Gurukul students
-
భావి తరాలపై పెట్టుబడే: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశ భవిష్యత్తే కాదు ప్రపంచానికే విజ్ఞానాన్ని అందించే శక్తి మన విద్యార్థులకు ఉంది. పిల్లలకు సరైన వసతి కల్పించకపోతే, నాణ్యమైన విద్యను అందించకపోతే మనం సమాజానికి ద్రోహం చేసినట్లు కాదా? సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు. వీటిపై పెడుతున్న వ్యయాన్ని భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా చూడాలి కానీ.. ఇతర ఖర్చులా భావించొద్దు. డైట్, కాస్మెటిక్ చార్జీలు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలపై పెడుతున్న ఖర్చులను భవిష్యత్తు పెట్టుబడిగా చూడాలి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో మన విద్యార్థులు 60% ఉంటారు. మల్టీ టాలెంటెట్ స్టూడెంట్స్‌ను ప్రోత్సహించడంలో మనమెందుకు వెనుకబడుతున్నాం? వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సీఎం శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ పథకాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...ఆ అపోహను తొలగించాలి..సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల్లో తక్కువ టాలెంట్ ఉంటుందని, వెనుకబడిన వారు మాత్రమే వీటిలో చదువుకుంటారనే అపోహ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెండ్ హబ్‌గా నిరూపించాలి. పీవీ నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడే సర్వేల్ గురుకులాన్ని ప్రారంభించారు. ప్రస్తుత పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం సహా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఇక్కడే చదువుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం భట్టితో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. సామాజిక బాధ్యతగా విద్యా ప్రమాణాలు పెంచాలని, నాణ్యమైన వసతులు కల్పించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇందులోభాగంగా డైట్ చార్జీలను 40 శాతం పెంచాం. కాస్మొటిక్ చార్జీలను ఏకంగా 200 శాతం పెంచాం’ అని రేవంత్ చెప్పారు.ప్రైవేట్ టీచర్లకు మీకన్నా ఎక్కువ జీతాలున్నాయా?ప్రభుత్వ ఉపాధ్యాయులను సూటిగా అడుగుతున్నా. ప్రైవేటు స్కూళ్లలో చదువు చెబుతున్న వాళ్లు మీకన్నా ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్లా? వాళ్లకేమైనా మీకన్నా ఎక్కువ జీతభత్యాలున్నాయా? మరెందుకు 11 వేల ప్రైవేటు స్కూళ్లలో 33 లక్షల మంది పిల్లలు చదువుతుంటే.. 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 23 లక్షల మంది చదువుతున్నారు? పేదలు కూలికిపోయి కూడబెట్టిన డబ్బులతో పిల్లలను ప్రైవేటు బడులకు పంపి, ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు తాపత్రయపడుతున్నారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారిలో విశ్వాసం కల్పించాలి. ఈ మధ్య హాస్టల్లో ఫుడ్ పాయిజనై ఓ అమ్మాయి చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ల పిల్లలను హాస్టళ్లలో పెడుతున్నారే కానీ, ప్రేమ లేక కాదు. ప్రభుత్వాన్ని నమ్మి పిల్లలను ఈ గురుకులాల్లో చేర్పిస్తే.. వారి సంక్షేమం, యోగక్షేమాలు చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉంది.ప్రతి నెలా 10న ఖాతాల్లోకి పైసలుసకాలంలో బిల్లులు రావడం లేదని, అప్పు చేసి, హాస్టళ్లలో విద్యార్థులకు భోజనం వడ్డించాల్సి వస్తోంది. నాణ్యతలో రాజీ పడాల్సి వస్తోందనే ప్రచారం లేకపోలేదు. ఇకపై ప్రతి నెలా 10వ తేదీలోగా గ్రీన్ చానల్ ద్వారా డైట్, కాస్మొటిక్, ఇతర అన్ని నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తాం. దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా హాస్టళ్లను తనిఖీ చేసి, వారితో పాటు కూర్చొని భోజనం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మెస్ మేనేజ్మెంట్ కమిటీల్లోనూ విద్యార్థుల భాగస్వామ్యం చేయనున్నాం.మట్టిలో మాణిక్యాలను గుర్తించాలిఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటికి వస్తే.. కేవలం పది వేల మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు దొరకడం లేదు. టాటా గ్రూపు సహకారంతో 75 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా మార్చాం. ఇది పోటీ ప్రపంచానికి దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. ఐటీఐలో చేరిన వారికి వందశాతం ఉద్యోగం వస్తుంది. కనీసం నెలకు రూ.30 వేలు సంపాదించే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కోర్సులను కూడా అప్‌గ్రేడ్ చేయాలని సూచించాం. ఒలింపిక్స్‌లో భారత్ ఒక్క బంగారుపతకం కూడా గెలవలేక పోయింది. ప్రపంచ దేశాల ముందు మన దేశానికి అవమానం కాదా? కోటి జనాభా ఉన్న దక్షిణ కొరియా 32 మెడల్స్ సాధిస్తే.. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం మాత్రం గుడ్లప్పగించి చూస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ చాంపియన్‌గా రాణిస్తే డీఎస్పీగా.. క్రికెట్లో రాణించిన సిరాజ్‌కు ఎడ్యుకేషన్ లేకపోయినా డీఎస్పీగా నియమించాం. చదువే కాదు.. క్రీడల్లోనూ రాణించాలి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ ఇద్దాం. మట్టిలో మాణిక్యాలను వెలికితీద్దాం.పిల్లలతో కలిసి భోజనం చేసిన సీఎంఅనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఐఐటీ, మెడిసిన్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాయిరాం, అమన్, శ్రుతి, హేమంత్, సిద్దార్థ్, దీక్షితలకు ల్యాప్‌టాప్‌లను అందించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం
నాయుడుపేట టౌన్ (తిరుపతి జిల్లా)/చిల్లకూరు(తిరుపతి జిల్లా): నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి 139 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వీరిని నాయుడుపేట గురుకులం, సామాజిక వైద్య కేంద్రం, సూళ్లూరుపేట సామాజిక వైద్య కేంద్రంలో, గూడూరు ఏరియా వైద్యశాలకి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్సల కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కలుషిత ఆహారం వల్లే..కలుషిత ఆహారం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. శనివారం వండిన పూరీలతో పాటు బంగాళాదుంపల కుర్మా ఆదివారం ఉదయం విద్యార్థులకు వడ్డించారు. అదేవిధంగా నిల్వచేసిన కోడి మాంసం ఆదివారం ఉదయం వండి మధ్యాహ్నం, మిగిలినది రాత్రి కూడా వడ్డించారు. దీనితోనే ఆదివారం మధ్యాహ్నం నుంచే విద్యార్థులకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయని చెప్పారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ దాదాపీర్, వార్డెన్ విజయభాస్కర్ గోప్యంగా ఉంచారు. రాత్రి పరిస్థితి విషమించి విద్యార్థులకు వాంతులు, విరోచనాలు తీవ్రస్థాయిలో మొదలవడంతో సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్ర తదితర అధికారులు గురుకులం వద్దే ఉండి విద్యార్థులకు వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ సోమవారం ఉదయం నాయుడుపేటకు చేరుకుని విద్యార్థులకు సత్వరం వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంఅండ్ హెచ్ఓ శ్రీహరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పద్మజ, సూళ్లూరుపేట ఆర్డీవో చంద్రముని, నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వైద్య సేవలను పర్యవేక్షించారు.ప్రిన్సిపాల్, వార్డెన్‌తో పాటు మరో ఇద్దరిపై చర్యలువిద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ దాదాపీర్‌తో పాటు వార్డెన్ విజయభాస్కర్‌రెడ్డి, శానిటేషన్ అధికారి, స్టాఫ్‌నర్సులపై చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయమై జేసీతో కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ చంద్రకళ బాధ్యతారాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో గురుకులంలోని విద్యార్ధుల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం తదితరులు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు.తల్లిదండ్రుల్లో ఆందోళన నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని తమ పిల్లలను చూసి ఆందోళన చెందారు. గురుకుల అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు కూడా నాయుడుపేట సీహెచ్‌సీ వైద్యులతో పాటు అర్బన్ వైద్యశాలల వైద్యులు, దొరవారిసత్రం ప్రభుత్వ వైద్యులు విద్యార్థులకు చికిత్సలు అందించారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున పడుకోబెట్టి వైద్య సేవలను అందించారు. బాధ్యులపై కఠిన చర్యలువిద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. నాయుడుపేటలోని గురుకులంలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం గురుకులాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీతో కలిసి పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు సీఎంకు నివేదించారని తెలిపారు. మూడురోజులు గురుకులానికి సెలవులు ప్రకటించామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో మెరుగైన వసతుల కల్పనకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అలాగే గూడూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఆహారం కలుషితమైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. -
బొమ్మకు ‘అపురూప’ ఆదరణ
విశాఖ విద్య : తమ చిత్రకళా నైపుణ్యంతో అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించి చూడముచ్చటైన చిత్రాలను గీస్తున్నారు నగరంలోని శ్రీకృష్ణాపురం గురుకులం విద్యార్థులు. గురుకులం ప్రాంగణంలో లభించే చీపురు పుల్లలతో విద్యార్థులు సృష్టిస్తున్న అందమైన ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించేలా గురుకులం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడుతున్నాయి. పోటీల్లో పాల్గొంటే పతకం గ్యారంటీ శ్రీకృష్ణాపురం విద్యార్థులు వేసిన చిత్రాలకు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు లభించాయి. గతేడాది విజయవాడలో డ్రీమ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఆలిండియా స్థాయిలో జరిగిన పోటీల్లో 12 బంగారు, 8 రజత పతకాలు సొంతమయ్యాయి. ఆన్లైన్ విధానంలో పుణే ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో బెస్ట్ ఆర్టిస్టు అవార్డుతో పాటు, 32 మందికి ప్రోత్సాహక ప్రశంసా పత్రాలు, ఆరుగురు విద్యార్థులు షీల్డ్స్ అందుకున్నారు. ఇటీవల కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో 10 బంగారు, 6 రజత పతకాలు దక్కాయి. చిత్రకళా నైపుణ్యతను ప్రోత్సహించేలా ఇక్కడి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ప్రిన్సిపాల్, ఆర్ట్ టీచర్‌కు నిర్వాహకులు విశ్వగురువు అవార్డులను ప్రదానం చేశారు. ఉన్నతాధికారుల సహకారంతోనే.. విద్యార్థులు చదువుతో పాటు, ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇందుకు ఉన్నతాధికారుల సహకారం ఎంతో ఉంది. పేద పిల్లల భవిష్యత్‌కు పటిష్టమైన పునాదులు వేసేలా గురుకులంలో విద్యాభ్యాసం సాగుతోంది. – తాళ్లూరి మేరీ ఫ్లోరెన్స్, ప్రిన్సిపాల్, శ్రీకృష్ణాపురం గురుకులం బీచ్ రోడ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటే లక్ష్యం విద్యార్థులు చిత్రలేఖనంపై మంచి ఆసక్తి చూపుతున్నారు. ప్రతి తరగతిలో 5 నుంచి 10 మంది విద్యార్థులు అద్భుతమైన బొమ్మలు గీస్తున్నారు. బొమ్మలు వేసేందుకు వర్క్‌షాపు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. పిల్లలువేసిన బొమ్మలతో బీచ్‌రోడ్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటే లక్ష్యం. – పిడమర్తి సుధాకర్, ఆర్ట్స్ టీచర్ మంత్రి మేరుగు ప్రశంసలు బొమ్మలు గీయడం అంటే ఎంతో ఇష్టం. మా గురువులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. బొమ్మలు గీసేందుకు అన్ని రకాల వస్తువులు సమకూరుస్తున్నారు. మా గురుకులానికి మంత్రి మేరుగు నాగార్జున వస్తే, ఆయన బొమ్మ గీసి ఇచ్చాను. నన్ను ఎంతో మెచ్చుకున్నారు. మంచి ఆరి్టస్టు అవ్వాలనేది కోరిక. – రాజ్‌కుమార్, విద్యార్థి -
గురుకులాల్లో ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు విద్యార్థులకు మేలు చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి ఆరోగ్య సమస్యల్ని గుర్తించి సత్వర చికిత్సను అందిస్తున్నారు. పేద పిల్లలు కావడంతో పోషకాహారం అందక రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారిని గుర్తించి చికిత్సను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 185 గురుకులాల్లో విద్యార్థులకు ఎనీమియా, పోషకాహార లోపానికి సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరోవైపు విద్యార్థుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా పోషక విలువతో కూడిన ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నారు. దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. వైఎస్సార్ కంటి వెలుగు బృందాలతో ఇప్పటివరకు 91 గురుకులాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో కంటి సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలను కొనసాగిస్తున్నారు. దంత సమస్యలను గుర్తించేందుకు ఇప్పటివరకూ 68 గురుకులాల్లో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. మిగిలిన వాటిలోనూ దంత పరీక్షలు కొనసాగుతున్నాయి. కౌమార దశలోని బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై అవగాహన కల్పించేలా ‘వాయిస్ ఫర్ గరల్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన 800 మంది బాలికలకు ఇప్పటికే ఈ శిక్షణ పూర్తి చేశారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి వీలుగా బోధన, బోధనేతర సిబ్బందికి ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం.. పోషకాహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గురుకులాల్లో చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. పేద పిల్లల పెద్ద చదువులకు వారధిగా నిలుస్తున్న అంబేడ్కర్ గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం, పోషకాహారం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానంగా నేత్ర, దంత, పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆడ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి తగిన అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
సత్తా చాటిన గిరి పుత్రులు
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్–2022 ఓవరాల్ చాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్ జయకేతనం ఎగురవేసింది. కోవిడ్‌తో వాయిదా పడిన మూడవ జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ఈ నెల 17 నుంచి గురువారం (22వ తేదీ) వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 4,328 మంది గిరిజన విద్యార్థులు పోటీ పడ్డారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ, విజయవాడలోని లయోలా కాలేజీ, ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, సీహెచ్‌కేఆర్ ఇండోర్ స్టేడియం, వీఎంసీ జింఖానా స్విమ్మింగ్ పూల్ వద్ద మొత్తం 22 రకాల క్రీడలు, ఆటల పోటీలను ఆరు రోజులపాటు నిర్వహించారు. 15 రకాల క్రీడల్లో రాష్ట్రానికి చెందిన బాలుర జట్లు 5 విభాగాల్లోను, బాలికల జట్లు 8 విభాగాల్లోను జయకేతనం ఎగురవేసి ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించాయి. మొత్తం 7 క్రీడల్లో గెలుపొందిన ఆంధ్రప్రదేశ్ అత్యధిక పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చివరివరకు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఇచ్చిన తెలంగాణ రన్నర్‌గా నిలిచింది. కాగా, 7 ఆటల విభాగాల్లో అండర్–19లో బాలురు హ్యాండ్‌బాల్, వాలీబాల్‌లోను, బాలికల జట్టు ఖోఖో విభాగంలోను చాంపియన్‌గా నిలవడం గమనార్హం. మొత్తానికి రాష్ట్రం నుంచి బాలుర కంటే బాలికలే బాగా రాణించడం విశేషం. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్లలో ప్రవేశాల (అడ్మిషన్ల) కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షలు నిర్వహించారు. ఐదో తరగతిలో 14,940 సీట్లు ఉండగా ఆన్లైన్ ద్వారా 61,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 49,890 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. వారికి 188 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్, ఐఐటీ, మెడికల్ అకాడమీలలో ప్రవేశానికి 13,560 సీట్లు ఉండగా ఆన్లైన్ ద్వారా 42,831 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 37,492 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 185 కేంద్రాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4 గంటల వరకు వీరికి రాత పరీక్ష నిర్వహించారు. కాగా, పామర్రు పరీక్షా కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తోపాటు అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి ఉన్నారు. -
ఫైటర్ పైలట్ కోర్సుకు గురుకుల విద్యార్థి ఎంపిక
సాక్షి, హైదరాబాద్: భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ కోర్సుకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థి అశోక్ సాయి ఎంపికయ్యాడు. కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్ సైనిక గురుకుల పాఠశాలలో అశోక్ సాయి చదివాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి అతని స్వగ్రామం. అశోక్ తండ్రి వికలాంగుడు. కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపిక కావడం పట్ల అశోక్‌సాయి, అతని తల్లిదండ్రులు సంతోషంవ్యక్తంచేశారు. దీనిపై ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందిస్తూ పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపిక కావడం పట్ల తెలంగాణ రాష్ట్రం గర్వపడుతుందని కొనియాడారు. -
స్పేస్ చాలెంజ్‌లో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
సాక్షి, అమరావతి: అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ వివరాలను ఎస్సీ గురుకులాల కార్యదర్శి కె.హర్షవర్థన్ గురువారం మీడియాకు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఏటీఎల్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు 2,500 ఆవిష్కరణలను ప్రదర్శించారని చెప్పారు. విశాఖపట్నం జిల్లా మధురవాడ గురుకుల విద్యార్థులు రూపొందించన ఆవిష్కరణ వాటిలో 75 ఉత్తమ ఆవిష్కరణలను బుధవారం ప్రకటించారని వెల్లడించారు. ఇందులో ఏపీకి సంబంధించి మూడు ఆవిష్కరణలకు మంచి పేరొచ్చిందని తెలిపారు. ఆ మూడు ఆవిష్కరణలు కూడా ఎస్సీ గురుకులాల విద్యార్థులవే కావడం గమనార్హమన్నారు. వీరికి త్వరలోనే ఇస్రో, నీతి ఆయోగ్ నుంచి బహుమతులు వస్తాయని తెలిపారు. -
50 మంది విద్యార్థులకు ఇన్స్పైర్ మానక్ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మానక్ అవార్డులకు ఎంపికయ్యారని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ అవార్డ్స్–2021–2022కు ఎంపిక కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ అవార్డును సాధించిన విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున పారితోషికం లభించనుందని తెలిపారు. అత్యధికంగా లేపాక్షి బాలుర గురుకులంలో ఐదుగురు, పుంగనూరు(పెదపంజాని) బాలికల గురుకులంలో 4గురు అవార్డులను సాధించారని పేర్కొన్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులు, పోత్సహించిన ఉపాధ్యాయులను కృష్ణమోహన్ అభినందించారు. -
గురుకుల విద్యార్థులకు వాట్సాప్ క్లాసులు
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తమ విద్యార్థులకు వాట్సాప్ క్లాసులు ప్రవేశపెట్టింది. గురుకుల కార్యదర్శి కల్నల్ వి.రాములు ఆదేశాల మేరకు ఈ విధానాన్ని గురుకులాల్లో టీచర్లు అమలు చేస్తున్నారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న తరుణంలో సెలవుల అనంతరం కూడా విద్యార్థులను తిరిగి గురుకులాలకు పంపించేందుకు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల దృష్టి చదువు నుంచి వేరే వ్యాపకాలవైపు మరలకుండా గురుకుల సంస్థ వాట్సాప్ క్లాసుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా గురుకుల స్కూళ్లలో చదువుతున్న 1.5 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. క్లాసులు ఇలా.. ► ఒక్కో తరగతికి ఒక్కో వాట్సాప్ గ్రూపు, గ్రూపులో 40 మంది విద్యార్థులు ఉండే విధంగా చర్యలు. ► సబ్జెక్ట్‌లో నిపుణులు, వాక్చాతుర్యం ఉండే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. వారు క్లాసు చెప్పేటప్పుడు వీడియో తీస్తారు. ► ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి, వీడియో లింక్‌ను విద్యార్థుల స్మార్ట్ ఫోన్లకు పంపిస్తారు. ► లింక్ ద్వారా యూట్యూబ్‌లో వీడియోను ఓపెన్ చేసి క్లాసును విద్యార్థులు పూర్తిగా వినవచ్చు. ► విద్యార్థులు తమ అభిప్రాయాలు, సందేహాలను వాట్సాప్ గ్రూపులో టీచర్‌తో చర్చించవచ్చు. లాటరీ ద్వారా అడ్మిషన్లు ఈ సంవత్సరం గురుకుల స్కూళ్లలో కొత్తగా 5వ తరగతిలో చేరే విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం పోటీ పరీక్ష పెట్టడం ద్వారా ఎంపిక జరిగేది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
గురుకుల విద్యార్థినుల ఘనత
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ మేలో నిర్వహించిన అటల్ కమ్యూనిటీ డే ఛాలెంజ్ – 2020లో ఈ విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఈ ఫలితాలు శుక్రవారం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ల కోసం 1,100కు పైగా ఎంట్రీలు రాగా అందులో 30 ప్రాజెక్టు ఐడియాలను జడ్జిలు ఎంపిక చేశారు. ఈ 30 ప్రాజెక్టుల్లో రెండు ప్రాజెక్టు ఐడియాలు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో చదివే విద్యార్థులు సమర్పించారు. ► విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గురుకుల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కేఎల్‌ఎస్‌పీ వర్షిణి ‘పీఐసీఓ’ (పికో–ద కోవిడ్ చాట్‌బాట్)ను రూపొందించింది. ఇది వాయిస్ కమాండ్లు, టెక్టస్ మెజేస్‌లను లేదా రెండింటి ద్వారా మానవ సంభాషణలు అనుకరించే కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది ఏదైనా పెద్ద మేసేజింగ్ ఆవర్తనాల ద్వారా ఉపయోగించే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్. కోవిడ్–19 లాక్డౌన్, అన్‌లాక్ సమయంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సహాయం చేయడానికి, ముందస్తు జాగ్రత్తలు చెప్పటానికి, కోవిడ్‌పై పోరాటానికి ‘పికో’ను వర్షిణి పరిచయం చేసింది. వర్షిణి స్వస్థలం విశాఖ జిల్లా బక్కన్నపాలెం. ► విజయనగరం జిల్లా చీపురుపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గర్భపు ప్రవల్లిక ‘వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు డ్రోన్లు ఉపయోగించుట’ అనే అంశంపై ప్రాజెక్టును సమర్పించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించి మెడికల్ కిట్లతో పాటు ఇతర అత్యవసర సామగ్రిని సరఫరా చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు రక్షించవచ్చు. వరద సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మెడికల్ కిట్స్ సరఫరా చేయడం, పరిస్థితిపై అవగాహన కల్పించడం ఈ ప్రోగ్రాం లక్ష్యం. ప్రవల్లిక స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలం కుసుమూరు. ► ఈ రెండు ప్రోగ్రామ్‌ల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు దేశవ్యాప్త గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్వహించే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లోని కొత్తకొత్త ఆలోచనలకు పదును పెడుతున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కల్నల్ వి రాములు తెలిపారు. (అందరూ ఉన్నా అనాథలయ్యారు..) -
పెట్రోల్ లేకుండా నడిచే బైక్..
సాక్షి,సిటీబ్యూరో: కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు ‘ఇంధన రహిత బైక్ ’ను ఆవిష్కరించారు. కాగజ్ నగర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సలీం, జె.ఆకాష్, అఖిల్ కుమార్, ఎస్.డి.ఆలం, మాలికార్జున్, ఎం.డి.ఇసానుల్లాఖాన్‌లు బృందంగా ఏర్పడి బైక్ తయారీలో సఫలీకృతులయ్యారు. ఈ బైక్‌కు పెట్రోల్, డీజిల్, చార్జింగ్ లాంటి ఎలాంటి ఇంధనం అవసరం లేదు. 50–60 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి బి.షఫీవుల్లా ఇటీవల కాగజ్ నగర్‌లోని గురుకులాలను పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు ‘ఇంధన రహిత బైక్’ తయారీ ప్రాజెక్టు కోరికను వ్యక్తం చేశారు. స్పందించిన కార్యదర్శి విద్యార్థులను ప్రోత్సహించడానికి హైదరాబాద్ బహదూర్‌పురా బాయ్స్–1లో వారికి తగిన సౌకర్యాలు కల్పించారు. తక్కువ వ్యవధిలో గేర్‌లెస్ బైక్ సిద్ధమైంది. శాశ్వత మాగ్నెట్ బ్రష్‌లెస్ డీసీ (బీఎల్డీసీ) మోటార్, పవర్ కంట్రోలర్, డైనమో, బ్యాటరీస్, ఎంసీబీ బాక్స్‌లు ఏర్పాటు చేసి తద్వారా శక్తిని పొందేలా ఏర్పాటు చేశారు. పెట్రోల్, ఇంజన్ బైక్ లానే ఉంటుంది. సమ్మర్ వెకేషన్లో ఎక్స్పోజర్ వర్క్‌షాప్ మైనారిటీ గురుకుల ప్రత్యేక ఆవిష్కరణ ఇంధన రహిత బైక్ అని రుకుల కార్యదర్శి బి. షఫీవుల్లా వెల్లడించారు. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ దొరకడం చాలా కష్టం, కాబట్టి ఈ బైక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ తరహా వినూత్న ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సమ్మర్ వెకేషన్లో హైదరాబాద్‌లో ఎక్స్పోజర్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
నేడు అబుల్ కలాం విద్యా పురస్కారాలు
ఒంగోలు టౌన్/సాక్షి, అమరావతి : ఈ ఏడాది టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా పురస్కారాలను అందజేయనున్నట్లు విదాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒంగోలు సంతపేటలోని తన క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో అక్కడి మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందిస్తారన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. డీఎల్టీ, డైట్ వంటి వాటిని టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లుగా మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా సుశిక్షితులైన ఉపాధ్యాయులను తయారుచేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇఫ్లూ, రీచల్ ఇన్స్టిట్యూట్ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని ఇంగ్లిష్ మీడియం బోధించే టీచర్లకు మరింత తర్ఫీదునిస్తామన్నారు. ఎస్సీ గురుకులాల నుంచి 189 మంది ఎంపిక ఇదిలా ఉంటే.. అబుల్ కలాం విద్యా పురస్కారాలకు రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి మొత్తం 189 మంది ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 47 మంది, మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల నుంచి 45 మంది ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వి.రాములు, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్, ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి పి రంజిత్‌బాషా అభినందనలు తెలిపారు. 14న సీఎం చేతుల మీదుగా నాడు–నేడు కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాడు–నేడు కార్యక్రమాన్ని ఈనెల 14న ఆయన చేతుల మీదుగా ఒంగోలులో ప్రారంభించనున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. అదేరోజు మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. -
గురుకుల విద్యార్థులకు ‘ఆరోగ్యమస్తు’
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై సొసైటీలు దృష్టి సారించా యి. దీనిలో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ ప్రొఫైల్ నంబర్‌ను కేటాయించను న్నాయి. విద్యార్థులకు తరుచూ వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆయా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నాయి. విద్యార్థులు గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందిన వెంటనే ఈ హెల్త్ ప్రొఫైల్స్‌ను తెరుస్తారు. టీసీ తీసుకుని వెళ్లే వరకు ఈ ప్రొఫైల్‌ను నిర్వహిస్తారు. ఆరోగ్య, అనారోగ్య సమా చారంతో పాటు శారీరక స్థితి, దేహదారుఢ్యం, ఎత్తు, బరువు తదితర సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రతిసారి రిపోర్టును అప్డేట్ చేస్తారు. ఈ రిపోర్టుతో విద్యార్థి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడంతో పాటు వ్యాధులకు చికిత్స చేయడం సులభతరమవుతుంది. కమాండ్ సెంటర్ ద్వారా.. విద్యార్థుల ఎలక్ట్రానిక్ హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో కమాండ్ సెంటర్ కీలకం కానుంది. ప్రతి గురుకుల పాఠశాలలో ఏఎన్ఎం/నర్స్ లేదా వైద్య సహాయకుడు అందుబాటులో ఉంటారు. వారు నెలవారీగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచుతారు. అనంతరం వైద్య పరీక్షల ఫలితాలను కమాండ్ సెంటర్ నుంచి అప్డేట్ చేస్తారు. ఇందులో వ్యాధులను గుర్తిస్తే వెంటనే చికిత్స అందిస్తారు. హృద్రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే ఆస్పత్రికి తరలిస్తారు. ప్రస్తుతం ప్రాథమిక దశలో (బీటా వెర్షన్) ఉన్న ఈ విధానాన్ని త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గిరిజన హాస్టళ్లలో... ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ కాల్హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో అందు బాటులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రత్యేకంగా కంట్రో ల్ రూమ్‌ను తెరిచింది. క్షేత్ర స్థాయిలో వసతి గృహా లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు 31 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తూ హెల్త్ రికార్డును పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఫలితాలను ఆ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇది సఫలమైతే ఎస్టీ గురుకులాల్లోనూ ఇదే తరహా హెల్త్ ప్రోగ్రాం నిర్వ హించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఎవరెస్టంత ఎదిగారు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థులు గురువారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మొత్తం 22 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లగా వారిలో ఒకరు విరమించుకున్నారు. మిగిలిన 21 మందిలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న జె.ప్రవీణ్, కొత్తూరు గురుకులంలో చదువుతున్న పి.భానుసూర్యప్రకాష్, విశాఖపట్నం జిల్లా వెలుగొండ గురుకులంలో జూనియర్ ఎంపీసీ చదువుతున్న జి.రాజు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలోని నెల్లూరు జిల్లా చిట్టేడు గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ప్రసన్నకుమార్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారిలో ఉన్నారు. గతేడాది 9 మంది విద్యార్థులు ఈ రెండు విద్యా సంస్థల నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరు లడక్‌లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణ పొందారు. మూడు బృందాలుగా బయల్దేరిన వీరిలో మొదటి బృందం విజయం సాధించింది. రెండో బృందం ఈ నెల 19వ తేదీ ఎవరెస్ట్‌ను అధిరోహించనుంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గురువారం అభినందనలు తెలిపారు. ఆత్మ విశ్వాసం పెరగాలి: సీఎం విద్యార్థులు శిఖరమంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులను అభినందిస్తూ గురువారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకొని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్థుల మనోస్థైర్యాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. శిఖరారోహణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, కష్టాలను తట్టుకునే ధృడత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబును, ఆయా శాఖల అధికారులను సీఎం అభినందించారు. మరిన్ని అధిరోహణలు సాధించాలి: వైఎస్ జగన్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అధిరోహణలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో గురుకులాల గుబాళింపు..!
భద్రాచలం: గురుకులాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో తమ ప్రతిభను చూపారు. ఆర్ట్స్ విభాగంలో ఏకంగా రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అనేక మంది విద్యార్థులు మంచి మార్కు లు సాధించి, గురుకులాల పేరును రాష్ట్రస్థాయిలో పదిలంగా ఉంచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల అంకంపాలెం, భద్రాచలం, సుదిమళ్ల బాలికల కళాశాల నుంచి 428 మంది విద్యార్థినీలు ఇంటర్ రెండో సం వత్సరం పరీక్షలకు హాజరుకాగా, ఇందులో 378 మంది (88.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. దమ్మపేట, కెస్‌డీసైట్, కృష్ణసాగర్, గుండాల, కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బాలుర కళాశాలల నుంచి మొత్తం 403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఇందులో 309 మంది (76.67శాతం) పాసయ్యారు. బాలికలు, బాలురు కలిపి మొత్తం రెండో సంవత్సరం నుంచి 831 మంది విద్యార్థులకుగానూ 687 (82.67) మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఒకేషనల్‌లో బాలికలు 78 మందికిగాను 78 మంది పాసవ్వగా, బాలురు 34 మందికి గాను 30 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో: ఇంటర్ ప్రథమ సంవ్సరంలో అంకంపాలెం, భద్రాచలం, సుదిమళ్ల బాలికల కళాశాలల నంంచి 501 మందికి గాను 397 మంది(79.24 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా దమ్మపేట, కెస్‌డీసైట్, కృష్ణసాగర్, గుండాల, కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బాలుర కళాశాలల నుంచి మొత్తం 394 మందికిగాను 311 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలికలు, బాలురు కలిపి 895 మందికి గాను 708 మంది(79.11శాతం) పాసయ్యారు. ఒకేషనల్ కోర్సులో బాలికలు 78 మందికి గాను 78 పాసవ్వగా, బాలురు 38కి గాను 31 మంది ఉత్తీర్ణులయ్యారు. గురుకులాల రాష్ట్రస్థాయి టాపర్లు వీరే.. రెండో సంవత్సరం:వీ వీణాకుమారి –915 సీఈసీ అంకంపాలెం డీ విమలత – 919 హెచ్ఈసీ సుదిమళ్ల మొదటి సంవత్సరం:కె కావేరి– 466 సీఈసీ అంకంపాలెం డీ శ్రావణి– 474 సుదిమళ్ల -
కోలుకుంటున్న విద్యార్థినులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : నిల్వ ఉన్న ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు కోలుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో ఏడుగురు, ఆంధ్రా హాస్పటల్స్‌లో 18 మంది చికిత్స పొందుతున్నారు. అందరి ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోని కంచికచర్ల గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులు నిల్వ ఉన్న ఆహారం తిని ఈ నెల 12న వాంతులు, విరేచనాలతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన విషయం తెలిసింది. వారిలో 12 మందిని ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ చేయగా, 18 మందిని ఆంధ్రా హాస్పటల్‌కు తరలించారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 9మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. అయితే, అదే హాస్టల్‌కు చెందిన మరో నలుగురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో కొత్తగా ప్రభుత్వాస్పత్రిలో చేరారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు డెప్యూటీ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జె నరసింహనాయక్ తెలిపారు. కాగా ఆంధ్రా హాస్పటల్స్‌లో చికిత్స పొందుతున్న 18 మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు తెలిపారు. అందరినీ గురువారం డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బుధవారం పలు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు, సోషల్ వెల్ఫేర్ అధికారులు పరామర్శించారు. కాగా ఈ ఘటనకు కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తప్పును మాఫీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఆగ్రహం.. మధురానగర్ (విజయవాడ సెంట్రల్) : తమ కుమార్తెలను ఎంతో నమ్మకంతో ఇక్కడ ఉంచి వెళితే మీరు ఈ విధంగా ఆసుపత్రి పాలు చేస్తారా.. అంటూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు బుధవారం కంచికచర్ల సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యంను నిలదీశారు. మాచవరంలోని హాస్టల్లో వారు ప్రిన్సిపల్‌ను కలిసి ఫుడ్ పాయిజనింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ కుమార్తెలను ఇళ్ళకు తీసుకువెళ్ళిపోయారు. అలాగే, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. మహేష్, ఏ అశోక్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ కోటి, ఎం సోమేశ్వరరావు, నగర కార్యదర్శి సుమంత్, ఉపాధ్యక్షుడు యేసుబాబు తదితరులు కూడా బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, మంగళవారం నుంచి ప్రారంభించిన ప్రత్యేక వైద్య శిబిరం బుధవారం కూడా కొనసాగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వైద్య సిబ్బంది అవసరమైన సేవలు అందించారు. -
చేతులెత్తేస్తున్నారు..!
నవ్యాంధ్ర రాజధాని నగరంలోని టీచింగ్ ఇనిస్టిట్యూట్‌కు అనుబంధంగా ఉన్న పెద్దాస్పత్రి.. వెయ్యికి పైగా పడకలు.. స్పెషాలిటీ.. çసూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 200 మందికిపైగా నిపుణులైన వైద్యులు.. మరో 200 మందికి పైగా పోస్టు గ్రాడ్యుయేట్లు.. సీనియర్ రెసిడెంట్లు నిత్యం అందుబాటులో ఉంటారు. కానీ ఫుడ్ పాయిజనింగ్ లాంటి సింపుల్ కేసులకు కూడా వైద్యం చేయలేక కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించేయడం ఇక్కడి డొల్లతనాన్ని వేలెత్తి చూపుతోంది. లబ్బీపేట (విజయవాడ తూర్పు) : విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందనే భావనతో మచిలీపట్నం, ఏలూరులోని జిల్లా ఆస్పత్రులతో పాటు, ఏరియా ఆస్పత్రుల నుంచి నిత్యం పదుల సంఖ్యలో రిఫరల్ రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడకు నేరుగా వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ కేసులను మాత్రం ప్రయివేటు ఆస్పత్రులకు తరలించడంలో ఆంతర్యం ఏమిటనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిపుణులైన వైద్యులు ఉన్నా.. ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురై సోమవారం సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అంత మంది ఒకేసారి రావడంతో తొలుత కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. వారికి వైద్యం చేసేందుకు జనరల్ మెడిసిన్ విభాగంలో నిపుణులైన వైద్యులు 20 మంది వరకూ అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం కూడా అందుబాటులో ఉంది. కానీ గంటలోపే పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఆరుగురిని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించడం.. ప్రభుత్వ వైద్యంపై ఉన్నతాధికారులకు నమ్మకం లేదనే భావన వెల్లడవుతోంది. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ కేసులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం వైద్యం చేస్తుంటారు. అలాంటిది ఒక టీచింగ్ ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన వారిని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించడం ఏమిటనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వైద్యంపైనమ్మకం లేకనా.. జిల్లా ఉన్నతాధికారులకు సైతం ప్రభుత్వాస్పత్రిల్లో వైద్యంపై నమ్మకం ఉండటం లేదు. దీంతో ఏ చిన్న ఘటన జరిగినా ఇక్కడకు వచ్చిన క్షతగాత్రులను వెంటనే ప్రయివేటు ఆస్పత్రులకు తరలించేస్తున్నారు. వారి చర్యల ద్వారా ప్రభుత్వాస్పత్రిలో లోపాలు వెలుగు చూస్తున్నాయి. రోగులకు తక్షణమే వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేం దుకు సిబ్బంది అందుబాటులో ఉండరు. ఏవైనా అత్యవసరంగా మందులు కొనుగోలు చేయడానికి కుదరదు. ఇలాంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటం వలనే ఏదైనా ఘటనలో గాయపడిన, అనారోగ్యానికి గురైనా.. కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నాసిరకం మందులు కారణమేనా.. ప్రభుత్వం సరఫరా చేసే మందులు నాణ్యమైనవి ఉండవని, వాటితో రికవరీ సత్వరమే ఉండదనే వాదన వినిపిస్తోంది. అత్యవసర సమయంలో రోగికి మందులు పని చేయకుండా పెనుముప్పు ఏర్పడుతుందనే భావనతో కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించేస్తున్నట్లు ఓ సీనియర్ వైద్యుడు ‘సాక్షి’తో చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రిలో అయితే నాణ్యమైన మందులు ఉంటాయనేది వారి వాదన. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రభుత్వాస్పత్రిల్లో క్వాలిటీ మందులు సరఫరా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల సందర్శన మధురానగర్ (విజయవాడ సెంట్రల్) / లబ్బీపేట (విజయవాడ ఈస్ట్) : కాగా, సంబంధిత కళాశాలను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, సోషల్ వెల్ఫేర్ జేడీ టీఎస్ఏ ప్రసాద్, బీసీ వెల్పేర్ అధికారి ఆర్ యుగంధర్ తదితరులు సందర్శించారు. ఆహారం ఎక్కడ నుంచి వచ్చింది, ఎలా వచ్చింది తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో కళాశాల విద్యార్థినులకు బుధవారం నుంచి ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, ర్రాతికి భోజనాన్ని అక్షయపాత్ర ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే, ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను సీపీఎం రాజధాని ప్రాంత కార్యదర్శి సీహెచ్ బాబూరావు, సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, ఎస్ఎఫ్ఐ సెంట్రల్ సిటీ కార్యదర్శి సుమంత్, విష్ణువర్దన్ తదితరులు పరామర్శించారు. డొల్లతనం బయటపడింది.. అది చేశాం.. ఇది చేశాం.. ప్రభుత్వాస్పత్రి ఓపీని పెంచాం.. అంటూ మంత్రులు నిత్యం గొప్పలు చెప్పుకోవడం కాదు, ఫుడ్ పాయిజనింగ్తో వచ్చిన వారికి కూడా వైద్యం చేయలేక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించేశారు. ఈ ఘటనతో ప్రభుత్వాస్పత్రి డొల్లతనం బయటపడింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు సౌకర్యాలు కల్పించాలి. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం మందులు కొనుగోలు చేయకుండా నాణ్యమైనవి కొనాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్,జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
నిర్లక్ష్యానికి కారకులెవరు!
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : అధికారుల నిర్లక్ష్యం విద్యార్థినులకు శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (గురుకుల) హాస్టల్లో ఉన్న విద్యార్థినులను ప్రయివేటు కార్యక్రమానికి తరలించడమే కాకుండా, వారికి నిల్వ ఉన్న ఆహారం పెట్టి అస్వస్థతకు గురి కావడానికి కారకులయ్యారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్లో మెరుగైన విద్య, వసతులు కల్పిస్తారని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు చేరితే, వారికి కలుషిత ఆహారం అందించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఏమిటీ నిర్లక్ష్యం.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న బాల, బాలికలను ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించడం ఆనవాయితీగా మారింది. అదే రీతిలో ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి సైతం రెసిడెన్షియల్ హాస్టల్లో ఉంటున్న డిగ్రీ విద్యార్థినులు 110 మందిని నిబంధనలకు విరుద్ధంగా తరలించారు. ఎవరి అనుమతితో తరలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు సైతం సీరియస్ అవుతున్నారు. నిల్వ ఉన్న ఆహారంఅందించడమేంటి.. రెనిడెన్షియల్ హాస్టల్లో ఉన్న విద్యార్థినులకు బయట భోజనాల వద్ద మిగిలిన చికెన్ కర్రీ తీసుకువచ్చి వడ్డించినట్లు తెలిసింది, వసతి గృహాలకు బయటి నుంచి ఆహారం ఎలా తీసుకువచ్చి పెడతారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా ఆదివారం మధ్యాహ్నం భోజనాలకు తయారు చేసిన కర్రీని సోమవారం ఉదయం కూడా విద్యార్థినులు తింటుంటే, హాస్టల్‌ను పర్యవేక్షించాల్సిన వారు ఏం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఉదయం పెట్టిన వెజిటబుల్ బిర్యానీ కూడా సరిగ్గా లేదని విద్యార్థినులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే వారికి శాపంగా మారిందని, 15 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. నిలకడగానే ఆరోగ్యం.. అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. చక్రధర్ ప్రకటించారు. అయితే ఐదుగురిని ముందు జాగ్రత్తగా కార్పొరేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ చేసిన వారిని మంగళవారం ఉదయం మరోసారి పరిశీలించి డిశ్చార్జి చేస్తామని చెప్పారు. కాగా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయకృష్ణణ్, జాయింట్ కలెక్టర్ – 2 బాబూరావు విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ఇదేమి వైద్యం: ప్రభుత్వాస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల నిరసన లబ్బీపేట (విజయవాడ తూర్పు) : కల్తీ ఆహారం తిని అస్వస్థతతో వచ్చిన విద్యార్థినులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. కనీసం వారిని తీసుకొచ్చేందుకు స్టెచ్చర్లు కూడా లేని దయనీయ స్థితి ప్రభుత్వాస్పత్రిలో నెలకొందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ఒక్కో స్ట్రెచ్చర్‌పై ఇద్దరు, ముగ్గురు విద్యార్థినులను ఉంచి చికిత్స చేస్తున్న వైనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత ఓ విద్యార్థినిని చికిత్స అందించకుండా అలాగే వదిలేయడంతో ఆమెను జాయింట్ కలెక్టర్–2 బాబూరావు చూశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను పిలిచి చీవాట్లు పెట్టడంతో సమీపంలో ఉన్న డాక్టర్ భవానీశంకర్ అక్కడకు వచ్చి విద్యార్థినిని చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్ మీదకు పడుకోబెట్టారు. ఒకేసారి 15 మంది విద్యార్థినుల రాకతో ప్రభుత్వాస్పత్రి డొల్లతనం బయటపడింది. మరోవైపు ఎస్ఎఫ్ఐ నాయకులు కె. రమేష్, కృష్ణ, కోటి తదితరులు ఆస్పత్రిలో విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు
పాడేరు: పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సలోమి తీరుపై విద్యార్థినులు నిరసన గళమెత్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులు కళాశాల నుంచి ప్రదర్శనగా ఐటీడీఏకు వెళ్లారు. కార్యాలయం ముందు ప్లకార్డులతో బైటాయించారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినులను నిత్యం మానసికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల సమయంలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు స్పందించిన గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయకుమార్ ఐటీడీఏకు చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులందరినీ కళాశాలకు తరలించారు. దీని గురించి తెలుసుకున్న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు స్పందించి, ఈ వ్యవహారంపై ఆరాతీశారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు డీడీ విజయకుమార్ కళాశాల ఆవరణలో విద్యార్థినులు, కళాశాల సిబ్బందితో విడివిడిగా మాట్లాడారు. ప్రిన్సిపాల్ సలోమి ప్రస్తుతం పరీక్షల సమయంలోనూ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, విద్యార్థినులను కొట్టడం, తిట్టడం, వేధింపులకు గురి చేస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని విద్యార్థినులు డీడీకి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ సరెండర్.. విద్యార్థినుల ఆందోళనకు సంబంధించి ప్రిన్సిపాల్ సలోమిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమెను గిరిజనసంక్షేమ గురుకుల సొసైటీకి సరెండర్ చేసినట్టు డీడీ విజయకుమార్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రానికి ఆమె డీవోగా విధులు నిర్వర్తిస్తున్నారని, దీంతో ఇంటర్ బోర్డ్ ఆర్ఐవోకు కూడా ఈమెను సరెండర్ చేసినట్లు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈమె స్థానంలో అరకు గురుకుల కళాశాల జేఎల్ భవానిని ఇన్చార్జిగా నియమించినట్లు తెలిపారు. -
గురుకుల్ సెట్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2018ను ప్రభుత్వం నిర్వహించనుంది. అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం టీజీ గురుకుల్ సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి అప్పగించింది. అర్హతలివే... గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్థుల వయసు 01.09.2018 నాటికి 9 నుంచి 11 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయోపరిమితి రెండేళ్లు సడలించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల/విద్యాసంస్థలో నాల్గోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకుండా ఉండాలి. దరఖాస్తు కోసం http:/tgcet. cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 19 నుంచి మార్చి 16 దాకా కొనసాగుతుందని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. టీజీ గురుకుల్ సెట్ పరీక్ష ఏప్రిల్ 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు www.tswreis.in వెబ్సైట్లో లేదా 1800 425 45678 హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. -
‘గురుకులం’లో వైరల్ ఫీవర్
నిజాంసాగర్(జుక్కల్): ఇంటర్ విద్యార్థిని కృప మరణం మరవకముందే పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురయ్యారు. వారం నుంచి పలువురికి జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం గురుకుల పాఠశాలకు చెందిన 8 మందికి ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో పీహెచ్సీలో వైద్య చికిత్సలు చేయించారు. వీరిలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న జ్యోతి అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మిగతావారికి ఏఎన్ఎం సవిత ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నారు. గురుకులంలో తరుచూ విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నా, పాఠశాల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తనిఖీలతో వెలుగులోకి.. పెద్దకొడప్‌గల్‌లోని బాలికల గురుకులాన్ని గురువారం గ్రామ సర్పంచ్ మౌనికసాయిరెడ్డి, తహసీల్దార్ గణేశ్ తనిఖీలు చేశారు. పాఠశాలలోని డార్మెట్ రూమ్‌ల్లోని మంచాలపై విద్యార్థినులు పడుకొని ఉండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారం నుంచి జ్వరాలు వస్తున్నాయని విద్యార్థినులు చెప్పడంతో వారు అవాక్కయారు. వెంటనే పీహెచ్సీ వైద్యుడు శ్రీనివాస్ గుప్తను గురుకులానికి రప్పించారు. వైరల్ ఫీవర్‌తో బాధతున్న విద్యార్థినులకు పరీక్షలు చేయించారు. ఎనిమిది మంది విద్యార్థులను ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం సర్పంచ్, తహసీల్దార్ గురుకులంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినుల డార్మెట్ రూమ్‌ల్లో దోమల బెడదతోపాటు నీటిసదుపాయం లేక విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురువుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. విద్యార్థినులకు అందిస్తున్న పండ్లు కుళ్లడంతో సిబ్బందిపై తహసీల్దార్ మండిపడ్డారు. ఆయన ఈ విషయాన్ని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ దృష్టికి తీసుకు వెళ్లి ఇక్కడి పరిస్థితులను వివరించారు. -
మట్టిలో మాణిక్యాలు గురుకులాలకు మెరుగులద్దారు!
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్, ప్రైవేటు సంస్థల విద్యార్థులతో పోటీ పడుతూ ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు అనూహ్య విజయాలను సాధిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తున్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరైన వారిలో 453 మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. గతంలో ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అర్హత సాధించే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేదని, ఇటీవలి కాలంలో ఆ సంఖ్య పెరుగుతోందని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2017 జేఈఈ మెయిన్‌లో టాప్ ర్యాంకులను సాధించి 174 మంది విద్యార్థులు ఎన్ఐటీల్లో సీట్లు పొందగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 59 మంది ఐఐటీల్లో సీట్లను పొందారు. ఇక ఏకంగా 82 మంది విద్యార్థులు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)లో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులను సాధించి మెడిసిన్‌లో సీట్లు పొందినట్లు విద్యా శాఖ లెక్కలు తేల్చింది. మరోవైపు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 62 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఫలితాల్లోనూ మేటి.. రాష్ట్రస్థాయి విద్యా సంస్థలతోపాటు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధించి తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న గురుకులాలు ఫలితాల్లోనూ సత్తా చాటుతున్నాయి. టెన్త్, ఇంటర్మీడియెట్‌లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే అధిక శాతం సాధిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర ఉత్తీర్ణత 84.15 శాతం ఉండగా, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు 89.10 శాతం ఫలితాలను సాధించాయి. ఇంటర్మీడియెట్‌లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 66.45 శాతం ఉండగా, సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులు 87.12 శాతం సాధించారు. మోడల్ స్కూల్స్ కూడా టెన్త్‌లో 94 శాతం, ఇంటర్మీడియెట్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత సాధించాయి. -
గుంజీలు తీయించిన టీచర్, విద్యార్థునులకు అస్వస్థత
-
గుంజీలు తీయించిన టీచర్
ఆదిలాబాద్ రూరల్: ఓ విద్యార్థినికి చెందిన నోట్ బుక్స్ ఎవరు చింపారని ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చిన విద్యార్థునులతో ఓ పీఈటీ టీచర్ గుంజీలు తీయించగా వారు అస్వస్థతకు గురయ్యారు. ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండలం పిట్టలవాడలోని మైనార్టీ గురుకులంలో సోమవారం చోటుచేసుకుంది. మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థులు ఓ విద్యార్థి నోట్‌బుక్స్ చింపివేశారు. ఎవరు చింపారని పీఈటీ రమాదేవి అడగ్గా.. తమకు తెలియదని చెప్పారు. దీంతో ఆమె 20 మందితో గుంజీలు తీయించారు. నలుగురు స్పృహ తప్పిపోయి పడిపోగా, వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. హోంవర్క్ చేయలేదని... స్టేషన్ ఘన్పూర్: హోంవర్క్ చేయలేదని ఓ టీచర్ నలుగురు విద్యార్థులను చితకబాదిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మహాత్మా జ్యోతిబాపూలే ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని నవీన్ అనే టీచర్ ఏడో తరగతి విద్యార్థులు భాస్కుల ప్రేమ్, అనుముల సాయికిరణ్, బి.నితిన్, సందీప్‌లను తొడలపై వాతలు వచ్చేలా చితకబాదాడు. తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో నవీన్‌పై చర్యలు తీసుకుం టామని ఎస్ఓ మల్లయ్య చెప్పారు.