యాలున్నాయా? మరెందుకు 11 వేల ప్రైవేటు స్కూళ్లలో 33 లక్షల మంది పిల్లలు చదువుతుంటే.. 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 23 లక్షల మంది చదువుతున్నారు? పేదలు కూలికిపోయి కూడబెట్టిన డబ్బులతో పిల్లలను ప్రైవేటు బడులకు పంపి, ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు తాపత్రయపడుతున్నారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారిలో విశ్వాసం కల్పించాలి. ఈ మధ్య హాస్టల్లో ఫుడ్ పాయిజనై ఓ అమ్మాయి చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ల పిల్లలను హాస్టళ్లలో పెడుతున్నారే కానీ, ప్రేమ లేక కాదు. ప్రభుత్వాన్ని నమ్మి పిల్లలను ఈ గురుకులాల్లో చేర్పిస్తే.. వారి సంక్షేమం, యోగక్షేమాలు చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉంది.ప్రతి నెలా 10న ఖాతాల్లోకి పైసలుసకాలంలో బిల్లులు రావడం లేదని, అప్పు చేసి, హాస్టళ్లలో విద్యార్థులకు భోజనం వడ్డించాల్సి వస్తోంది. నాణ్యతలో రాజీ పడాల్సి వస్తోందనే ప్రచారం లేకపోలేదు. ఇకపై ప్రతి నెలా 10వ తేదీలోగా గ్రీన్ చానల్ ద్వారా డైట్, కాస్మొటిక్, ఇతర అన్ని నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా హాస్టళ్లను తనిఖీ చేసి, వారితో పాటు కూర్చొని భోజనం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మెస్ మేనేజ్మెంట్ కమిటీల్లోనూ విద్యార్థుల భాగస్వామ్యం చేయనున్నాం.మట్టిలో మాణిక్యాలను గుర్తించాలిఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటికి వస్తే.. కేవలం పది వేల మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు దొరకడం లేదు. టాటా గ్రూపు సహకారంతో 75 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చాం. ఇది పోటీ ప్రపంచానికి దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. ఐటీఐలో చేరిన వారికి వందశాతం ఉద్యోగం వస్తుంది. కనీసం నెలకు రూ.30 వేలు సంపాదించే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కోర్సులను కూడా అప్‌గ్రేడ్ చేయాలని సూచించాం. ఒలింపిక్స్‌లో భారత్ ఒక్క బంగారుపతకం కూడా గెలవలేక పోయింది. ప్రపంచ దేశాల ముందు మన దేశానికి అవమానం కాదా? కోటి జనాభా ఉన్న దక్షిణ కొరియా 32 మెడల్స్ సాధిస్తే.. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మాత్రం గుడ్లప్పగించి చూస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ చాంపియన్‌గా రాణిస్తే డీఎస్పీగా.. క్రికెట్లో రాణించిన సిరాజ్‌కు ఎడ్యుకేషన్ లేకపోయినా డీఎస్పీగా నియమించాం. చదువే కాదు.. క్రీడల్లోనూ రాణించాలి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ ఇద్దాం. మట్టిలో మాణిక్యాలను వెలికితీద్దాం.పిల్లలతో కలిసి భోజనం చేసిన సీఎంఅనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఐఐటీ, మెడిసిన్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాయిరాం, అమన్, శ్రుతి, హేమంత్, సిద్దార్థ్, దీక్షితలకు ల్యాప్‌టాప్‌లను అందించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు
నీళ్ల పప్పు.. ఉడికీ ఉడకని అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో రోజూ ఇదే మెనూ. ఈ భోజనాన్ని తినలేక పిల్లలు అల్లాడిపోతున్నారు. చలి వణికిస్తోంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేక విలవిల్లాడిపోతున్నారు. ఓ వైపు దోమల మోత.. మరో వైపు బయటి నుంచి దుర్గంధం వెదజల్లుతుండటంతో రాత్రిళ్లు పడుకోలేకపోతున్నారు. ‘ఇదేంటయ్యా..’ అని పిల్లల తల్లిదండ్రులు వార్డెన్లను ప్రశ్నిస్తే.. ‘మేమేం చేయాలి.. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. ఎన్ని రోజులని మేం అప్పులు చేసి తెచ్చిపెట్టాలి? ఇప్పటికే చాలా వరకు అప్పులు చేశాం.. ఆ అప్పు తీరిస్తేనే కొత్తగా సరుకులు ఇస్తామని కిరాణా కొట్ల వాళ్లు చెబుతున్నారు. పై ఆఫీసర్లకు రోజూపరిస్థితి చెబుతూనే ఉన్నాం. వారు అంతా విని ఫోన్ పెట్టేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుప్పట్లు కూడా ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టినా.. కనీసం మెస్ చార్జీలన్నా సమయానికి ఇవ్వాలి కదా..’ అంటూ వాపోతున్నారు. వార్డెన్లే ఇలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు బిక్కమోహం వేసుకుని చూడాల్సిన దుస్థితి. సరిగ్గా ఐదు నెలలకు ముందు వరకు వారంలో రోజుకొక మెనూతో చక్కటి భోజనం తిన్న విద్యార్థులు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత పరిస్థితిపై వాపోతున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : మానవత్వం లేని కూటమి సర్కారు తీరుతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ వైపు చలి వణికిస్తుండగా, మరోవైపు పిల్లలకు సరైన భోజనం కరువైంది. చాలా చోట్ల మరుగుదొడ్లు, మంచి నీటి సమస్యతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. వారికి క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన వస్తువులతోపాటు కాస్మోటిక్, మెస్ చార్జీలు విడుదల చేయడం లేదు. ఈ దిశగా కూటమి పార్టీల నేతలు ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఐదు నెలలైనా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో 3,836 హాస్టళ్లు, గురుకులాల్లో చదివే 6,34,491 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర పేద వర్గాల విద్యార్థులతోపాటు వాటిలో పని చేస్తున్న 36,537 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఏటా స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికి రోజుకు రూ.46 చొప్పున డైట్ బిల్లు (మెస్ చార్జీలు) ఇవ్వాలి. మూడు నెలలు (ప్రస్తుతం నాల్గవ నెల)గా ఈ బిల్లులు పెండింగ్ పెట్టడంతో హాస్టల్, గురుకులాల నిర్వాహకులే చేతి నుంచి డబ్బులు పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు, బార్బర్ ఖర్చులను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు సైతం ఐదు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కంటింజెంట్ బిల్లులు కూడా విడుదల చేయలేదు. ఈ నిధులను స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి ఖర్చు పెడతారు. ఒక్కొక్క హాస్టల్, గురుకులానికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కంటింజెంట్ అవసరాలు ఉంటాయి.అంతటా అవే సమస్యలే..» ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదు. చాలా చోట్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. మంచి నీరు సరిగా ఉండదు. మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూలన పడింది. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 88 మంది విద్యార్థినిలు నేల మీదే పడుకుంటున్నారు. వీరికి కనీసం దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు. అవనిగడ్డ ఎస్సీ బాలికల వసతి గృహంలో మే నుంచి కాస్మటిక్స్ ఛార్జీలు ఇవ్వ లేదు. ఏ ఒక్క హాస్టల్లోనూ సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. » గుంటూరు నగరంలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. మార్చి నుంచి సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రాలేదు. దీంతో వార్డెన్ న్లు అప్పు తీసుకువచ్చి విద్యార్థినులకు ఆహారం పెట్టాల్సిన పరిస్థితి. జూన్ నెలలో ఇవ్వాల్సిన దుప్పట్లు, ప్లేట్లు, గ్లాస్లు ఇంత వరకు ఇవ్వలేదు. » ఒంగోలు జిల్లాలోని చాలా వరకు హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. వారంలో 6 సార్లు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరోజుతో సరిపెడుతున్నారు. ప్రతి రోజూ పాలు అందించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో కనిగిరి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో 45 మందికి గాను ముగ్గురు పిల్లలే హాస్టల్లో ఉన్నారు. పామూరు పట్టంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 30 మందికి గాను ఒక్క విద్యార్థి మాత్రమే కనిపించాడు. గిద్దలూరు బేస్తవారిపేటలోని బీసీ హాస్టల్లో వాచ్మెన్, అటెండర్లే వంట చేస్తున్నారు.» ఏలూరు జిల్లాలోని హాస్టళ్లలో చలికి తట్టుకోలేక చాలా మంది పిల్లలు హాస్టల్ వదిలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 400 మంది విద్యార్థులకు ఇప్పుడు 50 మంది మాత్రమే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని హాస్టళ్లలో పారిశుద్ధ్యం బాగోలేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. » కాకినాడ జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అధ్వాన పారిశుద్ధ్యం వల్ల పందులు, దోమలతో సావాసం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాల ప్రాంగణం అధ్వానంగా తయారైంది. సామర్లకోట బీసీ బాలికల వసతి గృహం చుట్టూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పిఠాపురం బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో భద్రత కరువైంది. చివరకు బాలికలు దుస్తులు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. రాత్రి పూట విద్యుత్ పోయిందంటే హాస్టల్లో అంధకారమే. » విజయనగరం జిల్లా కేంద్రంలో కాటవీధిలోనున్న బీసీ సంక్షేమ వసతి గృహంలో కోండ్రు సాంబశివరావు అనే విద్యార్థి ఇటీవల మృత్యువాతపడ్డాడు. కారణమేమిటో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ఘటనతో ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థుల్లో చాలా మంది మళ్లీ తిరిగి హాస్టల్లో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు నాలుగు నెలల్లో 8 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు.» విశాఖపట్నం జిల్లాలో కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై నివేదికలు పంపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనకాపల్లి జిల్లాలో బాలికల హాస్టళ్లన్నింటిలో సీసీ కెమెరాల్లేవు. విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు, జంబుకానాలు ఇవ్వలేదు. అల్లూరి జిల్లాలోనూ అదే పరిస్థితి. » బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో కనీస వసతులు కరువయ్యాయి. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య తగ్గింది.» మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్వగ్రామమైన కర్నూలు జిల్లా లద్దగిరిలో బాత్రూమ్లు లేక పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. కోసిగిలో పందుల బెడద తీవ్రంగా ఉంది. నంద్యాలలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహాల్లో నీటి సౌకర్యం లేదు. విద్యార్థులు బహిర్భూమికి ముళ్ల పొదలు, రైల్వే ట్రాక్ వద్దకు వెళుతున్నారు. శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలకు ప్రహరీ లేదు. ఈ హాస్టళ్లు నల్లమల అభయారణ్యం పరిధిలో ఉన్నందున అడవి జంతువులు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలుమార్లు వసతి గృహాలకు సమీపంలో చిరుతలు సంచరించాయి. ప్యాపిలి ఎస్సీ వసతి గృహంలో మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాణ్యంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో మంచి నీటి సమస్య ఉంది. » చిత్తూరులో ఎస్సీ ప్రీ మెట్రిక్ వసతి గృహంలో కుక్, కామాటి, వార్డెన్ లేరు. వాచ్మెన్ బంధువులతో అనధికారికంగా వంటలు వండిస్తున్నారు. జిల్లాలోని చాలా హాస్టళ్లలో వార్డెన్లు చేతి నుంచి ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. చౌడేపల్లిలో మరుగుదొడ్లు సహా వసతి గృహాన్ని బాలురే శుభ్రం చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోని బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో మరుగు దొడ్లకు నీటి సౌకర్యం లేదు. నిధుల లేమితో తిరుపతిలోని హాస్టళ్లలో ఐదు నెలలుగా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. కడుపునిండా భోజనం కరువు..ప్రభుత్వం మూడు నెలలుగా డైట్ చార్జీలు ఇవ్వక పోవడంతో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు ఎలా భోజనం పెట్టాలో తెలియక వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. సరుకులను అప్పుపై తెచ్చి వంట చేయించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. పెద్ద మొత్తంలో సరుకులను అప్పుగా ఇవ్వడానికి దుకాణదారులు ముందుకు రావడం లేదని గ్రామీణ ప్రాంత హాస్టల్, గురుకులాల వార్డెన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులకు అందించే ఆహారంలో పూర్తిగా నాణ్యత కరువైంది. నీళ్ల చారు, నాసిరకం అన్నంతో కడుపు నింపుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సమస్యలు.. ఆపై ఆకలి కేకలతో హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు భద్రత కరువైంది. ఎవరు పడితే వారు హాస్టల్ ప్రాంగణంలో వచ్చి పోతుంటారు. ఎవరు వస్తున్నారో.. ఎందుకు వస్తున్నారో అడిగే నాథుడే ఉండడు. ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇటీవల హైకోర్టు ప్రాథమికంగా పలు మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు.హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా..» హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. » హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. » హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.» మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. » భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. » సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ళీ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. » హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి.ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి » హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. » తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. » హాస్టళ్లలో సమ వయస్కులతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే గుర్తించి సరిచేయాలి. » హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీనిమహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. -
గురుకులాల్లో మృత్యుఘోష
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి. హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఒక ప్రకటనలో ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో విద్యారి్థని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభు త్వం చోద్యం చూడడం శోచనీయమని విమర్శించా రు. వాంకిడిలోని గురుకుల పాఠశాల విద్యారి్థని గత 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నదని, బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యారి్థని బలవన్మరణానికి కారణం ఎవర ని ప్రశ్నించారు. గత 11 నెల ల్లో సగటున నెలకు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకు దిగజారిపోతున్నా యని అన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారాయని ధ్వజమెత్తారు. విద్యాశాఖతోపాటు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, మైనార్టీ శాఖల నిర్వహణలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. -
నాణ్యత లేకుంటే జైలే!: సీఎం రేవంత్
ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్లుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేది. ఇప్పుడు ఓటుహక్కుకు అర్హత 18 ఏళ్లకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలి. అప్పుడే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తారు. – మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలకు నాసిరకం బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తే కాంట్రాక్టర్లతో ఊచలు లెక్కబెట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కలుషిత ఆహారం సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామని తెలిపారు. విద్యార్థి నులకు కాస్మెటిక్ చార్జీలు సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్ చానల్ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కూడా స్కూళ్లకు వెళ్లాలన్నారు. కుల గణనపై కొంతమంది కుట్ర చేస్తున్నారని, దీన్ని విద్యార్థి లోకం సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాల నుంచి వచ్చిన బాలలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం పెంచాలి ‘ప్రభుత్వ స్కూళ్ల ప్రతిష్ట దెబ్బతింటోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 26 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతుంటే, 36 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్నారు. అన్ని సౌకర్యాలున్నా, అర్హులైన టీచర్లు ఉన్నా ఈ పరిస్థితి ఎందుకుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. కలెక్టర్లు, ఎస్పీలు స్కూళ్లకు వెళ్లాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళాలి. విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యంతో అన్నం పెట్టాలి. అందుకే రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యా రంగానికి పెద్దపీట ‘విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 20 వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 35 వేలమంది టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. వర్సిటీలకు వీసీలను నియమించాం. త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. గత సీఎం మనవడి కుక్క చనిపోతే డాక్టర్‌ను జైల్లో పెట్టారు. విద్యార్థులు చనిపోతే కనీసం కన్నీరు కూడా పెట్టలేదు..’అని రేవంత్ అన్నారు. ‘తెలంగాణకు విద్యార్థులే పునాదులని, తమ ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాలను అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి వ్యసనాలకు బానిసలం కాబోమని, ఉన్నత విద్యలో రాణిస్తామని ప్రమాణం చేయాలని బాలలను సీఎం కోరారు. చదువులోనే కాదు.. క్రీడల్లో రాణించినా ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. కుల గణన మెగా హెల్త్ చెకప్ లాంటిది ‘కులగణనను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇది సమాజానికి మెగా ఆరోగ్య పరీక్ష వంటిది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలకు పెరగాలన్నా, నిధుల కేటాయింపు జరగాలన్నా కుల గణనే కీలకం. కులగణన ఆధారంగా భవిష్యత్తులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అందుబాటులోకి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దీనిద్వారా ఎవరి ఆస్తులూ లాక్కోవడం జరగదు. సంక్షేమ పథకాలు అందకుండా పోవడం అంటూ ఉండదు. విద్యార్థులు కూడా కులగణన వివరాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పుస్తకాన్ని, తెలంగాణ విద్యా ప్రగతి సూచించే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం అందజేశారు ‘21 ఏళ్ళకే పోటీ చేసే హక్కు’తీర్మానం చేయండి ఎస్సీఈఆర్టీలో గురువారం జరిగిన అండర్ 18 విద్యార్థుల నమూన అసెంబ్లీ సమావేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో పోటీ చేసే వయసును 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని, ఈ విధంగా చేసిన మాక్ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపాలని సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేదని, ఇప్పుడు ఓటు హక్కుకు అర్హత 18 ఏళ్ళకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్ళకు తగ్గిస్తే ఎక్కువమంది యువత రాజకీయాల్లోకి వస్తారని సీఎం పేర్కొన్నారు. -
అద్దె భారం.. గురుకులాలకు తాళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు తాళాలు పడ్డా యి. ప్రభుత్వం చెల్లించాల్సిన భవనాల అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో యజమానులు వాటి గేట్లకు తాళాలు వేశారు. బకాయిలు చెల్లిస్తేనే గేట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల యజమానులు తాళాలు వేయడమే కాకుండా, ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించలేదంటూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కొన్ని గంటల పాటు హాస్టళ్ల బయటే నిరీక్షించాల్సి వచ్చింది. హాస్టళ్లకు నెలవారీగా చెల్లించాల్సిన అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గత కొంతకాలంగా భవనాల యాజమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా దసరా సెలవుల నేపథ్యంలో మూతపడిన గురుకులాలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బడులు తెరిచేందుకు వచ్చిన గురుకుల పాఠశాలల సిబ్బంది, గేట్లకు వేరే తాళాలు వేసి ఉండడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే సిబ్బందిని, విద్యార్థులను లోనికి అనుమతిస్తామని యజమానులు స్పష్టం చేశారు. కళాశాలల భవనాలకు సంబంధించి కూడా బకాయిలున్నట్లు సమాచారం. పలు గురుకులాలకు తాళాలు యాదాద్రి జిల్లా మోత్కూరులోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలకు యజమాని తాళం వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు 6 గంటల పాటు పాఠశాల ఎదుట నిరీక్షించాల్సి వచ్చి0ది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన తర్వాత అందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక్కడి మైనార్టీ గురుకుల పాఠశాల భవనానికి యజమాని బకాయిలు చెల్లించలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.హుజూర్‌నగర్‌లో గంటపాటు బయటే వేచిచూసిన తర్వాత ప్రిన్సిపాల్ రెహనాబేగం విజ్ఞప్తి మేరకు యజమాని తాళం తీశారు. తుంగతుర్తిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే ఉండాల్సి వచ్చి09ది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులం, మైనార్టీ బాలికల గురుకులం, నాంచారి మడూరులోని బీసీ బాలుర డిగ్రీ గురుకుల కళాశాల గేట్లకు యజమానులు తాళాలు వేశారు. గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయానికి, ఖానాపురం మండలం ఐనపల్లిలో, దుగ్గొండి మండలం గిరి్నబావిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల గేట్లకు తాళం వేశారు. దుగ్గొండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్.. చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహిస్తుండగా భవనానికి తాళం వేశారు. రేగొండ మండలంలోని లింగాల, వరంగల్ ఉర్సు గుట్ట వద్ద మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనానికి కూడా తాళం వేశారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని మహాత్మా జ్యోతిబా పూలె గురుకుల పాఠశాలకు యజమాని తాళాలు వేశారు. కాగా, మంచిర్యాల జిల్లా తాండూరు బీసీ గురుకుల భవనానికి తాళం వేసిన యజమాని శరత్ కుమార్‌పై వివిధ సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దె భవనాల్లో 625 పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జనరల్ గురుకుల సొసైటీ కొనసాగుతోంది. వీటి పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,033 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 967 పాఠశాలలు కాగా మిగిలినవి డిగ్రీ కాలేజీలు. అయితే 625 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలున్న ప్రాంతాల ఆధారంగా అద్దె నిర్ణయించిన కలెక్టర్లు ఆ మేరకు చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భవనాలకు ఒక విధమైన అద్దె ఖరారు చేయగా, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో మరో విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో విధంగా చదరపు అడుగు చొప్పున ప్రభుత్వం అద్దె ఖరారు చేసింది. ఆ మేరకు ప్రతి త్రైమాసికంలో యజమానులకు నేరుగా చెల్లింపులు చేçసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే కొంత కాలంగా ఆయా భవనాలకు అద్దె చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. మైనార్టీ స్కూళ్లకు ఏడాదికి పైగా నిలిచిన చెల్లింపులు ఎస్సీ, ఎస్టీ సొసైటీల పరిధిలో నాలుగైదు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. అదేవిధంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 2024–25 వార్షిక సంవత్సరం నుంచి నిధులు విడుదల కాలేదు. ఇక మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో మాత్రం దాదాపు ఏడాదికి పైగా చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. దీంతో బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. గురుకుల అద్దె భవనాలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా దసరా సెలవులకు గురుకులాలు ఖాళీ కావడంతో, ఇదే అదనుగా కొందరు యజమానులు భవనాలకు తాళాలు వేశారు. -
గురుకుల అభ్యర్థుల వినూత్న నిరసన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర గురుకుల అభ్యర్థులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా రేవంతన్నకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మెరిట్ ఆధారంగా నియామకాలు జరపాలని విన్నవించారు. గురుకుల నియామకాల్లో పోస్టులు మిగిలిపోకుండా నెక్ట్స్ మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసేలా ఉండాలన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు.మూడు నెలలుగా గురుకుల అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం గురుకుల నెక్ట్స్ మెరిట్ అభ్యర్థులు జి.నాగలక్ష్మి, బి.లలిత, కె.పరమేశ్వరి, శైలజ, రమణి తదిత రులు మాట్లాడుతూ.. గురుకుల బోర్డు చేపట్టిన నియామకాల్లో (9,210 పోస్టు లు) డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం వల్ల, వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి పోస్టుల కేడర్ వేరైనప్పటికీ కొన్ని పేపర్లు ఉమ్మడిగా నిర్వహించడం వల్ల చాలా మంది అభ్యర్థులకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయన్నారు.ప్రస్తుతం ఒక ఉద్యోగం కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వాళ్లకు నచ్చినటు వంటి ఒక ఉద్యోగంలోనే చేరారన్నారు. వారు వదిలేసిన లేదా చేరకపోవడం వల్ల సుమారు 2,500 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇలా భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
5,000కోట్లతో గురుకులాల అభివృద్ధి
మెట్పల్లి/మెట్పల్లి రూరల్: అన్ని గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. జగిత్యాలజిల్లా మెట్ç³ల్లి మండలంలోని పెద్దాపూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఇటీవల ఇద్దరు విద్యార్థులు గుణాదిత్య, అనిరుధ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆ గురుకులాన్ని సందర్శించారు. ముందుగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇద్దరు చిన్నారుల మృతి సంఘటన ప్రభుత్వాన్ని ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2015–16 ఆర్థిక సంవత్సరంలో గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్లో రూ.197కోట్లు కేటాయించిన బీఆర్ఎస్.. ఆ తర్వాత ఏటా తగ్గిస్తూ వస్తూ గతేడాది కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించిందని, వీటిని ఈ సంవత్సరంలోనే ఖర్చు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. నెలకొసారి సందర్శన..గురుకులాల్లో పరిస్థితులను మెరుగుపర్చడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు నెలకోసారి సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. నాణ్యమైన భోజనం అందించేందుకు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచడానికి అధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. ప్రతి గురుకులంలో అత్యవసర మందులు, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయంతోపాటు ఒకరికి గురుకులాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని తెలిపా రు. ఇల్లు లేకుంటే ఇందిరమ్మ పథకం కింద రూ.5లక్షలు అందిస్తామన్నారు.అనంతరం డిప్యూటీ సీఎం.. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పనులకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో కోరుట్ల, చొప్పదండి, జగిత్యాల, మానకొండూర్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.విద్యార్థి తల్లికి పూనకం ‘గురుకులంలో మల్లన్నగుడి నిర్మించాలి. అలా అయితేనే శాంతిస్తానంటూ’ ఓ విద్యార్థి తల్లి పూనకంతో ఊగిపోయింది. గురుకులంలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి కౌశిక్ తల్లి కృష్ణవేణికి పూనకం వచ్చి పొర్లుదండాలు పెట్టింది. అక్కడున్న పలువురు ఆమెను ప్రశ్నించడంతో తాను శాంతించాలంటే తన మల్లన్న ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేయాలని సమాధానమిచ్చింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి పక్కనుంచి వెళుతుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. -
గురుకులాల్లో ఫీ‘జులుం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ఇకపై చదువు‘కొనా’ల్సిందే. గత విద్యా సంవత్సరం వరకు ఉచిత విద్యను అందించిన ఈ కళాశాలల్లో ప్రతి కోర్సుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫీజులు ఖరారు చేసింది. సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినుల నుంచి కోర్సును బట్టి రూ.4 వేల నుంచి రూ.14 వేల వరకు ఫీజులు వసూలు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది. గత నెలలోనే జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఇప్పుడు బయటకు రావడంతో విద్యార్థి సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు కళాశాలలకు, హాస్టళ్లకు ఎలాంటి ఫీజులు లేకుండా విద్యార్థినులు చదువుకున్నారు. అలాంటిది ఇప్పుడు భారీగా ఫీజులు చెల్లించమనడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి ఫీజుల పిడుగు..సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కేటగిరీ కింద ఏడేళ్ల క్రితం రెండు మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో ఒకటి కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కంచికచర్లలోనూ, మరొకటి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో కలికిరిలోనూ ఏర్పాటు చేశారు. ఎస్సీ మహిళలకు డిగ్రీ స్థాయిలో ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో విద్యతో పాటు హాస్టల్ సదుపాయాన్ని ప్రభుత్వమే సమకూరుస్తోంది. విద్యార్థినుల నెత్తిన ఫీజుల బండ: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలకు గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులను విడుదల చేసేవారు. రెండు కళాశాలల్లో సుమారు 600 మంది చదువుకుంటున్నారు. కంచికచర్ల కళాశాలలో బీకామ్ (జనరల్) కోర్సుకు రూ.4,225, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)కు రూ.14,172 ఫీజు నిర్ణయించగా, కలికిరిలో బీకామ్ (జనరల్)కు రూ.5,400, బీకామ్ (సీఏ)కి రూ.10,845, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)కు రూ.11,045గా ఖరారు చేశారు. ఫీజుల వసూలు నిలిపివేయాలి: ఎస్ఎఫ్ఐ గురుకుల డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థులు ఫీజులు చెల్లించాలంటూ ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్ ప్రకటనలో పేర్కొన్నారు. -
26% డైట్ చార్జీలు పెంపు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలతో సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల డైట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం 26% పెంచింది. డైట్ చార్జీల పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సబ్ కమిటీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సీఎం కేసీ ఆర్ శనివారం రాష్ట్ర సచివాలయంలో సంతకం చేశారు. పెరి గిన డైట్ చార్జీలు జూలై నుంచి అమలులోకి రానున్నాయి. గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, వెనకబడిన తరగతులు సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లోని 7.5 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీల పెంపుతో ప్రయోజనం చేకూరనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.237.24 కోట్ల అదనపు భారం పడనున్నా లెక్కచేయకుండా విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సన్నబియ్యం అన్నంతో చక్కటి భోజనాన్ని ఇప్పటికే అందిస్తున్నామ న్నారు. ఇప్పుడు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించేందుకే డైట్ చార్జీలు పెంచామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. డైట్ చార్జీల పెంపు నిర్ణయంపై మంత్రులు హర్షం సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో సంక్షేమ విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
టీచర్లుగా బీటెక్‌బాబులు వద్దా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీటెక్ చదివి టీచర్లు అవుదామనుకున్న వారి కలలు నెరవేరేలా లేవు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన పలువురు అభ్యర్థులు తాజాగా గురుకులాల్లో టీచర్ల కోసం దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నించి విఫలమవుతున్నారు. కారణం.. ఓటీఆర్‌లో విద్యార్హతల వద్ద బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి డిగ్రీలు ఉంచిన వెబ్సైట్లో.. బీటెక్ అన్న కాలమ్ అసలు పొందుపరచనే లేదు. తాము ఎంతో కష్టపడి రెండేళ్ల బీఈడీ కోర్సు పూర్తి చేశామని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష కూడా పాసయ్యామని, తీరా ఇపుడు తమకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించకపోవడం అన్యాయమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులకు తమను అనుమతించడం లేదంటూ కొందరు బీటెక్‌తోపాటు, బీఈడీ చేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అపుడు కూడా ఇదే తరహాలో దరఖాస్తులో తమకు బీటెక్ కాలమ్ కనిపించ లేదని చెప్పారు. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) 2010 మార్గదర్శకాల ప్రకారమే తాము నోటిఫికేషన్ జారీ చేశామని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఎన్సీటీఈ–2014 మార్గదర్శకాల ప్రకారం.. బీటెక్‌తోపాటు బీఈడీ చేసినవారంతా టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించింది. మళ్లీ ఇప్పుడూ అదే సమస్య గతంలో ఇదే వ్యవహారంపై హైకోర్టు వరకూ వెళ్లిన నేపథ్యంలో ఈసారి టీచర్ పోస్టులకు సంబంధించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. కానీ, తీరా దరఖాస్తు ఫారం ఓపెన్ చేసే సరికి తిరిగి అదే సమస్య పునరావృతమవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై పలువురు బీటెక్–బీఈడీ అభ్యర్థులు తొలుత గురుకుల కార్యాలయాలకు వరుసగా ఫోన్లు చేసినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కొందరు అధికారులు అయితే.. బీటెక్ బీఈడీ వారికి అసలు అర్హతే లేదని, మీరు దరఖాస్తు చేసుకోవద్దని చెబుతున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
గురుకులాల్లో సమ్మర్ క్యాంపుల హడావుడి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో సమ్మర్ క్యాంపులకు తెరలేచింది. నేటి(శనివారం) నుంచి మే 6వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్), మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)ల పరిధిలోని 86 గురుకుల పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. క్యాంపుల్లో దాదాపు 25 వేల మంది విద్యార్థుల కోసం వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహి స్తారు. సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థుల ఎంపికకు ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు. తరగతికి ఎనిమిది మంది చొప్పున ఒక్కో పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులు క్యాంపులో పాల్గొంటారు. ఈ విద్యార్థులకు తోడుగా ఒక్కో టీచర్‌ను ఎంపిక చేస్తారు. నాలుగు సొసైటీల నుంచి 650 మంది ఉపాధ్యాయులు క్యాంపుల్లో పాల్గొననున్నారు. అయితే ఈ ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం లేదు. కనీసం ఈఎల్(సంపాదిత సెలవులు) కూడా ఇవ్వకపోవడంపట్ల టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమ్మర్ క్యాంపులకు హాజరయ్యేందుకు పలువురు నిరాసక్తత వ్యక్తం చేస్తూ వినతులు సమర్పిస్తున్నారు. విద్యార్థుల్లోనూ అయిష్టతే... గురుకుల సొసైటీలు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులపట్ల విద్యార్థులు సైతం అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్యాంపుల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. కుటుంబసభ్యులతో గడిపే కాలం తగ్గిపోతుందనే భావన ఎక్కువ మందిలో కనిపిస్తోంది. మరోవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, కొన్నిచోట్ల కోవిడ్–19 కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రులు సైతం సమ్మర్ క్యాంపులకు పంపేందుకు సాహసించడంలేదు. వేసవి సెలవుల్లో పిల్లలతో ఇలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధమంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. సమ్మర్ క్యాంపులకు అవసరమైన మెటీరియల్ సరఫరా, ఏర్పాటు, ఇతరాత్ర సౌకర్యాల కల్పన బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడాన్ని గురుకుల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు సంస్థల కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గురుకులాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకులాల విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స అందించాలని.. అవసరమైన ఔషధాలను కూడా అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. గురుకులాల ఆవరణల్లో అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూడాలన్నారు. గతంలో సెర్ప్ ద్వారా విద్యార్థులకు అమలు చేసిన ఇన్‌స్రూ?న్స్ను పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా హెల్త్ సూపర్వైజర్, హాస్టల్ కేర్ టేకర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలోనూ ప్రభుత్వ మెనూ అమలవ్వాలని స్పష్టం చేశారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్షి్మ, గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లకు మహర్దశ.. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి. మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో, అలాంటి వసతులే ఉండాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలను నిశితంగా పరిశీలించి.. పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన పిల్లలు హాస్టళ్లలో ఉంటే ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటామో అదే స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు తీసుకు రావాలని చెప్పారు. నాడు–నేడు పథకం కింద ఏడాదిలోగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం ఆయన గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయన్న దానిపై తాను స్వయంగా పరిశీలన చేయించానని, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందన్నారు. దీనిపై ఒక స్పష్టమైన కార్యాచరణతో అడుగులు ముందుకు వేయాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని చెప్పారు. ‘ఈ పనులు మావి’ అనుకుని పని చేయాలని కోరారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఇప్పటికే నాడు – నేడు కింద తొలి దశలో స్కూళ్లను అభివృద్ధి చేశామని తెలిపారు. మొదటి దశలోని స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మించే పని జరుగుతోందన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోనందున, అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలని చెప్పారు. అభివృద్ధి పనులు చేశాక, వాటి నిర్వహణ కూడా బావుండేలా దృష్టి పెట్టాలని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిపడా సిబ్బంది ఉండాలి.. ► స్కూళ్ల నిర్వహణ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల నిర్వహణ ఫండ్‌ను ఏర్పాటు చేయండి. ప్రతి హాస్టల్లో తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి. హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్మెన్.. ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోండి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. నెలకోసారి హాస్టల్‌ను సందర్శించాలి. ► విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా డైట్ చార్జీలను పెంచాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ చార్జీలను పెంచింది. అప్పటి వరకూ హాస్టల్ విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాదిలోగా హాస్టళ్లలో నాడు–నేడు పూర్తవ్వాలి ► అద్దె ప్రాతిపదికన నడుస్తున్న వసతి గృహాలపై కూడా దృష్టి సారించాలి. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించండి. అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. ► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ప్రతి పనిలోనూ నాణ్యత చాలా ముఖ్యం. వీటికి అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలి. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించాలి. ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలి. ► ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పతకాలే లక్ష్యంగా క్రీడా పాఠశాలలు
సాక్షి, అమరావతి: గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా పతకాలు ఒడిసి పట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రతి జిల్లాలో క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలతో కలిసి గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను క్రీడాకారుల కార్ఖానాలుగా మారుస్తోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగిలో బాలుర, పోలసానపల్లిలో బాలికల గురుకులాల్లో స్పోర్ట్స్ స్కూళ్లు ప్రారంభించింది. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. సంయుక్త నిర్వహణ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసే క్రీడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు భోజన, వసతిని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారా సమకూర్చనున్నారు. కోచ్‌ల నియామకం, విద్యార్థుల ఎంపిక, శిక్షణ ప్రక్రియలను శాప్ నిర్వహించనుంది. దాదాపు 30 క్రీడాంశాల్లో.. ఒక్కో పాఠశాలలో ఆరు విభాగాల చొప్పున ఏర్పాటు చేసి తర్ఫీదు ఇవ్వనున్నారు. ప్రతిపాదనలు సిద్ధం క్రీడా పాఠశాలల కోసం ఇప్పటివరకు 8 ఎస్సీ గురుకులాలు (వీటిలో రెండింటిని ఇప్పటికే ప్రారంభించారు), 11 ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను గుర్తించారు. వీటిల్లో ప్లే ఫీల్డ్స్ అభివృద్ధికి రూ.3.92 కోట్లు, క్రీడా పరికరాల కోసం రూ.3 కోట్ల చొప్పున విడివిడిగా ప్రతిపాదనలు రూపొందించారు. వీటితోపాటు సమగ్రశిక్షలో మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ), ఏపీ రెసిడెన్షియల్, మైనార్టీ వెల్ఫేర్ పరిధిలో, ప్రత్యేక ప్రతిభావంతులకు కూడా స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కడప, విజయనగరం జిల్లాల్లో మాత్రమే క్రీడా పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిల్లో అన్ని వర్గాల విద్యార్థులకు బ్యాటిల్ టెస్టుల ఆధారంగా.. మెరిట్ సాధించిన వారికి సీట్లు కేటాయిస్తున్నారు. క్రీడా పాఠశాలలు ఇలా.. ఎస్సీ గురుకులాలు: పెదవేగిలో బాలుర, పోలసానపల్లిలో బాలికల గురుకులాల్లో క్రీడా పాఠశాలలు మొదలయ్యాయి. ఇంకా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (బాలికలు), విజయనగరం జిల్లా కొప్పెర్ల (బాలురు), కృష్ణాజిల్లా కృష్ణారావుపాలెం (బాలురు), కుంటముక్కల (బాలికలు), వైఎస్సార్ జిల్లా పులివెందుల (గండిక్షేత్రం–బాలురు), కర్నూలు జిల్లా డోన్ (బాలికలు)లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలు: శ్రీకాకుళం జిల్లా సీతంపేట (బాలురు), విజయనగరం జిల్లా భద్రగిరి (బాలికలు), విశాఖ జిల్లా చింతపల్లి (బాలురు), తూర్పుగోదావరి జిల్లా ముసురుమల్లి (బాలురు), గంగవరం (బాలికలు), పశ్చిమగోదావరి జిల్లా రాజానగర్ (బాలికలు), వైఎస్సార్ జిల్లా రాయచోటి (బాలికలు), ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం (బాలురు), చిత్తూరు జిల్లా రేణిగుంట (బాలురు), అనంతపురం జిల్లా గొల్లలదొడ్డి (బాలురు), కర్నూలు జిల్లా మహానంది (బాలికలు)లలో ఏర్పాటు చేయనున్నారు. క్రీడా విజయానికి నాంది రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధిలో భాగంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు అనుబంధంగా స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్కూళ్లను ప్రారంభించాం. గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి.. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇది క్రీడా విజయానికి నాంది పలుకుతుంది. శాప్‌లో అనుభవజ్ఞులైన కోచ్‌లు ఉన్నారు. వారిని మరింత సమర్థంగా ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – ఎన్.ప్రభాకరరెడ్డి, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
గురుకులాల గురి కుదిరింది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) గురుకుల విద్యాలయాల్లో మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దీంతో ఎస్సీ గురుకులాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గురి కుదిరింది. ఎస్సీ గురుకులాల్లో సాధిస్తున్న మెరుగైన ఫలితాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆదరణ పెరుగుతోంది. గురుకులాల విద్యార్థులు మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లోను తమ సత్తా చాటారు. నీట్లో అత్యంత ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు 17 మందికి ఎంబీబీఎస్‌లోను, 21 మందికి బీడీఎస్‌లోను సీట్లు లభించే అవకాశం ఉంది. ఏకంగా 13 మంది విద్యార్థులు నేరుగా ఐఐటీ అడ్మిషన్‌కు అర్హత సాధించారు. 34 మంది ప్రిపరేటరీ ఐఐటీ (ఏడాది తర్వాత ఎటువంటి పరీక్ష లేకుండా అడ్మిషన్)కి అర్హత సాధించగా 37 మంది ఎన్ఐటీకి అర్హత సాధించడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. అదే 2014లో మన రాష్టంలోని ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో సాధించిన ఐఐటీ సీటు ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం. ఆరోగ్యానికీ ప్రాధాన్యం గురుకులాల విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది ‘కంటివెలుగు’ ద్వారా ఎస్సీ గురుకులాల్లో చదివే లక్షమంది విద్యార్థులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. 3,326 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోడు అందించారు. ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా 55,763 మంది బాలికలకు ప్రతినెల పది చొప్పున నాణ్యమైన శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధతోనే ఇది సాధ్యమైంది అట్టడుగు వర్గాలకు మెరుగైన విద్యావకాశాలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేకశ్రద్ధ వల్లే ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోని 192 ఎస్సీ గురుకులాల్లోను మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన, ప్రైవేట్ క్లాస్‌లు పెట్టిస్తున్నాం. ఈ ఏడాది ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ సీట్లు సాధించడమే ఇందుకు నిదర్శనం. అమ్మఒడి వంటి పథకాలతోపాటు అనేక తోడ్పాటు చర్యలు తీసుకోవడం ద్వారా ఎస్సీ విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువచేసే ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. – పినిపే విశ్వరూప్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి -
కొత్తగా 9 ఏకలవ్య మోడల్ గురుకులాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కొత్తగా తొమ్మిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (ఈఎంఆర్ఎస్) స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ స్కూళ్లు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గురుకుల స్కూళ్లు కో–ఎడ్యుకేషన్‌లో పనిచేస్తాయి. కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లకు నిధులు కొత్తగా మంజూరైన ఈఎంఆర్ఎస్లను విశాఖజిల్లాలోని పెదబయలు, అనంతగిరి, హుకుంపేట, పాడేరు, జి మాడుగుల, కొయ్యూరు, అరకు, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరంలలో ఏర్పాటు చేస్తారు. వీటి నిర్మాణాలకు ప్రభుత్వం సేకరించిన స్థలంలో స్కూల్ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తారు. కనీసం 15 నుంచి 20 ఎకరాల్లో గురుకులం నిర్మిస్తారు. భవన నిర్మాణాలకు నిధులనూ ప్రభుత్వం మంజూరు చేసింది. క్రమేణా జూనియర్ కాలేజీలు.. ప్రస్తుతం ఉన్న 19 ఈఎంఆర్‌ఎస్‌ల్లో 3,603 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇవి ఆరేళ్ల క్రితం రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. మొదట, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 6వ తరగతిలో మాత్రమే విద్యార్థులను చేర్చుకుంటారు. మొదట చేరిన విద్యార్థులు పై క్లాసులకు వెళుతుంటారు. రెండు సెక్షన్లు ఏర్పాటు చేసి ఒక్కో సెక్షన్‌కు 30 మంది చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటారు. 2014లో ప్రారంభమైన నాలుగు స్కూళ్లు ప్రస్తుతం జూనియర్ కాలేజీలుగా మారాయి. మిగిలిన 15 స్కూళ్లు ప్రస్తుతం 9వ తరగతి వరకు నడుస్తున్నాయి. బాలుర స్కూలులో 547 మంది, మూడు బాలికల స్కూళ్లలో 1,419 మంది, 15 కో–ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,637 మంది విద్యార్థులు చదువుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల నియామకం ఈ స్కూళ్లలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల నియామకాలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎంపిక ఉంటుంది. నిర్వహణ బాధ్యతలు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ చూస్తుంది. కాగా, కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆదర్శ వంతమైన విద్యకు ఈఎంఆర్ఎస్ ఈఎంఆర్‌ఎస్‌ల్లో ఆదర్శవంతమైన విద్యను అందిస్తున్నాం. రాష్ట్రానికి కొత్తగా మరో తొమ్మిది స్కూళ్లు మంజూరు అయ్యాయి. ఇప్పటికే రెండింటి నిర్మాణాలకు ప్రభుత్వం స్థల సేకరణ పూర్తి చేసింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థలాల పరిశీలన జరుగుతోంది. – ఎస్. లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ, రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ. -
వక్ఫ్ భూముల్లో గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వక్ఫ్ భూములను అవసరమైన చోట మైనారిటీ గురుకులాల భవన సముదాయాల నిర్మాణాలకు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు వక్ఫ్ అభివృద్ధి కమిటీకి సిఫార్సు చేసింది. మంగళవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో జరిగిన వక్ఫ్ బోర్డు పాలకమండలి సమావేశంలో సుమారు 37 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్ మహ్మద్ సలీం బోర్డు నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఆదాయ మార్గాల పెంపు కోసం ఆరు ఆస్తుల అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించి చర్చించినట్లు తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. వక్ఫ్ ఆస్తుల కేసులపై హైకోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమిం చాలని నిర్ణయించినట్లు చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆదాయం ఆబ్జెక్టివ్ ఆఫ్ వక్ఫ్ ప్రకారం వినియోగించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. మసీదుల రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం 15 పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొన్ని మసీదుల పాలకమండలి కాలపరిమితి కూడా పొడిగిస్తూ తీర్మానం చేశామన్నారు. బోర్డుకు ఇద్దరు రిటైర్డ్ తహసీల్దార్లను నియమించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ పాలకమండలి సమావేశంలో సభ్యులైన సయ్యద్ షా అక్బర్ నిజామోద్దీన్ హుస్సేని, మీర్జా అన్వర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారమే గురుకుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీని నిబంధనల ప్రకారమే చేపట్టామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కోటాలో పోస్టింగ్‌లు ఇవ్వకుండా, లోకల్ కోటాలో పోస్టింగ్‌లు ఇచ్చారని, దానివల్ల లోకల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించిన నేపథ్యంలో టీఎస్పీఎస్పీ స్పందించింది. శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన కృష్ణయ్యకు పోస్టింగ్‌లకు సంబంధించి వివరాలను కమిషన్ సభ్యుడు సి.విఠల్, కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. భర్తీలో ఎలాంటి తప్పిదాల్లేవని వారు స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేయొద్దని కృష్ణయ్యకు సూచించారు. దానివల్ల కమిషన్ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఆప్షన్ల ప్రకారమే భర్తీ..: ఐదు సొసైటీలకు సంబంధించిన పోస్టులను ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేసినపుడు, అన్నింటికీ కామన్ మెరిట్ తీసి, అభ్యర్థుల నుంచి తీసుకున్న ఆప్షన్ల ప్రకారమే పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. కొందరు అభ్యర్థులు కోరుకున్న సొసైటీల్లో, కోరుకున్న జోన్లో, కోరుకున్న ఏజెన్సీ– నాన్ ఏజెన్సీ, బాలిక–బాలుర విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకొని వారికి లోకల్ కేటగిరీలో పోస్టులు కేటాయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఓపెన్ కేటగిరీలో వారు కోరుకున్న (ఆప్షన్లు ఇచ్చిన ప్రకారం) పోస్టులను వారికంటే మెరిట్లో ఉన్న వారికి కేటాయించడం వల్ల ఆ కొంతమంది అభ్యర్థులకు లోకల్ కేటగిరీలో పోస్టులను కేటాయించాల్సి వచ్చిందన్నారు. ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ప్రభుత్వం జారీ చేసిన జీవో 8, జీవో 124, 763 ప్రకారమే చేశామని స్పష్టం చేశారు. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 22, 22ఏ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మహిళ రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. అదికూడా మెరిట్ వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టుల్లేకపోతే లోకల్ కేటగిరీలో పోస్టులు ఇవ్వాలని, మల్టిపుల్ కేడర్ రిక్రూట్మెంట్ చేసినపుడు అభ్యర్థుల ఆప్షన్లు తీసుకొని భర్తీ చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జారీ చేసిన జీవో 763లో స్పష్టంగా ఉందని వివరించారు. -
‘గురుకులాల్లో మే12 నుంచి మెయిన్ పరీక్షలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి మే 12 నుంచి 17 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తం 1,099 ఖాళీల భర్తీకి గానూ 1:15 నిష్పత్తిలో 16,485 మందిని మెయిన్ పరీక్షలకు ఎంపిక చేసినట్టు పేర్కొంది. మే 12న లైబ్రేరియన్, 13న ఫిజికల్ డైరెక్టర్, 14న ప్రిన్సిపల్ (పాఠశాలలు), 15న జూనియర్ లెక్చరర్లు, 16న ప్రిన్సిపల్ (జూనియర్ కళాశాలలు), 17న డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు హైదరాబాద్‌లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. -
రెండు కొత్త గిరిజన క్రీడా గురుకులాలు
సాక్షి, హైదరాబాద్ : గిరిజన విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి నింపేందుకు గిరిజన సంక్షేమ శాఖ క్రీడా గురుకులాలను అందుబాటులోకి తెస్తోంది. కొత్తగా రెండు క్రీడా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో కిన్నెరసాని క్రీడా గురుకుల పాఠశాల అందుబాటులో ఉంది. అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్లో రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. ఈ పాఠశాలలో ఎక్కువగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని విద్యార్థులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూరు, ఏటూరునాగరం ఐటీడీఏల పరిధిలోనూ ఒక్కో క్రీడా గురుకులాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. గిరిజన విద్యార్థులు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండటంతో వారు క్రీడల్లో రాణించగలరని భావిస్తోంది. దీంతో కొత్తగా ఆదిలాబాద్ జిల్లా బోథ్, ఏటూరునాగరంలో రెండు క్రీడా గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తేనుంది. వీటికి సంబంధించి ప్రతిపాదనలను గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. కొత్తగా ప్రారంభించనున్న రెండు క్రీడా గురుకులాలు 2018–19 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. అక్కడ మైదానం, క్రీడా సామగ్రి తదితర సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. తొలి ఏడాది ఒక్కో గురుకులానికి రూ.కోటి చొప్పున తాజా బడ్జెట్లో ప్రతిపాదించింది. కిన్నెరసాని క్రీడా గురుకులాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు తయారు చేస్తోంది. విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ నవీన్‌నికోలస్ ‘సాక్షి’తో అన్నారు. -
నేడు గురుకులాల స్క్రీనింగ్ టెస్టు ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీకి గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితాలను ఈ నెల 21(బుధవారం)న విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. బుధవారం ఫలితాల విడుదల సాధ్యం కాకపోతే 22న విడుదల చేయాలని భావిస్తోంది. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొంది. పరీక్షల ఫలితాలు విడుదల కాకముందే మెయిన్ పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో ఎవరు మెయిన్ పరీక్షలకు ఎంపికయ్యారన్న వివరాలు తెలియకపోవడంతో అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. అనంతరం మెయిన్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాలను కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
టీజీటీ మెయిన్ పరీక్షలు వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ గురుకుల పీజీటీ, టీజీటీ, పీడీ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అభ్యర్థులు, విద్యార్థి సంఘాల విజ్ఞప్తితో పరీక్షలు వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. జూలై 18, 19 తేదీల్లో పీజీటీ, 20,22న టీజీటీ, 19న పీడీ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 4 నుంచి 6 వరకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) మెయిన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. -
4 నుంచి టీజీటీ మెయిన్ పరీక్షలు
- పీజీటీ, పీడీలకు 29, 30 తేదీల్లో పరీక్షలు - నేడు వెబ్సైట్లో ఫైనల్ కీ - పీజీటీ, టీజీటీ, పీడీ లాంగ్వేజెస్ పరీక్షకు 75.34 శాతం హాజరు సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని 4,362 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులకు వచ్చే నెల 4 నుంచి 6 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. టీజీటీ మ్యాథ్స్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఏ సబ్జెక్టు వారికి ఏ తేదీలో పరీక్షలు ఉంటాయన్న వివరాలను గురు వారం(నేడు) తమ వెబ్సైట్లో అందుబాటు లో ఉంచుతామని వెల్లడించింది. అలాగే 921 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), 6 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 29, 30 తేదీల్లో మెయిన్ పరీక్షలు ఉంటాయని తెలి పింది. పీజీటీ మ్యాథ్స్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను, పీజీటీ, టీజీటీ, పీడీ స్క్రీనింగ్ టెస్ట్ ఫైనల్ కీలను గురువారం వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించింది. ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరిం చేది లేదని స్పష్టం చేసింది. ఈ పోస్టులకు గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు రాసేందుకు 2,62,670 మంది(పీజీటీ పోస్టు లకు 1,12,255 మంది, టీజీటీ పోస్టులకు 1,47,025 మంది, పీడీ పోస్టులకు 3,390 మంది) దరఖాస్తు చేసుకోగా 1,09,949 హాజరయ్యారని వివరించింది. కాగా, పీజీటీ, టీజీటీ, పీడీ లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం) పోస్టులకు బుధవారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుకు 75.34 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. 51 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా.. 27,487 మంది హాజరైనట్లు వివరించింది. -
పేద విద్యార్థుల భవితకు ‘గురుకుల’ పునాది
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: వెనకబడిన కులాలు, పేద విద్యార్థుల ఉజ్వల భవితకు గురుకుల పాఠశాలలు పునాది వేయబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 119 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్, అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాల బీసీ గురుకుల పాఠశాలల వసతి గృహాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, జి.కిషన్‌రెడ్డితో కలసి ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనారిటీలు, బలహీనవర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
ఒకేరోజు.. 169 గురుకులాలు
- రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రారంభం: సీఎం కేసీఆర్ - దేశ చరిత్రలోనే ఇది రికార్డు.. అధికారులకు అభినందనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకే రోజు 169 గురుకులాలను ప్రారంభించామని.. దేశ చరిత్రలోనే ఇది రికార్డు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ‘కేజీ టు పీజీ’లో భాగంగా పేద విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను ఉచితంగా అందించేందుకే గురుకులాలను ప్రారంభించామని సోమవారం ఓ ప్రకటనలో చెప్పారు. తాజా విద్యా సంవత్సరంలో కొత్తగా 255 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని లక్ష్యం గా పెట్టుకున్నామని తెలిపారు. అందులో 169 స్కూళ్లను రికార్డు స్థాయిలో ఒకేరోజు ప్రారంభించేలా కృషి చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి 259 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవని.. తాము కేవలం మూడేళ్లలో కొత్తగా 527 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని పేర్కొన్నారు. బాలికల విద్యను ప్రోత్సహిం చేందుకు సగం స్కూళ్లను వారికే కేటాయించామన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. భారీగా గురుకులాలు తెలంగాణ ఏర్పాటుకాక ముందు ఎస్సీలకు 134 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పాటైన మరుసటి సంవత్సరమే ఎస్సీలకు 104 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ రెసిడెన్షియల్స్ ప్రారంభించారు. ఇక తెలంగాణ రాకముందు ఎస్టీలకు 94 రెసిడెన్షియల్స్ ఉండేవి. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా 51 రెసిడెన్షియల్స్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీసీలకు కేవలం 19 రెసిడెన్షియల్స్ ఉండగా.. ఇప్పుడు కొత్తగా 119 రెసిడెన్షియల్స్ ప్రారంభమవుతున్నాయి. బీసీ విద్యార్థులకు ప్రయోజనకరంగా.. రాష్ట్రంలో సోమవారం ఒకేరోజు 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో 56 బాలురకు, 63 బాలికలకు కేటాయించారు. తొలి ఏడాది 5, 6, 7 తరగతుల్లో.. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున మొదటి ఏడాది ఒక్కో రెసిడెన్షియల్లో 240 మందికి ప్రవేశం కల్పించారు. ఐదేళ్లపాటు ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. అప్పుడు ఒక్కో రెసిడెన్షియల్లో విద్యార్థుల సంఖ్య 640కు చేరుతుంది. ఐదేళ్లలో మొత్తం బీసీ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య 91,520కు చేరుకుంటుంది. ఇక ప్రస్తుతం మైనారిటీ విద్యాసంస్థల్లో 50 వేల మందికి ప్రవేశం కల్పించగా.. ఐదేళ్లలో ఈ సంఖ్య లక్షా 30 వేలకు చేరుతుంది. కాగా ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకుని స్కూళ్లు ప్రారంభించారు. వీటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం స్థలం సేకరించాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. వారంలో మరో 71 గురుకులాలు.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 169 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభంకాగా.. అందులో 119 బీసీ, 50 మైనారిటీ స్కూళ్లు ఉన్నాయి. ఈ నెల 15న మరో 50, 19న ఇంకో 21 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా 15 ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలను సైతం ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించనున్నారు. ఈ స్కూళ్లకు 24 వేల మంది అధ్యాపకులు అవసరమని అంచనా. వారిని దశల వారీగా నియమించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. -
గురుకులాలన్నింటా ఒకే మెనూ
అధికారులకు ఉపముఖ్యమంత్రి కడియం ఆదేశం - ప్రతి ఆదివారం నాన్‌వెజ్ తప్పనిసరి - ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ - గురుకులాల్లో వసతుల కల్పనపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నింట్లో ఒకే రకమైన మెనూ అమలు చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా గురుకులాల వరకు కామన్ అకడమిక్ క్యాలెండర్‌తో పాటు మౌలికవసతుల కల్పనలోనూ ఒకే పద్ధతిని అనుసరించాలని ఆదేశించారు. గురుకులాల్లో వసతుల కల్పన, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై సోమవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, అజ్మీరా చందూలాల్‌తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్‌మిశ్రా, రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈమేరకు గురుకుల సొసైటీల కార్యదర్శులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన రెసిడెన్షియల్ కాలేజీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం మహిళా డిగ్రీ కాలేజీల్లో ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ... వాటిపై స్పష్టత కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కడియం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఒక్కోచోట ఒక రకమైన భోజనాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్న కడియం, ఇకపై ఒకేరకమైన భోజనాన్ని ఇవ్వాలన్నారు. ప్రతి ఆదివారం గురుకుల విద్యార్థులకు నాన్‌వెజ్ భోజనం పెట్టాలన్నారు. గురుకుల విద్యార్థినులకు ఏడాది పాటు అవసరమయ్యే ఆరోగ్య వస్తువులను కిట్ రూపంలో ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని, వీటికి డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారులను నియమించాలని ముఖ్య మంత్రి భావిస్తున్నారన్నారు. పక్షం రోజుల్లో ఓ నివేదిక ద్వారా స్టడీ సర్కిళ్లపైనా సూచనలు చేయాలన్నారు. గత విద్యాసంవత్సరంలో ప్రారంభించిన గురుకుల పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న గురుకులాలకు సంబంధించి భవనాలు, విద్యార్థులకు సౌకర్యాలు తదితర అంశాలపైనా పరిశీలన చేపట్టాలన్నారు. కొత్త గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండొద్దని ఆయన స్పష్టం చేశారు. -
‘మైనారిటీ’ పరిధిలోకి 14 గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో ఉన్న 47 గురుకులాల్లోని 14 గురుకులాలను మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీఎం ఆర్ఈఐఎస్) పరిధిలోకి మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 12 గురుకుల పాఠశాలలతో పాటు ఉర్దూ మీడియం జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన 2 గురుకుల జూనియర్ కాలేజీలను టీఎంఆర్ఈఐఎస్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. టీఎంఆర్ఈఐఎస్ పరిధిలోకి వెళ్లిన విద్యాసంస్థల వివరాలు..కులీ కుతుబ్‌షా ఉర్దూ బాయ్స్ గురుకుల పాఠశాల బార్కాస్ (హైదరాబాద్), టీఎస్ఆర్ ఉర్దూ బాయ్స్ స్కూల్ నాగారం (నిజామాబాద్), టీఎస్ఆర్ ఉర్దూ బాయ్స్ స్కూల్ (సంగారెడ్డి), టీఎస్ఆర్ ఇంగ్లిషు మీడియం బాయ్స్ స్కూల్ ఎస్ఎల్బీసీ కాలనీ (నల్గొం డ), టీఎస్ఆర్ ఉర్దూ బాలికల స్కూల్ ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి), టీఎస్ ఆర్ ఉర్దూ గర్ల్æ్స స్కూల్ (మహబూబ్‌నగర్), టీఎస్ఆర్ మైనారిటీ గర్ల్స్ స్కూల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, కామారెడ్డి, జహీరాబాద్, వనపర్తి, వరంగల్‌లోని టీఎస్ఆర్ మైనారిటీ బాయ్స్ స్కూళ్లను మైనారిటీ గురుకుల సొసైటీ పరిధిలోకి తెచ్చారు. ఎల్బీనగర్లోని బార్కాస్ కులీకు తుబ్‌షా ఉర్దూ గురుకుల జూనియర్ కాలేజీ, నిజామాబాద్ జిల్లా నాగారం లోని టీఎస్ఆర్ ఉర్దూ బాయ్స్ జూనియర్ కాలేజీలను బదలాయించారు. -
ఈ ఎన్నికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలి
► ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా టీఆర్ఎస్ అధికార దాహం తీరడం లేదు ► ప్రభుత్వ పాఠశాలల మూసివేతను సమర్థ్ధిస్తూ గురుకులాలకు తెరలేపింది ► మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విద్యారంగం, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఓటర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకతీతంగా జరగాల్సిన ఎన్నికలను ప్రభుత్వం కలుషితం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ‘ఒకే ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ పదవులు ఉన్నా..ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నా ఇంకా అధికారదాహం తీరకపోవడం దారుణం. ఆఖరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడాపార్టీ అభ్యర్థులుగా ప్రకటించుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను సమర్థిస్తూ గురుకులాలకు తెరలేపిందని, ప్రవేశ పరీక్ష ద్వారా తెలివైన పిల్లలను ఎంపిక చేసుకొని ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టిస్తోందని అన్నారు. సరైన వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా సర్కారు బడులను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేసిందన్నారు. దీనికి బాధ్యులుగా టీచర్లను చిత్రీకరిస్తోందని సబిత అన్నారు. 610 జీఓకు విరుద్ధంగా జరుగుతున్న బదిలీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.రెండున్నరేళ్లవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికీ పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ఈ నెల 9న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘లొంగిపోయే గొంతుకు గాకుండా...ప్రశి్నంచే వ్యక్తిని’ ఎన్నుకోవాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. -
ఈ విద్యా సంవత్సరం నుంచే 250 గురుకులాలు
- దేశంలోనే మొదటిసారి విప్లవాత్మకమైన నిర్ణయం - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జనగామ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యనందించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు 250 గురుకుల పాఠశాలలకు ఏర్పాటుకు నిర్ణయించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. జనగామలోని ధర్మకంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దివంగత రిటైర్డ్ డీఈఓ మారోజు శ్రీహరి కుమారులైన ఎన్ఆర్ఐలు వెంకట్, హరి రూ.4లక్షల విలువైన డిజిటల్ తరగతి గది పరికరాలు అందజేశారు. ఈ మేరకు డిజిటల్ తరగతి గదిని శనివారం ప్రారంభించిన కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఇప్పటి వరకు 240 గురుకుల పాఠశాల ద్వారా లక్ష మంది పేద విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిషు బోధన అందగా.. సీఎం కేసీఆర్ ఒకేసారి 250 గురుకులాల ఏర్పాటు చేయనుండడం విప్లవాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ పాఠశాలలను ప్రస్తుతం విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యూయని, 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందించే ఒక్కో గురుకుల పాఠశాలలో 640 మంది చొప్పున మొత్తం 1.60లక్షల మంది విద్యార్థులకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. గురుకులానికి రూ.20 కోట్ల చొప్పున 2 వందల పాఠశాలలకు రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కడియం తెలిపారు. వీటి ఏర్పాటుతో ఏడు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచిత విద్యనందిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌పై ఆశతో అప్పులు చేసి మరీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారని కడియం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందుతుందని తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్‌కు ఏ మాత్రం తీసిపోరని ఇటీవల వెల్లడైన పలు పరీక్ష ఫలితాలతో తేలిపోయిందని శ్రీహరి వివరించారు. సమావేశంలో జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, సినీ దర్శకుడు నర్సింగరావు, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్ ఫర్మాజీతోపాటు దివంగత శ్రీహరి సతీమణి ఆగమ్మ, అమృతరెడ్డి, మేడ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎస్సీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: తమ గురుకులాల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి(2016-17) ఆన్లైన్లో ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రిజర్వేషన్ల నిబంధనలను పాటిస్తూ జిల్లాల వారీగా రూపొందించే మెరిట్ జాబితాకు అనుగుణంగానే విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. కాలేజీలను కూడా మెరిట్ ఆధారంగానే కేటాయిస్తారని, ఇందుకు ఎలాంటి కౌన్సెలింగ్ ఉండదని స్పష్టంచేశారు. కేవలం ఆన్లైన్ దరఖాస్తులనే ఆమోదిస్తామని, విడిగా ఇచ్చే దరఖాస్తులను స్వీకరించేది లేదన్నారు. దీనికై ఠీఠీఠీ.్టటఠీట్ఛజీట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తును చేసుకోవాలని పేర్కొన్నారు.