చికిత్స పొందుతున్న విద్యార్థినులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : అధికారుల నిర్లక్ష్యం విద్యార్థినులకు శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (గురుకుల) హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులను ప్రయివేటు కార్యక్రమానికి తరలించడమే కాకుండా, వారికి నిల్వ ఉన్న ఆహారం పెట్టి అస్వస్థతకు గురి కావడానికి కారకులయ్యారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్‌లో మెరుగైన విద్య, వసతులు కల్పిస్తారని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు చేరితే, వారికి కలుషిత ఆహారం అందించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
ఏమిటీ నిర్లక్ష్యం..
ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న బాల, బాలికలను ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించడం ఆనవాయితీగా మారింది. అదే రీతిలో ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి సైతం రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఉంటున్న డిగ్రీ విద్యార్థినులు 110 మందిని నిబంధనలకు విరుద్ధంగా తరలించారు. ఎవరి అనుమతితో తరలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు సైతం సీరియస్ అవుతున్నారు.
నిల్వ ఉన్న ఆహారంఅందించడమేంటి..
రెనిడెన్షియల్ హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులకు బయట భోజనాల వద్ద మిగిలిన చికెన్ కర్రీ తీసుకువచ్చి వడ్డించినట్లు తెలిసింది, వసతి గృహాలకు బయటి నుంచి ఆహారం ఎలా తీసుకువచ్చి పెడతారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా ఆదివారం మధ్యాహ్నం భోజనాలకు తయారు చేసిన కర్రీని సోమవారం ఉదయం కూడా విద్యార్థినులు తింటుంటే, హాస్టల్‌ను పర్యవేక్షించాల్సిన వారు ఏం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఉదయం పెట్టిన వెజిటబుల్ బిర్యానీ కూడా సరిగ్గా లేదని విద్యార్థినులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే వారికి శాపంగా మారిందని, 15 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.
నిలకడగానే ఆరోగ్యం..
అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. చక్రధర్ ప్రకటించారు. అయితే ఐదుగురిని ముందు జాగ్రత్తగా కార్పొరేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ చేసిన వారిని మంగళవారం ఉదయం మరోసారి పరిశీలించి డిశ్చార్జి చేస్తామని చెప్పారు. కాగా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయకృష్ణణ్, జాయింట్ కలెక్టర్ – 2 బాబూరావు విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.
ఇదేమి వైద్యం: ప్రభుత్వాస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల నిరసన
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : కల్తీ ఆహారం తిని అస్వస్థతతో వచ్చిన విద్యార్థినులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. కనీసం వారిని తీసుకొచ్చేందుకు స్టెచ్చర్‌లు కూడా లేని దయనీయ స్థితి ప్రభుత్వాస్పత్రిలో నెలకొందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ఒక్కో స్ట్రెచ్చర్‌పై ఇద్దరు, ముగ్గురు విద్యార్థినులను ఉంచి చికిత్స చేస్తున్న వైనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత ఓ విద్యార్థినిని చికిత్స అందించకుండా అలాగే వదిలేయడంతో ఆమెను జాయింట్ కలెక్టర్–2 బాబూరావు చూశారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను పిలిచి చీవాట్లు పెట్టడంతో సమీపంలో ఉన్న డాక్టర్ భవానీశంకర్ అక్కడకు వచ్చి విద్యార్థినిని చేతులపై ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్ మీదకు పడుకోబెట్టారు. ఒకేసారి 15 మంది విద్యార్థినుల రాకతో ప్రభుత్వాస్పత్రి డొల్లతనం బయటపడింది. మరోవైపు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె. రమేష్, కృష్ణ, కోటి తదితరులు ఆస్పత్రిలో విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment