దేశం ‘నిర్భయ’ను మర్చిపోలేదు.. ‘ఆసిఫా’ను.. | National Crime Records Bureau 2019 Data | Sakshi
Sakshi News home page

దేశం ‘నిర్భయ’ను మర్చిపోలేదు.. ‘ఆసిఫా’ను..

Published Tue, Oct 6 2020 6:55 AM | Last Updated on Tue, Oct 6 2020 6:55 AM

National Crime Records Bureau 2019 Data - Sakshi

ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే హాత్రాస్‌లో ఒక అమ్మాయిపై సజ్జ చేలో నలుగురు దారుణంగా లైంగిక దాడి చేశారు. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘోరంలో ఆ అమ్మాయి పక్షవాతానికి గురైంది. చావుతో పెనుగులాడింది. తుదకు నాలుగురోజుల క్రితం మరణించింది. దేశంలో తీవ్ర నిరసనలు పెల్లుబుకుతున్న ఈ సందర్భంలో ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో’ (ఎన్‌సిఆర్‌బి) 2019 నివేదిక విడుదలైంది. దేశంలో రోజుకు 87 రేప్‌లు జరుగుతున్నాయని తేల్చిన గణాంకాలు స్త్రీలకు ఇది అభద్ర భారతం అని హెచ్చరిస్తున్నాయి.

దేశం ‘నిర్భయ’ను మర్చిపోలేదు. దేశం కాశ్మీర్‌ పసిపాప ‘ఆసిఫా’ను మర్చిపోలేదు. దేశం హైదరాబాద్‌ ‘దిశ’ను మర్చిపోలేదు. కాని దేశంలో దారుణమైన మృగ ప్రవర్తన, మగ ప్రవర్తన కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఒక 19 ఏళ్ల అమ్మాయిపై జరిగిన లైంగిక దాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ‘న్యాయం.. న్యాయం’ అని అరిచినా ‘స్టాప్‌.. స్టాప్‌’ అని మొత్తుకున్నా వ్యవస్థలోని నిర్లిప్తత, అసమర్థత, రాజకీయ ప్రయోజనాలు, సామాజిక వర్గాల పలుకుబడి అంతిమంగా స్త్రీనే బాధితురాలిని చేస్తున్నాయి.

హత్రాస్‌లో ఏం జరిగింది?
సెప్టెంబర్‌ 14. 2020. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ (ఢిల్లీకి 200 కి.మి. దూరం)లో ఒక దళిత కుటుంబం తమ సజ్జ చేలో పనికి వెళ్లింది. తల్లి, కొడుకు, 19 ఏళ్ల కూతురు చేలో పని చేస్తున్నారు. కొడుకు తొందరగా ఇల్లు చేరుకోగా తల్లి, కూతురు పని కొనసాగించారు. పెద్ద చేను కావడం వల్ల ఇద్దరూ దూరం దూరంగా ఉండటం వల్ల కూతురు ఒంటరిదయ్యింది. సరిగ్గా ఆ సమయంలోనే నలుగురు దుండగులు ఆమెను చున్నీతో బంధించి దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత వారు ఆమెను దారుణంగా సామూహిక అత్యాచారం చేశారని కుటుంబం అభియోగం. కూతురు కనిపించక తల్లి వెతుకులాడితే ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది.

దుండగులు ఆమె వెన్ను విరిచేశారని, నాలుక కోసేశారని కుటుంబం, మీడియా వర్గాలు వెల్లడి చేస్తున్నాయి. ఆమెను మొదట అలిగర్‌లో వైద్య సహాయానికి చేర్పించారు. అక్కడ ఏమీ ప్రయోజనం లేకపోయేసరికి మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. కాని ఆమె మంగళవారం (సెప్టెంబర్‌ 29) మరణించింది. పోలీసులు ఆమెకు అనూహ్యంగా అదే రోజు అర్ధరాత్రి దాదాపు 3 గంటలకు దహన సంస్కారాలు నిర్వహించారు. మమ్మల్ని కనీసం రానివ్వలేదు అని కుటుంబం అంటోంది. చట్టాలు ఎన్ని చేసినా ఈ దేశంలో స్త్రీ పరిస్థితి ఇది.

మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌
2019లో స్త్రీలపై జరిగిన అన్ని నేరాలను పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్‌ దాదాపు 60 వేల కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి వరుసలో రాజస్తాన్, మహారాష్ట్ర, అస్సాం నిలుస్తున్నాయి. ఇక లైంగిక దాడికి సంబంధించి దేశంలో రాజస్తాన్‌ మొదటి స్థానంలో ఉంది. అక్కడ గత సంవత్సరం దాదాపు అరువేల లైంగిక దాడులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌ ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే కేరళ, హర్యాణాలు కూడా లైంగిక దాడుల విషయంలో ప్రమాదకర రాష్ట్రాలుగా నిలిచాయి.

రోజుకు 87 రేపులు
ఈ నేపథ్యంలో ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో’ 2019 నివేదిక తాజాగా విడుదలైంది. దేశంలో స్త్రీలపై జరుగుతున్న నేరాలను ఈ నివేదిక తెలియచేసింది. 2018 కంటే 2019లో స్త్రీలపై నేరాల సంఖ్య 7.3 శాతం పెరిగింది. దేశంలో మొత్తం 4,05,481 స్త్రీ సంబంధిత నేరాలు నమోదయ్యాయి. వీటిలో మొదటి వరుస భర్త లేదా బంధువులు చేస్తున్న దాష్టీకం 30 శాతం, స్త్రీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే కేసులు 21.8 శాతం, కిడ్నాప్‌–ఎత్తుకుపోవడం 17.9 శాతం, రేప్‌ 7.9 శాతం ఉన్నాయి. దేశంలో గత సంవత్సరం రోజుకు సగటున 87 అత్యాచారాలు నమోదయ్యాయి. ఇవి నమోదైనవి మాత్రమే. ప్రపంచ గణాంకాలను చూస్తే 91.6 శాతం రేప్‌ కేసులు నమోదు కావు. అంటే ఇప్పుడు చెప్పుకుంటున్న అంకెలు 8 శాతం బాధితుల నుంచి నమోదైనవిగా అర్థం చేసుకోవాలి. ఈ నివేదిక ప్రకారం దేశంలోని ప్రతి లక్షమంది స్త్రీలలో 62 మంది ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. అది ఎటువంటిదైనా.

పిల్లలపై దాడులు
పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది. గత సంవత్సరం అక్కడ ఏడున్నర వేల పోస్కో కేసులు నమోదయ్యాయి. దీని తర్వాతి స్థానంలో మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, సిక్కిం, హర్యానా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంత చైతన్యం, ప్రతిఘటన తర్వాత కూడా వరకట్నం కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో 42 యాసిడ్‌ అటాక్‌లు జరిగాయంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో దేశం ఉందో అర్థం చేసుకోవచ్చు. వెస్ట్‌ బెంగాల్‌లో 36 యాసిడ్‌ అటాక్స్‌ జరిగాయి.

ఆత్మ రక్షణ, పోలీసు సహాయం
స్త్రీలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసు సహాయం తీసుకోవాలని అన్యాయం జరిగితే తప్పకుండా దోషులకు శిక్ష పడేలా చూడాలని తెలిసి వస్తోంది. సమాజంలో స్త్రీని గౌరవించే వాతారణం, కుటుంబంలో స్త్రీకు ఇచ్చే మర్యాద, వర్క్‌ ప్లేస్‌లో ఆమెకు దక్కాల్సిన గౌరవం, భావజాలంలో మార్పు ఇవన్నీ మార్పును తెచ్చే విషయాలు. పురోగామి దృక్పథమే ఇప్పుడు కావలసింది. – సాక్షి ఫ్యామిలీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement