చంద్రబాబు వాడుకుని వదిలేసే జాబితాలో మరో నేత చేరారా? ఉత్తరాంధ్రకు చెందిన ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండిస్తున్నారా? నాలుగేళ్ల పాటు ఆయన్ను పొలిటికల్‌గా వాడుకుని ఇప్పుడు సీటు లేదంటున్నారా? చంద్రబాబు చేసిన మోసంతో ఆ నాయకుడికి రాజకీయంగా జ్ఞానోదయం కలిగిందా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయనకు చంద్రబాబు చేసిన ద్రోహం ఏంటి?
అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి తగిన శాస్తి జరిగిందనే చర్చ తెలుగుదేశంలో జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా ఎలాగైనా వాడుకోగలడనే విషయం ఆ పార్టీ వాళ్ళందరికీ బాగానే తెలుసు. గడచిన నాలుగేళ్లుగా అయ్యన్నతో అధికార పార్టీ మీద అడ్డగోలు విమర్శలు చేయించారు. అయ్యన్నను అడ్డుపెట్టుకుని బీసీల మీద జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చారు.
తన రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అయ్యన్న కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఇష్టారీతిన రెచ్చిపోయారు. చంద్రబాబు మాట విని ప్రభుత్వం మీద రెచ్చిపోతే తనకు ఎమ్మెల్యే సీటు, తన కొడుక్కి ఎంపీ సీటు వస్తుందని ఆశపడ్డారు. అయితే అయ్యన్న కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదు. కేవలం ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకోవాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందనే సాకుతో అయ్యన్న కుటుంబానికి ఎంపీ సీటు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తీరుతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి అయ్యన్న బెంగ పెట్టుకున్నారు.
అయ్యన్న కుమారుడికి సీటు ఇచ్చేదిలేదని చెప్పడమే గాకుండా..ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజ్ అయిందనే వాదనను చంద్రబాబు తెరపైకి తీసుకువస్తున్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు మాటలు విని ఒళ్ళు మరిచి ఇష్టానుసారంగా రెచ్చి పోయిన అయ్యన్నకు ఇప్పుడు అసలు విషయం బోధపడుతోంది. చంద్రబాబు తన రాక్షస క్రీడలో తనను బలి పశువును చేశారనే విషయం అయ్యన్నకు అర్థమైంది.
తన రాజకీయ ప్రత్యార్థులైన గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తితో కలిసి చంద్రబాబు తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడని వారికి పెద్దపీట వేస్తూ తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎర్రన్నాయుడు ఇంట్లో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానికి సీట్లు ఇవ్వడంతో పాటు రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని.. అదే తన ఇంట్లో తనకూ తన కుమారునికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు మాత్రం పార్టీలో ఉన్న బీసీలను అవసరానికి వాడుకొని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు.. సీఎం జగన్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని, చంద్రబాబు మాత్రం మాట ఇస్తే నిలబెట్టుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా?
గత ఎన్నికల్లో ఎంతోమంది యువకులకు సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా అవకాశాలు కల్పించారని..చంద్రబాబు మాత్రం ఎంపీ సీటు ఇస్తానని చెప్పి తమను మోసం చేశారని, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అయ్యన్న రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారునికి సీటు ఇవ్వకపోతే చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు మాటలు విని నాలుగేళ్లపాటు ఇస్టానుసారంగా రెచ్చిపోయిన అయ్యన్నకు తగిన శాస్తి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment