గాలి వార్తలు బాధాకరం
విష ప్రచారాన్ని ఖండించిన ప్రభాస్
షర్మిలను కలిసిందీ, మాట్లాడిందే లేదు
నా ఆరోగ్యంపైనా ఇలాంటి గాలివార్తలే
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలపై, తనపై కొన్నాళ్లుగా జరుగుతున్న విషప్రచారాన్ని ప్రముఖ సినీ హీరో ప్రభాస్ తీవ్రంగా ఖండించారు. ఆమెను తానెప్పుడూ కలవడం కానీ, మాట్లాడడం కానీ జరగలేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ‘‘ప్రచారంలో ఉన్న గాలి వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. వాటిలో వీసమెత్తయినా నిజం లేదు’’ అని ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను కూడా ప్రభాస్ ఖండించారు. ‘‘నా ఆరోగ్యం బాగా లేదని, తీవ్రంగా గాయపడ్డానని, కోమాలో ఉన్నానని... ఇలా అనేక మాసాలుగా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇవన్నీ గాలివార్తలే’’ అని వివరించారు. ‘‘వాటిని చూసి శ్రేయోభిలాషుల నుంచి నా సన్నిహిత మిత్రులకూ, కుటుంబసభ్యులకూ బోలెడన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. మిగతా వారి సంగతెలా ఉన్నా వీటన్నిటితో నా కుటుంబం ఎంతో బాధకూ, ఆవేదనకూ గురైంది’’ అని వెల్లడించారు.
ఆ బాధ నాకు తెలుసు!
‘‘మొదట్లో నా ఆరోగ్యం గురించి పుకార్లు వచ్చినప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. ఇలాంటి వదంతులను పట్టించుకోకుండా వదిలేయడమే మంచి పద్ధతని, వాటంతట అవే సమసిపోతాయని భావించాను. కానీ నాతో పాటు మరో వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగించేలా విషప్రచారం సాగుతున్నప్పుడు నేను వాటిని ఉపేక్షించకూడదు. అందుకే ఆ దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని ప్రభాస్ వివరించారు. ‘‘పెళ్లి చేసుకుని, పిల్లలు కూడా ఉన్న అత్యంత గౌరవనీయురాలైన ఓ మహిళ గురించి ఇంత అమానవీయంగా, అగౌరవకరమైన రీతిలో, ఆమె గౌరవమర్యాదలను దెబ్బ తీసే రీతిలో పుకార్లను ప్రచారం చేయడం శోచనీయం. నాకు రాజకీయ ఆసక్తులేవీ లేవని మీ అందరికీ తెలుసు. ఈ ప్రచారం వ్యక్తిగతంగా హృదయాన్ని తీవ్రంగా బాధించడంతో ఈ ప్రకటన చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ రకమైన నిరాధారమైన గాలి వార్తల వల్ల ఒక వ్యక్తి ఎంతటి బాధకు గురవుతారో, మానసిక క్షోభను అనుభవిస్తారో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈ దుష్ర్పచారానికి పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యాను’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వదంతుల వల్ల సంబంధిత వ్యక్తుల గౌరవమర్యాదలకు తీరని నష్టం వాటిల్లుతుంది గనుక ఈ పుకార్లను సృష్టించిన, వాటిని ప్రచారంలో పెట్టడానికి బాధ్యులైన వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని ఈ యువ హీరో ప్రకటించారు.