ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన తెలంగాణ నేత వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వైఎస్ఆర్ అభిమానులలో తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ అంటే ఇష్టపడేవారి హృదయాలను ఆమె గాయపరిచేలా మాట్లాడుతున్నారు. తన అన్న తనకేదో అన్యాయం చేశారన్న భావన వచ్చేలా ప్రజలకు సంకేతం ఇస్తున్నారు.
షర్మిల ప్రసంగాలు తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి మొదటి పేజీ వార్తలుగా ఉపయోగపడుతున్నాయి తప్ప, ఆమెకు దీనివల్ల ప్రత్యేకంగా కలిసి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వపరంగా ఆమె చేస్తున్న విమర్శలు అవగాహనా రాహిత్యానికి దర్పణం పడుతుంటే, సీఎం జగన్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని చెప్పాలి.
రాజకీయాలలో ఆమె ఏ పార్టీలో అయినా చేరవచ్చు అది ఆమె ఇష్టం. కానీ, కుటుంబ విషయాలను, రాజకీయాలను కలగలిపి మాట్లాడడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి ఏజెంట్లుగా ఉన్న రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి కళ్లలో ఆనందం చూడడానికే అయితే మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు.
షర్మిల, ఆమె భర్త అనిల్ ఇద్దరిని రాజకీయంగా వీరంతా కలిసి వాడుకుని వదలివేస్తారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. షర్మిల స్టేట్‌మెంట్ల వల్ల కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆనందపడుతున్నట్లు లేదు. వారెవరూ పెద్దగా స్పందించడం లేదు. కానీ, టీడీపీ, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెగ ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేస్తున్నాయి. దీనిని బట్టే ఆమె ఎవరికి సేవ చేస్తున్నది అనే విషయం తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్లో రాజ్ దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ జవాబిస్తూ కాంగ్రెస్ పార్టీకి డర్టీ రాజకీయాలు అలవాటేనని, రాష్ట్రాన్ని దారుణంగా విభజించిందని, అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజిస్తోందని అన్నారు. గతంలో తన బాబాయి వివేకానందరెడ్డిని వేరుచేసి తమకు వ్యతిరేకంగా పోటీ చేయించిందని, ఇప్పుడు తమ చెల్లిని విడదీసిందని తప్పుపట్టారు. అంతే తప్ప వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ, షర్మిల మాత్రం తమ కుటుంబం విడిపోవడానికి జగనన్న కారణమని ఆరోపించారు. అందుకు సాక్ష్యం తను, తన తల్లి అని ఆమె వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం చేసిన ఫర్వాలేదని, కాని రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
తద్వారా తనకేదో అన్యాయం జరిగినట్లు చెప్పడానికి యత్నించారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ షర్మిలకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాలని కోరారు. ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన బదులు ఇచ్చారే తప్ప, షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా హుందాగా వ్యవహరించారు. షర్మిల తనకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పలేకపోయారు కాని, పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఇక అభివృద్ది జరగలేదని ఆమె చెబుతున్న అబద్దాలకు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారానికి తేడా లేకుండా పోయింది.
ఆమె అబద్దాలను వైఎస్ జగన్ అబిమానులు తీవ్రంగా ఖండిస్తూ, ఏపీలో ఎక్కడికక్కడ జరిగిన అభివృద్ది పనుల వద్దకు వెళ్లి వీడియో తీసి షర్మిల చూడాలని చెబుతూ యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఉదాహరణకు జగన్ అభిమాని ఒకరు విజయవాడ కృష్ణానది కరకట్ట వద్దకు వెళ్లి అక్కడ జగన్ ప్రభుత్వం నిర్మించిన భారీ రిటైనింగ్ వాల్ చూపించి, దీనిని అభివృద్ది కాదంటారా అని తీవ్రంగా ప్రశ్నించారు. షర్మిల ఇక్కడకు వచ్చి చూడాలని ఆయన సవాల్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో పూర్తి చేసిన వంతెనలపై తిరుగుతూ వీడియోలు తీసి షర్మిలకు తెలియచేయాలని తలపెట్టారు.
బాగు పడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు, తీర ప్రాంతంలో నిర్మాణంలో ఓడరేవులు, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొదలైన వాటిని షర్మిల చూడాలని అంటున్నారు. షర్మిల శ్రీకాకుళం జిల్లాకు కూడా వెళ్లారు. అక్కడ పలాస వద్ద ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రభుత్వం నిర్మించిన సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, 800 గ్రామాలకు ఉపయోగపడే మంచినీటి ప్రాజెక్టును చూసి ఉంటే అభివృద్ది ఎలా జరుగుతోందో తెలుసుకునే అవకాశం ఉండేది. నిజానికి వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని, సీఎం జగన్ మాత్రం తన తండ్రి పేరును గొప్పగా నిలబెడుతున్నారని వైఎస్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీ మాయలో ఉన్న షర్మిలకు ఇవేవీ కనిపించడం లేదు. షర్మిల మరో ఆరోపణ కూడా చేశారు. సీఎం జగన్ తనను నమ్మినవారిని ముంచారని పిచ్చి ఆరోపణ చేశారు. తనకోసం రాజీనామా చేసిన వారికి మంత్రి పదవులు ఇవ్వలేదని తెలిసి, తెలియని ఆరోపణ చేశారు. నిజానికి జగన్ తన వెంట 2011 నుంచి ఉన్నవారిలో తొంభైఐదు శాతం మందికి ఏదో విధంగా పదవులు వచ్చేలా చేశారు. ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని, రోజా, అంబటి రాంబాబు మొదలైనవారికి మంత్రి పదవులు ఇచ్చారు. కాకపోతే పరిమితులను బట్టి కొందరికి ముందు, మరికొందరికి వెనుకా పదవులు ఇచ్చారు.
పలువురికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చారు. అంతేకాదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నివేల మందికి కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర పదవులు ఇచ్చి అందరిని సంతృప్తి పరచే యత్నం చేశారు. కానీ, షర్మిల ఏమి చేశారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పెడతానని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులందరిని పిలిచి, వారిని పార్టీలోకి తెచ్చి, తదుపరి వారితో చెప్పాపెట్టకుండా పార్టీని ఎత్తివేశారు. ఏ కాంగ్రెస్‌పై ఉమ్ము వేయాలని వైఎస్ చెప్పి ఉండేవారని ఆమె అన్నారో, అదే కాంగ్రెస్‌లో ఆమె తన పార్టీని విలీనం చేసి వైఎస్ అభిమానులందరిని షాక్‌కు గురి చేశారు.
ఆమె పార్టీలో చేరి కొంత మంది కోట్ల రూపాయలు చేతి చమురు వదిలించుకుని అప్పుల పాలయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెతో పాటు వైఎస్సార్‌టీపీలో పనిచేసిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి ఓపెన్‌గా చెప్పారు. షర్మిల అహంకారంతో, ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. షర్మిల భర్త అనిల్ మరికొందరితో కలిసి సీఎం జగన్ నుంచి ప్రభుత్వపరంగా అనుచిత లబ్ది పొందాలని చూశారని, దానికి జగన్ అంగీకరించలేదని ఆయన నిర్మొహమాటంగా తెలిపారు.
ఆ కారణంతోనే ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా మారారని ఆయన వెల్లడించారు. అక్రమ కేసులలో జగన్ అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు తనకు తానే పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించుకున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం జగన్‌పై షర్మిల ఆరోపణలు చేయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. ఈ విషయంలో విజయమ్మ కూడా షర్మిల తీరుపై బాధ పడుతుంటారని కూడా రాఘవరెడ్డి పేర్కొన్నారు.
ఆయన మాట్లాడిన విషయాల వీడియోలను లక్షల సంఖ్యలో ఆసక్తిగా గమనిస్తున్నారంటేనే ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజలలో ఎంత అభిమానం ఉందన్నది అర్ధం అవుతుంది. అలాగే షర్మిల మాటలను వారెవ్వరు అంగీకరించడం లేదని తెలుస్తుంది. రాఘవరెడ్డి వ్యాఖ్యలపై స్పందించినా ఆమె ఆత్మరక్షణలో పడినట్లు అనిపిస్తుంది. విజయమ్మతో ఈ విషయాలు చెప్పించాలని అన్నారట. ఆ పని చేయవలసిన అవసరం రాఘవరెడ్డికి ఏమి ఉంటుంది. పైగా కొద్ది రోజుల క్రితమే విజయమ్మ ఇడుపుల పాయలో సీఎం జగన్ పట్ల ఎంత అప్యాయంగా వ్యవహరించింది అందరూ చూశారు.
ఈ ఘటనలతో విజయమ్మ బాధపడుతుండవచ్చు. కానీ, షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆమె కూడా సమర్ధించారనే అంతా అనుకుంటున్నారు. అందువల్ల షర్మిల ఇప్పటికైనా అనవసర వ్యర్ధ ప్రసంగాలుమాని ,రాజకీయంగా తనకు తోచిన నాలుగు మాటలు చెప్పుకుని తిరిగితే మంచిది. ఏపీలో షర్మిల పర్యటనలు చేసినా కాంగ్రెస్‌కు ప్రయోజనమేమీ ఉండదు. కాకపోతే ముఖ్యమంత్రి జగన్‌కు నష్టం చేయాలన్న దుష్ట తలంపుతో కాంగ్రెస్ పార్టీ ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకు వచ్చింది.
ఏపీలో కాంగ్రెస్‌కు ఎవరూ నేతలే లేనట్లు, ఇక్కడ ఉన్న నేతలందరిని చెత్తబుట్టలోకి విసిరేసి, తెలంగాణ నుంచి షర్మిలను తీసుకురావడం ఒక రకంగా ఏపీ ప్రజలను సోనియాగాందీ మరోసారి అవమానించడమే అనిపిస్తుంది. ఇదంతా తెలుగుదేశంతో ఉన్న రహస్య అవగాహన తప్ప మరొకటి కాకపోవచ్చు. ఈ చదరంగంలో షర్మిల పావుగా మిగిలిపోవడం తప్ప సీఎం జగన్‌కు జరిగే నష్టం ఏమీ ఉండదని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు.
Comments
Please login to add a commentAdd a comment