ఈ ఎన్నికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలి
► ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా టీఆర్‌ఎస్ అధికార దాహం తీరడం లేదు
► ప్రభుత్వ పాఠశాలల మూసివేతను సమర్థ్ధిస్తూ గురుకులాలకు తెరలేపింది
► మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విద్యారంగం, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఓటర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకతీతంగా జరగాల్సిన ఎన్నికలను ప్రభుత్వం కలుషితం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు.
‘ఒకే ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ పదవులు ఉన్నా..ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నా ఇంకా అధికారదాహం తీరకపోవడం దారుణం. ఆఖరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడాపార్టీ అభ్యర్థులుగా ప్రకటించుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను సమర్థిస్తూ గురుకులాలకు తెరలేపిందని, ప్రవేశ పరీక్ష ద్వారా తెలివైన పిల్లలను ఎంపిక చేసుకొని ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టిస్తోందని అన్నారు.
సరైన వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా సర్కారు బడులను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేసిందన్నారు. దీనికి బాధ్యులుగా టీచర్లను చిత్రీకరిస్తోందని సబిత అన్నారు. 610 జీఓకు విరుద్ధంగా జరుగుతున్న బదిలీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.రెండున్నరేళ్లవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికీ పీఆర్‌సీ బకాయిలు ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ఈ నెల 9న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘లొంగిపోయే గొంతుకు గాకుండా...ప్రశి్నంచే వ్యక్తిని’ ఎన్నుకోవాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.