15వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం
సీఎం వైఎస్ జగన్ ముఖంలో ఎప్పటిలాగే అదే చిరునవ్వుతో కూడిన ఆత్మవిశ్వాసం
వచ్చిన ప్రతి ఒక్కరూ సీఎం జగన్ ఆరోగ్యంపైనే ఆరా
జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్ కుట్రేనన్న జనం
ఎవరెన్ని కుట్రలు చేసినా 175 స్థానాలు గెలిపించుకుంటామని హామీ
మండుటెండను సైతం లెక్కచేయక తరలివచ్చిన అవ్వాతాతలు, విద్యార్థులు
కిలోమీటర్ల కొద్దీ బస్సుయాత్ర వెంట యువకుల బైక్ ర్యాలీ
గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కిక్కిరిసిన కూడళ్లు
మధ్యాహ్నం నుంచే గుడివాడ బహిరంగ సభకు పోటెత్తిన ప్రజలు
కృష్ణాజిల్లాలో ముగించుకుని ఏలూరు జిల్లాలో ప్రవేశించిన బస్సుయాత్ర
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు.
అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.
అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి.
బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు.
స్వచ్ఛందంగా తరలివస్తున్న జనం..
ఉమామహేశ్వరం మీదుగా ముందుకు సాగిన జగన్‌ను చూసేందుకు ఇళ్లల్లో నుంచి వృద్ధులు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా పెరికీడుకు చేరుకున్న జగన్‌కు భారీ జనసందోహం బాణాసంచాతో స్వాగతం పలికారు. కానుమోలులో శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ (ఉయ్యూరు) నిర్వాహకులు, దివ్యాంగులతో వచ్చి జగన్‌ని కలిశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌ను అందించినందుకు వారు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మాట్లాడి ముందుకు సాగిన జగన్‌కు గ్రామస్తులు భారీగా వచ్చి ఘనస్వాగతం పలికారు.
ఆరుగొలనులో రహదారి కిక్కిరిసిపోయేలా అభిమానులు తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆరుగొలను ఆరోగ్యమాత ఆలయం వద్ద స్కడ్ హాట్ ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు జగన్ మావయ్యా అంటూ ఎదురొచ్చారు. వారిని దాటి వచ్చిన జగన్‌కు పుట్టగుంటలో దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురొచ్చిన వేద పండితులు జగన్‌ను ఆశీర్వదించారు. మ.3.30 గంటలకు జగన్నాథపురం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకున్న సీఎం జగన్ ప్రజాభిమానాన్ని దాటుకుంటూ సా.5.38 గంటలకు గుడివాడ బహిరంగ సభకు చేరుకున్నారు.
మధ్యాహ్నం నుంచే బహిరంగ సభకు జనం పోటెత్తడంతో సభా ప్రాంగణం జన సునామీని తలపించింది. ఆ అశేష జనవాహినినుద్దేశించి జగన్ ప్రసంగించారు. సభ అనంతరం 6.40 కి బస్సుయాత్ర తిరిగి ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ హైవే మీదుగా కలపర్రు టోల్‌ప్లాజా చేరుకుంది. ఏలూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు, బాణాసంచా వెలుగులతో ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబు, పవన్ కుట్ర అది..
ఇక జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కుట్రేనని బస్సుయాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ నినదించారు. వాళ్లే వేయించారని, రాళ్లు పెట్టికొట్టండి పగోడు వస్తున్నాడు అని ఆ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రెచ్చగొట్టారని దుమ్మెత్తిపోశారు. ‘రాళ్లుపెట్టి కొట్టండి అని చంద్రబాబు అన్నాడు. నీకు దమ్ముంటే గెలిపించుకో, నీకు దమ్ముంటే పథకాలివ్వు. నీ దగ్గర శక్తి ఉంటే జనం మనస్సులు గెలుచుకో. కానీ, నువ్వు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు. జనానికి సున్నా చుట్టావు. నిన్నెలా నమ్ముతారు చంద్రబాబు.. అంటూ జనం సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేదని, అన్యాయమే చేశాడని, 175 సీట్లు జగన్‌కే వస్తాయి.. చంద్రబాబుకు ఒక్క సీటు కూడా రాదని ముక్తకంఠంతో చెప్పారు.
ఏలూరు జిల్లాలో ఎగిసిన అభిమాన సంద్రం
బస్సుయాత్ర కలపర్రు టోల్‌గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు బాణాసంచాతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు ఏర్పాటుచేసి మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. పొద్దుపోయినా జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. బస్సు పైకెక్కి వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ఏలూరు క్రాస్ నుంచి భీమడోలు మీదుగా యాత్ర కదిలింది. కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు.
ఒక పోలీస్ వాహనాన్ని (కాన్వాయ్ వాహనం కాదు) బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. సీఎం బస్సును ఆపి, ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్లో ఉంచిన అంబులెన్స్ ద్వారానే క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముందుకు సాగిన సీఎం జగన్ చేబ్రోలు మీదుగా నారాయణపురం బస ప్రాంతానికి రాత్రి 9.55 నిమిషాలకు చేరుకున్నారు. యాత్ర మొత్తం జగన్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలు మీకు తోడుగా మేమున్నామంటూ ఆశీర్వదించంతో 15వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది.
మొదటి ఓటు జగన్ మామకే..
ఫస్ట్‌టైమ్ ఓటు వేస్తున్నాను. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జగన్ వంటి మంచి వ్యక్తికి ఓటు వేయడమనేది చాలా గర్వంగా ఉంది. జగన్ మామకే ఓటు వేయాలనుకుంటున్నా. మంచి పథకాలిచ్చి జనానికి మంచి చేస్తున్నారు. అందుకోసమైనా గెలిపించుకోవడానికి ఆయనకే ఓటు వేస్తా. మంచిచేసే వ్యక్తిని కావాలని కోరుకుంటాంగానీ తప్పుడు పనులు చేసేవాళ్లకు వేయం కదా.
ఇంతకుముందు పాలనలో పేదోడు అయితే బాగుపడింది లేదు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. మంచి గెలవాలి అంటే మనమంతా కలిసి గెలిపించుకోవాలి.. చెడు రాజకీయం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో విద్యార్థులే ఎక్కువ.. అన్నయ్య గెలుపు కూడా విద్యార్థులతోనే మొదలవుతుంది.– కమలాకర్, విద్యార్థి
జగనే మళ్లీ సీఎంగా రావాలి..
జగనన్న స్థలం ఇచ్చాడు.. ఇళ్లు కట్టించాడు. మగ్గం డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాడు. నాకు మగ్గంతో ఇంట్లో ఇరుకుగా ఉండేది. ఇల్లు ఇరుకుగా ఉండటంతో మగ్గాన్ని షెడ్డులో తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు మాకు బాగుంది. కాబట్టి మళ్లీ జగనన్నే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. – బత్తూరి పద్మావతి, మంగళగిరి
టీడీపీ హయాంలో నరకయాతన
టీడీపీ ప్రభుత్వంలో చాలా యాతన పడ్డాం.. వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్‌ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. మా అమ్మ ఆఫీస్ చుట్టూ తిరగలేకపోయేది. మేం వెళ్తుంటే పెన్షన్ మాకు ఇచ్చేవారు కాదు. ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేని, లేవలేని మనిషి.. వాళ్ల అమ్మాయికివ్వండి అని ఎంతమంది చెప్పినా ఇవ్వలేదు.
జగనన్న మాకు స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. మేం ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించిన వాళ్లు, అలా అనుగ్రహించి చూసిన వాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టిన వాడిలా మాకు సహాయం చేశాడు. మళ్లీ మళ్లీ జగనే రావాలని మేం కోరుకుంటున్నాం. – కందుకూరి కల్పన, ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు
సూరీడు నిప్పులు చెరుగుతున్నా..
ఎర్రని సూరీడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా జగన్ బస్సుపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. చినఅవుటపల్లి వద్దకు రాగానే అక్కడ మహిళలు జగన్‌కు ఎదురొచ్చారు. వారిని జననేత పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. హైవే బైపాస్‌వల్ల జాతీయ రహదారితో కనెక్షన్ కోల్పోయిన చినవాడిపల్లికి న్యాయం చేయాలంటూ ఆ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగంపల్లి నేలవేణి సాయం చేయమని సీఎంను కోరారు. ఆమెకు భరోసా ఇచ్చి జగన్ ముందుకు కదిలారు.
మరికొంత దూరం రాగానే పెదఅవుటపల్లి క్రాస్ వద్ద తనను చూసేందుకు పరుగుపరుగున వచ్చిన ప్రజలను చూసి జగన్ బస్సును ఆపించి వారితో మాట్లాడారు. సుభాషిణి అనే మహిళ తన అన్న బాలశౌరి ఆరోగ్యంపై వినతిపత్రం అందజేశారు. ఆత్కూరులో అభిమానులు జగన్‌కు వైఎస్సార్‌సీపీ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి మహిళల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పొట్టిపాడు టోల్‌గేట్ దాటగానే మహిళలు హైవేపై బంతిపూలతో వైఎస్సార్‌సీపీ అని రాసి స్వాగతం పలికారు. తేలప్రోలు వద్ద అభిమానుల స్వాగతాన్నందుకుని జగన్ ముందుకొచ్చారు. కోడూరుపాడు వద్ద మహిళలు, రైతులను జగన్ పలకరించారు. వీరవల్లి హైస్కూల్ బాలికలు జగన్ మావయ్యకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారితో జగన్ కాసేపు ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment