ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు.. ప్రజాసైన్యంతో ఎన్నికల రణ రంగంలోకి దూకితే ఎలా ఉంటుందో చూడాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలను చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జన సామాన్యంతో చేయి చేయి కలిపి సాగుతున్న ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని అంచనా.
ఐదేళ్లూ తమను కాపుకాసిన నాయకుడి కోసం ప్రజలు దూరాభారాలు లెక్క చేయడం లేదు.. మలమల మాడ్చే ఎండలనూ పట్టించుకోవడం లేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి అభిమాన నేతను కళ్ల నిండా చూసుకోవాలన్న ప్రజల తాపత్రయం అడుగడుగునా ప్రస్ఫుటంగా కనిపిస్తూంటుంది ఈ యాత్ర పొడవునా!.
వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని ఇడుపలపాయలో గత నెల 26న మొదలైన యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను దాటుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. రాయలసీమ మొత్తం భానుడి భగభగలను సైతం తట్టుకుని అభిమాన జన సముద్రం సీఎం జగన్ వెంట ఒక ప్రవాహంలా కదిలింది. బస్సు యాత్ర రోజూ ఉదయమే ప్రారంభం కావాల్సి ఉండగా.. తెల్లవారుతూండగానే పరిసరాల్లోని అభిమాన గణం ముఖ్యమంత్రి జగన్ బస చేసిన టెంట్ దగ్గరకు చేరిపోతున్నారు.
ఒక్కసారి కళ్లారా చూసేందుకు పోటీపడుతున్నారు. వారి అభిమానానికి ఆకలిదప్పులూ భయంతో దూరమైపోయాయి. గొంతు తడారిపోతున్నా.. శరీరం చెమటతో తడిసి ముద్దవుతున్నా.. సీఎం వైఎస్ జగన్‌పై వారి అభిమానం అణువంత కూడా తగ్గలేదు. చిక్కటి చిరునవ్వుతో టెంట్ నుంచి బయటకొచ్చే జగన్‌ను చూసుకున్న తరువాతే వారు ముందుకు కదులుతున్నారు. జై జగన్ అంటూ నినదిస్తూ బస్సుయాత్రతో మమేకమై పోతున్నారు.
అందరిలో ఒకడిగా..
‘మేమంతా సిద్ధం’ యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో కలుస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బస దగ్గరికి వచ్చిన వారందరినీ పలుకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్న తరువాత మాత్రమే సీఎం జగన్ యాత్రను చేపడుతూండటం గమనార్హం. తమ కష్టాలు తీర్చిన నేతకు కృతజ్ఞత చెప్పాలని వచ్చిన వారు ఏ ఒక్కరినీ నిరాశ పరచరాదన్నదే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ జన సందోహంలోనే ఎవరైనా తమ కష్టాలు చెప్పుకునేందుకు ముందుకొస్తే వారి బాధను ఆసాంతం వినడం మాత్రమే కాదు.. అక్కడికక్కడే ఆ సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు, సూచనలు చేసేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఈ క్రమంలో చాలా సందర్భాల్లో సీఎం జగన్‌తో ఫొటో దిగేందుకు ప్రజలు, అభిమానులు పట్టుబట్టడం వారి అభిమానానికి, పట్టుదలకు ముఖ్యమంత్రి సైతం చాలాసార్లు ఓడిపోతున్నారు కూడా. అడిగిన వారందరితో సెల్ఫీలు దిగిన తరువాతే ముందుకు కదులుతున్నారు.
గ్రామ గ్రామాన నీరాజనం..
రాజు వెడలె రవితేజములు అలరగ అన్న పద్యం గుర్తుకొస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రను చూసిన వారికి. బస్సు ముందు వెనుకల జెండాలతో అభిమాన గణం.. గ్రామ గ్రామాన బస్సు యాత్రకు మిద్దెలెక్కి, చెట్లు ఎక్కి వేచి చూస్తున్న జనం.. ఇదీ జగన్ ‘మేమంత సిద్ధం’ యాతరంలో ప్రతి దినం ఆవిషృతమవుతున్న దృశ్యం. బస్సు దగ్గరకు రాగానే ఆడా మగా తేడా లేకుండా అందరూ చుట్టుముట్టడం. పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలకడమన్న అపురూపమైన దృశ్యాలు మన మనస్సుల్లో నిలిచిపోతాయి.
గ్రామంలో రోడ్ల వెంబడి కదం తొక్కుతున్న వారిని ‘ఎందుకింత అభిమానం’ అని అడిగితే ఠక్కున వచ్చే సమాధానం.. ‘ఆయన మాకు చేసిన దాంతో పోలిస్తే ఇదెంత’ అని!. యాత్రలో మరో అధ్బుతమైన ఘట్టం.. ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ మాటామంతి. గ్రామాల్లో ప్రజలతో కలిసి సంక్షేమ పథకాలపై చేస్తున్న సమీక్ష ఐదేళ్లలో గ్రామానికి జరిగిన మంచిని ముఖ్యమంత్రి అంకెలతో సహా వివరిస్తున్నప్పుడు గ్రామస్తులు తమ కృతజ్ఞతను వెలిబుచ్చే తీరు కూడా అద్భుతం.
జనమే స్టార్ క్యాంపెయినర్లు..
బస్సు యాత్రలో చివరి అంకం బహిరంగ సభ. రోజూ జరిగే ఈ సమావేవం కోసం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన జనాలకు నిర్వహకులు చేసిన ఏర్పాట్లు ఏమాత్రం చాలని పరిస్థితి. ఇక సీఎం బస్సు సభా ప్రాంగణానికి రాగానే రణ నినాదంలా జై జగన్ నినాదం వినిపిస్తుంది. ముఖ్యమంత్రి స్టేజీ మీద నుంచి ర్యాంప్‌పై నడుస్తుంటే జనాలు ఉర్రూతలూగిపోతున్నారు. అభిమానుల కేరింతలు.. ఈలలు, కరతాళ ధ్వనులు.. నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణం ఏర్పడిపోతోంది. జగన్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి ప్రతీ మాటకు జనం నుంచి అదే స్థాయిలో రియాక్షన్. అది రాజకీయ స్పీచ్ కాదు.. జుగల్బందీలా కొనసాగే డిస్కషన్.
ఉదయం నుంచి ఎదురుచూసిన జనానికి సీఎం జగన్ మాట్లాడిన మాటలు టానిక్‌గా ఉంటాయి. సభ పూర్తయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను తమ ఊరికి మోసుకెళ్తారు. అక్కడ సభ గురించి చర్చపెడతారు. సీఎం జగన్ చెప్పినట్లు వారే స్టార్ క్యాంపేనర్లుగా పథకాలను ప్రజలకు వివరిస్తారు. ఆయనపై జరిగే కుట్రలను ప్రజాకోర్టులో ఎండగడతారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. ఎన్నికల యాత్ర కాదు. రాజకీయ ప్రకటనల కోసం చేస్తున్న ప్రయాణం కాదు. ఇది ఓ ప్రజా నాయకుడు ప్రజలతో మమేకమవుతున్న అపురూప ఘట్టం.
Comments
Please login to add a commentAdd a comment