(వెబ్ స్పెషల్): రేపిస్టుల పాలిట సింహ స్వప్నం, బ్రహ్మాస్త్రమంటూ ‘నిర్భయ’ చట్టాన్ని తెచ్చుకున్నాం.. ఖబడ్దార్... అత్యాచారం చేస్తే మరణ శిక్షే అన్నాం.. ఎన్‌కౌంటర్లూ చూశాం.. కానీ ఏం జరిగింది. చరిత్ర పునరావృతమైంది. ఘోరాతి ఘోరంగా.. మరింత హేయంగా...దిగ్భ్రాంతికరంగా.. పుణ్య భారతంలో మరో నిర్భయ బలైపోయింది. పసిగుడ్డునుంచి 90 ఏళ్ల వృద్దురాలి దాక, ఆఖరికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బాధితులను కూడా విడిచిపెట్టకుండా ప్రజాస్వామ్య దేశంలో హత్యాచార పర్వం కొనసాగుతూనే ఉంది. ఇపుడు ఏకంగా పోలీసులే సాక్ష్యాలను కాల్చి బూడిద చేసేశారు. ఇదీ మన నవభారతం.
దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిన 2012 నిర్భయ ఘటనతో వచ్చిన ‘నిర్భయ’ చట్టం తరువాత హత్యాచారాలకు ఏమాత్రం అడ్డకట్ట పడటం లేదు. బాధితులకు ముప్పు పెరిగిందే తప్ప తగ్గలేదు. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా అత్యాచారాలు ఆగలేదు సరికదా గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్ ఉన్నావ్, జమ్మూకశ్మీర్ కథువా, తెలంగాణాలో దిశ, మరో దళిత మహిళ.. ఇలా దేశంలో పలు హత్యాచార ఘటనలు మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మరో అమానుష ఘటన ఆందోళన పుట్టిస్తోంది. తల్లితో కలిసి పొలాలకు వెళ్లిన 19 ఏళ్ల దళిత బాలికను ఎత్తుకెళ్లి ఆధిపత్య కులానికి చెందిన నలుగురు నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారం, తీవ్ర చిత్రహింసల పాలు చేశారు. ఏకంగా నాలుక కోసేశారు. ఇక ఈ హింస తన వల్ల కాదంటూ ఈ లోకం నుంచి నిష్ర్రమించింది బాధితురాలు.
బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ వ్యవహారంలో యోగి సర్కార్ వైఖరి మరువక ముందే మరో అమానుష ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులే బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. అతిదారుణమైన పరిస్థితుల్లో బిడ్డను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబానికి ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం చివరి చూపు దక్కుకుండా, ఈ తంతును ముగించడం వెనక అంతర్య మేమిటి? తొలుత ఫిర్యాదు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం, ఆ తరువాత రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా బాధితురాలి శవ దహనం చేయడం ఎవరిని రక్షించడానికి? కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి, బయటకు రాకుండా పోలీసులు ఎందుకు వ్యవహరించాలి? పోలీసుల రక్షణ వలయంగా ఏర్పడి మరీ ఈ దారుణానికి పాల్పడిన దృశ్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. దోషులను కాపాడేందుకు, సాక్ష్యాధారాలు మాయం చేసేందుకే ఇలా చేశారా? ఈ ప్రశ్నలకు అక్కడి ప్రభుత్వం సమాధానం చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 'నిర్భయ' నిందితుల ఉరికోసం ఆరాటపడిన బీజేపీ అధినాయకత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నాయి.
మరీ ముఖ్యంగా మైనర్ బాలికలను, కూలి పనులకు వెళ్లిన దళిత బలహీన వర్గాల అమ్మాయిలే లక్ష్యంగా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. బేటీ బచావో నినాదాన్ని అపహాస్యం చేస్తూ పైశాచికత్వంతో అన్నెంపున్నెం ఎరుగని పసివాళ్లను, అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు. దీనికి తోడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, మరింత రాక్షసంగా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. చంపేస్తామనే బెదిరింపులు, హత్యలూ పెరుగుతున్నాయి. కఠిన శిక్షలు భయంతో మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అత్యాచార దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించి...విషయం బయటికి చెబితే బయటపెడతాం అంటూ.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో తీరని అవమానంతో, సమాజానికి భయపడి చాలామంది బాధితులు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కడంలేదు. చాలా కేసుల్లో దర్యాప్తుల జాప్యంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. మరోవైపు నేరస్తులతో పోలీసు అధికారులు కుమ్మక్కవ్వడం, బేరసారాలు, ఒప్పందాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. 2012లో రోజుకు 68 అత్యాచార సంఘటనలు రికార్డయ్యాయి. 2013లో ఈ సంఖ్య 92కు పెరిగింది. 2014లో 100, 2016లో రోజుకు 106 కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా అత్యాచార కేసులు నమోదు కావడం లేదు. తాజాగా హత్రాస్‌లో సామూహిక హత్యాచార ఘటన అమ్మాయిల భద్రతపై ప్రశ్నల్ని లేవనెత్తింది. హైదరాబాద్ దిశ కేసు మాదిరిగానే తక్షణ న్యాయం కావాలని, నేరస్థులను ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
‘చట్టం’ తన పని చేస్తోందా?
అత్యాచారం, కిడ్నాప్ లాంటి ఘటనల్లో పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి అనేక నిదర్శనాలు వెక్కిరిస్తున్నాయి. ఆడపిల్ల కనిపించడం లేదు అనగానే వారినోటి నుంచి ముందు "లేచిపోయిందేమో.. రెండు రోజుల్లో వస్తుంది.. లేదంటే ఏదైనా శవం దొరికితే కబురు చేస్తాం'' అనే మాటలే వినిపిస్తాయి. చాలా కేసుల్లో ప్రాథమింగా ఎదురవుతున్న ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. వ్యవహారం కాస్తా తీవ్రంగా మారి మేలుకొనే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీనికితోడు నిర్భయ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్షలు పడే అవకాశముంది. కఠిన శిక్షలు పేరుతో కొందరు పోలీసు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారనీ, నిందితులతో లాలూచీ పడుతున్నారనీ పలువురు మానవహక్కుల నేతలు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు బలహీన సెక్షన్లతో కేసు వీగిపోయేలా వ్యవహరిస్తున్నారనీ, భారీ ముడుపులు అందుకొని కేసులను నీరు గారుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పలు కేసుల్లో నిందితులుగా ఉండటం గమనార్హం. సమాజంలో స్త్రీలను ఒక పౌరురాలిగా కాకుండా కేవలం సెక్స్ సింబల్ గా, విలాస వస్తువుగా చూసే దృక్పథం మారనంత వరకూ, చట్టాలు, పోలీసులు సక్రమంగా తమ విధి తాము నిర్వర్తించనంతవరకు, పాలకులు ప్రజలు, మహిళల భద్రత పట్ల చిత్తశుద్ధిగా ఉండనంతవరకూ ఈ అమానుష హింసాకాండ కొనసాగుతూనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment