రాజన్న ఉంటే పేదలకు భరోసా ఉండేది
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందేది
ప్రజానేత వైఎస్‌కు మరణం లేదు
కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నారు
నర్సంపేట పరామర్శ యాత్రలో షర్మిల
వరంగల్ జిల్లాలో మూడో రోజు ఆరు కుటుంబాలకు పరామర్శ
వరంగల్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ప్రజల కోసం తపించిన గొప్పనాయకుడని వైఎస్సార్ తనయ, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ సోదరి షర్మిల అన్నారు. ప్రజల కోసం ఎంత చేసినా తక్కువే అనే భావనతో జనం మెచ్చేలా వైఎస్ పాలన సాగించారన్నారు. వైఎస్ ఉంటే ప్రతి పేద కుటుంబానికీ సొంతిళ్లు ఉండేదని, ప్రతి ఎకరాకూ సాగునీరు అందేదని అన్నారు. వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మూడోరోజు బుధవారం నర్సంపేట నియోజకవర్గంలో ఆరు కుటుంబాలను పరామర్శించారు. నియోజకవర్గ ఇంచార్జి నాడెం శాంతికుమార్ నిర్మించిన వైఎస్సార్ స్మారక గార్డెన్‌లో వైఎస్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం షర్మిలప్రసంగించారు. ‘ఒక నాయకుడి మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోవడం దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక నాయకుడు చనిపోతే ఇంతమంది అభిమానులు గుండె పగిలి చనిపోవడం వైఎస్ విషయంలోనే జరిగింది.
కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారు. రైతులను రాజులను చేశారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. మన రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ర్టంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో కృషి చేశారు. వైఎస్ పాలన కాలంలో దేశం మొత్తం మీద ప్రభుత్వాలు 46 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే వైఎస్ హయాంలోరాష్ట్రంలో 46 లక్షల ఇళ్లను నిర్మించారు. డబ్బులు లేని కారణంగా చదువులు ఆగిపోయే పరిస్థితి ఏ ఒక్క పేదకు రాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. సీఎం పదవిలో ఉన్నవారు ప్రజలను బిడ్డల్లా ప్రేమించాలని రుజువు చేసి చూపారు. అందుకే వైఎస్ ఇప్పటికీ కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. వైఎస్‌కు మరణంలేదు. తెలుగుజాతి బతికి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో రాజన్నగా జీవించి ఉంటారు. వైఎస్ ఆశయాలను మనమే బతికించుకోవాలి. మీరు, నేను, మనమందరం చేయిచేయి కలపాలి. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం’ అని షర్మిల అన్నారు.
వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే ప్రక్రియలో భాగంగా షర్మిల బుధవారం నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం వెంకటాపురంలో సూరం ఐలయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి ఇదే మండలంలోని దీక్షకుంట్ల గ్రామానికి వెళ్లారు. ఈ ఊరిలోని బేతం చంద్రయ్య, కొమ్ముల మల్లమ్మ కుటంబాలను పరామర్శించారు. తర్వాత చెన్నారావుపేట మండలం జీజీఆర్‌పల్లికి సమీపంలోని మామిళ్లపల్లిలో బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పించారు. అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోని కొత్తగూడ మండలం ఓటాయితండాకు వెళ్లారు. వైఎస్ మృతి తట్టుకోలేక చనిపోయిన బానోత్ మంగిళి కుటుంబాన్ని పరామర్శించారు. చివరగా దుగ్గొండి మండలం మహ్మదాపురంలోని మిట్టపెల్లి సంజీవ ఇంటికి వెళ్లారు.
సంజీవ తల్లి సారమ్మను పరామర్శించారు. మూడోరోజు ఆరు కుటుంబాలను పరామర్శించిన షర్మిల గురువారం నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గ ట్టు శ్రీకాంత్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, ఆదం విజయ్‌కుమార్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, షర్మిలసంపత్, జి.శివకుమార్ పాల్గొన్నారు.
వైఎస్ కలలు నెరవేర్చుదాం: పొంగులేటి
వైఎస్ ఆశయాలను పూర్తి చేసేందుకు, ఆయన కలలను నెరవేర్చేందుకు అందరం కలసి కష్టపడదామని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పొంగులేటి ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ పేదల బాంధవుడిగా పని చేశారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టినా ప్రజలే చెబుతున్నారు. అందుకే ఆ నేత మరణించి ఆరేళ్లవుతున్నా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రాజన్న కలలు నెరవేర్చడానికి మనమంతా కలసి కష్టడదాం’ అని పిలుపునిచ్చారు.