మాకూ హక్కులు కావాలి, మాకూ అవకాశాలు కావాలి అని మహిళలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నా ఇంకా లింగ-సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. తమ ఉనికితోపాటు, పురుషులతో సమానంగా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జీ రాధారాణిని సాక్షి.కామ్ పలకరించింది. మహిళలందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు అందించిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు.
‘‘ఇప్పటి యంగ్ జనరేషన్‌కు లింగ వివక్ష ఎక్కడ ఉంది అనిపించవచ్చు. చాలామంది టీనేజర్లకు ఈ విమెన్ డేస్ అవీ... అవసరమా అనిపిస్తుంది. కానీ వన్స్ పెళ్లి చేసుకొని కుటుంబ జీవితంలోకి ఎంటరైన ప్రతీ మహిళకు వివక్ష ఏ రూపంలో ఉంటుందనేది కనబడుతుంది. అర్థం అవుతుంది. తరతరాలుగా వివక్ష అనేది మనం జీవితాల్లో అంతర్లీనంగా జీర్ణించుకుపోయింది.
గతంలో భార్యను భర్త కొట్టడం సహజమే కదా అన్నట్టుగా ఉండేవాళ్లం. ఈ పరిస్థితి నేడు మారినా ఇంకా చాలా మారాలి. ఈ కాస్త మార్పు అయినా మన పోరాటం, ప్రశ్నించడం మూలంగానే వచ్చాయి. ఆలోచించడం, ప్రశ్నించడం అనే ప్రక్రియ నిరంతరం సాగాలి. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఎక్కడ ఉన్నాం. ఎక్కడ లోపాలున్నాయి అనేది రివ్యూ చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకునేలా సమీక్షించుకోవాలి. మార్పుకోసం అవగాహన పెంచుకొని ముందుకు పోవాలి. అదే మార్చి 8 ఉద్దేశం.
మహిళలకు న్యాయవాద వృత్తి సవాలే! ఏ ప్రొఫెషన్‌ను లైట్ తీసుకోకూడదు
ఏ ప్రొఫెషన్ అయినా డెడికేటెడ్‌గా కమిటెడ్‌గా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. వృత్తిని తేలిగ్గా తీసుకోకుండా, నిబద్ధతగా పనిచేసుకుంటూ పోవాలి. జ్యుడీషియల్ ప్రొఫెషన్‌లో సాధారణంగా సీనియర్లతో పోలిస్తే జూనియర్లకు అందులోనూ మహిళలకు ముఖ్యంగా క్రిమినల్ లాయర్స్‌కు వృత్తిలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ సక్సెస్‌ఫుల్ విమెన్‌గా నిలవాలంటే ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోవాలి. నిరుత్సాహ పడకుండా తామేంటో నిరూపించుకోగలగాలి.
కుటుంబ సహకారం లేకుండా మహిళలు ముందుకు పోవడం చాలా కష్టం. నిజానికి మన బాధ్యతలు, పనితీరును బట్టి ఇంట్లో వాళ్లు అవగాహన పెంచుకుంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ వర్కింగ్ విమెన్ పిల్లల గ్రోత్‌కు చాలా ఉపయోగపడతాయి. నాకు నా భర్త సహకారం చాలా ఉంది. పెళ్లి తరువాతే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తరువాత ఆయన సపోర్టుతోనే ఏలూరులో సీఆర్‌ఆర్ (ఈవినింగ్) లా కాలేజీలోలా చేశాను. మా కుటుంబలో ఎవరూ లీగల్ ప్రొఫెషనల్స్ లేరు. తండ్రులు, తాతలు, తెలిసినవాళ్లు ఎవరూ లేకుండానే ఈ స్థాయికి రాగలిగాను. ఇలానే అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించి సాధించాలి.
బార్ కౌన్సిల్‌లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
లీగల్ ప్రొఫెషనల్‌లోకి వచ్చేందుకు 33 శాతం రిజర్వేషన్ చాలా ఉపయోగపడుతోంది. చాలామంది మహిళలం సర్వీస్ కేండిడేట్స్‌గా వచ్చాం. అయితే బార్ నుంచి మహిళల ప్రాతినిధ్యం లభించకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది. అక్కడ పురుషుల డామినేషన్ కారణంగా మోర్ విమెన్ రావడం లేదు. ఇది మారాలి. బార్ నుంచి మహిళా లాయర్లు పెరగాలి. అలాగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో లేడీ రిప్రజెంటేటివ్‌గా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మహిళల రిప్రజెంటేషన్ పెరగాలి.
డెసిషన్ మేకింగ్ పవర్ ముఖ్యం
నా దృష్టిలో చదువుకోని స్త్రీ అయినా సరే స్వంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే సాధికారత. అలాగే చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండి కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేక పోవడం దురదృష్టకరం. మహిళలకు విద్య, ఉద్యోగం రావడమే ఒక ఎంపవర్‌మెంట్. ఎడ్యుకేషన్ మహిళల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇవ్వాలి. ఇస్తుంది కూడా.
బయటికి వెళ్లి ఉద్యోగం చేసుకుని ఎలాగైనా జీవించవచ్చు అనే ధైర్యం విద్య ద్వారానే వస్తుంది. ఉద్యోగం చేయాలా వద్దా, పిల్లల్ని కనాలా వద్దా, ప్రమోషన్ తీసుకోవాలా వద్దా లాంటి నిర్ణయాలు మహిళలు స్వయంగా తీసుకోగలగాలి. డెసిసిషన్ మేకింగ్ పవరే విమెన్‌కు కీలకం. మన ఇండియాలో చాలామంది మహిళలకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎంతమంది పిల్లలు కావాలి అనేది స్వయంగా నిర్ణయించుకునే స్థితిలో లేరు. అలాగే ట్రాన్సఫర్, ఉద్యోగంలో ప్రమోషన్ తీసుకోవాలా లేదా అనే సందిగ్దంలో చాలా మంది ఉద్యోగినులు కెరీర్‌ను వదులుకుంటున్నారు. పిల్లల కోసమో, భర్తల ఒత్తిడితోనో, లేదంటే కుటుంబం కారణంగానో ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితి. దీనికి నేటి మహిళలు ఆలోచించాలి.
దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అంతేకాదు ఎవరికి ఓటు వేయాలి అనే డెసిషన్ కూడా స్వయంగా మహిళలే తీసుకోవాలి. ఆ పవర్ రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. స్త్రీలకు స్త్రీలే శత్రువులు అనేది నేను అసలు విశ్వసించను. మహిళల్లో ఈ భావజాలం మారేలా అవగాహన కల్పించలేకపోవడమే లోపం. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది.
కాగా 1963 జూన్ 29న రాధారాణి గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు.1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా విధులు నిర్వంచారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.
జీవితంలో అనుకున్న లక్ష్యాలను పట్టుదలగా సాధించి, ఉన్నత శిఖాలను అధిరోహించారు రాధారాణి. అంతేకాదు తాను కులాంతర వివాహం చేసుకుని, తన బిడ్డలకు కూడా కులాంతర వివాహాలను చేసి తానేంటో నిరూపించుకున్న రాధారాణిగారికి మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాట్సాఫ్!!!
-సాక్షి వెబ్ స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment