విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సహచరులు, పీహెచ్‌సీలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు
నిజాంసాగర్(జుక్కల్): ఇంటర్ విద్యార్థిని కృప మరణం మరవకముందే పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురయ్యారు. వారం నుంచి పలువురికి జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం గురుకుల పాఠశాలకు చెందిన 8 మందికి ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో పీహెచ్‌సీలో వైద్య చికిత్సలు చేయించారు. వీరిలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న జ్యోతి అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మిగతావారికి ఏఎన్‌ఎం సవిత ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నారు. గురుకులంలో తరుచూ విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నా, పాఠశాల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తనిఖీలతో వెలుగులోకి..
పెద్దకొడప్‌గల్‌లోని బాలికల గురుకులాన్ని గురువారం గ్రామ సర్పంచ్ మౌనికసాయిరెడ్డి, తహసీల్దార్ గణేశ్ తనిఖీలు చేశారు. పాఠశాలలోని డార్మెట్ రూమ్‌ల్లోని మంచాలపై విద్యార్థినులు పడుకొని ఉండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారం నుంచి జ్వరాలు వస్తున్నాయని విద్యార్థినులు చెప్పడంతో వారు అవాక్కయారు. వెంటనే పీహెచ్‌సీ వైద్యుడు శ్రీనివాస్ గుప్తను గురుకులానికి రప్పించారు. వైరల్ ఫీవర్‌తో బాధతున్న విద్యార్థినులకు పరీక్షలు చేయించారు.
ఎనిమిది మంది విద్యార్థులను ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం సర్పంచ్, తహసీల్దార్ గురుకులంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినుల డార్మెట్ రూమ్‌ల్లో దోమల బెడదతోపాటు నీటిసదుపాయం లేక విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురువుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. విద్యార్థినులకు అందిస్తున్న పండ్లు కుళ్లడంతో సిబ్బందిపై తహసీల్దార్ మండిపడ్డారు. ఆయన ఈ విషయాన్ని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ దృష్టికి తీసుకు వెళ్లి ఇక్కడి పరిస్థితులను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment