
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్) ఫలితాలు ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. ఈ నెల 1న ప్రారంభమైన రెండో విడత మెయిన్స్ పరీక్షలు 9వ తేదీతో ముగిశాయి. మొత్తం 12 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది వరకూ పరీక్ష రాశారు. తొలి విడత పరీక్షలు జనవరిలో జరిగాయి. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేశారు. రెండు విడతల మెయిన్స్ పూర్తవడంతో విద్యార్థులకు ర్యాంకులు కేటాయించనున్నారు. వీటి ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు.
23 నుంచి అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్
దేశవ్యాప్తంగా మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరుగనుంది. మెయిన్స్ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నెల 23 నుంచి అడ్వాన్స్‌డ్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు.