ఆర్టీసీలో మళ్లీ కారుణ్య నియామకాలు | Telangana: Compassionate Appointments In TSRTC Soon | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో మళ్లీ కారుణ్య నియామకాలు

Published Sun, Apr 24 2022 2:47 AM | Last Updated on Sun, Apr 24 2022 3:31 PM

Telangana: Compassionate Appointments In TSRTC Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఆర్టీసీ పాలక మండలి ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం కనీస వేతనాల చెల్లింపు(ప్రభుత్వ నిబంధనల ప్రకారం) పద్ధతిలో మాత్రమే వీటిని చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులకు సంబంధించిన (చనిపోయినవారు, తీవ్ర అనార్యోగానికి గురైనవారు) కుటుంబసభ్యులు మూడేళ్లుగా బ్రెడ్‌ విన్నర్‌ స్కీం కింద కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

అందులో తొలి విడతలో 300 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకోబోతోంది. వారి పనితీరు బాగుంటే రెండేళ్ల తర్వాత రెగ్యులరైజ్‌ చేయనున్నారు. తదుపరి రిటైర్మెంట్లతో పోస్టులు ఖాళీ అయ్యేకొద్దీ మిగతావారిని తీసుకోవాలని బోర్డు సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత టీఎస్‌ఆర్టీసీ పాలకమండలి తొలి సమావేశం ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగింది. చైర్మన్‌ సహా 9 మంది బోర్డు సభ్యులకుగాను ఏడుగురు సమావేశానికి హాజరయ్యారు. పనిఒత్తిడి కారణంగా జీహెచ్‌ఎంసీ, రవాణాశాఖ కమిషనర్లు హాజరు కాలేదు. కారుణ్య నియామకాలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ఆర్టీసీ ఎండీకి బోర్డు సూచించింది. 

ఏడేళ్ల అకౌంట్స్‌కు అనుమతి
టీఎస్‌ ఆర్టీసీ ఏర్పడిన ఏడేళ్లలో ఆర్థికపరమైన పద్దులకు ఇప్పుడు బోర్డు ఆమోద ముద్ర(రాటిఫికేషన్‌) వేసింది. ఈ ఖాతాలకు సంబంధించి ఏజీ ఆడిట్‌ ఇప్పుడు నిర్వహించాల్సి ఉంది. ఆడిట్‌ కాకపోవడం వల్ల ఇంతకాలం బ్యాంకు రుణాలు తీసుకునే విషయంలో ఆర్టీసీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

1,050 కొత్త బస్సులు: బస్సులు పాతబడి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న తరణంలో 1,050 కొత్త బస్సులు కొనాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ బస్సులు కొనే విషయంపై దృష్టి సారించాలని చైర్మన్‌ బాజిరెడ్డి సూచించారు. ఇటీవలే వివిధ సెస్‌ల పేరుతో పెంచిన ఆర్టీసీ చార్జీలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ సెస్‌ల విధింపు వల్ల రూ.వంద కోట్ల వరకు ఆదాయం పెరిగిందని, ఈ పెంపు నామమాత్రమే అయినందున ప్రజల నుంచి వ్యతిరేకత కూడా లేదని అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు.

డీజిల్‌ ధరలు పెరిగినప్పుడల్లా సెస్‌ను సవరించే అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడానికి, దానికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీని ప్రారంభించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్‌ ఆదేశంతో కార్గో, పార్శిల్‌ విభాగాలను ఏర్పాటు చేశామని, అవి ప్రారంభించిన రెండేళ్లలో రూ.వంద కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు.

బోర్డు లేకపోవడం వల్ల ఇంతకాలం పేరుకుపోయిన 55 అంశాలకు సమావేశంలో ఆమోదముద్ర వేసింది. సమావేశానికి ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాణికుముదిని, ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రోడ్లు, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కేంద్ర రోడ్లు, రవాణా శాఖ డైరెక్టర్‌ పరేశ్‌ కుమార్‌ గోయల్, ఆ శాఖ ఈఎన్‌సీ రవీంద్రరావు తదితరులు హాజరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement