స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు
చుట్టూ ఎత్తైన కొండలు.. పక్కనే పారుతున్న సీతవాగు.. దాని మీద నుంచి వస్తున్న చల్లని గాలి.. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత మధ్య ఐ.పోలవరం కొండల్లో దివ్యమంగళ రూపంలో కనులపండువగా దర్శనమిస్తున్న కోనేటిరాయుడిని చూసినంతనే భక్తులు అలౌకికానందం పొందుతున్నారు. తిరుమలలో తనివి తీరా స్వామిని దర్శించలేని వారు అదే తరహాలో కొలువైన చూడచక్కని శ్రీనివాసుడిని కనులారా కావలసినంత సేపు చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఈ ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
రంపచోడవరం: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరం వద్ద సీతపల్లి వాగు పక్కన కొండపై వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించింది. గత ఏడాది మేలో అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆలయాన్ని ప్రారంభించారు. టీటీడీ ప్రధాన అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉండడంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు.
సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు...
తిరుమలలో మాదిరిగా ఇక్కడ ప్రతి రోజు స్వామి వారికి అన్ని సేవలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. సుమారు అరగంట పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఎనిమిది గంటల వరకు సర్వదర్శనం. తరువాత ప్రాతః కాల ఆరాధన (మొదటి నైవేద్యం), సహస్రనామార్చన 9.30 వరకు నిర్వహిస్తారు. సర్వదర్శనం 12 గంటల వరకు ఉంటుంది. శుద్ధి, మధ్యాహ్న కాల ఆరాధన (రెండవ నైవేద్యం), అష్టోత్తర శతనామార్చన ఒంటి గంట వరకు జరుగుతాయి. ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సర్వ దర్శనం ఉంటుంది.
సాయంత్రం మూడో నైవేద్యం, అష్టోత్తర శతనామార్చన ఏడు గంటల వరకు నిర్వహిస్తారు. తరువాత 45 నిమిషాల పాటు సర్వదర్శనం భక్తులకు అవకాశం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఏకాంత సేవతో స్వామి సేవలు ముగుస్తాయి. ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు స్వామి నేత్ర దర్శనం, శుక్రవారం అభిషేకం, ఆదివారం గరుడాళ్వార్‌కు అభిషేకం జరుగుతాయి. నవంబరు, డిసెంబరు, జనవరి నెలలకు సంబంధించి స్వామి హుండీ లెక్కింపు జరిగింది. హుండీ ఆదాయం రూ. 5 లక్షలు వచ్చింది. ప్రతి రోజు స్వామి సేవలకు టీటీడీ ఆలయ అర్చకులను నియమించింది.
తిరుమలలో దర్శించుకున్నట్టే..
స్వామి దర్శనం నేత్ర పర్వంగా ఉంది. తిరుపతిలో వేంకటేశ్వరస్వామిని చూసినట్టే ఉంది. కొండల నడుమ ఎంతో సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. వచ్చిన భక్తులకు అన్నసమారాధన కోసం నా వంతు సహాయం చేస్తున్నాను.
– గురు ప్రసాద్, రాజమహేంద్రవరం
మూడు రోజులు అన్నసమారాధన
వారంలో మూడు రోజుల పాటు భక్తుల సహకారంతో ఆలయం వద్ద అన్నసమారాధన నిర్వహిస్తున్నాం. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛందంగా పనులు నిర్వహిస్తున్నాం.
– నల్లమిల్లి వెంకటరామారెడ్డి, ధర్మప్రచార సేవా భక్త మండలి కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment