
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్.. ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమానికి హాజరైన మహిళలు
అదానీ, అంబానీలకు దీటుగా తెలంగాణ మహిళల వ్యాపారం
పరేడ్ గ్రౌండ్స్‌లో ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చితే బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు.. ఆర్టీసీకి అద్దె బస్సులు..
పదేళ్ల చంద్ర గ్రహణం వీడింది.. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు వెలుగులు
ప్రమాదాలను చూస్తూ పైశాచిక ఆనందంతో ప్రతిపక్షాలు నవ్వుకుంటున్నాయని మండిపాటు
ఇందిరా మహిళాశక్తి మిషన్–2025 పాలసీ ఆవిష్కరణ
ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి.. రేవంత్ స్ఫూర్తి
ఎప్పుడైనా కూడా మహిళలకు అండగా నిలిచింది ఇందిరమ్మ రాజ్యమే. ప్రజలు ఇందిరాగాందీని అమ్మ అని పిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు. ఇప్పుడు నన్ను కూడా అన్నా అని పిలుస్తున్నారు. తోబుట్టువు మాదిరిగా ఆదరిస్తున్నారు. అలాంటి తోబుట్టువుల కోసం నేను ఎలాంటి రిస్క్ అయినా ఎదుర్కొంటా. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి.. రేవంత్ స్ఫూర్తితో మీరు ముందుకెళ్లండి. ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఆడబిడ్డల అభివృద్ధే. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేలా తీర్చిదిద్దుతా.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగల శక్తి మహిళలేనని.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఇందిరా మహిళా శక్తి(Mahila Shakthi)’కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లు చంద్రగ్రహణంతో మహిళలు చీకటిలోకి నెట్టబడ్డారు.
వారు కనీసం మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పదేళ్ల పాటు మహిళాభివృద్ధి జాడలేదు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంతో మహిళలు మళ్లీ వెలుగులోకి వచ్చారు. రాష్ట్ర రాజధాని నగరానికి వచ్చి ఆత్మగౌరవాన్ని చాటే పరిస్థితికి వచ్చారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు వడ్డీలేకుండా రుణాలు ఇవ్వడం మొదలు వివిధ ఆర్థిక పురోగతి కార్యక్రమాలతో సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థుల కోసం 1.30 కోట్ల యూనిఫారాలు కుట్టే బాధ్యతను మహిళలు విజయవంతం చేశారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీలో మహిళా బజార్ ఏర్పాటు చేశాం. సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.25 కోట్లతో మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం.
మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం
అదానీ, అంబానీలే కాదు.. తెలంగాణ మహిళలు విద్యుత్ వ్యాపారాన్ని చేయగలరనే ధీమాతో వారికి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. వారిని పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా.. ఆరీ్టసీకి బస్సులు అద్దెకు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తున్నాం.
వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను వారి ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఎంఓయూ కుదిర్చాం. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోడౌన్స్ నిర్మించే బాధ్యత తీసుకుంటా. మిల్లుల్లో ధాన్యాన్ని బొక్కుతున్న పందికొక్కులకు, దొంగలకు బుద్ధి చెబుతాం. ప్రభుత్వమే మహిళలకు స్థలం ఇస్తుంది, రుణాలు ఇస్తుంది, గోడౌన్స్ నిర్మించండి, వ్యాపారవేత్తలుగా మారండి. మీకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలతో పోటీపడేలా మహిళలు వ్యాపారాల్లో ముందుకెళ్లాలి.
మహిళా సంఘాల్లో వయసు సడలింపు..
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీల్లో) 65 లక్షల మంది ఉన్నారు. మేం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఎస్‌హెచ్‌జీలలో చేరే నిబంధనలు సడలించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఇకపై 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మహిళలందరికీ అవకాశం కల్పించేలా నిబంధనలు తెస్తాం..’’అని సీఎం రేవంత్ తెలిపారు.

ఎస్‌హెచ్‌జీలకు చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్, పొన్నం, జూపల్లి తదితరులు
వడ్డీ లేకుండా రూ.21 వేల కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేకుండా రూ.21వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్ల పాటు మహిళా సంఘాలకు పైసా సాయం చేయని గత ప్రభుత్వ నేతలు.. ఈరోజు ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలేని రుణాలంటే వెకిలిగా నవ్వుతున్నారని మండిపడ్డారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలను తీసుకువస్తోందన్నారు.
రాష్ట్రంలో మహిళలు తలెత్తుకుని మహాలక్ష్మిలా గౌరవంగా బతకాలన్నదే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు బడితె మాదిరి పెరిగారే తప్ప మహిళలకు కనీసం రుణాలు ఇప్పించలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేసి ప్రజల సంపద పెరిగేందుకు కృషి చేస్తోందని.. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి కింద ప్రజాప్రభుత్వం 20 రకాల అద్భుత కార్యక్రమాలను అమల్లోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.
‘ఇందిరా మహిళా శక్తి’ విశేషాలివీ..
⇒ మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్న బస్సులను సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభించారు.
⇒ కార్యక్రమంలో 2,82,552 స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు రూ.22,794.22 కోట్ల రుణాల చెక్కులను సీఎం అందించారు.
⇒ ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణబీమా, ప్రమాద బీమా పథకాల కింద రూ.44.80 కోట్ల చెక్కును అందించారు.
⇒ మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
⇒ ఇందిరా మహిళాశక్తి మిషన్–2025 పాలసీని సీఎం ఆవిష్కరించారు.
⇒ సభకు ముందు సీఎం రేవంత్, మంత్రులు వివి ధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కుటీర పరిశ్రమల స్టాళ్లను, మహిళా పెట్రోల్ బంకు నమూనాను పరిశీలించారు.
బీఆర్‌ఎస్ నేతలది పైశాచిక ఆనందం
రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదం జరిగినా నన్ను తిడుతూ ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందుతున్నాయి. టన్నెల్ కూలి కార్మికులు మరణిస్తే సంతోషపడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే నవ్వుతున్నారు. పంటలు ఎండితే బీఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. వాళ్ల పైశాచిక ఆనందం కోసం నన్ను తిడుతున్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయతి్నంచాలి. పదేళ్ల పాలన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. అలాంటివారు బాగుపడరు.
Comments
Please login to add a commentAdd a comment