మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శనివారం ‘జై జగన్..జైజై జగన్’ నినాదాలతో దద్దరిల్లింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆద్యంతం ఉత్సాహం, ఉత్తేజంతో సాగింది. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికార పదవులు లభించాయని కొనియాడారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.
దళితులకు అడుగడుగునా మేలు..
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని కొనియాడారు. జనవరి 1 నుంచి వితంతు, వృద్ధాప్య పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు.
రెండు వేళ్లు చూపించే టీడీపీ నేతలకు.. ఇక వృద్ధులు, వితంతువులు మూడు వేళ్లు చూపాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా మేలు జరుగుతోందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఈసారి తనను రాజ్యసభకు పంపుతున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రజల సంక్షేమం కోసం రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశంసించారు.
వైద్య విప్లవం తీసుకొచ్చారు..
సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విప్లవాన్ని తీసుకొచ్చారని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి కొనియాడారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ మాట్లాడుతూ.. సీఎం సహకారంతో రూ.2,700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు.
అయ్యన్నపాత్రుడు సైకోలా తయారై బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సాధికారతకు సీఎం జగన్ నిజమైన అర్థం చెప్పారని కొనియాడారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ ఎ.నారాయణమూర్తి, పార్టీ నేత చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment