press release
-
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గురునాథ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అనంతపురం(అర్బన్) అసెంబ్లీ నియోజక వర్గానికి నూతన సమన్వయ కర్త, కో-ఆర్డినేటర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. నియోజక వర్గ సమన్వయ కర్తగా నదీమ్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వారి నియామకాన్ని తెలియచేస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటివరకూ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. -
ఈ ఎన్నికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలి
► ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా టీఆర్ఎస్ అధికార దాహం తీరడం లేదు ► ప్రభుత్వ పాఠశాలల మూసివేతను సమర్థ్ధిస్తూ గురుకులాలకు తెరలేపింది ► మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విద్యారంగం, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఓటర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకతీతంగా జరగాల్సిన ఎన్నికలను ప్రభుత్వం కలుషితం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ‘ఒకే ఇంట్లో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ పదవులు ఉన్నా..ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నా ఇంకా అధికారదాహం తీరకపోవడం దారుణం. ఆఖరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను కూడాపార్టీ అభ్యర్థులుగా ప్రకటించుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను సమర్థిస్తూ గురుకులాలకు తెరలేపిందని, ప్రవేశ పరీక్ష ద్వారా తెలివైన పిల్లలను ఎంపిక చేసుకొని ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టిస్తోందని అన్నారు. సరైన వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా సర్కారు బడులను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేసిందన్నారు. దీనికి బాధ్యులుగా టీచర్లను చిత్రీకరిస్తోందని సబిత అన్నారు. 610 జీఓకు విరుద్ధంగా జరుగుతున్న బదిలీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.రెండున్నరేళ్లవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికీ పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ఈ నెల 9న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘లొంగిపోయే గొంతుకు గాకుండా...ప్రశి్నంచే వ్యక్తిని’ ఎన్నుకోవాలని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. -
గాలి వార్తలు బాధాకరం
విష ప్రచారాన్ని ఖండించిన ప్రభాస్ షర్మిలను కలిసిందీ, మాట్లాడిందే లేదు నా ఆరోగ్యంపైనా ఇలాంటి గాలివార్తలే హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలపై, తనపై కొన్నాళ్లుగా జరుగుతున్న విషప్రచారాన్ని ప్రముఖ సినీ హీరో ప్రభాస్ తీవ్రంగా ఖండించారు. ఆమెను తానెప్పుడూ కలవడం కానీ, మాట్లాడడం కానీ జరగలేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ‘‘ప్రచారంలో ఉన్న గాలి వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. వాటిలో వీసమెత్తయినా నిజం లేదు’’ అని ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను కూడా ప్రభాస్ ఖండించారు. ‘‘నా ఆరోగ్యం బాగా లేదని, తీవ్రంగా గాయపడ్డానని, కోమాలో ఉన్నానని... ఇలా అనేక మాసాలుగా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇవన్నీ గాలివార్తలే’’ అని వివరించారు. ‘‘వాటిని చూసి శ్రేయోభిలాషుల నుంచి నా సన్నిహిత మిత్రులకూ, కుటుంబసభ్యులకూ బోలెడన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. మిగతా వారి సంగతెలా ఉన్నా వీటన్నిటితో నా కుటుంబం ఎంతో బాధకూ, ఆవేదనకూ గురైంది’’ అని వెల్లడించారు. ఆ బాధ నాకు తెలుసు! ‘‘మొదట్లో నా ఆరోగ్యం గురించి పుకార్లు వచ్చినప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. ఇలాంటి వదంతులను పట్టించుకోకుండా వదిలేయడమే మంచి పద్ధతని, వాటంతట అవే సమసిపోతాయని భావించాను. కానీ నాతో పాటు మరో వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగించేలా విషప్రచారం సాగుతున్నప్పుడు నేను వాటిని ఉపేక్షించకూడదు. అందుకే ఆ దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని ప్రభాస్ వివరించారు. ‘‘పెళ్లి చేసుకుని, పిల్లలు కూడా ఉన్న అత్యంత గౌరవనీయురాలైన ఓ మహిళ గురించి ఇంత అమానవీయంగా, అగౌరవకరమైన రీతిలో, ఆమె గౌరవమర్యాదలను దెబ్బ తీసే రీతిలో పుకార్లను ప్రచారం చేయడం శోచనీయం. నాకు రాజకీయ ఆసక్తులేవీ లేవని మీ అందరికీ తెలుసు. ఈ ప్రచారం వ్యక్తిగతంగా హృదయాన్ని తీవ్రంగా బాధించడంతో ఈ ప్రకటన చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ రకమైన నిరాధారమైన గాలి వార్తల వల్ల ఒక వ్యక్తి ఎంతటి బాధకు గురవుతారో, మానసిక క్షోభను అనుభవిస్తారో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈ దుష్ర్పచారానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యాను’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వదంతుల వల్ల సంబంధిత వ్యక్తుల గౌరవమర్యాదలకు తీరని నష్టం వాటిల్లుతుంది గనుక ఈ పుకార్లను సృష్టించిన, వాటిని ప్రచారంలో పెట్టడానికి బాధ్యులైన వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని ఈ యువ హీరో ప్రకటించారు. -
జేపీ.. మోడీ ఫొటో వాడొద్దు: బీజేపీ
సాక్షి,హైదరాబాద్: లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన ఎన్నికల ప్రచారం, పత్రికాప్రకటనల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఫొటోను వాడుకోవటం ఏ మాత్రం సరికాదని బీజేపీ పేర్కొంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... తన స్వార్థం కోసం బీజేపీ, మోడీ పేర్లను జేపీ వాడుకోవటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే ఆయన తన ప్రచారంలో మోడీ ఫొటోలను తీసేసి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని లేకుంటే బీజేపీ కార్యకర్తలు ఆయన్ను నిలదీయాలని మల్లారెడ్డి పిలుపునిచ్చారు.