Radha rani
-
భువనగిరి ఖిలాను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
భువనగిరి: భువనగిరి ఖిలాను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఖిలాపై చారిత్రాత్మాక కట్టడాలు, నీటి కొలనులు, నిర్మాణాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఏకశిలపై నిర్మించిన కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని, భావితరాలకు తెలియజేసేందుకు శిథిలం కాకుండా పరిరక్షించుకోవాలని సూచించారు. ఖిలా రాక్ క్లైలైంబింగ్కు అనువుగా ఉందని, ఇక్కడ శిక్షణ పొందినవారు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతారోహణ చేయడం మంచి పరిణామం అన్నారు. అనంతరం న్యాయమూర్తి కుమార్తెలు రాక్ క్లైలైంబింగ్, జిప్‌లైన్ చేశారు. జస్టిస్ రాధారాణి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్రావు, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి దశరథరామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.కవిత ఉన్నారు. -
బేబీ కేర్ కేంద్రాల తరహాలో వృద్ధాశ్రమాలు అవసరం
హఫీజ్‌పేట్: పిల్లల బేబీ కేర్ కేంద్రాల తరహాలో వృద్ధాశ్రమాల ఏర్పాటు అవసరమని హైకోర్టు జస్టిస్ జి.రాధారాణి అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లోని వృద్ధాశ్రమ 23వ వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ రాధా రాణి, సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాజరై మహాత్మాగాంధీ, చండ్ర రాజేశ్వర్రావుల విగ్రహాలకు నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ దేశంలో 15 కోట్ల వృద్ధుల జనాభా ఉందని, 2050 నాటికి అది మరో మూడింతలు పెరుగుతుందని తెలిపారు. సీఆర్ ఫౌండేషన్ నిర్వహించే వృద్ధాశ్రమంలో పెద్ద పెద్ద వారు ఉంటున్నారన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధాశ్రమాలంటే అనాథాశ్రమాల నడం పొరపాటు అన్నారు. ఉద్యోగాల పేరుతో పిల్లలు దూరంగా ఉన్నప్పుడు, అనేక కారణాల తో పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వారి తల్లిదండ్రులకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్న నేపథ్యంలో వృద్ధాశ్రమాలు అవసరమని వ్యాఖ్యానించారు. చండ్ర రాజేశ్వర్‌రావు గొప్ప దేశ భక్తుడని కొనియాడారు. రాజేశ్వర్‌రావు మరణానంతరం ఆయన కోరిక మేరకు సీఆర్ ఫౌండేషన్ చిన్న వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. చికిత్సా లయం, గ్రంథాలయం, నీలం రాజశేఖర్‌రెడ్డి రీసెర్చ్ సెంటర్, మహిళా స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సీఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యద ర్శులు చెన్నమనేని వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా వు, కార్యదర్శి చెన్నకేశవరావు, హెల్త్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రజినీ తదితరులు పాల్గొన్నారు. -
కుల, మతాంతర వివాహాలు.. ‘పిల్లలకంటే కులమే ఎక్కువైంది’
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: కుల, మతాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోయిందని, తల్లిదండ్రులే పిల్లలను చంపేస్తున్నారని, వారికి పిల్లల కంటే కులమే ఎక్కువైందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో మహిళా, ట్రాన్స్‌జెండర్ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ‘కుల, మతాంతర వివా హాలు–హత్యా రాజకీయాలు’ అనే అంశంపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరి గింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ.. సమాజంలో రోజు రోజుకు కులతత్వం పెరిగి పోతోందన్నారు. కుల, మతాంతర వివాహా లు చేసుకున్న వారిని హత్య చేస్తున్న నింది తులను చట్టప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా త్వరిత గతిన శిక్ష పడాలని అందరు కోరుకుంటు న్నప్పటికీ అందుకు సరిపడా న్యాయమూ ర్తులు లేరని ఆమె చెప్పారు. ప్రజల ప్రాథ«మిక హక్కులను కాపాడాల్సిన, ప్రేమ వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితురాలు అవంతిక మాట్లాడుతూ ‘కుల, మతాంతర వివాహాలు చేసుకుంటే... బతికే హక్కు లేదా?’ అని ప్రశ్నించారు. ఆరు నెలలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా ఇంత వరకు శిక్ష పడలేదని, ముందుగా న్యాయ వ్యవస్థలో మార్పు రావాలని ఆమె అన్నారు. పీవోడ బ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు‡ రమా మెల్కొటే, పద్మజాషా పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో సత్తాచాటుతున్న మహిళలు
సాక్షి, హైదరాబాద్: నేటి మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలకు క్వీన్ అఫ్ ది నేషనల్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రాధారాణి మహిళలను సన్మానించి ప్రసంగించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, విశ్రాంత ఐపీఎస్ అధికారి డాక్టర్ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... మహిళలకు ఓర్పు సహనంతో పాటు ఏకాగ్రత అంకితభావం అమితంగా ఉంటాయన్నారు. అవి వారికి దేవుడు ఇచ్చిన వరాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 33 మంది మహిళలను వారు ఘనంగా సన్మానించారు. సంస్థ వ్యవస్థాపకుడు, కార్యనిర్వాకులు సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ సత్యవోలు పూజిత, సలహాదారు సుందరపల్లి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!!) కార్యక్రమంలో భాగంగా సత్యవోలు రాంబాబు తన ప్రతిభను ప్రదర్శించారు. ముక్కుతో బొమ్మ గీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. -
International Womens Day 2022 : స్త్రీకి స్త్రీయే శత్రువా? నేను ఒప్పుకోను!
మాకూ హక్కులు కావాలి, మాకూ అవకాశాలు కావాలి అని మహిళలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నా ఇంకా లింగ-సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. తమ ఉనికితోపాటు, పురుషులతో సమానంగా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జీ రాధారాణిని సాక్షి.కామ్ పలకరించింది. మహిళలందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు అందించిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు. ‘‘ఇప్పటి యంగ్ జనరేషన్‌కు లింగ వివక్ష ఎక్కడ ఉంది అనిపించవచ్చు. చాలామంది టీనేజర్లకు ఈ విమెన్ డేస్ అవీ... అవసరమా అనిపిస్తుంది. కానీ వన్స్ పెళ్లి చేసుకొని కుటుంబ జీవితంలోకి ఎంటరైన ప్రతీ మహిళకు వివక్ష ఏ రూపంలో ఉంటుందనేది కనబడుతుంది. అర్థం అవుతుంది. తరతరాలుగా వివక్ష అనేది మనం జీవితాల్లో అంతర్లీనంగా జీర్ణించుకుపోయింది. గతంలో భార్యను భర్త కొట్టడం సహజమే కదా అన్నట్టుగా ఉండేవాళ్లం. ఈ పరిస్థితి నేడు మారినా ఇంకా చాలా మారాలి. ఈ కాస్త మార్పు అయినా మన పోరాటం, ప్రశ్నించడం మూలంగానే వచ్చాయి. ఆలోచించడం, ప్రశ్నించడం అనే ప్రక్రియ నిరంతరం సాగాలి. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఎక్కడ ఉన్నాం. ఎక్కడ లోపాలున్నాయి అనేది రివ్యూ చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకునేలా సమీక్షించుకోవాలి. మార్పుకోసం అవగాహన పెంచుకొని ముందుకు పోవాలి. అదే మార్చి 8 ఉద్దేశం. మహిళలకు న్యాయవాద వృత్తి సవాలే! ఏ ప్రొఫెషన్‌ను లైట్ తీసుకోకూడదు ఏ ప్రొఫెషన్ అయినా డెడికేటెడ్‌గా కమిటెడ్‌గా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. వృత్తిని తేలిగ్గా తీసుకోకుండా, నిబద్ధతగా పనిచేసుకుంటూ పోవాలి. జ్యుడీషియల్ ప్రొఫెషన్లో సాధారణంగా సీనియర్లతో పోలిస్తే జూనియర్లకు అందులోనూ మహిళలకు ముఖ్యంగా క్రిమినల్ లాయర్స్‌కు వృత్తిలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ సక్సెస్ఫుల్ విమెన్‌గా నిలవాలంటే ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోవాలి. నిరుత్సాహ పడకుండా తామేంటో నిరూపించుకోగలగాలి. కుటుంబ సహకారం లేకుండా మహిళలు ముందుకు పోవడం చాలా కష్టం. నిజానికి మన బాధ్యతలు, పనితీరును బట్టి ఇంట్లో వాళ్లు అవగాహన పెంచుకుంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ వర్కింగ్ విమెన్ పిల్లల గ్రోత్‌కు చాలా ఉపయోగపడతాయి. నాకు నా భర్త సహకారం చాలా ఉంది. పెళ్లి తరువాతే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తరువాత ఆయన సపోర్టుతోనే ఏలూరులో సీఆర్ఆర్ (ఈవినింగ్) లా కాలేజీలోలా చేశాను. మా కుటుంబలో ఎవరూ లీగల్ ప్రొఫెషనల్స్ లేరు. తండ్రులు, తాతలు, తెలిసినవాళ్లు ఎవరూ లేకుండానే ఈ స్థాయికి రాగలిగాను. ఇలానే అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించి సాధించాలి. బార్ కౌన్సిల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి లీగల్ ప్రొఫెషనల్‌లోకి వచ్చేందుకు 33 శాతం రిజర్వేషన్ చాలా ఉపయోగపడుతోంది. చాలామంది మహిళలం సర్వీస్ కేండిడేట్స్‌గా వచ్చాం. అయితే బార్ నుంచి మహిళల ప్రాతినిధ్యం లభించకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది. అక్కడ పురుషుల డామినేషన్ కారణంగా మోర్ విమెన్ రావడం లేదు. ఇది మారాలి. బార్ నుంచి మహిళా లాయర్లు పెరగాలి. అలాగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో లేడీ రిప్రజెంటేటివ్‌గా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మహిళల రిప్రజెంటేషన్ పెరగాలి. డెసిషన్ మేకింగ్ పవర్ ముఖ్యం నా దృష్టిలో చదువుకోని స్త్రీ అయినా సరే స్వంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే సాధికారత. అలాగే చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండి కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేక పోవడం దురదృష్టకరం. మహిళలకు విద్య, ఉద్యోగం రావడమే ఒక ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ మహిళల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇవ్వాలి. ఇస్తుంది కూడా. బయటికి వెళ్లి ఉద్యోగం చేసుకుని ఎలాగైనా జీవించవచ్చు అనే ధైర్యం విద్య ద్వారానే వస్తుంది. ఉద్యోగం చేయాలా వద్దా, పిల్లల్ని కనాలా వద్దా, ప్రమోషన్ తీసుకోవాలా వద్దా లాంటి నిర్ణయాలు మహిళలు స్వయంగా తీసుకోగలగాలి. డెసిసిషన్ మేకింగ్ పవరే విమెన్‌కు కీలకం. మన ఇండియాలో చాలామంది మహిళలకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎంతమంది పిల్లలు కావాలి అనేది స్వయంగా నిర్ణయించుకునే స్థితిలో లేరు. అలాగే ట్రాన్సఫర్, ఉద్యోగంలో ప్రమోషన్ తీసుకోవాలా లేదా అనే సందిగ్దంలో చాలా మంది ఉద్యోగినులు కెరీర్‌ను వదులుకుంటున్నారు. పిల్లల కోసమో, భర్తల ఒత్తిడితోనో, లేదంటే కుటుంబం కారణంగానో ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితి. దీనికి నేటి మహిళలు ఆలోచించాలి. దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అంతేకాదు ఎవరికి ఓటు వేయాలి అనే డెసిషన్ కూడా స్వయంగా మహిళలే తీసుకోవాలి. ఆ పవర్ రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. స్త్రీలకు స్త్రీలే శత్రువులు అనేది నేను అసలు విశ్వసించను. మహిళల్లో ఈ భావజాలం మారేలా అవగాహన కల్పించలేకపోవడమే లోపం. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. కాగా 1963 జూన్ 29న రాధారాణి గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు.1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా విధులు నిర్వంచారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను పట్టుదలగా సాధించి, ఉన్నత శిఖాలను అధిరోహించారు రాధారాణి. అంతేకాదు తాను కులాంతర వివాహం చేసుకుని, తన బిడ్డలకు కూడా కులాంతర వివాహాలను చేసి తానేంటో నిరూపించుకున్న రాధారాణిగారికి మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాట్సాఫ్!!! -సాక్షి వెబ్ స్పెషల్ -
పలువురు జడ్జిల బదిలీ
హైదరాబాద్ ఎంఎస్‌జేగా రాధారాణి సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఏడుగురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఉమ్మడి హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా పనిచేస్తున్న పి.శ్రీసుధ.. హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న ఎన్ .బాలయోగి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ పోస్టును శ్రీసుధతో భర్తీ చేశారు. అలాగే ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి జి.ఉదయగౌరి హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న జి.ఉమాదేవి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. న ల్లగొండ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న జి.రాధారాణి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే)గా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న తెల్లప్రోలు రజిని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మెదక్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.వి.రమణనాయుడు తెలంగాణ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా బదిలీ అయ్యారు. గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి సి.సుమలత ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అనంతపురం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్ ్ జడ్జి ఎ.హరిహరనాథశర్మ గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్ ఎన్ .నర్సింగరావు గుంటూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారందరూ ఇప్పటికే రిజర్వు చేసుకున్న తీర్పులను, ఉత్తర్వులను వెలువరించి ఆ తర్వాత కొత్త బాధ్యతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
ఉద్యమ కేసులు ఉపసంహరణ
సంగారెడ్డి లీగల్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వివిధ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన 107 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని జిల్లా జడ్జి రాధారాణి తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా శనివారం జిల్లా కోర్టులో రెండవ మెగా లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ మెగా లోక్‌అదాలత్‌లో మొత్తం 6,206 కేసులు పరిష్కారం కాగా, అందులో ఉద్యమకారులకు సంబంధించినవి 107 ఉన్నాయి. లోక్‌అదాలత్ అనంతరం జిల్లా జడ్జి రాధారాణి మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై మరోసారి పైకోర్టులకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. లోక్ అదాలత్ ద్వారా కొన్ని కేసులైనా వెంటనే పరిష్కారం అవుతున్నాయని, దీంతో కోర్టులకు కొంత పని భారం తగ్గుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా చిట్‌ఫండ్, బ్యాంకులకు సంబంధించిన కేసుల్లో రూ.2 కోట్లు కక్షిదారులకు అందజేశామన్నారు. విదేశాల్లోని కోర్టులతో పోలిస్తే మనదేశంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్లే లోక్‌అదాలత్‌లు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నామన్నారు. కేసుల పరిష్కారానికి మంచి అవకాశం కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, కేసులు పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్ మంచి మార్గమన్నారు. క్రిమినల్ కేసుల్లో తప్ప మిగతా అన్ని సివిల్ కేసుల్లో సమన్యాయం జరుగుతుందన్నారు. రాజీ పద్ధతిలో కేసులు పరిష్కరించుకోవడం చాలా మంచిదన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు ఉపసంహరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. భూసేకరణ కేసులు చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని, బాధితులకు కూడా నష్టపరిహారం వెంటనే అందుతుందన్నారు. బాధితులకు సత్వర న్యాయం ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, జిల్లాలో 3,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అందులో లోక్‌అదాలత్ ద్వారా 1,050 కేసులు పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. లోత్ అదాలత్ ద్వారా ఔటర్‌రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించామన్నారు. విద్యుత్ వినియోగదారులపై ఆశాఖ పెట్టిన కేసులకు జరిమానా కట్టించి పరిష్కరించినట్లు గుర్తు చేశారు. అలాగే ఆస్తి తగాదాలు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు ఆమె తెలిపారు. అంతకుముందు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జిల్లా జడ్జి రాధారాణి జ్యోతిప్రజ్వలనతో మెగా లోక్‌అదాలత్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాప్రాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ, సివిల్ జడ్జి షేక్ రజాక్ ఉజ్ జమా, జిల్లా జువైనల్ బోర్డు చైర్మన్ దుర్గప్రసాద్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, బార్ అసోషియేషన్ అధ్యక్షులు విష్ణవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 6,206 కేసులు పరిష్కారం శనివారం జరిగిన రెండవ లోక్ అదాలత్‌లో మొత్తం 6,206 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా జడ్జి రాధారాణి తెలిపారు. అందులో మోటర్ వెహికిల్ యాక్ట్, సివిల్ కేసులు 100. క్రిమినల్ కేసులు 2,058, పీఎల్సీ కేసులు 3,048, విద్యుత్ చోరీ కేసులు, బ్యాంకు, బీఎస్ఎల్ కేసులు 1,000 పరిష్కారం చేశామన్నారు. మోటర్ వెహికల్ చట్టానికి సంబంధించి రూ. 57,09,000 బాధితులకు అందజేశారు. అదేవిధంగా బ్యాంకులు, చిట్ ఫండ్లకు సంబంధించిన కేసుల్లో రూ. 2,50,00,000 లు బాధితులకు అందజే సినట్లు జిల్లా జడ్జి తెలిపారు.