
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2018ను ప్రభుత్వం నిర్వహించనుంది. అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం టీజీ గురుకుల్ సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి అప్పగించింది.
అర్హతలివే...
గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్థుల వయసు 01.09.2018 నాటికి 9 నుంచి 11 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయోపరిమితి రెండేళ్లు సడలించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల/విద్యాసంస్థలో నాల్గోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకుండా ఉండాలి. దరఖాస్తు కోసం http:/tgcet. cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 19 నుంచి మార్చి 16 దాకా కొనసాగుతుందని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. టీజీ గురుకుల్ సెట్ పరీక్ష ఏప్రిల్ 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు www.tswreis.in వెబ్‌సైట్‌లో లేదా 1800 425 45678 హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.