గాజువాక సభలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన, వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: సామాజిక న్యాయానికి ప్రతీక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని గౌరవంగా బతుకుతున్నారంటే సీఎం వైఎస్ జగన్, ఆయన పథకాలే కారణమని తెలిపారు.
సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం గాజువాక నియోజకవర్గం పాత గాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని, ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు, చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు.
గతంలో మనమందించే పథకాలను అవహేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా పథకాలు ఇస్తా అంటున్నాడని, ఇవి పేదలకు అందించే పథకాలని ఇప్పుడు తెలిసాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి వారి మాటలు నమ్మకూడదని చెప్పారు. ఓ రోడ్డు వేస్తేనో, బిల్డింగ్ కట్టేస్తేనో అభివృద్ధి కాదని, పేద వాడి జీవన ప్రమాణాలను పెంచి, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి జరిగినట్లని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల అభివృద్ధికే అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
సీఎం జగన్ పాలనలో బడుగుల అభ్యున్నతి
రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అని చెప్పారు. ఈ వర్గాలను అన్ని రంగాల్లోనే అగ్రగణ్యులుగా నిలబెడుతున్న ఘనత సీఎం జగన్‌దేనని తెలిపారు. గతంలో బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకే సమావేశం పెట్టుకునే ధైర్యం కూడా ఉండేది కాదని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తలెత్తుకొని ధైర్యంగా సభలు పెట్టుకోగలుగుతున్నామని అన్నారు.
చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇవ్వకపోయినా ఆయన వద్ద ఈ వర్గాల నాయకులు ఎందుకు బానిసత్వం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవమానించిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముందుగా లేఖ రాసింది సీఎం జగన్ అని గుర్తించుకోవాలన్నారు. పవన్‌కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఓ పార్టీకి, రాష్ట్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నాడని మండిపడ్డారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్‌ను 2024లోనూ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు నమ్మకుండా ఎలా ఉంటారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
బడుగు, బలహీన వర్గాలను భుజానికెత్తుకున్న జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్, పురందేశ్వరి రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. ఒకప్పడు చంద్రబాబును ఛీకొట్టిన పురందేశ్వరి ఇప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి ప్రయత్నిస్తోందన్నారు. ఆమె బీజీపీ కండువా వేసుకుని టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్‌బాషా మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 600పైగా హామీల్లో ఒకటీ నెరవేర్చలేదని, అయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలోనే ముస్లిం మైనారిటీలకు సువర్ణ పాలన అందించిని ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. విశాఖ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ బీసీ మహిళకు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కట్టబెట్టారని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ సామాజిక సాధికారతకు కృషి చేస్తున్నారని చెప్పారు.
వైఎస్ జగన్‌ను 30 ఏళ్ల పాటు సీఎంను చేసుకుందాం
గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో పడిపోయిన గాజువాక హౌస్ కమిటీ సమస్యను సీఎం జగన్ త్వరితగతిన పరిష్కరించారని చెప్పారు. సీఎం జగన్‌ను 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన భవిష్యత్ తరాల భవిత బాగుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త కె.కె రాజు, మాజీ మంత్రి బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment