సభలో మాట్లాడుతున్న శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం
సాక్షి, అనకాపల్లి: పెందుర్తి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు శనివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన సునామీని తలపించింది. పెందుర్తి మండలం వేపగుంట జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ర్యాలీ సబ్బవరం మండలం మూడు రోడ్ల జంక్షన్‌లో బహిరంగ సభాస్థలి వరకూ భారీ ఎత్తున సాగింది. వేలాది ప్రజలు కడలిలా బస్సు యాత్రలో పాల్గొన్నారు. వందలాది బైక్‌లతో యువత ర్యాలీ చేశారు. యాత్ర ఆద్యంతం సామాజిక నినాదాన్ని హోరెత్తించారు.
పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.8 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రయోగశాల భవనాన్ని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి అమర్‌నాథ్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ప్రారంభించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించారు. రాష్ట్రంలోని అణగారిన వర్గాలను సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారో నేతలు వివరించినప్పుడు ప్రజలు ‘జై జగన్’ అంటూ పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్న సీఎం జగన్: స్పీకర్ సీతారాం
సామాజిక సాధికార సభలో స్పీకర్ తమ్మినేనీ సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్నారని చెప్పారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సాధికారిత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలవుతోందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 139 కులాలను గుర్తించి, 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, వాటిని చైర్మన్లు, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు.
ఆటో డ్రైవర్‌గా పనిచేసిన దళితుడైన నందిగం సురేష్ ను పార్లమెంట్‌కు, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారన్నారు. అభివృద్ధి జరగలేదని దుష్ప్రచారం చేస్తున్న వారికి రాష్ట్రంలో రూ.2.30 లక్షల కోట్ల సంక్షేమం కనబడలేదా అని ప్రశ్నించారు. చిరిగిన నిక్కరు, చిరిగిన పుస్తకాలతో పెచ్చులూడిన భవనాల్లో చదువుకునే పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ తరహా విద్య అందించడం, ఇంగ్లిష్ మీడియంలో బోధించడం అభివృద్ధి కాదా అని నిలదీశారు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టడం, తీరప్రాంత అభివృద్ధితో పాటు నూతన పోర్టులు, హార్బర్ల నిర్మాణం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు.
ఈ నాలున్నరేళ్లలో మీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన సీఎం జగన్‌కు రానున్న ఎన్నికల్లోనూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు తండోపతండాలుగా వస్తుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ఈ యాత్ర గురించి పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు.
జనమే జగన్ బలం: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నాలుగు ఉపముఖ్యమంత్రి పదవులు కల్పించి అక్కున చేర్చుకున్నారన్నారు. జనమే జగన్ బలమని, ఈ సైన్యం వైఎస్సార్‌సీపీ విజయసారథులని అన్నారు.
జగనన్న పాలనలో సామాజిక న్యాయం: ఎంపీ సురేష్
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్ రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేశారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఇది పెత్తందార్ల రాజ్యం కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజ్యమని చూపించారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం ఓ విప్లవమని, సాధికారతకు నిదర్శనమని అన్నారు.
పెందుర్తిలో రూ.2,162 కోట్లతో సంక్షేమం: ఎమ్మెల్యే అదీప్‌రాజ్
పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో పెందుర్తి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు రూ.2,162 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment