ధైర్యంగా ఉండండి..మంచిరోజులు వస్తాయి | Sharmila visitation trip | Sakshi
Sakshi News home page

ధైర్యంగా ఉండండి..మంచిరోజులు వస్తాయి

Published Thu, Jan 7 2016 11:24 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ధైర్యంగా ఉండండి..మంచిరోజులు వస్తాయి - Sakshi

ధైర్యంగా ఉండండి..మంచిరోజులు వస్తాయి

జూబ్లీహిల్స్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్రకు మూడో రోజు గురువారం అనూహ్య స్పందన లభించింది. మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్‌లోని సత్యనారాయణ నివాసానికి ఉదయం 10.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. పార్టీ వైద్యవిభాగం రాష్ట అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్థానికులు ఆమెను చూడడానికి, కరచాలనం చేయడానికి ఎగబడ్డారు.

ఉదయం 10.30 గంటలు...
ముడతా సత్యనారాయణ నివాసం (రహమత్‌నగర్) దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన ముడతా సత్యనారాయణ కుటుంబ సభ్యులను రాజన్న బిడ్డ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గురువారం పరామర్శించారు. ఆమెను చూడగానే సత్యనారాయణ భార్య లక్ష్మి, కుమారుడు క్రాంతి, కుమార్తెలు సుధారాణి, వైష్ణవి కన్నీరుమున్నీరయ్యారు. సుధారాణి, వైష్ణవిలు షర్మిలను ‘అక్కా... జగనన్న, మీ పిల్లలు, విజయమ్మ ఎలా ఉన్నారు?’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు. మహానేత మరణ వార్తతో తీవ్ర వేదనకు గురైన తన భర్తకు గుండెపోటు వచ్చిం దని లక్ష్మి తెలిపారు. ఆస్పత్రికితీసుకెళితే ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెప్పారని... దీంతో సరైన వైద్యం చేయించలేకపోయామని... ఆయన మృతి చెందాడని చెబు తూ లక్ష్మి విల పించారు. ఆమెను ఓదార్చిన షర్మిల... ‘మళ్లీ మంచిరోజులు వస్తాయి. మీ కుటుంబానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు... అండదండలు అందిస్తా’మని  భరోసా ఇచ్చారు. ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా పలుకరిస్తూ... వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. క్రాంతికి మంచి ఉద్యోగం ఇప్పించాలని తల్లి లక్ష్మి కోరగా.. తప్పకుండా సాయం చేస్తామని షర్మిల భరోసా ఇచ్చి.. అక్కడి నుంచి కదిలారు. వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్య క్షుడు, పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, రాష్ట్ర సమన్వయ కార్యదర్శి జొన్నలగడ్డ లూర్ధుమేరి, రహమత్‌నగర్ డివిజన్ అధ్యక్షురాలు షమీమ్, నాయకులు మల్లాది సం దీప్, చోటూ, రమేష్, మహేశ్, విజయలక్ష్మి, రాజేంద్రసింగ్, సయ్యద్, తులసీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.  

పేదరికంలో కుటుంబం
 సత్యనారాయణ ఆకస్మిక మరణంతో కుటుంబాన్ని నడపడానికి లక్ష్మి హౌస్‌కీపింగ్‌లోనూ...  కుమారుడు క్రాంతి పాలిటెక్నిక్ డి ప్లొమా మధ్యలో ఆపేసి... ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. పెద్ద కుమార్తె సుధారాణి ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పని చేస్తుండగా... చిన్న కుమార్తె వైష్ణవికి ఇటీవలే వివాహమైంది.
 
ఖైరతాబాద్ 11.40 గంటలు... శివలాల్ యాదవ్ నివాసం  (మారుతీ నగర్, ఖైరతాబాద్)
 బంజారాహిల్స్: ఖైరతాబాద్ పెద్ద గణేష్ చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో మహిళలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. శివలాల్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆమెను తమ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్, శివలాల్ యాదవ్‌ల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. శివలాల్ భార్య లలితను షర్మిల పరామర్శించారు. వైఎస్సార్‌కు తన భర్త వీరాభిమాని అని... ఆయన మరణ వార్తను టీవీలో చూస్తూ ... ఆవేదనతో కన్నుమూశాడని లలిత వివరించారు. వైఎస్సార్‌లాంటి సీఎంను తాము ఇంత వరకు చూడలేదని అన్నారు. శివలాల్ ముగ్గురు కొడుకులు నరేందర్ యాదవ్, మహేష్ యాదవ్, సురేష్ యాదవ్‌లను కూడా షర్మిల పరామర్శించారు. వారి పిల్లలతో మాట్లాడారు. ఏం చదువుతున్నారని అడిగారు. మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో వైఎస్సార్ అభిమానులు వేల సంఖ్యలో ఉంటారని చెప్పారు. పేదవాడి ఆకలి తెలిసిన గొప్ప నేతని... పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఆయన స్ఫూర్తితో తాను ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వివరించారు. అక్కడి మహిళలంతా మహానేత చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో షర్మిల ఒకింత ఉద్వేగానికి గురై... కంట తడి పెట్టారు.  కొద్దిసేపు తండ్రి ఫొటోను చూస్తూ గడిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని షర్మిలను మహేష్ కోరారు. ఖైరతాబాద్‌లో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్‌ను గెలిపించుకొని పెద్ద గణేష్ చౌరస్తాలో వైసీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. అనంతరం పేద వృద్ధ మహిళలకు షర్మిల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు ఎం.సుజాత, ఉషారాణి, వరలక్ష్మి, మేఘన, రమాదేవి, శారద, ప్రశాంత్, రాజు యాదవ్, వెంకట్ మోహన్, చంద్రశేఖర్, సురేందర్ ముదిరాజ్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

12.05 గంటలు. కొండబోయిన లత నివాసం  (కట్టమైసమ్మ బస్తీ, రసూల్‌పురా)
 రసూల్‌పురా: కట్టమైసమ్మ బస్తీలోని లత కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. కుటుంబ పెద్ద గౌరమ్మ, రేణుకలు మహానేత వైఎస్‌ఆర్‌ను తలచుకుని కంటతడి పెట్టారు. తాము డ్వాక్రా రుణాలు తీసుకుంటున్నామంటే వైఎస్ చలవేనని పేర్కొన్నారు. తమ కుమార్తె లతకు వైఎస్సార్ అంటే అభిమానమని చెప్పారు. ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి పసిగుడ్డుతో ఇంటికి వచ్చిన లత... వైఎస్సార్ మరణ వార్తలను టీవీలో చూస్తూ కన్ను మూసిందని వివరిస్తూ ఆ కుటుంబం కంటతడి పెట్టడంతో అక్కడి వారి కళ్లు చెమ్మగిల్లాయి. లత కూతురు వైష్ణవిని షర్మిల అక్కున చేర్చుకున్నారు. ఏం చదువుతున్నావు? ఎంత ర్యాంక్ వస్తోంది? అని అడిగారు. బాగా చదువుకోవాలని చెప్పారు. పాఠశాలలోని స్నేహితుల పేర్లు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వైష్ణవికి అన్నివిధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని ఆ కుటుంబ సభ్యులకు సూచించారు. సుమారు 15 నిమిషాల పాటు షర్మిల అక్కడ గడిపారు.

బయటికి వచ్చిన అనంతరం బస్తీవాసులు ఆమెతో ఫొటోలు దిగారు. స్థానిక నాయకులు రాములు, ఆంజనేయులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించారు.అక్కడి నుంచి బయలుదేరిన షర్మిలకు బాలంరాయి విమాన నగర్‌లో మమత హైస్కూల్ విద్యార్థులు స్వాగతం పలికారు, కారు వద్దకు వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఆమెతో కరచాలనం చేశారు. అనంతరం షర్మిల నిజామాబాద్‌కు బయలుదేరారు.
 
ఘన స్వాగతం
కట్టమైసమ్మ బస్తీలో పార్టీ నాయకులుఆదం విజయ్ కుమార్, కె.చంద్రశేఖర్‌రెడ్డిలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, జగదీశ్వర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement