- దేశంలోనే మొదటిసారి విప్లవాత్మకమైన నిర్ణయం
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
జనగామ
తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచిత, నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యనందించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు 250 గురుకుల పాఠశాలలకు ఏర్పాటుకు నిర్ణయించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. జనగామలోని ధర్మకంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దివంగత రిటైర్డ్ డీఈఓ మారోజు శ్రీహరి కుమారులైన ఎన్‌ఆర్‌ఐలు వెంకట్, హరి రూ.4లక్షల విలువైన డిజిటల్ తరగతి గది పరికరాలు అందజేశారు. ఈ మేరకు డిజిటల్ తరగతి గదిని శనివారం ప్రారంభించిన కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఇప్పటి వరకు 240 గురుకుల పాఠశాల ద్వారా లక్ష మంది పేద విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిషు బోధన అందగా.. సీఎం కేసీఆర్ ఒకేసారి 250 గురుకులాల ఏర్పాటు చేయనుండడం విప్లవాత్మక నిర్ణయమని తెలిపారు.
ఈ పాఠశాలలను ప్రస్తుతం విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యూయని, 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందించే ఒక్కో గురుకుల పాఠశాలలో 640 మంది చొప్పున మొత్తం 1.60లక్షల మంది విద్యార్థులకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. గురుకులానికి రూ.20 కోట్ల చొప్పున 2 వందల పాఠశాలలకు రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కడియం తెలిపారు. వీటి ఏర్పాటుతో ఏడు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచిత విద్యనందిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌పై ఆశతో అప్పులు చేసి మరీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారని కడియం తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందుతుందని తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్‌కు ఏ మాత్రం తీసిపోరని ఇటీవల వెల్లడైన పలు పరీక్ష ఫలితాలతో తేలిపోయిందని శ్రీహరి వివరించారు. సమావేశంలో జనగామ మునిసిపల్ చైర్‌పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, సినీ దర్శకుడు నర్సింగరావు, ఆర్‌డీఓ వెంకట్‌రెడ్డి, ప్రొఫెసర్ ఫర్మాజీతోపాటు దివంగత శ్రీహరి సతీమణి ఆగమ్మ, అమృతరెడ్డి, మేడ శ్రీనివాస్ పాల్గొన్నారు.