సంగారెడ్డి లీగల్: తెలంగాణ ఉద్యమం సందర్భంగా ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వివిధ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన 107 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని జిల్లా జడ్జి రాధారాణి తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా శనివారం జిల్లా కోర్టులో రెండవ మెగా లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ మెగా లోక్‌అదాలత్‌లో మొత్తం 6,206 కేసులు పరిష్కారం కాగా, అందులో ఉద్యమకారులకు సంబంధించినవి 107 ఉన్నాయి. లోక్‌అదాలత్ అనంతరం జిల్లా జడ్జి రాధారాణి మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై మరోసారి పైకోర్టులకు వెళ్లే అవకాశం ఉండదన్నారు.
లోక్ అదాలత్ ద్వారా కొన్ని కేసులైనా వెంటనే పరిష్కారం అవుతున్నాయని, దీంతో కోర్టులకు కొంత పని భారం తగ్గుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా చిట్‌ఫండ్, బ్యాంకులకు సంబంధించిన కేసుల్లో రూ.2 కోట్లు కక్షిదారులకు అందజేశామన్నారు. విదేశాల్లోని కోర్టులతో పోలిస్తే మనదేశంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్లే లోక్‌అదాలత్‌లు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నామన్నారు.
కేసుల పరిష్కారానికి మంచి అవకాశం
కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, కేసులు పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్ మంచి మార్గమన్నారు. క్రిమినల్ కేసుల్లో తప్ప మిగతా అన్ని సివిల్ కేసుల్లో సమన్యాయం జరుగుతుందన్నారు. రాజీ పద్ధతిలో కేసులు పరిష్కరించుకోవడం చాలా మంచిదన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు ఉపసంహరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. భూసేకరణ కేసులు చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని, బాధితులకు కూడా నష్టపరిహారం వెంటనే అందుతుందన్నారు.
బాధితులకు సత్వర న్యాయం
ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, జిల్లాలో 3,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అందులో లోక్‌అదాలత్ ద్వారా 1,050 కేసులు పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. లోత్ అదాలత్ ద్వారా ఔటర్‌రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించామన్నారు. విద్యుత్ వినియోగదారులపై ఆశాఖ పెట్టిన కేసులకు జరిమానా కట్టించి పరిష్కరించినట్లు గుర్తు చేశారు. అలాగే ఆస్తి తగాదాలు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు ఆమె తెలిపారు. అంతకుముందు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జిల్లా జడ్జి రాధారాణి జ్యోతిప్రజ్వలనతో మెగా లోక్‌అదాలత్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాప్రాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ, సివిల్ జడ్జి షేక్ రజాక్ ఉజ్ జమా, జిల్లా జువైనల్ బోర్డు చైర్మన్ దుర్గప్రసాద్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, బార్ అసోషియేషన్ అధ్యక్షులు విష్ణవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
6,206 కేసులు పరిష్కారం
శనివారం జరిగిన రెండవ లోక్ అదాలత్‌లో మొత్తం 6,206 కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా జడ్జి రాధారాణి తెలిపారు. అందులో మోటర్ వెహికిల్ యాక్ట్, సివిల్ కేసులు 100. క్రిమినల్ కేసులు 2,058, పీఎల్‌సీ కేసులు 3,048, విద్యుత్ చోరీ కేసులు, బ్యాంకు, బీఎస్‌ఎల్ కేసులు 1,000 పరిష్కారం చేశామన్నారు. మోటర్ వెహికల్ చట్టానికి సంబంధించి రూ. 57,09,000 బాధితులకు అందజేశారు. అదేవిధంగా బ్యాంకులు, చిట్ ఫండ్లకు సంబంధించిన కేసుల్లో రూ. 2,50,00,000 లు బాధితులకు అందజే సినట్లు జిల్లా జడ్జి తెలిపారు.
ఉద్యమ కేసులు ఉపసంహరణ
Published Sun, Dec 7 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement