రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం
వరంగల్ జిల్లాలో షర్మిల రెండో రోజు పరామర్శ యాత్ర
మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలకు పరామర్శ
అటవీ ప్రాంతానికి వెళ్లి గిరిజన కుటుంబానికి భరోసా
ప్రజలను వైఎస్సార్ సొంత బిడ్డల్లా చూసుకున్నారు
ఆయన కోట్లాది మంది గుండెల్లో బతికే ఉన్నారు
రాజన్న ఆశయాలను మనమే బతికించుకుందామన్న జగన్ సోదరి
వరంగల్: ప్రజలందరూ మెచ్చేలా పరిపాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పటికీ ప్రజల గుండెల్లో బతికే ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ప్రజల మనసులో రాజశేఖరరెడ్డి ఉంటారని... వైఎస్సార్ ప్రజలను సొంతబిడ్డల్లా చూసుకుని పాలన సాగించారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో రెండో దశ మంగళవారం కొనసాగింది. యాత్ర రెండో రోజున షర్మిల మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలను పరామర్శించారు. నెల్లికుదురు మండలం చిన్ననాగారంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన ఆమె... అక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఏం చేశారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను గుండెల్లో పెట్టుకున్న మీరు ఇక్కడికి వచ్చారు. వైఎస్సార్‌పై మీకు ఉన్న అభిమానానికి ఇదే సాక్ష్యం. ప్రజలను సొంత బిడ్డల్లా భావించి భరోసా కల్పించిన వైఎస్సార్... వారి గుండెల్లో రాజన్నగా నిలిచిపోయారు. అందరి అవసరాలకు తగినట్లుగా పాలన సాగించారు. సీఎం పదవిలో ఉన్నవారు ప్రజలను బిడ్డల్లా ప్రేమించాలని రుజువు చేసి చూపారు. అందుకే ఇప్పటికీ రాజన్న ప్రజల్లో ఉన్నారు. తెలుగుజాతి బతికి ఉన్నంతకాలం కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఆయన జీవించి ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను మనమే బతికించుకోవాలి. మంచి రోజులు మళ్లీ వస్తాయి. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. వైఎస్సార్‌పై అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా..’’ అని షర్మిల పేర్కొన్నారు.
మానుకోటలో ఆత్మీయ స్వాగతం
వరంగల్ జిల్లా రెండో దశ పరామర్శ యాత్ర రెండో రోజైన మంగళవారం తొలుత మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెంలో కమ్మజెల్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి చిన్ననాగారం చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. సమీపంలోని తార్‌సింగ్‌బాయి తండాలో గుగులోత్ బబ్బి కుటుంబాన్ని ఆమె ఓదార్చారు. అక్కడి నుంచి చిన్నముప్పారంలోని కె.వెంకట్రాం నర్సయ్య ఇంటికి వెళ్లిన షర్మిల... వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత పరామర్శ యాత్ర మహబూబాబాద్ పట్టణానికి చేరుకుంది. ఇక్కడ భారీ సంఖ్యలో జనం రహదారులకు ఇరువైపులా నిలబడి షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. షర్మిల వారికి అభివాదం చేస్తూ, కొందరితో కరచాలనం చేస్తూ ముందుకుసాగారు. జనం భారీ సంఖ్యలో రావడంతో మహబూబాబాద్‌లో షర్మిల యాత్ర ఆలస్యంగా జరిగింది. ఇక్కడ అమడగాని కరయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆమె... తర్వాత ఇదే మండలం గాంధీపురంలో షేక్ బికారి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం చేరుకుని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబానికి భరోసా కల్పించారు.
సాయంత్రం 6.24 గంటలకు లక్ష్మీపురం నుంచి బయలుదేరి గూడూరు మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఊట్ల గ్రామానికి వెళ్లిన షర్మిల... అక్కడ సబావత్ మంగమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. రాత్రిపూట దట్టమైన అడవిలో ప్రయాణించి మరీ షర్మిల ఊట్ల గ్రామానికి రావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయాల్లోనూ ఏ రాజకీయ నాయకుడు రాని తమ ఊరికి రాత్రిపూట షర్మిల రావడం ఆమె ధైర్యానికి చిహ్నమని చెప్పారు. షర్మిల తమ ఊరికి రావడంతో వైఎస్సార్‌ను మళ్లీ చూసినట్లుగా ఉందని సబావత్ మంగమ్మ కుమారుడ ు కృష్ణ పేర్కొన్నారు. మొత్తంగా రెండోరోజు ఏడు కుటుంబాలను పరామర్శించిన షర్మిల... బుధవారం నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లో ఐదు కుటుంబాలను కలుసుకోనున్నారు. ఈ యాత్రలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్.భాస్కర్‌రెడ్డి, అనిల్‌కుమార్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, ఎం.శంకర్, షర్మిల సంపత్, ఎస్.రాజేశ్, టి.నాగారావు, సాధు రమేశ్‌రెడ్డి కె.పాండురంగాచార్యాలు, కె.అచ్చిరెడ్డి, హైదర్ అలీ, ఎం.దయానంద్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.