శనివారం చిలుకూరు గురుకులంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
సంక్షేమ, అభివృద్ధి వ్యయాన్ని ఖర్చుగా చూడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
గురుకుల విద్యార్థుల్లో తక్కువ టాలెంట్ ఉంటుందనే అపోహను పోగొట్టాలి
రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ హబ్ అని నిరూపించాలి
ఇకపై ప్రతి నెలా 10వ తేదీలోగా డైట్, కాస్మెటిక్ నిధులు జమ చేస్తాం
చిలుకూరు గురుకులంలో కామన్ డైట్ మెనూ పథకానికి శ్రీకారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశ భవిష్యత్తే కాదు ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించే శక్తి మన విద్యార్థులకు ఉంది. పిల్లలకు సరైన వసతి కల్పించకపోతే, నాణ్యమైన విద్యను అందించకపోతే మనం సమాజానికి ద్రోహం చేసినట్లు కాదా? సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు. వీటిపై పెడుతున్న వ్యయాన్ని భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా చూడాలి కానీ.. ఇతర ఖర్చులా భావించొద్దు.
డైట్, కాస్మెటిక్ చార్జీలు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలపై పెడుతున్న ఖర్చులను భవిష్యత్తు పెట్టుబడిగా చూడాలి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో మన విద్యార్థులు 60% ఉంటారు. మల్టీ టాలెంటెట్ స్టూడెంట్స్‌ను ప్రోత్సహించడంలో మనమెందుకు వెనుకబడుతున్నాం? వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
సీఎం శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ పథకాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఆ అపోహను తొలగించాలి..
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల్లో తక్కువ టాలెంట్ ఉంటుందని, వెనుకబడిన వారు మాత్రమే వీటిలో చదువుకుంటారనే అపోహ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెండ్ హబ్‌గా నిరూపించాలి.
పీవీ నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడే సర్వేల్ గురుకులాన్ని ప్రారంభించారు. ప్రస్తుత పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం సహా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఇక్కడే చదువుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం భట్టితో ఓ కమిటీ ఏర్పాటు చేశాం.
సామాజిక బాధ్యతగా విద్యా ప్రమాణాలు పెంచాలని, నాణ్యమైన వసతులు కల్పించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇందులోభాగంగా డైట్ చార్జీలను 40 శాతం పెంచాం. కాస్మొటిక్ చార్జీలను ఏకంగా 200 శాతం పెంచాం’ అని రేవంత్ చెప్పారు.
ప్రైవేట్ టీచర్లకు మీకన్నా ఎక్కువ జీతాలున్నాయా?
ప్రభుత్వ ఉపాధ్యాయులను సూటిగా అడుగుతున్నా. ప్రైవేటు స్కూళ్లలో చదువు చెబుతున్న వాళ్లు మీకన్నా ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్లా? వాళ్లకేమైనా మీకన్నా ఎక్కువ జీతభత్యాలున్నాయా? మరెందుకు 11 వేల ప్రైవేటు స్కూళ్లలో 33 లక్షల మంది పిల్లలు చదువుతుంటే.. 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 23 లక్షల మంది చదువుతున్నారు? పేదలు కూలికిపోయి కూడబెట్టిన డబ్బులతో పిల్లలను ప్రైవేటు బడులకు పంపి, ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు తాపత్రయపడుతున్నారు.
సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారిలో విశ్వాసం కల్పించాలి. ఈ మధ్య హాస్టల్లో ఫుడ్ పాయిజనై ఓ అమ్మాయి చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ల పిల్లలను హాస్టళ్లలో పెడుతున్నారే కానీ, ప్రేమ లేక కాదు. ప్రభుత్వాన్ని నమ్మి పిల్లలను ఈ గురుకులాల్లో చేర్పిస్తే.. వారి సంక్షేమం, యోగక్షేమాలు చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉంది.
ప్రతి నెలా 10న ఖాతాల్లోకి పైసలు
సకాలంలో బిల్లులు రావడం లేదని, అప్పు చేసి, హాస్టళ్లలో విద్యార్థులకు భోజనం వడ్డించాల్సి వస్తోంది. నాణ్యతలో రాజీ పడాల్సి వస్తోందనే ప్రచారం లేకపోలేదు. ఇకపై ప్రతి నెలా 10వ తేదీలోగా గ్రీన్ చానల్ ద్వారా డైట్, కాస్మొటిక్, ఇతర అన్ని నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా హాస్టళ్లను తనిఖీ చేసి, వారితో పాటు కూర్చొని భోజనం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మెస్ మేనేజ్‌మెంట్ కమిటీల్లోనూ విద్యార్థుల భాగస్వామ్యం చేయనున్నాం.
మట్టిలో మాణిక్యాలను గుర్తించాలి
ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటికి వస్తే.. కేవలం పది వేల మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు దొరకడం లేదు. టాటా గ్రూపు సహకారంతో 75 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చాం. ఇది పోటీ ప్రపంచానికి దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. ఐటీఐలో చేరిన వారికి వందశాతం ఉద్యోగం వస్తుంది. కనీసం నెలకు రూ.30 వేలు సంపాదించే అవకాశం ఉంది.
ఇంజనీరింగ్ కోర్సులను కూడా అప్‌గ్రేడ్ చేయాలని సూచించాం. ఒలింపిక్స్‌లో భారత్ ఒక్క బంగారుపతకం కూడా గెలవలేక పోయింది. ప్రపంచ దేశాల ముందు మన దేశానికి అవమానం కాదా? కోటి జనాభా ఉన్న దక్షిణ కొరియా 32 మెడల్స్ సాధిస్తే.. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మాత్రం గుడ్లప్పగించి చూస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం.
నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ చాంపియన్‌గా రాణిస్తే డీఎస్‌పీగా.. క్రికెట్‌లో రాణించిన సిరాజ్‌కు ఎడ్యుకేషన్ లేకపోయినా డీఎస్పీగా నియమించాం. చదువే కాదు.. క్రీడల్లోనూ రాణించాలి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ ఇద్దాం. మట్టిలో మాణిక్యాలను వెలికితీద్దాం.
పిల్లలతో కలిసి భోజనం చేసిన సీఎం
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఐఐటీ, మెడిసిన్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాయిరాం, అమన్, శ్రుతి, హేమంత్, సిద్దార్థ్, దీక్షితలకు ల్యాప్‌టాప్‌లను అందించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment