
గురుకుల విద్యార్థి నులకు వివిధ రంగాల ప్రముఖులు, నిపుణుల దిశానిర్దేశం
సమయాన్ని వృథా చేసుకోవద్దు.. మహిళా దినోత్సవం సందర్భంగా
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రత్యేక కార్యక్రమం
జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం
సమాజంలో ఒత్తిడులను ఎదుర్కొని విజయవంతమైన మహిళగా ఎదగాలంటే ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలంటూ గురుకుల విద్యార్థి నులకు పలు రంగాల నిపుణులు, ప్రముఖులు మనోనిబ్బరం నింపారు. నవ్వుతూ, సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలని.. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో మెలగా లని దిశానిర్దేశం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి అలగు వర్షిణి ఆధ్వర్యంలో విద్యార్థి నులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జూమ్ మీటింగ్ ద్వారా పలువురు ప్రముఖులు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల బాలికల పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిపుణులు, ప్రముఖులు చెప్పిన అంశాలు, సూచనలివీ.. –సాక్షి, హైదరాబాద్
మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పవు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇక్కడ ఒక ఈ–సిగరెట్ కంపెనీ స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పాలకులను, అధికార యంత్రాంగాన్ని సమన్వయపరచి ఆ కంపెనీ నెలకొల్పకుండా చేశాను. ఒకవేళ ఆ కంపెనీ నెలకొల్పి ఉంటే ఎంతోమంది అనారోగ్యా ల బారినపడేవారు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ‘బేటీ బచావో.. బేటీ పడావో, ఆయుష్మాన్ భవ’వంటి వినూత్న కార్యక్రమాలను దేశ ప్రజలకోసం ప్రవేశపెట్టే ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. దేశం కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఉన్నతంగా ఆలోచిస్తే మన మదిలో ఇంకా ఎన్నో మంచి ఆలోచనలు, పథకాలు పుట్టుకొస్తాయి. – ప్రీతి సుదాన్, యూపీఎస్సీ చైర్మన్
సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి
మన ముఖంలో చిరునవ్వుతో, సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండొద్దు. మన ముఖంలో నవ్వు లేకపోతే ఇతరులు కూడా మనతో అలాగే ఉంటారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్లతో పోల్చితే గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. సమయాన్ని వృథా చేసుకోకుండా ఉన్నతంగా రాణించేలా లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దానిని చేరుకునేలా ముందుకు వెళ్లాలి. – ఛాయా రతన్, రిటైర్డ్ ఐఏఎస్
సమయం వృథా చేసుకోవద్దు
పస్తుతం మెడికల్ సీటు సాధించాలంటే చాలా కష్టపడాలి. నీట్ కోచింగ్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాల్లో చక్కటి తర్పిదు ఇస్తున్నారు. నేను కూడా గౌలిదొడ్డి కళాశాలలో చదివాను. ఆ రోజుల్లో కేవలం సబ్జెక్టు పుస్తకాలను చదివి ర్యాంకు సాధించాను. ఇప్పుడు లైబ్రరీలు, డిజిటల్ రూపంలో పూర్తిస్థాయిలో మెటీరియల్ లభిస్తోంది. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథా చేయవద్దు. క్రమశిక్షణతో ఉండాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల స్రత్పవర్తనతో ఉండాలి. – డాక్టర్ శిరీష, ఎండి (మెడిసిన్) స్విమ్స్, తిరుపతి
మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి
మన జీవితం ఒక తెల్ల కాగితం వంటిది. అందులో ఎంత చక్కగా చిత్రాన్ని గీస్తే అంత అద్భుతంగా, అందంగా ఉంటుంది. మన జీవితం కూడా అంతే. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. కోవిడ్ సమయంలో 21వేల కాల్ సెంటర్లు పెట్టి, వేల మంది ప్రజల జీవితాలను కాపాడేలా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. – అలగు వర్షిణి, కార్యదర్శి, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్
భయం వదిలితేనే విజయం
చాలా మంది భయంతో ఏ పనిలోనూ ముందుకు వెళ్లలేరు. భయాన్ని వీడితే ఎన్నో విజయాలు సాధించవచ్చు. విద్యార్థుల్లో భయమే వారి చదువులో వెనుకబాటు తనానికి కారణం.’అన్నారు. భయాన్ని వీడేందుకు పలు చిత్రాలను ఆమె ప్రదర్శించారు. ఈ చిత్రాలను వీక్షించిన విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. – డాక్టర్ గీతా చల్ల, చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకాలజిస్ట్
శక్తి వంచన లేకుండా కృషి చేస్తే విజయం తథ్యం
చదువుతోపాటు క్రీడలు కూడా నాకు ఎంతో ఇష్టం. క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నా. ఇప్పటివరకు 42 పతకాలను సాధించాను. రానున్న ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధిస్తానన్న విశ్వాసం ఉంది. విద్యార్థులను ప్రోత్సహించే అధ్యాపకులకు, కోచ్‌లకు, తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. – అగసారా నందిని, అంతర్జాతీయ క్రీడాకారిణి, బుధేల్ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment