మహిళల్లో క్రమక్రమంగా పెరుగుతున్న ‘మద్యపానం’ అలవాటు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి
టాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, నాలుగో స్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: మనదేశ మహిళల్లో మద్యం సేవించేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది అధికంగా ఉన్నట్టుగా తేలింది. ఆల్కాహాల్ అలవాటు అనేది ప్రజారోగ్యంతో ముడిపడి.. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేసే అంశంగా మారింది. మద్యపానానికి అలవాటు పడడం వల్ల 60కు పైగా అనారోగ్యాలు, ఇతర సమస్యలకు దారి తీస్తున్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మద్యం తీసుకునే అలవాటు పెరగడం, ఓ రుగ్మతగా, మానలేని అలవాటుగా మారింది. గత పదేళ్లలో భారత్‌లో మద్యపాన వినియోగమనేది గణనీయంగా పెరిగినట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019లో జర్మనీలోని టీయూ డ్రిస్‌డేన్ నిర్వహించిన అధ్యయనంలో 2010– 2017 మధ్యలో భారత్‌లో ఆల్కాహాల్ వినియోగం 38 శాతం పెరిగినట్టుగా వెల్లడైంది.
ఏడాదికి ఒక్కో వయోజనుడు (అడల్ట్ పర్ ఇయర్) 4.3 లీటర్ల నుంచి 5.9 లీటర్లకు మద్యం సేవిస్తున్నట్టుగా తేలింది. ఈ కాలంలోనే స్థానికంగా విస్కీ, జిన్ వంటివి పెద్దమొత్తంలో తయారుకావడంతో పురుషులు, మహిళల్లో మద్యపానం అనేది మరింతగా పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు.
భారత్..మూడో అతిపెద్ద మార్కెట్
చైనా, రష్యాల తర్వాత.. భారత్ లిక్కర్‌కు మూడో అతిపెద్ద మార్కెట్‌గా మారింది. భారత్‌లో మద్యం వినియోగిస్తున్న వారి సంఖ్య పెరగడానికి.వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక, సామాజిక, ఇతర పరిస్థితులు ప్రభావితం చేస్తున్నట్టుగా తేలింది. మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో మద్యపానమనేది ఉన్నతవర్గాల జీవనశైలికి ప్రతిబింబంగా గతంలో గుర్తించిన పరిస్థితులున్నాయి.
ఇతర ప్రాంతాల్లో రోజువారి జీవనంలో భాగంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, భయాలు, ఆందోళనలు వంటి వాటిని అధిగమించేందుకు ఓ సాధనంగా మద్యపానాన్ని చూస్తున్నారు. అదీగాకుండా ఖరీదైన మద్యమే కాకుండా, అన్ని వర్గాల వారికి (మహిళలతో సహా) చీప్ లిక్కర్ అనేది సులభంగా అందుబాటులోకి రావడంతో మద్యం సేవించడం అనేది అలవాటుగా మారుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు.
ఎంతో కాలంగా కట్టుబాట్లు, సామాజికపరంగా వివక్ష, వేధింపులకు గురైన మహిళలు మద్యపానంతోపాటు ఇతర విషయాల్లోనూ తమ సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఆల్కాహాల్ వినియోగం, మద్యపానం ఉపయోగించే పద్ధతులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా భౌగోళిక పరంగానూ మారుతున్నాయి.
టాప్–7 స్టేట్స్ ఇవే...
నేషనల్ ఫ్యామిలీ హెల్త్‌సర్వే–5 2019–20 డేటాను పరిశీలిస్తే మనదేశంలోని ఏడు రాష్ట్రాల్లో మహిళలు అధికంగా మద్యపానానికి అలవాటు పడినట్టుగా వెల్లడైంది. అందులో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.
» 15–49 ఏళ్ల మధ్య వయసు్కల్లో 26 శాతం మహిళలు మద్యం సేవిస్తుండగా, అరుణాచల్‌ప్రదేశ్ టాప్–1లో ఉంది. ఆ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా ఆల్కాహాల్ తీసుకోవడం అధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. మద్యం సేవించడాన్ని అక్కడ ప్రోత్సహిస్తారు. ఆ రాష్ట్ర గిరిజన తెగల సంప్రదాయాలు, కట్టుబాట్లలో భాగంగా రైస్ బీర్ (అపాంగ్)ను అతిథులకు అందజేస్తారు.
» సిక్కింలో 16.2 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇళ్లలోనే మద్యం తయారీకి ప్రసిద్ధిగా ఆ రాష్ట్రం గుర్తింపు పొందింది. కొన్నితరాలుగా ఈ సంప్రదాయం అక్కడ కొనసాగుతోంది. మద్యం సేవించడాన్ని సంస్కృతితో ముడిపడినట్టుగా భావిస్తారు అక్కడ.
» అస్సోంలో 7.3 శాతం మంది మహిళలు ఆల్కాహాల్ తీసుకుంటారు. ఆ రాష్ట్రంలోని గిరిజన, ఆదివాసీ తెగలు మద్యం తయారీలో కొన్ని తరాలుగా నిమగ్నమై ఉన్నాయి. అక్కడ మద్యపానం అనేది ఓ జీవనశైలిగానూ, ఓ తంతుగా పరిగణిస్తారు.
» దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే... తెలంగాణలో 6.7 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉన్నట్టుగా తేలింది. పట్టణ ప్రాంతాలతో పోలి్చతే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలే అధికంగా మద్యం సేవిస్తున్నట్టుగా వెల్లడైంది.
» జార్ఖండ్‌లో 6.1శాతం మహిళలు. మరీ ముఖ్యంగా గిరిజన తెగలకు చెందిన వారిలోనే మద్యం అలవాటు అధికంగా ఉన్నట్టుగా తేలింది. వీరికి ఉద్యోగ, ఉపాధిపరంగా అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో ఈ తెగల్లోని అత్యధికులు రోజువారీ సవాళ్లను ఎదుర్కొనేందుకు మద్యపానం అలవాటుగా చేసుకున్నారు.
» అండమాన్, నికోబార్ దీవుల్లో 5 శాతం మహిళలు మద్యానికి అలవాటు పడ్డారు. సామాజిక కట్టుబాట్లు, ఒత్తిళ్లు, ఇతర ప్రభావాలతో మహిళలు మద్యం సేవిస్తున్నారు.
» ఛత్తీస్‌గఢ్‌లో 5% మంది మహిళలు ఆల్కాహాల్ తాగుతున్నారు. మహిళలకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరవడటం, మానసిక ఒత్తిళ్లకు గురికావడం వంటివి ఆల్కాహాల్ సేవనం పెరగడానికి ప్రధాన కారణాలుగా అంచనా వేస్తున్నారు.
కారణాలు ఎన్నో....
భారత్‌లోని మహిళల్లో మద్యపానం అలవాటుగా మారడానికి అనేక అంశాలు కారణమవుతున్నట్టుగా తేలింది. స్త్రీలలో ఆర్థిక స్వాతంత్య్రం పెరుగుదల, సమాజంలో వస్తున్న మార్పులు, ఆధునికత పేరుతో మారుతున్న అలవాట్లు వంటివి ప్రభావితం చేస్తున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆల్కాహాల్ మార్కెట్ బాగా విస్తరించింది. దీంతోపాటు మద్యపానానికి సంబంధించి వివిధ రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. స్థానిక బ్రాండ్స్ పెరుగుదల కూడా ఒక కారణమే. ఇలా అనేక రకాలుగా మద్యం అనేది మహిళలకు సైతం సులభంగా అందుబాటులోకి వచి్చనట్టుగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment