
కారుణ్య నియామకంపై సర్కార్‌కు హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కుమార్తె వైవాహిక స్థితిని పరిగణనలోకి తీసుకుని కారుణ్య నియామకానికి అర్హురాలు కాదని చెప్పడం సరికాదని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహమైనా ఆమె అర్హురాలేనని, అయితే దీనికి వారి ఆర్థిక పరిస్థితి సహా పలు అంశాలను పరిశీంచాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈమేరకు పిటిషనర్ దరఖాస్తును పునఃపరిశీలించాలని ఆదేశించింది. నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్లతో మళ్లీ వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది.
కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తూ యూసఫ్ మృతిచెందారు. కారుణ్య నియామకం కింద తన కుమార్తె ఫాతిమాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని సీపీ నిరాకరించారంటూ యూసఫ్ భార్య షాహీన్ సుల్తానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు విచారణ చేపట్టారు. ‘షాహీన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కుమారుడు కెనడా వెళ్లి తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు. కూతురు ఫాతిమానే తల్లిని చూసుకుంటోంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి సరైన వైద్యం కూడా అందించలేకపోతోంది’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ‘పిటిషనర్‌కు కుమారుడు ఉన్నారు. అతను ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే కారుణ్య నియామక విజ్ఞప్తిని సీపీ తిరస్కరించారు. ఫాతిమా, ఆమె భర్త ఆర్థిక పరిస్థితిని షాహీన్ వెల్లడించలేదు’ అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆమె డాక్యుమెంట్లను పునఃపరిశీలన చేసి నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.