social welfare gurukul schools
-
గురుకుల ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం కానుకగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించినట్టుగానే గురుకుల ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 11ను జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రకటించింది ప్రభుత్వం. సాంఘిక గురుకుల ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు శెట్టి రజని, ప్రధాన కార్యదర్శి సిరిమళ్ల జానకమ్మ, కోశాధికారి విక్టోరియా, స్వప్నారెడ్డి, సునీత, కిరణ్మయి, చంద్రశేఖర్ ప్రసూన, గాయత్రిలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. కాంగ్రెస్ నేతతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ! -
గురుకులాల్లో ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు విద్యార్థులకు మేలు చేస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి ఆరోగ్య సమస్యల్ని గుర్తించి సత్వర చికిత్సను అందిస్తున్నారు. పేద పిల్లలు కావడంతో పోషకాహారం అందక రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే వారిని గుర్తించి చికిత్సను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 185 గురుకులాల్లో విద్యార్థులకు ఎనీమియా, పోషకాహార లోపానికి సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరోవైపు విద్యార్థుల్లో పోషకాహార లోపం తలెత్తకుండా పోషక విలువతో కూడిన ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నారు. దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. వైఎస్సార్ కంటి వెలుగు బృందాలతో ఇప్పటివరకు 91 గురుకులాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో కంటి సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలను కొనసాగిస్తున్నారు. దంత సమస్యలను గుర్తించేందుకు ఇప్పటివరకూ 68 గురుకులాల్లో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. మిగిలిన వాటిలోనూ దంత పరీక్షలు కొనసాగుతున్నాయి. కౌమార దశలోని బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై అవగాహన కల్పించేలా ‘వాయిస్ ఫర్ గరల్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన 800 మంది బాలికలకు ఇప్పటికే ఈ శిక్షణ పూర్తి చేశారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి వీలుగా బోధన, బోధనేతర సిబ్బందికి ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం.. పోషకాహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గురుకులాల్లో చదివే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. పేద పిల్లల పెద్ద చదువులకు వారధిగా నిలుస్తున్న అంబేడ్కర్ గురుకులాల్లో విద్యతోపాటు వైద్యం, పోషకాహారం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానంగా నేత్ర, దంత, పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆడ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి తగిన అవగాహన కల్పించి చైతన్యం తెచ్చేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
గురుకులాల్లో 317 గుబులు! జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 గుబులు మొదలైంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఆమేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను కేడర్ల వారీగా కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. తాజాగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వం ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించింది. దీంతో కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపుపై సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లు జీఓ 317 అమలుకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వగా... అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అతి త్వరలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలోనూ కొత్త జోన్ల వారీగా ఉద్యోగ కేటాయింపు ప్రక్రియ మొదలు కానుంది. నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే కొత్తగా నియామకాలు, పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమం కానుంది. వివరాల సేకరణ షురూ ఎస్సీ, మైనార్టీ గురుకుల సొపైటీల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగుల నుంచి నిర్దేశించిన ఫార్మాట్లో వివరాలను సేకరించే పనిలో రీజినల్ కోఆర్డినేటర్లు బిజీ అయ్యారు. ఇప్పటికే దాదాపు సమాచారం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించాక సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరం కేటాయింపులు జరుపుతారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా నిర్దేశించిన కేటగిరీల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం కొత్త జోనల్ విధానం ప్రకారం విభజన అంశం జోనల్ స్థాయి ఉద్యోగుల్లోనే ఎక్కువ గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కొత్త విధానంతో జోన్ల సంఖ్య ఏడుకు పెరిగింది, ఇందులో జోన్ పరిధి తగ్గింది. ఈ క్రమంలో జోనల్ స్థాయి ఉద్యోగుల స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపితే సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం అనివార్యం కానున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల స్థానచలనం జరిగితే పిల్లల చదువులు, ఇతరత్రా అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన ఇలా... జిల్లా స్థాయి: జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండర్ జోనల్ స్థాయి: టీజీటీ, సూపరింటెండెంట్, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 2), లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, వార్డెన్, పీఈటీ, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, ప్లంబర్/ఎలక్ట్రీషియన్ మల్టీ జోనల్ స్థాయి: ప్రిన్సిపల్ (గ్రేడ్ 2), డిగ్రీ కాలేజీలోని లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 1), పీజీటీలు. జిల్లా, మల్టీ జోన్లలో కొందరు జిల్లాస్థాయి, మల్టీ జోనల్ స్థాయి కేడర్ ఉద్యోగుల్లోనూ కొన్ని మార్పులు తప్పవని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాల పరిధి కుదించుకోపోవడం, ఇదివరకు మల్టీ జోన్ లేకుండా రాష్ట్రస్థాయి పోస్టులుండగా... ఇప్పుడు ఆయా కేడర్లలోని ఉద్యోగుల్లో కొందరికి మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం వివరాల సేకరణలో ఉన్న అధికారులు.. వారంలోగా సీనియారిటీ ఆధారంగా కేటాయింపులపై ప్రాథమిక జాబితాలు రూపొందిస్తే కొంత స్పష్టత రానుంది. మరోవైపు ఉద్యోగుల కేటాయింపులు మాత్రమే ఇప్పుడు జరిపి, స్థానచలనం జరిగితే కొంత సమయం ఇవ్వాలనే ఉద్యోగుల వినతులను ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం. చదవండి: Telangana: ఊరూరా గోదారే!.. కనీవినీ ఎరుగని జలవిలయం -
గురుకులంలోకి అగంతకుడు.. రాత్రి సమయంలో విద్యార్థుల గదుల్లోకి
సాక్షి, నిర్మల్: సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయంతో పాటు అదే ప్రాంగణంలోని కస్తూరిబా విద్యాలయంలో శనివారం ఓ అగంతకుడు చొరబడి విద్యార్థులు నిద్రిస్తున్న గదుల్లో సంచరించాడు. గత గురువారం సైతం ఇదే విధంగా రావడంతో గమనించిన సిబ్బంది, విద్యార్థులు కేకలు వేశారు. వెంబడించడంతో పరారయ్యాడు. శనివారం రాత్రి సేమ్ సీన్ రిపీట్ కావడంతో విద్యార్థులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి అక్కడికి చేరుకుని వి ద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. అగంతకుడు కేజీబీవీ వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాగ లతను వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తి రెండు సార్లు వచ్చిన విషయం వాస్తవమేనని, త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కేజీబీవీ ఎస్వో అన్నపూర్ణను వివరణ కోరగా.. వెనుకవైపు ప్రహరీని మూపివేయకపోవడంతో అగంతకుడు లోనికి వ చ్చాడని, ఈమేరకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. -
33 ఏళ్ల తర్వాత నియామకాలు : మంత్రి విశ్వరూప్
సాక్షి, తాడేపల్లి : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో దాదాపు 33 ఏళ్ల తర్వాత కేర్ టేకర్ల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలియజేశారు. బుధవారం ప్రిన్సిపాల్, కేర్టేకర్లుగా నియమితులైన వారికి మంత్రి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా కేర్ టేకర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పారదర్శకంగా శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. త్వరలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 552 టీజీటీ పోస్టులను కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు. నాడు, నేడు కింద విద్యాలయాలు, గురుకులాలను అభివృద్ధి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామంటూ.. వసతి గృహాల్లో మెరుగైన విద్య, ఆహారం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
సాంఘిక సంక్షేమ గురుకులాలకు 775 పోస్టులు
10 గురుకుల పాఠశాలలు, 2 ప్రత్యేక గురుకులాల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ప్రిన్సిపాల్ నుంచి వార్డెన్ల వరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల మంజూరు రెగ్యులర్ పోస్టులు 657, ఔట్ సోర్సింగ్ పోస్టులు 118 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రారంభ మయ్యే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రిన్సిపాల్ నుంచి వార్డెన్, ఇతర ఔట్ సోర్సింగ్ సేవలను కలుపుకుని 775 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 657 రెగ్యులర్ పోస్టులు కాగా, మరో 118 ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే పోస్టులు. పోస్టులు, పేస్కేల్ వివరాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాబోతున్న 10 గురుకుల పాఠశాలలతో పాటు కరీంనగర్లో ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్, రాయికోట్లోని రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. కాగా, ఈ గురుకుల పాఠశాలలు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నేతృత్వంలో పనిచేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా ప్రారంభమయ్యే గురుకులాలు: బెల్లంపల్లి(బి), మానకొండూరు(బి), ఆలంపూర్(బి), చెన్నూరు(జి), వర్ధన్నపేట(బి), దానవాయిగూడెం(జి), కుల్చారం(జి), గోపాలపేట(జి), దోమకొండ(జి), గచ్చిబౌలి(జి) గురుకుల పోస్టులు: ప్రిన్సిపాల్-10, పీజీటీలు-90, టీజీటీలు-90, పీఈటీ-20, లైబ్రేరియన్-10, స్టాఫ్ నర్స్-10, క్రాఫ్ట్ టీచర్-10, ఆర్ట్/మ్యూజిక్ టీచర్-10, సూపరింటెండెంట్-10, సీనియర్ అసిస్టెంట్-10, వార్డెన్-10. రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్(జి), రాయ్‌కోట్ పోస్టులు: ప్రిన్సిపాల్ గ్రేడ్ 2-1, ఫిజికల్ డెరైక్టర్ గ్రేడ్ 1-1, పీజీటీలు-5, టీజీటీలు-3, పీఈటీ-1, లైబ్రేరియన్-1, స్టాఫ్ నర్స్-1, సూపరింటెండెంట్-1, సీనియర్ అసిస్టెంట్-1, వార్డెన్-1. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్(సీఈవో), కరీంనగర్ పోస్టులు: ప్రిన్సిపాల్ గ్రేడ్ 1-1, జూనియర్ లెక్చరర్-19, పీజీటీలు-9, టీజీటీలు-1, పీడీ-1, పీఈటీ-1, లైబ్రేరియన్-1, స్టాఫ్ నర్స్-1, సూపరింటెండెంట్-1, సీనియర్ అసిస్టెంట్-1, వార్డెన్-1. 108 అప్‌గ్రేడెడ్ స్కూళ్ల కోసం టీజీటీ పోస్టులు-324. ఇవి కాక 10 గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించే పోస్టులు: జూనియర్ అసిస్టెంట్/డేటాఎంట్రీ ఆపరేటర్-20, ప్లంబర్ కమ్ ఎలక్ట్రిషియన్-10, రికార్డు అసిస్టెంట్-10, ఆఫీస్ సబార్టినేట్-40. రాయ్‌కోట్ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ మొదలుకుని 13 కేటగిరీల్లో 29 పోస్టులు, కరీంనగర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ కోసం 4 కేటగిరీల్లో 9 పోస్టులను మంజూరు చేశారు.