బిడ్డలు కాదు.. రాక్షసులు | son and doughters murder to father for hes job | Sakshi
Sakshi News home page

బిడ్డలు కాదు.. రాక్షసులు

Published Thu, Jul 6 2017 2:37 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

బిడ్డలు కాదు.. రాక్షసులు

బిడ్డలు కాదు.. రాక్షసులు

కన్న తండ్రినే కిరాయి హత్య చేయించిన కూతుళ్లు, కొడుకు
కారుణ్య నియామకంతో  ఉద్యోగం పొందిన తనయుడు
గుండెపోటుతో మృతి చెందాడంటూ నమ్మబలికిన వైనం
ఒప్పుకున్న కిరాయి ఇవ్వకపోవడంతో విషయాన్ని వెల్లడించిన హంతకులు
ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం
సమాధి తొలగించి శవానికి పంచనామా చేసిన అధికారులు


ఐదుగురు సంతానం.. ఆణిముత్యాల్లా భావించి అపురూపంగా పెంచుకున్నాడు. ఒకరిని మించి ఒకరిపై ప్రేమ కురిపించాడు. బాధ్యతల కష్టాలను తాను మోసి..ఆనందాల పూలబాటలో వారిని నడిపించాడు. పెద్దయ్యాక రెక్కలు తెచ్చిన తండ్రిని బిడ్డలు భారమనుకున్నారు. ఆకలమ్మా అంటూ కూతుళ్ల వద్దకొస్తే గుమ్మంలోనే నెట్టేశారు..కన్న తీపి కదా..పదే పదే కూతుళ్లు, కొడుకు ఇంటి తలుపులు తట్టాడు..ఒక్క బిడ్డయినా కనికరిస్తారని..అయినా ఆ పాషాణ హృదయాలు కరగలేదు. చివరకు తండ్రిని కడతేర్చి ఆయన  ఉద్యోగాన్ని లాగేసుకోవాలనుకున్నారు. కిరాయి గూండాలతో కర్కశంగా ఊపిరి తీయించేశారు. గుండెలపై పెట్టుకుని పెంచిన తండ్రి అనురాగాన్ని చిదిమేసి ఆయన ఆత్మఘోషను సమాధి చేసేశారు.  

బాపట్ల టౌన్‌:  పట్టణంలోని 32వ వార్డు పరిధిలోని కొత్తపేటకు చెందిన మల్లెల రవికుమార్‌కు 25 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లాలోని తెలుగుగంగా ప్రాజెక్ట్‌లో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆయన అక్కడే స్థిరపడి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరందరికీ పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చుకున్నాడు. వారిలో పెద్ద కుమార్తె లలిత బాపట్ల పట్టణంలోని 32వ వార్డు చెంగళ్రాయుడు తోటలో నివాసం ఉంటోంది. మిగిలిన నలుగురు సంతానం నెల్లూరు జిల్లాలో జీవిస్తున్నారు. కొంత కాలంగా తండ్రి మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగాన్ని కుమారుడు ఆనందరావుకు వచ్చేలా చూడాలని కూతుళ్లు, అల్లుళ్లు పథకం పన్నారు. తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

ఇదీ పథకం..
రవికుమార్‌ రెండో అల్లుడైన ప్రశాంత్‌ నెల్లూరులోనే నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఒప్పందం మేరకు నెల్లూరులోని తన స్నేహితులైన శివాజీ, యోహోషుతో కిరాయి మాట్లాడాడు. రవికుమార్‌ను చంపితే రూ. 60 వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2016 జూలై 30న రవికుమార్‌ నెల్లూరులోని ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే అదనుగా అల్లుడైన ప్రశాంత్, కిరాయి హంతకులు శివాజీ, యోహోషువాలు ముగ్గురూ గదిలోకి వెళ్లారు. ఇద్దరు కాళ్లు, చేతులు పట్టుకున్నారు. ఒకరు దిండు మొహం మీద ఒత్తి పట్టుకొని ఊపిరాడకుండా చేసి హతమార్చారు. కుటుంబ సభ్యులంతా గుండెపోటుతో మృతి చెందాడని బంధువులకు నమ్మించారు. వెంటనే మృతదేహాన్ని బాపట్ల పట్టణంలోని చెంగళ్రాయుడు తోటకు తీసుకొచ్చి అక్కడ క్రైస్తవ శ్మశాన వాటిలో సమాధి చేశారు.

సమాధి తొలగించిన ఫోరెన్సిక్‌ అధికారులు
పూర్తి స్థాయిలో ఆధారాల కోసంనెల్లూరు టూటౌన్‌ సీఐ రామకృష్ణారెడ్డి బుధవారం బాపట్ల వచ్చారు. గుంటూరు జిల్లా మెడికల్‌ కళాశాల ఫోరెన్సిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కృష్ణమూర్తి, బాపట్ల తహసీల్దార్‌ టి. వల్లయ్య సమక్షంలో చెంగళ్రాయుడుతోటలోని రవికుమార్‌ సమాధిని తొలగించారు. ఆస్తి పంజరం నుంచి ఆ«ధారాలు సేకరించారు. ఈ నివేదిక అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు.   

వెలుగులోకి వచ్చిందిలా..
ప్రశాంత్‌ ఒప్పందం ప్రకారం శివాజీ, యోహోషువాలకు కిరాయి రూ. 60 వేలు ఇవ్వకుండా కేవలం రూ. 10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పటి నుంచి మిగిలిన రూ. 50 వేలు ఇవ్వాలని వారు అడుగుతూనే ఉన్నారు. ప్రశాంత్‌ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇటీవల శివాజీ, యోహోషువాలు నెల్లూరులోని టూటౌన్‌ సీఐ రామకృష్ణారెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఏడాది క్రితం రవికుమార్‌ మృతి విషయంలో జరిగిన పరిణామాలను వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన సీఐ కుమార్తెలు, అల్లుళ్లు, కొడుకును అదుపులోకి తీసుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement