అనకాపల్లి: కొన్ని రోజుల క్రితం ఏపీలోని కాంగ్రెస్ పార్టీలో చేరి రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజలకు వద్దకు వెళుతున్న షర్మిలకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీ కండువా మళ్లీ మీరు ఎందుకు కప్పుకున్నారని షర్మిలను ఓ సామాన్యుడు నిలదీశాడు.
గతంలో జగనన్న వెంట నడిచి, ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ అనడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని నిలదీశాడు. అనకాపల్లి నియోజకవర్గంలో నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సామాన్యుడి నుంచి ఎదురైన ఈ హఠాత్తు పరిణామంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించింది. వైఎస్సార్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మా కార్యకర్తలమంతా తప్పుపట్టాం. ఆ సమయంలో మేమంతా మీకు, మీ కుటుంబానికి అండగా నిలబడ్డాం. మీ పాదయాత్రలో మీతో నడిచాం.
ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటున్నారు. అందుకే నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి’ అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, పింఛన్లు మొదలుకొని ప్రతీ పథకం అర్హుడైన పేదవాడికి అందుతుందని స్పష్టం చేశాడు .
Comments
Please login to add a commentAdd a comment