విశాఖ విద్య : తమ చిత్రకళా నైపుణ్యంతో అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించి చూడముచ్చటైన చిత్రాలను గీస్తున్నారు నగరంలోని శ్రీకృష్ణాపురం గురుకులం విద్యార్థులు. గురుకులం ప్రాంగణంలో లభించే చీపురు పుల్లలతో విద్యార్థులు సృష్టిస్తున్న అందమైన ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించేలా గురుకులం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడుతున్నాయి.
పోటీల్లో పాల్గొంటే పతకం గ్యారంటీ
శ్రీకృష్ణాపురం విద్యార్థులు వేసిన చిత్రాలకు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు లభించాయి. గతేడాది విజయవాడలో డ్రీమ్ ఆర్ట్ ఆధ్వర్యంలో ఆలిండియా స్థాయిలో జరిగిన పోటీల్లో 12 బంగారు, 8 రజత పతకాలు సొంతమయ్యాయి. ఆన్‌లైన్ విధానంలో పుణే ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో బెస్ట్ ఆర్టిస్టు అవార్డుతో పాటు, 32 మందికి ప్రోత్సాహక ప్రశంసా పత్రాలు, ఆరుగురు విద్యార్థులు షీల్డ్స్ అందుకున్నారు.
ఇటీవల కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో 10 బంగారు, 6 రజత పతకాలు దక్కాయి. చిత్రకళా నైపుణ్యతను ప్రోత్సహించేలా ఇక్కడి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ప్రిన్సిపాల్, ఆర్ట్ టీచర్‌కు నిర్వాహకులు విశ్వగురువు అవార్డులను ప్రదానం చేశారు.
ఉన్నతాధికారుల సహకారంతోనే..
విద్యార్థులు చదువుతో పాటు, ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇందుకు ఉన్నతాధికారుల సహకారం ఎంతో ఉంది. పేద పిల్లల భవిష్యత్‌కు పటిష్టమైన పునాదులు వేసేలా గురుకులంలో విద్యాభ్యాసం సాగుతోంది. – తాళ్లూరి మేరీ ఫ్లోరెన్స్, ప్రిన్సిపాల్, శ్రీకృష్ణాపురం గురుకులం
బీచ్ రోడ్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటే లక్ష్యం
విద్యార్థులు చిత్రలేఖనంపై మంచి ఆసక్తి చూపుతున్నారు. ప్రతి తరగతిలో 5 నుంచి 10 మంది విద్యార్థులు అద్భుతమైన బొమ్మలు గీస్తున్నారు. బొమ్మలు వేసేందుకు వర్క్‌షాపు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. పిల్లలువేసిన బొమ్మలతో బీచ్‌రోడ్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటే లక్ష్యం. – పిడమర్తి సుధాకర్, ఆర్ట్స్ టీచర్
మంత్రి మేరుగు ప్రశంసలు
బొమ్మలు గీయడం అంటే ఎంతో ఇష్టం. మా గురువులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. బొమ్మలు గీసేందుకు అన్ని రకాల వస్తువులు సమకూరుస్తున్నారు. మా గురుకులానికి మంత్రి మేరుగు నాగార్జున వస్తే, ఆయన బొమ్మ గీసి ఇచ్చాను. నన్ను ఎంతో మెచ్చుకున్నారు. మంచి ఆరి్టస్టు అవ్వాలనేది కోరిక. – రాజ్‌కుమార్, విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment