సాక్షి, హైదరాబాద్: ఒకటో తేదీ (నేటి) నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను, 2 నుంచి 6వ తేదీ వరకు బీటెక్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 660 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరుకానున్నారు. ఇక రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌లో 27 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్‌టికెట్‌లో పేర్కొన్న పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేయనున్నారు. తర్వాత వచ్చే వారిని అనుమతించరు. మధ్యాహ్నం పరీక్షకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది.
విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్‌తోపాటు ఏదేని గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. ఇక పరీక్షలకు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా విద్యార్థులు హాజరుకానున్నారు. ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ వర్గాలు వెల్లడించాయి. దీంతో 12వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లను ఐఐటీ ఢిల్లీ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 27న జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించిన ఐఐటీ ఢిల్లీ వాటి ఫలితాలను అక్టోబర్ 5న ప్రకటిస్తామని తాజాగా వెల్లడించింది. మరోవైపు ఐఐటీల్లో బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును (ఏఏటీ) అక్టోబర్ 8న నిర్వహిస్తామని, 11న ఫలితాలు వెల్లడిస్తామని వివరించింది. మొత్తానికి ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను అక్టోబర్ 6 నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా!)
Comments
Please login to add a commentAdd a comment