గురుకుల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది(ఫైల్)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు విద్యార్థులకు మేలు చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి ఆరోగ్య సమస్యల్ని గుర్తించి సత్వర చికిత్సను అందిస్తున్నారు. పేద పిల్లలు కావడంతో పోషకాహారం అందక రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారిని గుర్తించి చికిత్సను అందించేందుకు చర్యలు చేపట్టారు.
ఇప్పటివరకూ 185 గురుకులాల్లో విద్యార్థులకు ఎనీమియా, పోషకాహార లోపానికి సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరోవైపు విద్యార్థుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా పోషక విలువతో కూడిన ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నారు. దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. వైఎస్సార్ కంటి వెలుగు బృందాలతో ఇప్పటివరకు 91 గురుకులాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించారు.
వారిలో కంటి సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలను కొనసాగిస్తున్నారు. దంత సమస్యలను గుర్తించేందుకు ఇప్పటివరకూ 68 గురుకులాల్లో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. మిగిలిన వాటిలోనూ దంత పరీక్షలు కొనసాగుతున్నాయి. కౌమార దశలోని బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై అవగాహన కల్పించేలా ‘వాయిస్ ఫర్ గరల్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన 800 మంది బాలికలకు ఇప్పటికే ఈ శిక్షణ పూర్తి చేశారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి వీలుగా బోధన, బోధనేతర సిబ్బందికి ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం.. పోషకాహారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గురుకులాల్లో చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. పేద పిల్లల పెద్ద చదువులకు వారధిగా నిలుస్తున్న అంబేడ్కర్ గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం, పోషకాహారం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానంగా నేత్ర, దంత, పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆడ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి తగిన అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment