జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సాగిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
22 రోజుల్లో 23 జిల్లాలు..
86 నియోజకవర్గాలు
2,188 కి.మీలు
9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు
మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మియ స్వాగతం
మంచి చేసిన మిమ్మల్ని మళ్లీ సీఎంగా చేసుకుంటామని భరోసా
విజయవాడలో టీడీపీ మూక హత్యాయత్నం.. వెరవక యాత్ర కొనసాగింపు
టీడీపీ నేతల దాష్టికంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం..
జాగ్రత్తగా ఉండండి అన్నా.. అంటూ బాసటగా నిలిచిన ప్రజలు
యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిందంటోన్న పరిశీలకులు
పోటీ ఏకపక్షమే.. వైఎస్సార్‌సీపీ విజయం లాంఛనమేనంటూ విశ్లేషణలు
తీవ్ర నిరాశ, నిస్పృహల్లో బాబు, పవన్
నిన్ను చూడటానికే వచ్చానన్నా..
బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద ఏప్రిల్ 10న మధ్యాహ్నం 1.30 గంటలకు 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో సీఎం జగన్‌ను చూసేందుకు వేల్చూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపాలెంకు చెందిన వెంకాయమ్మ పరుగెత్తుకొస్తోంది. మధ్యలో చెప్పులు తెగిపోయినా లెక్క చేయకుండా తారు రోడ్డుపై ఉత్త కాళ్లతోనే పరుగులు తీస్తున్న ఆమెను చూసిన సీఎం జగన్.. బస్సు ఆపించారు. ఆమెను దగ్గరికి పిలిచారు. ‘ఏం తల్లీ బాగున్నావా? ఏమైనా సమస్య ఉందా..’ అంటూ ఆత్మియంగా పలకరించారు. ‘జగనన్నా.. నీ పాలనలో నాకు ఎలాంటి సమస్య లేదు. నిన్ను దగ్గరి నుంచి చూద్దామని, పలకరిద్దామనే వచ్చా’ అని చెబుతూ మురిసిపోయింది.
► కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంటకు ఒక కిలోమీటరు దూరంలో ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మండుతున్న ఎండలో సీఎం జగన్‌ను చూసేందుకు పొలాల వెంట 20–25 మంది మహిళలు పరుగులు పెడుతూ వస్తున్నారు. ఇది గమనించిన సీఎం జగన్ బస్సు నుంచి కిందకు దిగారు. మహిళలంతా సీఎం జగన్ చుట్టూ చేరారు. ‘విజయవాడలో మీపై రాయితో దాడి చేశారని తెలిసి తల్లడిల్లిపోయాం. మంచి చేసిన మిమ్మల్ని ప్రజలంతా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే అక్కసుతో టీడీపీ వాళ్లు మీపై దాడి చేయించారు.. జాగ్రత్తగా ఉండు జగనన్నా.. మీరు బాగుంటేనే మేం బాగుంటాం’ అంటూ తోడబుట్టిన అన్నగా భావిస్తూ పరామర్శించారు.
► కాకినాడ జిల్లా సామర్లకోట ముఖ ద్వారం వద్ద ఏప్రిల్ 19న మధ్యాహ్నం ఒంటి గంటకు మండే ఎండలో వేలాది మంది మహిళలు రోడ్డుపై నిలబడ్డారు. సీఎం జగన్ బస్సు అక్కడకు రాగానే మహిళలు హర్షధ్వానాలు చేశారు. బస్సు దిగిన సీఎం జగన్.. వారితో ముచ్చటించారు. ‘జగనన్నా.. మీరు మాకు మంచి చేశారు. మేం మళ్లీ మిమ్మల్ని గెలిపించుకుని సీఎంగా చేసుకుంటాం’ అంటూ భరోసా ఇచ్చారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసి.. హారతులు ఇచ్చి దీవించారు.
► వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఆత్మియత, అనుంబంధాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలు అడుగడుగునా కన్పించాయి. ఇలాంటి దృశ్యాలు రాజకీయాల్లో అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాటపై నిలబడి.. నిబద్ధత, నిజాయితీతో పని చేసే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనడానికి సీఎం జగన్ బస్సు యాత్రే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.
బస్సు యాత్ర సాగినంత దూరం.. మండుటెండైనా అర్ధరాత్రయినా లెక్క చేయకుండా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకు మానవ హారంగా ఏర్పడి సీఎం జగన్‌కు నీరాజనాలు పలకడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. ‘ఫలానా పనులు చేస్తాం.. మాకు ఓటేయండి’ అని రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు అడగడం సాధారణమని, కానీ.. ‘జగనన్నా.. మీరు మంచి చేశారు.. మిమ్మల్ని మళ్లీ గెలిపించి సీఎంగా చేసుకుంటాం’ అని ప్రజలు అడుగడుగునా భరోసా ఇస్తుండటం చరిత్రలో తామెన్నడూ చూడలేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. –మరిన్ని వివరాలు ఐఐఐలో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 22 రోజుల పాటు సాగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్‌ను చూసేందుకు ఆద్యంతం జనం ప్రభంజనంలా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ఆరంభించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సమీపంలో అక్కవరం బహిరంగ సభతో పాదయాత్రను ముగించారు. 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీల దూరం బస్సు యాత్ర సాగింది.
యాత్రలో 16 భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. వివిధ వర్గాల ప్రజలతో ఆరు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర తొమ్మిది ప్రాంతాల్లో భారీ రోడ్ షోలు నిర్వహించారు. బస్సు యాత్ర ప్రారంభమైన ఇడుపులపాయ నుంచి ఈనెల 13న విజయవాడలో జరిగిన రోడ్ షో వరకూ యాత్ర సాగినంత దూరం కెరటాల్లా జనం పోటెత్తారు. విజయవాడలో లక్షలాది మంది ప్రజలు రోడ్ షోలో సీఎం జగన్‌కు నీరాజనం పలుకుతుండడం చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పదునైన రాయితో గురిపెట్టి కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
విజయవాడ నుంచి సునామీలా పోటెత్తిన జనం
విజయవాడలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత.. వైద్యుల సలహా మేరకు ఈనెల 14న విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్ ఈ నెల 15 నుంచి యాత్రను కొనసాగించారు. సీఎం జగన్‌పై టీడీపీ నేతలు హత్యాయత్నానికి తెగబడటంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈనెల 15 నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు సునామీలా జనం పోటెత్తి సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో దారి పొడవునా జనం బారులు తీరి సీఎం జగన్‌కు మద్దతు తెలిపారు.
రాజమహేంద్రవరంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది ప్రజలు కదలిరావడం కూటమి వెన్నులో వణుకు పుట్టించింది. ఇక విశాఖపట్నంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది జనం పోటెత్తడంతో కూటమి వణికిపోయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు.
ఘోర పరాజయం భయంతో వణికిపోతున్న టీడీపీ
సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు లక్షలాది మంది పోటెత్తడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. టీడీపీ–జనసేన జత కలిశాక తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక చిలకలూరిపేటకు ప్రధానిని రప్పించి నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమి ఆందోళన చెందింది.
ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకు.. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా జనం నీరాజనాలు పలికారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 సభలకు లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోలు అతి పెద్ద మానవ హారంగా నిలిచిపోతాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన సభలకు.. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి వారిద్దరూ నిర్వహించిన సభలకు జనం రాకపోవడంతో ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి ఆ నేతలు వచ్చేశారు. తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీఎం జగన్‌పై దూషణలకు దిగుతూ, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడాలని ఆ పారీ్టల కార్యకర్తలను రెచ్చగొడుతుండటమే అందుకు తార్కాణం.
సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందని, ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్‌సీపీ విజయం లాంఛనమేనని తేల్చి రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరడం.. వేలాది మంది క్రియాశీలక కార్యకర్తలు వారి బాటనే అనుసరించడంతో ఆ పార్టీ నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. ఘోర పరాభవం తప్పదనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేన అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్‌పై దూషణలకు దిగుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment