compassionate appointment
-
ఏడాదిన్నార కాలంలోనే 245 శాశ్వత నియామకాలు
-
AP Govt: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రేడ్–1, 2 గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)కు ప్రభుత్వం భరోసానిచ్చింది. సర్వీస్‌లో ఉన్న గ్రేడ్–1, 2 వీఆర్వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ ఏపీ వీఆర్వో సర్వీస్ నిబంధనలు–2008 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. దీంతో గ్రేడ్–1, 2 వీఆర్వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత కలిగిన భాగస్వామి/పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్‌కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారు. కారుణ్య నియామకాలపై వీఆర్వోలు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం వీఆర్వోల డిమాండ్‌ను పట్టించుకోలేదు. సీఎం జగన్ సర్కార్.. వీరి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని వీఆర్వోల సుదీర్ఘ కాల డిమాండ్‌ను నెరవేర్చింది. దీనిపై ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (ఏపీ టెట్ ఫలితాలు విడుదల) -
ఆర్టీసీలో మళ్లీ కారుణ్య నియామకాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఆర్టీసీ పాలక మండలి ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం కనీస వేతనాల చెల్లింపు(ప్రభుత్వ నిబంధనల ప్రకారం) పద్ధతిలో మాత్రమే వీటిని చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులకు సంబంధించిన (చనిపోయినవారు, తీవ్ర అనార్యోగానికి గురైనవారు) కుటుంబసభ్యులు మూడేళ్లుగా బ్రెడ్ విన్నర్ స్కీం కింద కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అందులో తొలి విడతలో 300 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకోబోతోంది. వారి పనితీరు బాగుంటే రెండేళ్ల తర్వాత రెగ్యులరైజ్ చేయనున్నారు. తదుపరి రిటైర్మెంట్లతో పోస్టులు ఖాళీ అయ్యేకొద్దీ మిగతావారిని తీసుకోవాలని బోర్డు సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ పాలకమండలి తొలి సమావేశం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగింది. చైర్మన్ సహా 9 మంది బోర్డు సభ్యులకుగాను ఏడుగురు సమావేశానికి హాజరయ్యారు. పనిఒత్తిడి కారణంగా జీహెచ్ఎంసీ, రవాణాశాఖ కమిషనర్లు హాజరు కాలేదు. కారుణ్య నియామకాలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ఆర్టీసీ ఎండీకి బోర్డు సూచించింది. ఏడేళ్ల అకౌంట్స్‌కు అనుమతి టీఎస్ ఆర్టీసీ ఏర్పడిన ఏడేళ్లలో ఆర్థికపరమైన పద్దులకు ఇప్పుడు బోర్డు ఆమోద ముద్ర(రాటిఫికేషన్) వేసింది. ఈ ఖాతాలకు సంబంధించి ఏజీ ఆడిట్ ఇప్పుడు నిర్వహించాల్సి ఉంది. ఆడిట్ కాకపోవడం వల్ల ఇంతకాలం బ్యాంకు రుణాలు తీసుకునే విషయంలో ఆర్టీసీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 1,050 కొత్త బస్సులు: బస్సులు పాతబడి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న తరణంలో 1,050 కొత్త బస్సులు కొనాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సులు కొనే విషయంపై దృష్టి సారించాలని చైర్మన్ బాజిరెడ్డి సూచించారు. ఇటీవలే వివిధ సెస్‌ల పేరుతో పెంచిన ఆర్టీసీ చార్జీలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ సెస్‌ల విధింపు వల్ల రూ.వంద కోట్ల వరకు ఆదాయం పెరిగిందని, ఈ పెంపు నామమాత్రమే అయినందున ప్రజల నుంచి వ్యతిరేకత కూడా లేదని అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా సెస్‌ను సవరించే అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడానికి, దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని ప్రారంభించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశంతో కార్గో, పార్శిల్ విభాగాలను ఏర్పాటు చేశామని, అవి ప్రారంభించిన రెండేళ్లలో రూ.వంద కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. బోర్డు లేకపోవడం వల్ల ఇంతకాలం పేరుకుపోయిన 55 అంశాలకు సమావేశంలో ఆమోదముద్ర వేసింది. సమావేశానికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాణికుముదిని, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రోడ్లు, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కేంద్ర రోడ్లు, రవాణా శాఖ డైరెక్టర్ పరేశ్ కుమార్ గోయల్, ఆ శాఖ ఈఎన్సీ రవీంద్రరావు తదితరులు హాజరయ్యారు. -
కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే అతని/ఆమె డిపెండెంట్‌కు కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబం ఆర్థిక స్థితిగతులు, అతడు/ఆమెపై ఆ కుటుంబంలోని వారు ఏ మేరకు ఆధారపడ్డారు, వారు వృత్తి, వ్యాపారాల్లో కొనసాగుతున్నారా వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కారుణ్యనియామకాన్ని చేపట్టాల్సి ఉంటుందని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. సర్వీస్ నిబంధనల్లో కారుణ్య నియామకం కూడా ఒక్కటై, ఉద్యోగి మరణించిన సందర్భాల్లో ఆటోమేటిక్‌గా, ఎలాంటి పరిశీలనలు జరపకుండా కారుణ్య నియామకం చేపడితే అది సంపూర్ణ చట్టబద్ధ హక్కు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘కానీ, ప్రస్తుతం కారుణ్య నియామకం అలా కాదు. అది వివిధ పరామితులకు లోబడి ఉంటుంది. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక పరిస్థితులు, ఆ కుటుంబం ఏమేరకు ఆ మృత ఉద్యోగిపై ఆధారపడి ఉంది, వారు సాగిస్తున్న వివిధ వృతులు, ఉద్యోగాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు భీమేశ్ అనే వ్యక్తికి కారుణ్య కారణాలతో ఉద్యోగం ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన బెడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. భీమేశ్ సోదరి కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తూ 2010లో చనిపోయారు. అవివాహిత అయిన ఆమెకు తల్లి, ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సోదరి ఆదాయంపై తమ కుటుంబం ఆధారపడి ఉన్నందున తనకు కారుణ్య కారణాలతో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ భీమేశ్ వాదించగా అధికారులు తిరస్కరించారు. దీంతో, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా తీర్పు అనుకూలంగా వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా, ట్రిబ్యునల్ తీర్పునే కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో, ఆ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సుప్రీంకోర్టు తలుపుతట్టింది. -
ఆ ఉద్యోగం వద్దు.. పంజాబ్ ఎమ్మెల్యే స్పష్టీకరణ
చండీగఢ్: పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫతేజంగ్ సింగ్ బజ్వా తన కుమారుడు అర్జున్ ప్రతాప్‌సింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులుకున్నట్టు స్పష్టం చేశారు. బజ్వా తండ్రి వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో బలి కావడంతో కారుణ్య నియామకాల కింద ఆయన కుమారుడికి ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల్లో ఒకరికి పోలీసు ఇన్స్పెక్టర్, ఇంకొకరికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మౌనం వీడిన ఎమ్మెల్యే తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ఆ ఉద్యోగం అక్కర్లేదని కుటుంబ సభ్యులందరం నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్‌పై అపోహలు తొలగించండి -
కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపించకుండా పోయినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలని, అప్పుడు మాత్రమే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరు కారుణ్య నియామకం కింద ఉద్యోగానికి అర్హులవుతారన్న నిబంధనను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ నిబంధన ఏకపక్షమని, అన్యాయమని పేర్కొంటూ దాన్ని కొట్టేసింది. ఈ నిబంధనను కారణంగా చూపుతూ.. కనిపించకుండాపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఎఫ్ఐఆర్ నాటికి ఏడేళ్ల సర్వీసు మిగిలి లేదన్న కారణంతో అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తూ అధికారులు జారీ చేసిన మెమోను రద్దు చేసింది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్ శ్రీనివాసరావు పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, అతడికి సరిపోయే పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో టి.సుబ్బారావు ప్లాంట్ అటెండెంట్‌గా పనిచేస్తూ 2001 ఆగస్టు 26న కనిపించకుండా పోయారు. దీనిపై సుబ్బారావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం సంబంధిత కోర్టులో సుబ్బారావు అదృశ్యాన్ని ‘అన్ డిటెక్టబుల్’గా పేర్కొంటూ తుది నివేదిక దాఖలు చేశారు. 2002 అక్టోబర్‌లో ఇదే విషయాన్ని థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులకు తెలియచేశారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు కుమారుడు టి.శ్రీనివాసరావు కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రి కనిపించకుండా పోయి ఏడేళ్లు అయిందని, అందువల్ల తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే అదృశ్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి సుబ్బారావుకు ఏడేళ్ల సర్వీసు మిగిలి లేదంటూ శ్రీనివాసరావు దరఖాస్తును థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులు తోసిపుచ్చారు. దీనిపై శ్రీనివాసరావు 2012లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తుది విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. నిబంధనల పేరుతో ఈ వివక్ష ఏమిటి? ‘ప్రభుత్వోద్యోగి మరణిస్తే అతని కుటుంబంలో అర్హులకు కారుణ్య నియామకం కింద వెంటనే ఉద్యోగం దొరుకుతోంది. మరణించిన ఉద్యోగికి ఎంత సర్వీసు మిగిలి ఉందన్న విషయంలో కండీషన్లు లేవు. ఉద్యోగి మరణించిన ఏడాది లోపు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు పెట్టుకుంటే చాలు. అదే.. ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపించకుండా పోతే అతని కుటుంబంలో ఎవరైనా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాలంటే ఎఫ్ఐఆర్ నమోదయ్యే నాటికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీసు మిగిలుండటం తప్పనిసరి. ఆ ఉద్యోగిని చనిపోయినట్టు ప్రకటించాలంటే ఏడేళ్లు వేచిచూడాలి. ఇద్దరూ ప్రభుత్వోద్యోగులే. అలాంటప్పుడు నిబంధనల పేరుతో ఈ వివక్ష ఏంటి? కారుణ్య నియామకానికి సంబంధించి ప్రభుత్వ విధానం అందరికీ ఒకేలా ఉండాలి. అంతే తప్ప మరణించిన ఉద్యోగి విషయంలో ఓ రకంగా, కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో మరోలా ఉండటానికి వీల్లేదు. ప్రభుత్వం సానుభూతితో ఆలోచించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు మార్గదర్శకాలు తేవాలి’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
బిడ్డలు కాదు.. రాక్షసులు
♦ కన్న తండ్రినే కిరాయి హత్య చేయించిన కూతుళ్లు, కొడుకు ♦ కారుణ్య నియామకంతో ఉద్యోగం పొందిన తనయుడు ♦ గుండెపోటుతో మృతి చెందాడంటూ నమ్మబలికిన వైనం ♦ ఒప్పుకున్న కిరాయి ఇవ్వకపోవడంతో విషయాన్ని వెల్లడించిన హంతకులు ♦ ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం ♦ సమాధి తొలగించి శవానికి పంచనామా చేసిన అధికారులు ఐదుగురు సంతానం.. ఆణిముత్యాల్లా భావించి అపురూపంగా పెంచుకున్నాడు. ఒకరిని మించి ఒకరిపై ప్రేమ కురిపించాడు. బాధ్యతల కష్టాలను తాను మోసి..ఆనందాల పూలబాటలో వారిని నడిపించాడు. పెద్దయ్యాక రెక్కలు తెచ్చిన తండ్రిని బిడ్డలు భారమనుకున్నారు. ఆకలమ్మా అంటూ కూతుళ్ల వద్దకొస్తే గుమ్మంలోనే నెట్టేశారు..కన్న తీపి కదా..పదే పదే కూతుళ్లు, కొడుకు ఇంటి తలుపులు తట్టాడు..ఒక్క బిడ్డయినా కనికరిస్తారని..అయినా ఆ పాషాణ హృదయాలు కరగలేదు. చివరకు తండ్రిని కడతేర్చి ఆయన ఉద్యోగాన్ని లాగేసుకోవాలనుకున్నారు. కిరాయి గూండాలతో కర్కశంగా ఊపిరి తీయించేశారు. గుండెలపై పెట్టుకుని పెంచిన తండ్రి అనురాగాన్ని చిదిమేసి ఆయన ఆత్మఘోషను సమాధి చేసేశారు. బాపట్ల టౌన్: పట్టణంలోని 32వ వార్డు పరిధిలోని కొత్తపేటకు చెందిన మల్లెల రవికుమార్‌కు 25 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాలోని తెలుగుగంగా ప్రాజెక్ట్‌లో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆయన అక్కడే స్థిరపడి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరందరికీ పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకున్నాడు. వారిలో పెద్ద కుమార్తె లలిత బాపట్ల పట్టణంలోని 32వ వార్డు చెంగళ్రాయుడు తోటలో నివాసం ఉంటోంది. మిగిలిన నలుగురు సంతానం నెల్లూరు జిల్లాలో జీవిస్తున్నారు. కొంత కాలంగా తండ్రి మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగాన్ని కుమారుడు ఆనందరావుకు వచ్చేలా చూడాలని కూతుళ్లు, అల్లుళ్లు పథకం పన్నారు. తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఇదీ పథకం.. రవికుమార్ రెండో అల్లుడైన ప్రశాంత్ నెల్లూరులోనే నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఒప్పందం మేరకు నెల్లూరులోని తన స్నేహితులైన శివాజీ, యోహోషుతో కిరాయి మాట్లాడాడు. రవికుమార్‌ను చంపితే రూ. 60 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2016 జూలై 30న రవికుమార్ నెల్లూరులోని ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే అదనుగా అల్లుడైన ప్రశాంత్, కిరాయి హంతకులు శివాజీ, యోహోషువాలు ముగ్గురూ గదిలోకి వెళ్లారు. ఇద్దరు కాళ్లు, చేతులు పట్టుకున్నారు. ఒకరు దిండు మొహం మీద ఒత్తి పట్టుకొని ఊపిరాడకుండా చేసి హతమార్చారు. కుటుంబ సభ్యులంతా గుండెపోటుతో మృతి చెందాడని బంధువులకు నమ్మించారు. వెంటనే మృతదేహాన్ని బాపట్ల పట్టణంలోని చెంగళ్రాయుడు తోటకు తీసుకొచ్చి అక్కడ క్రైస్తవ శ్మశాన వాటిలో సమాధి చేశారు. సమాధి తొలగించిన ఫోరెన్సిక్ అధికారులు పూర్తి స్థాయిలో ఆధారాల కోసంనెల్లూరు టూటౌన్ సీఐ రామకృష్ణారెడ్డి బుధవారం బాపట్ల వచ్చారు. గుంటూరు జిల్లా మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి, బాపట్ల తహసీల్దార్ టి. వల్లయ్య సమక్షంలో చెంగళ్రాయుడుతోటలోని రవికుమార్ సమాధిని తొలగించారు. ఆస్తి పంజరం నుంచి ఆ«ధారాలు సేకరించారు. ఈ నివేదిక అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు. వెలుగులోకి వచ్చిందిలా.. ప్రశాంత్ ఒప్పందం ప్రకారం శివాజీ, యోహోషువాలకు కిరాయి రూ. 60 వేలు ఇవ్వకుండా కేవలం రూ. 10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పటి నుంచి మిగిలిన రూ. 50 వేలు ఇవ్వాలని వారు అడుగుతూనే ఉన్నారు. ప్రశాంత్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇటీవల శివాజీ, యోహోషువాలు నెల్లూరులోని టూటౌన్ సీఐ రామకృష్ణారెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఏడాది క్రితం రవికుమార్ మృతి విషయంలో జరిగిన పరిణామాలను వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐ కుమార్తెలు, అల్లుళ్లు, కొడుకును అదుపులోకి తీసుకొన్నారు. -
కారుణ్య నియామకాలకు రేపు ఇంటర్వ్యూలు
కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించి ‘‘శ్రామిక్’’ పోస్టులకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్ఎం జి.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఆర్ఎం కార్యాలయంలో వీటి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగి మరణించిన తేదీని ప్రాతిపదికనగా తీసుకోని సినీయారిటీ నిర్ణయిస్తామన్నారు. ఈ జాబితాలోని వారిలో 60 మంది పురుషులకు ఇది వరకే కాల్ లెటర్ వారి అడ్రసులకు పంపించామని, అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు ఫొటోలు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.